ఉజ్వల భారత్ కు మోడీ మార్క్ బడ్జెట్
posted on Jul 10, 2014 @ 11:32PM
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సామాన్య ప్రజలపై కొత్తగా ఎటువంటి భారం వేయకుండా, అదే సమయంలో ఎటువంటి ప్రజాకర్షక పధకాలు ప్రకటించకుండా, దేశం సర్వతోముఖాభివృద్ధికి అత్యుత్తమ ప్రణాళిక సిద్దం చేసారు. ఈ బడ్జెటులో విద్యా, వైద్య, ఆర్ధిక, పారిశ్రామిక, వర్తక, వ్యాపార, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా మౌలిక వసతులు కల్పనకు చాలా భారీ ప్రణాళికలు సిద్దం చేసారు. వీటన్నిటి ద్వారా దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తూనే అదే సమయంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా సృష్టించే ప్రయత్నం చేయడం చాలా గొప్ప ఆలోచనే.
ఇక ఈ బడ్జెట్ లో మెచ్చుకోవలసిన విషయం ఏమిటంటే, గత ఆరు దశాబ్దాలలో తీవ్ర నిరాధారణకు గురయి, ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ఈశాన్య రాష్ట్రాలకు, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో సముచిత స్థానం కల్పించడం. ఈశాన్య రాష్ట్రాలలో మౌలిక వసతులు, హైవేల అభివృద్ధి, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు, కాశ్మీరులో ఐఐటీ ఏర్పాటు అందుకు చక్కటి ఉదాహరణ. కాశ్మీరు మొదలు కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలలో సమానంగా అభివృద్ధి సాధించేందుకు అనేక వ్యూహాలు రచించారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు, వ్యవస్థలకు మేలు చేకూరే విధంగా బడ్జెట్ రూపొందించారు.
ఇక వివరాలలోకి వెళితే, భారీ పెట్టుబడులు అవసరమయిన ఉత్పత్తి, మౌలికవసతులు, రక్షణ, రైల్వేలు తదితర రంగాలలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, వివిధ సంస్థలలో ప్రభుత్వ పెట్టుబడులను కొంతమేర ఉపసంహరించుకోవడం, బ్యాంకింగ్ రంగంలో అదనపు వనరులను ఉపయోగించుకోవడం ద్వారా, సామాన్య ప్రజలపై ఎటువంటి భారం మోపకుండానే అభివృద్ధి సాధించేందుకు మార్గం కనుగొన్నారు. బ్యాంకింగ్ రంగంలో 2018నాటికి రూ.2.40 లక్షల కోట్ల మూలధన నిధులు సమీకరణ లక్ష్యంగా పెట్టుకొన్నారు.
వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, కాకినాడలో హార్డ్ వేర్ పార్క్, దేశంలో కొత్తగా ఆరు టెక్స్ టైల్ పార్కులు, రూ.11, 635 కోట్ల పెట్టుబడితో కొత్తగా 16 నౌకాశ్రయాల నిర్మాణం, రూ.37,850కోట్లతో దేశవ్యాప్తంగా హైవేల అభివృద్ధి, నిర్మాణం, రూ.7600 కోట్ల వ్యయంతో దేశంలో 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి, రూ.500కోట్లతో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వంటివన్నీ కూడా పెద్ద ఎత్తున ఉపాధికి, దేశాభివృద్ధికి దోహదపడేవే!
మన దేశం ఇంతవరకు కేవలం సాఫ్ట్ వేర్ రంగంపైనే దృష్టి కేంద్రీకరించి, భారీ ఉత్పత్తి, ఉపాధి, ఎగుమతులకు అవకాశామున్న హార్డ్ వేర్ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది. కానీ ఈ బడ్జెట్టులో హార్డ్ వేర్ రంగం అభివృద్ధికి కూడా ప్రణాళిక సిద్దం చేసారు.
ఇక కొత్తగా ఐఐటీలు, ఐఐయంలు, ఎయిమ్స్ వైద్య సంస్థలు, మెడికల్ కాలేజీలు, వ్యవసాయ, ఉద్యానవన, పెట్రోలియం విశ్వవిద్యాలయాలు, క్రీడా రంగానికి ప్రత్యేకంగా అకాడమీలు వంటివన్నీ కూడా ఉన్నత విద్యలకు, ఉపాధికి దారి చూపేవే.
ఇక దేశానికి వెన్నెముక వంటి గ్రామీణ భారత పరిస్థితిలో పెనుమార్పులు తెచ్చేందుకు వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా, రైతులకోసమే ప్రత్యేకంగా కిసాన్ ఛానల్ ప్రారంభిస్తున్నారు. లక్షల మంది రైతులు, ప్రజలకు జీవనాధారమయిన గంగా నదీ ప్రక్షాళనకు, ఘాట్స్ అభివృద్దికి రూ.2137కోట్లు, దేశంలో నదుల అనుసంధానంపై అధ్యయనం కోసం రూ.100 కోట్లు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు. భూసార పరీక్షల కోసం మొబైల్ పరీక్ష కేంద్రాల ఏర్పాటు, తక్కువ వడ్డీపై స్వల్పకాలిక రుణాలు, రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు ప్రోత్సాహకాలు, మార్కెట్ ధరల స్థిరీకరణ కోసం రూ.100 కోట్లు నిధి ఏర్పాటు, ఈశాన్య రాష్ట్రాలలో వ్యవసాయాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులను కేటాయించి రైతులు సంక్షేమంపై శ్రద్ధ వహించారు.
కేవలం అభివృద్ధి పధకాలే కాకుండా సైనికులకు ఒక హోదా ఒకే పించన్, బాలికల సంరక్షణ మరియు విద్య కోసం ప్రత్యేకంగా రూ.500 కోట్ల నిధులు, యస్సీ, ఎస్టీ మరియు గిరిజనుల సంక్షేమం కోసం ఏకంగా రూ.50, 100 కోట్ల భారీ నిధులు, రక్షిత మంచి నీటి పధకాలకు, కళాశాలలో టాయిలెట్లు, త్రాగునీరు ఏర్పాటు వంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా బడ్జెట్ లో చోటు కల్పించడం ద్వారా, విమర్శలకు తావులేకుండా చేసారు.
ఈవిధంగా దేశాభివృద్ధికి అనేక పధకాలు రచించి అదే సమయంలో వాటి ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి మార్గం కూడా కల్పించే ప్రయత్నం చేసారు. ఇంతవరకు కేవలం ప్రజాకర్షక పధకాల ప్రకటనకు, ఆచరణకు నోచుకోని అభివృద్ధి పధకాల ప్రకటనకు మాత్రమే పరిమితమవుతున్న బడ్జెట్ ను అరుణ్ జైట్లీ ఎవరూ ఊహించని విధంగా కొత్త పుంతలు త్రొక్కించి దేశంలో అన్ని వర్గాల మన్ననలు అందుకొంటున్నారు. అందుకు ప్రధాన కారకుడు ప్రధాని నరేంద్ర మోడీయేనని వేరే చెప్పనవసరం లేదు. ఉజ్వల భారత్ నిర్మాణం కోసం మోడీ వేసిన ముద్ర ఈ బడ్జెట్. క్లుప్తంగా చెప్పుకోవాలంటే దేశం మొత్తం సర్వతో ముఖాభివృద్ధికి రూపొందించిన అత్యంత తెలివయిన, ఆకర్షణీయమయిన, ఆశజనకమయిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ ను యధాతధంగా అమలుచేయగలిగితే గత ఆరు దశాబ్దాలుగా సాధించలేని అభివృద్ధిని వచ్చే ఐదు సంవత్సరాలలోనే భారత్ సాధించడం తధ్యం.