తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిపోక తప్పదా?
posted on Jul 5, 2014 @ 1:00PM
తెరాస ప్రభుత్వం దెబ్బకి తెలుగు సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. మూడు నాలుగు రోజుల క్రితమే జీ.హెచ్.యం.సి అధికారులు నాగార్జున కు చెందిన యన్. కన్వెన్షన్ సెంటరు అక్రమ నిర్మాణమని ప్రకటించారు. దానిపై నాగార్జున కోర్టుకు వెళ్ళినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆయనకీ చట్టబద్దంగా నోటీసులు జారీ చేసి చర్యలు చెప్పట్టవచ్చని హైకోర్టు సూచించింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పోరేషన్ కు చెందిన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని నిన్న తెలంగాణా ప్రభుత్వం స్వాధీనం చేసుకొంటున్నట్లు ప్రకటించింది.
ఇదివరకు తెలుగు సినీ పరిశ్రమ మద్రాసులో ఉన్నపుడు దానిని హైదరాబాదుకు రప్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ యన్టీఆర్ హైదరాబాదులో 40 ఎకరాల భూమిని సినీ పరిశ్రమ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. అందులో 9 ఎకరాలలో సూపర్ స్టార్ కృష్ణ పద్మాలయ స్టూడియోని నిర్మించగా, 5 ఎకరాలలో రామానాయుడు ఒక స్టూడియో నిర్మించి నాటి నుండి నేటి వరకు కూడా వాటిలో షూటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిగిలిన భూములను మరికొందరు సినీ ప్రముఖులకు కేటాయించబడ్డాయి. ఇప్పుడు వాటిలో 20ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొంటున్నట్లు ప్రకటించింది. ఇది తెలుగు సినీ పరిశ్రమకు నిర్ఘాంతపరిచింది.
ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలలో పవన్ కళ్యాణ్ తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుపై తీవ్రంగా విరుచుకుపడటంతో, అది తెలంగాణాలో కూడా ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది. తెలంగాణా గడ్డపై సినిమాలు నిర్మిస్తూ, ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించుకొంటున్న సినీపరిశ్రమ, తమకు వ్యతిరేఖంగా పనిచేస్తోందనే తెలంగాణా ప్రభుత్వం భావించేందుకు ఇదీ ఒక కారణమని బహుశః అందుకే తెరాస అధికారంలోకి రాగానే తెలుగు సినీపరిశ్రమపై కొరడా జుళిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వారి అంచనాలు నిజమయితే బహుశః త్వరలోనే పవన్ కళ్యాణ్ తో సహా అనేకమందికి టీ-సెగ తగలవచ్చును.
ఇక మరోపక్క ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి విడిపోయి కొత్తగా తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసుకొన్న తెలంగాణా సినీ పరిశ్రమకు చెందిన కొందరు, తాము ఇకపై ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పనిచేయదలచుకోలేదని, అందువల్ల ఆ భవనంలో తమ వాటా తమకు వెంటనే అప్పగించమని కోరుతూ ఆందోళనచేస్తున్నారు. అందుకు ఆంధ్రాకు చెందిన సినీ పెద్దలు అంగీకరించినప్పటికీ, రెండు ఫిలిం చాంబర్లు కలిసి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ క్రింద కలిసి పనిచేద్దామనే చేస్తున్న ప్రతిపాదనను తెలంగాణా సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు నిర్ద్వందంగా తిరసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందువలన అంటే ఇంకా ఆంధ్రాకు చెందిన నిర్మాతలు, దర్శకుల పెత్తనంలో తాము పనిచేయవలసిన అవసరం లేదని, ఆంధ్రా నిర్మాతలు, దర్శకులు నిర్మిస్తున్న సినిమాలు తెలంగాణాలో ప్రదర్శింపజేసుకోనేందుకే ఈ ఏర్పాటు ఉపయోగపడుతుంది తప్ప, తెలంగాణా సినిమాలు ఆంధ్రాలో రిలీజ్ చేసే ఆలోచనలు, అవకాశాలు లేనందున, ఈ ప్రతిపాదనను వ్యతిరేఖిస్తున్నాట్లు చెపుతున్నారు.
ఈ సమస్య ఇలా నలుగుతుంటే మరోపక్క ఆంధ్రాకు చెందిన నిర్మాతలు, దర్శకులు అక్కడి హీరోలతో నిర్మించుతూ, తెలంగాణా(నైజాం ఏరియా)లో కూడా వందలాది సినిమా హాళ్ళను తమ గుప్పెట్లో పెట్టుకొని తెలంగాణా ప్రజల నుండి లక్షల కొల్లగొడుతున్నారని కొందరు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అటువంటి వారు కొందరు ఇటీవల హైదరాబాదు శివార్లలో జరుగుతున్న (రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న) బాహుబలి సినిమా షూటింగును అడ్డుకొన్నట్లు సమాచారం. అదేవిధంగా రజనీకాంత్ నటించిన విక్రమసింహ సినిమా ప్రదర్శనను కూడా అడ్డుకోన్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినీపరిశ్రమ ఎక్కడికీ వెళ్ళదు. హైదరాబాదులోనే ఉంటుంది అని మా అధ్యక్షుడు మురళీ మోహన్ వంటి వారు ఎంత గట్టిగా చెపుతున్నప్పటికీ, ఈ సమస్యలన్నీ చూస్తుంటే తెలంగాణా ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను నోటితో పొమ్మని చెప్పకుండా పొగపెట్టి బయటకు పంపేప్రయత్నం చేసినట్లే కనిపిస్తోంది గనుక త్వరలోనే సినీ పరిశ్రమ మూటాముల్లె కట్టుకొని ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరవలసిన సమయం దగ్గర పడుతున్నట్లే ఉంది. ఇందుకు తెలుగు ప్రజలు సంతోషించాలో బాధపడాలో తెలియని పరిస్థితి.