వారణాసిలో వాయువు పీలిస్తే... 'కైలాసా'నికేనట!
posted on Dec 17, 2016 @ 10:40AM
కాశీ... ఈ పేరు చెప్పగానే ప్రతీ హిందువూ పులికించిపోతాడు. జీవితంలో కనీసం ఒక్కసారైనా అక్కడి మణికర్ణికలో మునగాలనీ, విశ్వేశ్వరుని కరుణాకటాక్షాలతో తడిసిపోవాలని తపిస్తాడు. కాని, ఇప్పుడు అదే కాశీ .. శివ శివా అనిపించేలా తయారైపోతోంది! అదీ స్వయంగా ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అయ్యి వుండి కూడా దారుణంగా వుంటోంది. తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదో, కేంద్ర ప్రభుత్వానిదో తెలియదు కాని హిందువుల అత్యంత పురాతన క్షేత్రం పవిత్రత ఇప్పుడు గంగపాలు అవుతోంది! భక్తితో భూ కైలాసానికి వెళితే ఆరోగ్యం పాడై రోగాలు అంటుకునేలా తయారైంది పరిస్థితి!
కాశీ అనగానే మనకు గంగా కాలుష్యం గుర్తొస్తుంది. గత కొన్ని ఏళ్లుగా గంగా బచావ్ నినాదాలు వింటూనే వున్నాం. మోదీ ప్రధాని అయ్యాక ఏకంగా ఉమాభారతి లాంటి సీనియర్ మంత్రినే ఆ విషయం చూడమన్నారు. అయినా గంగ బాగుపడ్డది లేదు. కాని, ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. వారణాసిలోని నీళ్లే కాదు వాయువు కూడా విషతుల్యం అవుతోందట! భూమ్మీద ప్రతీ జీవీ ఊపిరి పీల్చటానికి కారణమైన ఆ శివుడి పట్టణమే ఊపిరి ఆడనివ్వని కాసారంగా మారిపోతోంది. ఇందుకు కారణం మానవ స్వార్థం అరాచకత్వాలే...
కాశీ అంటే మహా పుణ్యక్షేత్రం అని మాత్రమే మనకు తెలుసు. కాని, అక్కడి దాకా వెళితే అసలు విషయం బోధపడుతుంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇష్టానుసారం నిర్మాణాలు జరుపుతున్నారు.రోడ్లపై తిరిగే డీజిల్ వాహనాలు, విపరీతమైన పొగ వదిలే బండ్ల వల్ల దారుణమైన దుమ్ము, ధూళీ రేగుతుంటుంది. ఇక లెక్కా పత్రం లేని ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీల వల్ల కూడా కాలుష్యం కట్టలు తెంచుకుంటోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే రోజూ వచ్చే లక్షలాది మంది భక్తుల ఒత్తిడి అక్కడి వాతావరణంపై ఎలాగూ వుంటుంది. ఇవన్నీ కలిసి వారణాసిని దారుణంగా మార్చేస్తున్నాయి.
కాశీలో కాలుష్యం ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవటానికి కారణం తాజా అధ్యయనాలే. అక్కడి గాలి ఢిల్లీ లాంటి అత్యంత విషతుల్యమైన నగరాన్ని కూడా మించిపోయిందట! దేశంలోనే బనారస్ లో వున్నంత ప్రమాదకరమైన గాలి మరెక్కడా లేదట! వాయు కాలుష్యానికి కారణమైన పీఎం 2.5 కణాలు ఒక్క క్యూబిక్ మీటర్ గాలిలో 25 మైక్రో గ్రాములు మాత్రమే వుండాలి.కాని, కాశీలో 60 మైక్రో గ్రాములు వుంటోందట. దీన్ని బట్టి అక్కడి గాలి పీలిస్తే ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. ఈ విషాదకరమైన పరిస్థితిని ఇటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం , అటు ప్రధాని మోదీ ఇద్దరూ గుర్తించాలి. గంగతో పాటూ గంగలో కలుస్తోన్న వాయువును కూడా యుద్ధ ప్రాతిపదికన కాపాడాలి. ఎందుకంటే, కాశీ కేవలం ఒక నగరం మాత్రమే కాదు.. హిందువుల అత్యంత పురాతనమైన దివ్య క్షేత్రం. అది మన సంస్కృతి. వారసత్వ సంపద.