ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్ అలుపెరుగని పోరాటం
posted on Jul 9, 2014 @ 11:10AM
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత పదేళ్ళలో స్వయంగా అధికారం చెప్పట్టక పోయినప్పటికీ, ప్రధానమంత్రిని డమ్మీగా చేసి అంతా తానే అయ్యి కర్ర పెత్తనం చేస్తూ వెనక నుండి ప్రభుత్వాన్నినడిపించారు. 120కోట్ల మంది భారతీయుల జీవితాలను ప్రబావితం చేసే అనేక కీలక నిర్ణయాలు చేసారు. రాష్ట్ర విభజన చేసి మన రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి వదిలిపెట్టారు. ఇంతటి ప్రభావశీలి అయిన ఆమె, ఇప్పుడు లోక్ సభలో ప్రతిపక్షహోదా కోసం పడరాని పాట్లు పడుతుండటం నవ్వు తెప్పిస్తుంది. ఓడలు బళ్లవడం అంటే బహుశః ఇదేనేమో?
నిన్న మొన్నటి వరకు దేశాన్ని ఏక చత్రాధిపత్యంగా పరిపాలించిన ఆమె, తమకు ప్రతిపక్ష హోదా ఇమ్మని అధికార ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎంతగా బ్రతిమాలుకొన్నా ససేమిరా అంటుండటంతో, చేసేదేమీ లేక తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వవలసినదిగా కోరుతూ పార్టీ యంపీల చేత లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ఒక లేఖ వ్రాయించారు. కానీ ఆమె కూడా బీజేపీ సభ్యురాలే కనుక, సానుకూలంగా స్పందిస్తారనే ఆశలేక పోవడంతో సోనియా గాంధీ స్వయంగా వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఆయనకు తన గోడు వెళ్ళబోసుకొన్నారు. రాష్ట్రపతి ప్రణబ్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆ స్థాయికి ఎదిగినవారే అయినప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కాదని స్వయంగా అటువంటి నిర్ణయము తీసుకోలేరు. మహా అయితే కేంద్రప్రభుత్వానికి నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చును. అందువల్ల లోక్ సభ స్పీకర్ జవాబు చూసిన తరువాత, అవసరమయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
అయితే ఈ వ్యవహారంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ, “ఏపార్టీ కయినా సభలో కనీసం 10శాతం మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాజ్యాంగం చెపుతోంది. కానీ 545 మంది ఉన్న లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 44మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ప్రతిపక్ష హోదా కోరుకొంటోందో తెలియదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళదలచుకొంటే మాకేమీ అభ్యంతరం లేదు. రాజ్యాంగానికి బాష్యం చెప్పే సుప్రీంకోర్టుకి ఈ నియమనిబంధనలు అన్నీ తెలుసు,” అని అన్నారు.
ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలితే, అది ఎన్నికలలో ఓటమికంటే అవమానకరమయిన విషయం అవుతుంది. కానీ కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలని భావిస్తోంది. అందుకు ప్రధాన కారణం ఏమిటంటే, ప్రతిపక్ష హోదా దక్కితే తప్ప ప్రభుత్వం నియమించే పలు అధికారిక కమిటీలలో కాంగ్రెస్ కు చోటు దొరకదు. అదేవిదంగా లోకాయుక్త వంటి వ్యవస్థల నియామకాలలో వేలు పెట్టే అవకాశం కూడా లభించదు. పైగా మళ్ళీ ఎప్పుడు అధికారంలోకి తిరిగి వస్తామో తెలియని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ నేతలు, పార్టీని అంటిపెట్టుకొని ఉండాలంటే వారికి ఇటువంటి అధికారిక కమిటీలలో పదవులేవో ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు మోడీ ప్రభుత్వ చర్యలను పొగుడుతుంటే, మరికొందరు సోనియా, రాహుల్ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దుస్థితిలో ఉన్నందునే ప్రతిపక్ష హోదా కోసం ఇంత గట్టిగా పట్టుబడుతోందని భావించవలసి ఉంటుంది.