కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్ధతకు పరీక్షగా పోలవరం
posted on Jul 14, 2014 @ 10:22PM
ఈరోజు రాజ్యసభ కూడా పోలవరం బిల్లును ఆమోదించింది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం కేవలం లాంఛనప్రాయమే. అయితే ఇల్లలకగానే పండగ కాదన్నట్లు ఇప్పటి నుండి మళ్ళీ తెలంగాణాలో ఉద్యమాలు, ఆందోళనలు మొదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణా ప్రభుత్వం ఈ అంశంపై న్యాయపోరాటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా టీ-జేఏసీ కూడా మళ్ళీ ఆందోళన బాట పట్టవచ్చును. బహుశః ముంపు గ్రామాలలో గిరిజనులను కలుపుకొని ఉద్యమించినా ఆశ్చర్యం లేదు. అందువలన ప్రాజెక్టుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణంలో చాలా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు ఈ సమస్యలను ఎదుర్కొంటూనే మరోవైపు ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తి చేయవలసి ఉంటుంది. తెలంగాణా రాష్ట్ర సరిహద్దులను మార్పుపై ఏర్పడిన న్యాయ వివాదం గురించి సుప్రీంకోర్టు చూసుకొంటుంది. గనుక మిగిలిన సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పరిష్కరించుకొని ముందుకు సాగవలసి ఉంటుంది.
దాదాపు రెండు లక్షల మంది గిరిజనులకు పూర్తి సంతృప్తి కలిగే విధంగా పునరావాసం కల్పించాలంటే కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లనే కాదు. అందుకు స్థానిక ప్రజలు, నేతలు, స్వచ్చంద సంఘాలు, పర్యావరణ, పునరావాస చర్యలలో అనుభవం ఉన్ననిపుణుల సలహాలు, సహాయ సహకారాలు తీసుకోవడం కూడా చాలా అవసరం.
అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో, దేశాలలో ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించడానికి తీసుకొన్న చర్యలు, జాగ్రత్తలు, పునరావాసచర్యలు వంటి అనేక అంశాలను లోతుగా అధ్యయనం చేయడం వల్లకూడా చాల మేలు జరుగుతుంది. ఈ విషయంలో నిపుణుల సలహాలనే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రజల, నిర్వాసితుల సూచనలు, సలహాలు, అభిప్రాయలు, సహాయసహకారాలు కూడా తీసుకొనే ప్రయత్నం చేసినట్లయితే అనేక క్లిష్ట సమస్యలకు ఎవరూ ఊహించలేని అద్భుత పరిష్కారాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది.
పోలవరం ముంపు గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులకు మంచి పునరావాసం కల్పించి, వారిలో ఆసక్తి ఉన్నవారికి తగిన సాంకేతిక శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం మరియు నిర్వహణలో భాగస్వాములను చేసి తగిన ఉపాధి కల్పించగలిగితే సమస్యలు కొంత వరకు పరిష్కారం కావచ్చును. అంతేగాక వారి జీవనవిధానం, ఆచార వ్యవహారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు, సమీప ప్రాంతాలలోనే వారికి అనుకూలమయిన చోట పునరావాసం కల్పించడం ద్వారా కూడా వారిని శాంతింపజేయవచ్చును.
అదేవిధంగా ప్రాజెక్టు క్రింద కోల్పోతున్న అటవీ ప్రాంతాలకు ప్రతిగా మరొకచోట మళ్ళీ అంతే పరిణామం గల అటవీ ప్రాంతాలను పెంపొందించి, పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా కాపాడటం కూడా అంతే అవసరం. ఆ బాధ్యత కూడా గిరిజనులకే అప్పగించినట్లయితే వారు సంతోషంగా స్వీకరించవచ్చును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా వారి సంక్షేమం, పునరావాసం కోసం తగిన ఏర్పాటు చేయగలిగినట్లయితే వారూ సంతోషంగా ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వహణకి సహకరించే అవకాశం ఉంది.అప్పుడే వారు తమను రెచ్చగొట్టే రాజకీయ నేతల ప్రభావానికి లొంగకుండా నిలువగలుగుతారు.
పోలవరం ప్రాజెక్టు సకాలంలో నిర్మించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమర్ధతకు, కార్యదీక్షకు ఒక పరీక్ష వంటివి. అదేవిధంగా నిర్వాసితులకు పూర్తి సంతృప్తికరంగా పునరావాసం కల్పించదదం ద్వారా పోలవరం ప్రాజెక్టును యావత్ దేశంలోనే ఒక ఆదర్శవంతమయిన నమూనా ప్రాజెక్టుగా నిలపగలిగితే, అది కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలకు కూడా గర్వకారణంగా నిలుస్తుంది.