చంద్రబాబు చొరవతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం
posted on Jul 12, 2014 7:37AM
తెలుగుదేశం పార్టీ బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొని ఆ పార్టీకి మిత్రపక్షంగా మారిన తరువాత, చంద్రబాబు నాయుడుకి ప్రధాని మోడీ మరియు ఇతర కేంద్ర మంత్రులతో గల సత్సంబంధాలు బాగా పెంపొందించుకొన్నారు. తత్ఫలితంగా కేంద్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్ ఆసుపత్రి, ఐఐటీ, పారిశ్రామిక కారిడార్, హార్డ్ వేర్ పార్క్ వంటి అనేక ప్రాజెక్టులు కేటాయిస్తోంది. తీవ్ర విద్యుత్ కొరతతో సతమతమవుతున్న రాష్ట్రానికి అదనపు విద్యుత్ కేటాయించడమే కాక, ఎన్డీయే కొత్తగా ప్రవేశపెట్టబోతున్న నిరంతర విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్రాన్నే ఎంచుకొంది. ఇది అక్టోబర్ రెండు నుండి అమలులోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రానికి మరో పెద్ద వరం ఇస్తూ పోలవరం ముంపు గ్రామాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ నిన్న లోక్ సభలో బిల్లును ఆమోదింపజేసింది. సోమవారంనాడు ఈ బిల్లును రాజ్యసభ చేత కూడా ఆమోదింపజేసేందుకు సిద్దమవుతోంది. ఇక కేంద్ర ఇంధన శాఖ రూ.100 కోట్లు వ్యయం అయ్యే మరో విద్యుత్ పైలట్ ప్రాజెక్టును కూడా మంజూరు చేస్తున్నట్లు నిన్న ప్రకటించింది. ఈ పైలట్ ప్రాజెక్టు అమలుకు వైజాగ్, విజయవాడ, గుంటూరు మరియు నెల్లూరు జిల్లాలను ఎంచుకొంది. ఈ నాలుగు జిల్లాలలో విద్యుత్ నష్టాలను అరికట్టేందుకు నాణ్యమయిన విద్యుత్ పరికరాలను కేంద్రమే అందిస్తుంది. అంతేగాక విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగయిన సేవలు అందించేందుకు, ఈ నాలుగు జిల్లా కేంద్రాలలో సూపర్వైజింగ్ సర్వీస్ మరియు డాటా కలెక్షన్ సెంటర్లను నెలకొల్పుతారు. ఈ నాలుగు జిల్లాలలో ఈ ప్రయోగం విజయవంతమయితే క్రమంగా మిగిలిన జిల్లాలకు, మరియు రాష్ట్రాలకు కూడా దీనిని విస్తరింపజేస్తారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసే శుష్క వాగ్దానాల వలే కాకుండా, చేసిన ప్రతీ వాగ్దానాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకురావడం నిజంగా చాలా అభినందనీయం, అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి యం. వెంకయ్య నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, కేంద్ర వాణిజ్య శాక మంత్రి నిర్మలా సీతారామన్, ఇదే పనిమీద డిల్లీలో మకాం వేసిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావు తదితరులు అందరూ చేస్తున్న చేస్తున్న కృషి కారణంగానే ఇవ్వన్నీ సాకారమవుతున్నాయని చెప్పవచ్చును. అందుకు వారందరినీ కూడా అభినందించవలసిందే.
కేంద్రం ఉదారం అందిస్తున్న ఈ సహాయ సహకారాలను రాష్ట్ర మంత్రులు, యంపీలు, యం.యల్యేలు అందరూ కూడా పూర్తిగా అందిపుచ్చుకొని తమ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలిగితే రాష్ట్రం ఊహించిన దానికంటే చాలా వేగంగానే అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చును.