ఎందుకీ అకారణ ద్వేషం?
posted on Jul 4, 2014 @ 9:49AM
ఆంధ్ర, తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి కనీసం నెల రోజులు గడవక మునుపే అప్పుడే విద్యుత్, జల వివాదాలు మొదలయ్యాయి. ప్రతీసారి కేంద్ర జల, విద్యుత్ సంఘాలు జోక్యం చేసుకొంటే తప్ప అడుగు ముందుకుపడటం లేదు. విభజన కారణంగా ఉభయ రాష్ట్రాలు అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ తరుణంలో అవి సరిపోవన్నట్లుగా మళ్ళీ కొత్త సమస్యలు సృష్టించుకోవడం అవివేకమే అవుతుంది.
రాష్ట్ర విభజన మొదలు మొన్న ఎన్నికల వరకు జరిగిన రాజకీయాలతో ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా విసుగెత్తిపోయి ఉన్నారు. ప్రజలు రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి జరగాలని కోరుకొంటున్నారు తప్ప ఇంకా ఈ విద్వేషాలను కొనసాగించాలని కోరుకోవడం లేదనే సంగతిని రెండు ప్రభుత్వాలు గ్రహించాలి. ప్రజల దృష్టిలో హీరోలుగా నిలిచేందుకో, లేక సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికో అధికారంలో ఉన్నవారు ఇతరుల గురించి చులకనగా మాట్లాడటం, నిందించడం, దుందుడుకుగా వ్యవహరించడం వలన తాత్కాలికంగా కొందరు ప్రజల మెప్పు పొందవచ్చునేమో, కానీ చిరకాలం ప్రజలందరినీ మెప్పించలేరు. మభ్యపెట్టలేరు. వారు ఇదే ధోరణి ఇంకా కొనసాగించినట్లయితే ఆ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో ప్రజలు కూడా గ్రహించగలరు.
రాష్ట్ర విభజన జరగడం కోసం తెరాస నేతలు ఆంధ్ర, తెలంగాణా ప్రజలను మానసికంగా విడదీసారు. చివరికి వారు కోరుకొన్నట్లే భౌగోళికంగా కూడా రెండు రాష్ట్రాలు విడిపోయాయి. అయినా ఇంకా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, వ్యవహరించడం వల్ల ఏమి ప్రయోజనం ఆశిస్తున్నారో వారికే తెలియాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయనం పాటిస్తూ, తెలంగాణా ప్రభుత్వానికి స్నేహహస్తం అందిస్తుంటే, తెరాస నేతలు మాత్రం అందుకు ఏ మాత్రం సానుకూలంగా స్పందించకపోగా, దానిని ఆయన బలహీనతగా భావిస్తున్నట్లు చాలా చులకనగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏమాత్రం సంమయమనం కోల్పోకుండా వ్యవహరిస్తుండటం అభినందనీయం.
మాటకారితనం ప్రదర్శించడం వలన రెండు ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య కూడా దూరం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. ‘రాష్ట్రాలుగా విడిపోదాము, అన్నదమ్ములుగా కలుసుందాము,’ అని తెరాస నేతలు పదేపదే చెప్పిన నిన్నటి మాటలను ఒక మారు గుర్తుకు తెచ్చుకోవాలి. నిన్న మొన్నటి వరకు ఒకటిగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా మారినపుడు అన్నదమ్ములవలె మెలగాలి తప్ప దాయాదులుగా మారి కుమ్ములాడుకోవడం తగదు. దాని వలన రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అభివృద్ధి కుంటుపడుతుంది తప్ప వేరే ప్రయోజనం ఉండదు. అందువల్ల ఇప్పటికయినా తెరాస నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజల పట్ల తమ అకారణ విద్వేష వైఖరిని విడనాడి, స్నేహసంబంధాలు పెంచుకొనే ప్రయత్నాలు చేయగలిగితే, రాష్ట్ర విభజన కారణంగా తలెత్తుతున్న అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చును. రెండు రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకొంటూ వేగంగా అభివృద్ధి చెందవచ్చును. కానీ ఇప్పుడు కూడా రెండు ప్రభుత్వాలు విజ్ఞతతో వ్యవహరించకపోతే, కేంద్రం దృష్టిలో, దేశ ప్రజల దృష్టిలో తెలుగుజాతి చులకనవుతుంది. నవ్వులపాలవుతుంది.