త్వరలో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు

  తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి ఐదు నెలలు గడిచినా ఇంతవరకు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అందుకు రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది కనుక రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, సామాజిక వర్గాలకు పూర్తి న్యాయం జరిగే విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, మూస పద్దతిలో కాక తెలంగాణా రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా బడ్జెటు తయారు చేయమని అధికారులకు ఆదేశించినందున బడ్జెట్ తయారీలో కొంత జాప్యం జరిగింది. ఇక రెండవ కారణం-తీవ్ర రెవెన్యూ లోటు.   రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ, ఆ తరువాత ఈ ఐదు నెలల కాలంలో వివిధ ఆదాయ వనరుల ద్వారా రాష్ట్రానికి ఆశించినంతగా ఆదాయం సమకూరకపోవడం కూడా ఈ జాప్యానికి కారణంగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన తరువాత వివిధ శాఖల ద్వారా తెలంగాణా రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం పెరుగుతుందని వేసిన అంచనాలకు భిన్నంగా చాలా తక్కువ ఆదాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. జూలై-సెప్టెంబరు నెలలలో వివిధ శాఖల ద్వారా రూ.10,611 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని భావిస్తే, అందులో మూడవ వంతు కూడా సమకూరలేదని తెలుస్తోంది. వ్యాట్ టాక్స్ ద్వారా రూ. 7,875 కోట్లు రాబడి వస్తుందని అంచనా వేస్తే అక్టోబరు చివరినాటికి కేవలం రూ. 4,500 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. మద్యం అమ్మకాల ద్వారా రూ. 1,125 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేయగా కేవలం రూ. 700కోట్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ఇక స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.960కోట్లు ఆదాయం ఆశించగా అందులో సగం మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మోటార్ వాహనాలపై ట్యాక్స్ వసూళ్లదీ అదే పరిస్థితి. రూ.651కోట్లు ఆదాయం ఆశించగా కేవలం రూ.425కోట్లు మాత్రమే వసూలయినట్లు సమాచారం.   ఈ ఆదాయపు లోటుకు తోడు, అదనపు విద్యుత్ కొనుగోలుకు భారీ మొత్తాలు వెచ్చించవలసి రావడం, పంట రుణాల మాఫీ ఇత్యాదులు ఆ లోటును మరింత పెంచేలా చేస్తున్నాయి. అందువల్ల రూ.75,000 కోట్లతో భారీ బడ్జెటు రూపొందించాలని తెలంగాణా ప్రభుత్వం భావించినప్పటికీ ఈ తీవ్ర ఆదాయ లోటు కారణంగా బడ్జెట్‌ని కుదించక తప్పని పరిస్తితి కనబడుతోంది. ఒకవేళ ఆదాయానికి తగినట్లు బడ్జెట్ ను కూడా కుదించవలసివస్తే అన్నిటికంటే ముందు సంక్షేమ కార్యక్రమాలపైనే వేటు పడవచ్చును. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే నెల మొదటి వారం నుండి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.   ఈనెల 24న ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణా భవన్ లో సమావేశమయ్యి బడ్జెట్ సమావేశాలకు వ్యూహ రచన చేయబోతున్నారు. ఆ తరువాత వెంటనే తెరాస యల్పీ సమావేశం నిర్వహించి, అదే రోజు సాయంత్రం మంత్రి వర్గ సమావేశం కూడా నిర్వహించేందుకు అవసరమయిన కసరత్తు జరుగుతోంది. మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులపై మరింత లోతుగా చర్చించిన తరువాత, సమావేశ తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది.   తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల 5నుండి బడ్జెట్ సమావేశాలు మొదలయ్యి 23వరకు కొనసాగుతాయి. వచ్చే నెల 7న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు సమాచారం.

కోలుకొంటున్న ఉత్తరాంధ్ర

  హుద్ హూద్ తుఫాను తాకిడికి విలవిలాడిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఇప్పుడిపుడే మెల్లగా కోలుకొంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విశాఖలో వారం రోజులు మఖం వేసి తుఫాను సహాయ,పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించిన కారణంగానే ఇది సాధ్యమయిందని చెప్పవచ్చును. ఆయన ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు, కడప, కర్నూలు తదితర జిల్లాలు, పొరుగు రాష్ట్రమయిన ఓడిషా నుండి విద్యుత్, వైద్య, మున్సిపల్, ఫైర్ సర్వీస్ సిబ్బందిని రప్పించి, ప్రాంతాల వారిగా వారికి బాధ్యతలు అప్పగించడంతో అన్ని ప్రాంతాలు చాలా త్వరగా సాధారణ స్థితికి చేరుకోగలుగుతున్నాయి.చుట్టుపక్కల జిల్లాల ప్రజలు స్వచ్చంద సంస్థలు, వ్యాపారస్తులు బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు, బట్టలు వంటివి భారీ ఎత్తున పంపించి ఉత్తరాంధ ప్రజలకు కష్ట కాలంలో అండగా నిలబడ్డారు.   అదేవిధంగా తెలంగాణా ప్రభుత్వం, ప్రజలు కూడా మానవతా దృక్పధంతో స్పందించి యధాశక్తిన సహాయం అందించారు. అంతేకాక తెలంగాణాకు చెందిన కొందరు యువకులు వచ్చి సహాయ, పునరావాస కార్యక్రమాలలో పాల్గొనడం చాలా అభినందనీయం. ఓడిషా మొదలు కొని కడప, కర్నూలు వరకు అనేక ప్రాంతాల నుండి అనేక సహాయక బృందాలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వారం రోజుల పాటు రేయింబవళ్ళు సహాయ కార్యాక్రమాలలో పాల్గొన్నారు. వారి సహాయం ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలు ఎన్నటికీ మరువలేరు. ఇక ఇటువంటి ఆపత్సమయంలో కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడానికే ప్రాధాన్యం ఇచ్చేయి తప్ప, సహాయ కార్యక్రమాలలో పాల్గొనకపోవడం చాలా శోచనీయం. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ నేతలు జిల్లా పర్యటనలు చేస్తూ, బాధల్లో ఉన్న ప్రజలకు యదా శక్తిన సహాయపడవలసిందిపోయి, చీపుర్లు పట్టుకొని మీడియాకు ఫోజులు ఇవ్వడానికి, ఓదార్పుకి, ప్రభుత్వం సహాయం డిమాండ్ చేయడానికే పరిమితమయ్యారు. ప్రతిపక్షమంటే ఇలాగే వ్యవహరించాలన్నట్లుంది వారి తీరు.   ఇక మున్సిపల్, విద్యుత్ సిబ్బంది గత వారం రోజులుగా అలుపెరుగకుండా చాలా కష్టపడుతున్న కారణంగా మూడు జిల్లాలు ఇప్పుడిపుడే సాధారణ స్థితికి చేరుకొంటున్నాయి. కనుక విద్యుత్ సిబ్బందిలో కూడా కొంత అలసత్వం మొదలయింది. వారం రోజులుగా అంధకారంలో మ్రగ్గుతున్న ప్రజలు విద్యుత్ లేక విలవిలలాడుతుంటే ఇదే అదునుగా విద్యుత్ పునరుద్దరణకు కొన్ని చోట్ల విద్యుత్ సిబ్బంది లంచాలు అడుగుతున్నట్లు పత్రికలలో వార్తలు కూడా వస్తున్నాయి. ఇరుగుపొరుగు జిల్లాల, రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు మానవత్వంతో స్పందిస్తుంటే, స్థానిక విద్యుత్ సిబ్బంది ఈవిధంగా ప్రవర్తించడం చాలా దారుణం.   గత వారం రోజులుగా రేయింబవళ్ళు కష్టపడి విద్యుత్ పునరుద్దరణ చేసి మంచిపేరు తెచ్చుకొన్న విద్యుత్ శాఖకి,కొందరు అవినీతిపరుల కారణంగా తీరని అప్రతిష్టకలుగుతోంది.అందువలన ప్రభుత్వం తక్షణమే స్పందించి అటువంటి వారిపై కటిన చర్యలు తీసుకొంటే తప్ప మిగిలిన ప్రాంతాలు విద్యుత్ పునరుద్దరణ సాధ్యపడదు.నేటికీ ఉత్తరాంద్రా జిల్లాలలో అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పునరుద్దరించవలసి ఉంది.ఇంతవరకు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు స్వయంగా సహాయ, పునరావాసకార్యక్రమాలను పర్యవేక్షించారు. కానీ ఇకపై విద్యుత్, వైద్య, మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులు అదే స్పూర్తి, సమన్వయం, పట్టుదలతో కృషి చేసినప్పుడే ఉత్తరాంధ్రా తిరిగి సాధారణ స్థితికి చేరుకోగలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వారికి అవసరమయిన సహాయం అందించేందుకు సంసిద్దంగా ఉంది కనుక, ఇక వారే ఉత్తరాంధ్ర జిల్లాలను చక్కదిద్దవలసి ఉంటుంది. ఇది వారి బాధ్యత మాత్రమే కాదు, వారి దీక్షా దక్షతలకు ఒక పరీక్ష వంటిది.

విశాఖకు మరో తుఫాను ముప్పు... తప్పించడం ఎలా?

  హుదుద్ తుఫాను ఉత్తరాంధ్రని అల్లకల్లోలం చేసేసింది. ముఖ్యంగా విశాఖపట్నం కనీవిని ఎరుగని విధ్వంసాన్ని ఎదుర్కొంది. దాదాపు 70 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం, ప్రజల ముందు ఒకే లక్ష్యం వుంది. తుఫాను కారణంగా దెబ్బతిన్న విశాఖపట్నం సాధ్యమైనంత త్వరగా కోలుకునేలా చేయాలి... విశాఖపట్నానికి పూర్వ వైభవం తేవాలి. అయితే దీనికంటే పెద్ద కర్తవ్యం వీరి మీద వుందని వాతావరణ పరిశోధకులు అంటున్నారు. ఆ కర్తవ్య నిర్వహణ చేయకపోతే విశాఖకు మరిన్ని తుఫానులు వచ్చే ప్రమాదం వుందని హెచ్చరిస్తున్నారు.   హుదుద్ తుఫాను విశాఖ దగ్గర తీరం దాటడానికి గల ప్రధాన కారణం ఉత్తరాంధ్ర పరిసర తీర ప్రాంతంలో ఇతర తీరాలకంటే విశాఖ తీరంలోనే ఎక్కువ వేడి వుండటం, ఆ వేడివల్ల ఎక్కువ పీడనం ఏర్పడటమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా సముద్రంలో ఏర్పడిన తుఫానులు వేడి, పీడనం ఎక్కువగా వున్న ప్రాంతంలోనే తీరం దాటుతూ వుంటాయని విశ్లేషిస్తున్నారు. హుదుద్ తుఫాను విశాఖ తీరం దాటిన రోజును పరిశీలిస్తే, ఆరోజున కాకినాడకంటే, కళింగపట్నం కంటే, సమీపంలోని ఇతర తీరప్రాంతాల కంటే విశాఖపట్నంలోనే ఎక్కువ వేడి, పీడనం వున్నాయని గుర్తించారు. అందువల్లే హుదుద్ విశాఖలో తీరం దాటిందని చెబుతున్నారు. ఇతర తీర ప్రాంతాల కంటే విశాఖలో ఎక్కువ వేడి, పీడనం ఏర్పడటానికి గల ప్రధాన కారణం నివాస ప్రాంతాలు పెరిగిపోవడం, చెట్లను కొట్టేయడం, తద్వారా వాతావరణంలో వేడి పెరగడమే నని విశ్లేషిస్తున్నారు.   హుదుద్ తీరం దాటింది. కనీవినీ ఎరుగని విధ్వంసాన్ని సృష్టించింది. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన విశాఖలో ఇప్పుడు పచ్చని చెట్టు అనేదే లేకుండా చేసింది. ఇప్పటికే విశాఖలో గతంలో కంటే వేడి, పీడనం పెరిగాయి. ఇప్పుడు తుఫాను కారణంగా చెట్లన్నీ మటుమాయం అయిపోవడంతో రాబోయే రోజుల్లో వేడి, పీడనం మరింత పెరిగే అవకాశం వుంది. అలాంటి వాతావరణం కారణంగా బంగాళాఖాతంలో భవిష్యత్తులో ఏర్పడబోయే అల్పపీడనాలు మళ్ళీ విశాఖవైపే వచ్చే ప్రమాదం వుంది. సాధారణంగా ప్రతి ఏడాదీ అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశం వుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా నవంబర్‌లోపు అల్ప పీడనాలు ఏర్పడే అవకాశం వుంది. ఇప్పుడు విశాఖలో వేడి పెరగకుండా చూసుకోవడం, త్వరగా పచ్చదనం పెరిగేలా చూడటం వల్ల వేడిని తగ్గించుకోవడం ద్వారా విశాఖ మరో తుఫాను బారిన పడకుండా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో తుఫాన్లు విశాఖను తాకకుండా వుండాలంటే విశాఖ పరిసరాల్లో భారీగా చెట్లను పెంచడం మాత్రమే తరుణోపాయమని నిపుణులు చెబుతున్నారు.

జగన్‌ బుద్ధి మారేలా చెయ్యి ప్రభువా...

  పరలోకమందున్న మా తండ్రీ! నీ నామం పరిశుద్ధ పరచబడును గాక! నీ రాజ్యం వచ్చు గాక... కానీ వీటికంటే ముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా వున్న జగన్ బుద్ధి మారుగాక! అవును ప్రభువా... తన వైఎస్సార్‌ ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని జగన్ లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించాడని ఆరోపణలు భారీ స్థాయిలో వున్నా, ఆయన నెత్తిమీద బోలెడన్ని కేసులు వున్నా, పదహారు నెలలు జైల్లో వుండి వచ్చినా, ఏ క్షణంలో తిరిగి జైలుకి వెళ్తాడో తెలియకపోయినా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిపక్ష నాయకుడిని చేశారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ఆయన అలా కాకుండా, కేవలం అధికారమే పరమావధిగా జగన్ వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా వుంది. అవినీతి డబ్బుతో స్థాపించిన తన మీడియాలో ప్రభుత్వం మీద లేనిపోని నిందలు, అపవాదులు, దుష్ప్రచారం చేస్తున్నారు. పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలనలో విసిగి వేసారిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజన లాంటి దారుణాన్ని కూడా ఎదుర్కొన్నారు. పదేళ్ళ నరకం తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్‌లో శ్రమించి పనిచేసే సమర్థమైన ప్రభుత్వం వచ్చిందని ప్రజలు ఆనందిస్తున్న వేళ జగన్ మాత్రం ప్రజల పంటికింద రాయిలా మారారు. పొరపాటున సాక్షి టీవీ పెట్టినా, బుద్ధి గడ్డితిని సాక్షి పేపర్ చూసినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించడం తప్ప మరొకటి కనిపించదు. వాస్తవాలకు వక్రభాష్యం ఇవ్వడం తప్ప మరోటి చూసే అదృష్టం కలగదు.   సరే, చంద్రబాబు ప్రభుత్వం మీద జగన్ రెగ్యులర్‌గా జల్లే బురద సంగతి అలా వుంచుదాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెను విపత్తును ఎదుర్కొంది. హుదుద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర కకావికలు అయిపోయింది. విశాఖపట్నం దారుణంగా దెబ్బతింది. హుదూద్ తుఫాను సముద్రంలో ఏర్పడినప్పటి నుంచి, తీరం దాటిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ఎలర్ట్‌గా వుండి అవసరమైన చర్యలు తీసుకుంది. తుఫాను తీరం దాటినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలోనే వుంటూ జనాల్లో కలసిపోయి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి అండగా వుండాల్సిన ప్రతిపక్ష నాయకుడు జగన్ తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించడం లేదు. తుఫాను బాధితులకు అండగా నిలిచిన ప్రభుత్వం మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. తుఫాను సహాయక పనుల మీద కూడా విషప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు. తుఫాను బాధితులకు అండగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడికి పొలిటికల్ మైలేజ్ ఎక్కడ పెరిగిపోతుందోనని భయపడిపోతున్న జగన్ ఆయన మీద ఆరోపణల బురద చల్లుతూ ఆత్మానందం చెందుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మారని జగన్ బుద్ధి ఇంకెప్పుడు మారుతుంది? ఆయన బుద్ధిని ఆయన మార్చుకోడని, ఆ బుద్ధిని మార్చడం నరమానవుల వల్ల కాదని అర్థమైపోయింది. అంచేత ప్రభువా.. కనీసం నువ్వయినా జగన్ బుద్ధిని మార్చు. ఆమెన్.

అవిశ్రాంత శ్రామికుడు సీఎం చంద్రబాబు

  ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎలా వుండాలి, నాయకుడు అంటే ఎలా వుండాలి అనే ప్రశ్నలకు ఇలా వుండాలి అని సమాధానంగా ప్రపంచమంతా చూపించే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వుంది. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భుజ స్కందాల మీదకు తీసుకున్నారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు దూసుకు వెళ్ళబోతోందన్న నమ్మకం బలపడుతోంది. ఈ సమయంలో అనుకోకుండా వచ్చిన హుదుద్ తుఫాను ఉత్తరాంధ్రను అతలాకుతలం చేయడంతోపాటు చంద్రబాబు నాయుడు సామర్థ్యానికి పెద్ద పరీక్షలా నిలిచింది.   హుదుద్ తుఫాను వస్తోందని తెలిసినప్పటి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనలోని కార్యసాధకుడు ఈ అంశం మీద దృష్టిని కేంద్రీకరించేలా చేశారు. అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో తుఫాను రాకని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తుఫాను తీరం దాటే అవకాశం వున్న ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ముందస్తుగా అనేక చర్యలు తీసుకున్నారు. ఆ చర్యల ఫలితంగా అత్యంత భారీ స్థాయిలో హుదుద్ తుఫాను విశాఖ తీరాన్ని తాకినప్పటికీ జననష్టం చాలా తక్కువగా వుండేలా చేశారు.   ఎటో వెళ్ళబోతోందని అనుకున్న తుఫాను మరెటో మళ్ళి విశాఖ తీరాన్ని తాకింది. విశాఖ కనీవిని ఎరుగని రీతిలో నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు తను ఆదుకునేది ఎవరా అని విశాఖ నగరం యావత్తూ ఎదురుచూస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులు, అధికారులతో విశాఖలోనే మకాం వేసి అక్కడి ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచారు. కనీసం విశ్రాంతి కూడా తీసుకోకుండా ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాంతాలకు సహాయ కార్యక్రమాలు వెళ్ళేలా చర్యలు తీసుకున్నాను. భారీగా దెబ్బతిన్న విశాఖపట్టణం రెండు రోజుల్లోనే ఒక మోస్తరుగా కోలుకునేలా చేశారు. ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలతోనే వుంటూ ఆయన చేస్తున్న కృషిని చూస్తున్న వారికి నాయకుడంటే ఇలా వుండాలన్న అభిప్రాయం కలుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడుతున్న శ్రమను చూసి, ఆయన ద్వారా లభించిన స్ఫూర్తితో ఎంతోమంది విరాళాల రూపంలో తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు. మొత్తమ్మీద చంద్రబాబు నాయుడు తుఫాను విషయంలో వ్యవహరించిన తీరు ఉత్తరాంధ్ర ప్రజల్లో మాత్రమే కాదు.. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయన నాయకత్వం మీద వున్న నమ్మకాన్ని ఎన్నోరెట్లు పెంచింది.

ఆంధ్రాలో నల్ల బంగారం గనులు

  రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి ఆందోళన పడుతున్న సమయంలో అప్పుడప్పుడు కొన్ని తియ్యటి వార్తలు వీనుల విందుగా వినుపిస్తుంటే ప్రభుత్వానికే కాదు ప్రజలకు కూడా చాలా సంతోషం కలుగుతుంది.   రాష్ట్రంలో అనేక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఉన్నప్పటికీ తీవ్ర బొగ్గు కొరత కారణంగా తరచూ ఉత్పత్తి నిలిచిపోతుండేది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేప్పట్టిన అనేక చర్యల కారణం క్రమంగా బొగ్గు సరాఫరా మెరుగుపడడంతో మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి కూడా గాడిలో పడింది. అయినా నేటికీ ఇంకా బొగ్గు కొరత వేధిస్తూనే ఉంది. ఇటువంటి సమయంలో, దేశంలో వివిధ సంస్థలకు కేటాయించిన బొగ్గు గనులను రద్దు చేసిన సుప్రీంకోర్టు ఓడిషాలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన బొగ్గు గనులను మాత్రం రద్దు చేయకపోవడంతో అక్కడ లభించే 240 మిలియన్ టన్నుల బొగ్గునిక్షేపాలను ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు రెండు కలిసి త్రవ్వుకోనేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొంటున్నాయి. అందులో ఆంధ్రా వాటాగా 120 టన్నుల బొగ్గు రాష్ట్రానికి దక్కుతుంది. ఇదే సమయంలో మరో శుభవార్త కూడా వినిపించడం విశేషం.   లక్నోనగరంలో గల బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ డిశంబర్ 2013లో కృష్ణ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో చేసిన ఒక అధ్యయనంలో కృష్ణా జిల్లా సోమవరం నుండి తూర్పు గోదావరిలో రాజమండ్రీ వరకు గల అనేక ప్రాంతాలలో చాలా నాణ్యమయిన బొగ్గు నిక్షేపాలున్నట్లు కనుగొన్నారు. అవి ఏకంగా 3,000 మిలియన్ టన్నుల వరకు ఉంటాయని ఆ సంస్థ అంచనా వేసింది. అంతే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో బొగ్గు గనులలో దొరికే బొగ్గుతో పోల్చి చూస్తే ఇక్కడ దొరికే బొగ్గు వాటి కంటే చాలా నాణ్యమయిందని స్పష్టం చేసారు. ఈ బొగ్గు గనులు భూ ఉపరితలానికి కేవలం 500 మీటర్ల లోతులోనే ఉన్నట్లు ఆ సంస్థ గుర్తించింది.   ఈ గనులలో అత్యంత నాణ్యమయినవి అశ్వారావు పేట (తెలంగాణాలో ఖమ్మం జిల్లా), చింతలపూడి, జంగారెడ్డి గూడెం( పశ్చిమ గోదావరి జిల్లా), చాట్రాయి మండలం (కృష్ణ జిల్లా) మరియు రాజమండ్రీ (తూర్పు గోదావరి జిల్లా)లలో వ్యాపించి ఉన్నాయని ఆ సంస్థ తెలియజేసింది.   ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో వివిధ సంస్థల నుండి చాలా అధికధరలు చెల్లించుతూ బొగ్గు కొనుగోలు చేస్తోంది. కానీ ఇప్పుడు ఒడిషా రాష్ట్రంలో వాటా దొరకడమే కాకుండా, రాష్ట్రంలోనే భారీ బొగ్గు నిక్షేపాలు బయటపడటం చాలా మంచి వార్త.   బొగ్గు గనులున్న చోటే అనేక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కూడా పుట్టుకొస్తాయి. విద్యుత్ సరఫరా బాగుంటే కొత్తగా పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. ఈ బొగ్గు గనుల త్రవ్వకాలకు, సరఫరాకు అనేక కంపెనీలు వస్తాయి, కనుక వాటి ద్వారా కూడా యువతకు ఉపాధి, రాష్ట్రానికి అదనపు ఆదాయం దక్కవచ్చును. విద్యుత్ ఉత్పత్తి పెరిగితే రాష్ట్రానికి మిగులు విద్యుత్ కూడా ఏర్పడుతుంది. కనుక దాని ద్వారా కూడా రాష్ట్రానికి అదనపు ఆదాయం లభిస్తుంది. ఇక బొగ్గు లభ్యత పెరుగుతున్న కొద్దీ విద్యుత్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. బహుశః అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ధరలను తగ్గించేందుకు కృషి చేస్తానని ఇటీవల హామీ ఇచ్చారేమో?   ఈ బొగ్గు గనులలలో త్రవ్వకాలు మొదలయితే ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఇతర రాష్ట్రాలకు బొగ్గు సరఫరా చేయగలిగే పరిస్థితి ఏర్పడుతుంది, కనుక ఆవిధంగా కూడా రాష్ట్ర ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అందుకే వీలయినంత త్వరగా ఈ బొగ్గు గనుల త్రవ్వకాలు మొదలు పెట్టాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కోరుతూ కేంద్రానికి లేఖ వ్రాసింది.   కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయినప్పటికీ, ఆ భగవంతుడే రాష్ట్రానికి ఈవిధంగా ఆదుకొన్నట్లుంది. ఈ నల్ల బంగారం రాష్ట్రానికి సిరులు కురిపించడం ఖాయం. కాకపోతే రాష్ట్రంలో కూడా మరో కోల్-గేట్ కుంభకోణం జరగకుండా ముందు నుండే జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 

ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగేనా?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ పరిసర ప్రాంతాలలో నిర్మించాలని భావించిన తెదేపా ప్రభుత్వం ఆ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూసేకరణకు ప్రయత్నిస్తోంది. అయితే దానికి రైతుల నుండి మిశ్రమ స్పందన వస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత నిరాశకు గురయినట్లు కనబడుతున్నారు. బహుశః అందుకే ఆయన ఇప్పుడు గుంటూరు వద్ద రాజధాని ఏర్పాటు చేయాలనుకొంటునట్లు చెప్పారనుకోవలసి ఉంటుంది. రాజధాని విజయవాడ వద్ద నిర్మిస్తారా? లేకపోతే గుంటూరు వద్ద నిర్మిస్తారా? అనే విషయం పక్కనబెడితే, అందరూ ఊహించినట్లే రాజధాని నిర్మాణానికి భూసేకరణ ప్రధాన అవరోధంగా మారిందని స్పష్టమవుతోంది. ఆ ప్రాంతాలలో ప్రభుత్వభూములు లేకపోవడం, ఉన్న భూములు రైతులు, రాజకీయ నాయకులు మరియు రియల్టర్ల చేతిలో ఉండటంతో భూసేకరణ చాలా కష్టమవుతోంది.   రాజకీయ నాయకులు, రియాల్టర్లు కేవలం లాభార్జన కోసమే అక్కడ భూములపై పెట్టుబడులు పెట్టారు కనుక ప్రభుత్వం వారి భూములకు తగిన వెల కట్టి సొమ్ము ముట్టజెప్పేందుకు సిద్దపడితే వారు తమ భూములను ప్రభుత్వానికి అమ్ముకోవడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పరు. కానీ రైతులకి జీవనాధారమయిన భూమి వారికి ప్రాణంతో సమానం. దానితోనే రైతుల సుఖ దుఃఖాలు అన్నీపెనవేసుకొని జీవిస్తుంటారు. ఆ ప్రాణాన్ని ప్రభుత్వం కోరుతున్నప్పుడు తప్పనిసరిగా అందుకు పరిహారం తిరిగి భూమి రూపంలోనే ఇవ్వడం ద్వారానే రైతును తృప్తి పరిచే అవకాశం ఉంటుంది తప్ప దానికి వెల కట్టి డబ్బు రూపంలో ఎంత పరిహారం చెల్లించేందుకు సిద్దపడినా రైతులు అంగీకరించక పోవచ్చును.   అయితే ల్యాండ్ పూలింగ్ ద్వారా అటు రైతులు, ఇటు ప్రభుత్వం ఇరువురూ కూడా పూర్తి ప్రయోజనం పొందేవిధంగా ప్రణాళిక సిద్దం చేసి దాని గురించి మంత్రులు, అధికారులు కూడా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారు. కానీ మధ్యలో ప్రత్యర్ధ రాజకీయ పార్టీ నేతలు కొందరు చేస్తున్న విష ప్రచారం వలన కొందరు రైతులు ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సందేహిస్తున్నారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ వద్ద రాజధాని నిర్మిస్తామని శాసనసభలో ప్రకటించినప్పుడు ఆయన నిర్ణయాన్ని స్వాగతించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆ తరువాత అందుకు అవరోధాలు సృష్టిస్తుండటం చాలా విచారకరం. రైతులు ల్యాండ్ పూలింగ్ పద్దతిలో ప్రభుత్వానికి తమ భూములు అప్పగించకపోయినట్లయితే, భూసేకరణ పద్ధతి ద్వారా ప్రభుత్వం వారి నుండి బలవంతంగా భూములు గుంజుకొంటుందని తన మీడియా ద్వారా ప్రచారం చేయడం కూడా రైతులలో లేని భయాలు రేకెత్తించింది.   అందువలన ప్రభుత్వం వారికి అర్ధం కాని లెక్కలు చెప్పడం కంటే ముందుగా వారిలో ప్రభుత్వం పట్ల ఏర్పరచబడిన ఈ అపనమ్మకాన్ని తొలగించి వారి భయాలు పోగొట్టి వారి నమ్మకం పొందే ప్రయత్నాలు గట్టిగా చేయవలసి ఉంటుంది. అంతే కాదు రైతులకి తమ పంట భూములపై ఉన్న మమకారం, దానితో వారికున్న అనుబందాన్నికూడా ప్రభుత్వం గుర్తించి మన్నించివలసి ఉంటుంది.ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొన్నా అది వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కనుక వారి ఆవేదనను, భూమితో వారికున్న అనుబంధాన్ని, దానిపైనే ఆధారపడి ఉన్న వారి జీవితాలను అన్నిటినీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని తదనుగుణంగా ప్రతిపాదనలు చేసినట్లయితే బహుశః వారు తప్పకుండా ప్రభుత్వానికి సహకరించవచ్చును.   ఒకవేళ రైతులు అంగీకరించకపోయినట్లయితే ప్రభుత్వం కూడా మొండిపట్టుదలకు పోవడం కంటే, రాజధాని నిర్మాణానికి ప్రత్యామ్నాయ ప్రాంతాలను గుర్తించడం మంచిది. లేదా విజయవాడ-గుంటూరు నగరాలలో ఉన్న పరిమిత ప్రభుత్వ భూములలో కేవలం సచివాలయం, శాసనసభ, ముఖ్యమంత్రి అధికార నివాసం మరియు ప్రభుత్వాధికారుల నివాసాలు వంటి ముఖ్యమయిన భవన సముదాయాలతో కూడిన చిన్న రాజధానిని మాత్రమే అక్కడ నిర్మించి, శివరామకృష్ణన్ కమిటీ సూచించిన విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను, హైకోర్టు వంటి వాటిని రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వికేంద్రీకరించడం ద్వారా ఈ సమస్యను అధిగమించ వచ్చును.   తద్వారా అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందడమే కాకుండా రైతులతో సహా అన్ని జిల్లాల ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. ఏమయినప్పటికీ, ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం తన ముందు ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా అవసరం. భూసేకరణ అనేది చాలా సున్నితమయిన, రైతుల భావోద్వేగాలతో, జీవితాలతో ముడిపడి ఉన్న అంశం కనుక ప్రభుత్వం కూడా అంతే సున్నితంగా వ్యవహరించడం చాలా అవసరం. లేకుంటే అది కొత్త సమస్యలకు ఆహ్వానం పలికినట్లవుతుంది.

వైజాగ్ కు మహర్దశ మొదలయినట్లే

  రాష్ట్రంలో మెట్రో హంగులన్నీ కలిగిన ఏకైక నగరంగా వైజాగ్ వేగంగా ఎదుగుతోంది. ప్రభుత్వం వైజాగ్ నగరాన్ని ఐటీ హబ్ గా అభివృద్ధి చేసి, అక్కడ ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చాలని నిశ్చయించుకొంది. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆరు నెలలలోగా వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకు అన్నివిధాల సహకరించేందుకు ఏషియన్ డెవెలప్మెంట్ బ్యాంకు అంగీకరించింది.   అదేవిధంగా వచ్చే ఆరు నెలలోగానే విజయవాడతో బాటు వైజాగ్ నగరంలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే డిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టు కార్పోరేషన్ చైర్మన్ శ్రీధరన్ న్ను ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్టుల ప్రధాన సలహాదారుగా నియమించుకొని, ఆయనకే మెట్రో ప్రాజెక్టు నివేదికలను తయారుచేసే బాధ్యతను కూడా అప్పగిస్తూ ప్రభుత్వం నిన్ననే ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈనెల 15,16 తేదీలలో ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు వైజాగ్ కు వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహకరిస్తే మెట్రో రైల్ నిర్మాణాన్ని కేవలం మూడేళ్ళలోనే పూర్తి చేయడం తనకు పెద్ద కష్టమయిన పని కాదని ఆయన ఇదివరకే ప్రకటించారు. కనుక ఇక ప్రభుత్వాలదే ఆలశ్యమని చెప్పవచ్చును. రాష్ట్ర ప్రభుత్వం కూడా మెట్రో రైల్ ప్రాజెక్టులు పూర్తి చేసి మంచి పేరు సంపాదించుకోవాలనే చాలా ఆత్రంగా ఉంది కనుక బహుశః వచ్చే ఎన్నికలలోగానే మూడు నగరాలలో మెట్రో రైళ్ళు పరుగులు తీయవచ్చును.   ఇక హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణా ప్రభుత్వం నుండి వస్తున్న ఒత్తిళ్ళ కారణంగా, తక్షణమే కాకపోయినా క్రమంగా ఒకటొకటిగా వైజాగ్ కి తరలి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే వైజాగ్ లో రామానాయుడు సినిమా స్టూడియో నిర్మించడంతో అక్కడ సినీ నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. చిన్న నిర్మాతల సంఘం అధ్యక్షుడు నట్టి కుమార్ తమకు ప్రభుత్వం వైజాగ్ లో భూములు కేటాయిస్తే, అక్కడే సినీ నిర్మాణానికి అవసరమయిన హంగులు ఏర్పాటు చేసుకొంటామని అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ వైజాగ్ కు రావాలనే కోరుకొంటోంది కనుక బహుశః ఆయన కోరికను మన్నించవచ్చును. ఇంతవరకు కేవలం సినిమా షూటింగులకే పరిమితమయిన వైజాగ్ నగరంలో ఇకపై సినీ నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలయితే ఇక వైజాగ్ లో సందడే సందడి.   అదేవిధంగా వైజాగ్ లో ఏదయినా ఒక ఉన్నత విద్యా సంస్థను కూడా ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందిన వైజాగ్ నగరంలో అనేక స్టార్ హోటల్స్, పెద్ద షాపింగ్ మాల్స్ తో కళకళ లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ నగరాన్ని స్మార్ట్ సిటీగా మలచాలని భావిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వైజాగ్ లోనే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. బహుశః ఈ ప్రాజెక్టులన్నీ ఒకటొకటిగా రూపుదాల్చడం మొదలయితే, ఇక వైజాగ్ నగరానికి మహార్ధశ మొదలయినట్లే భావించవచ్చును. ఇకపై వైజాగ్ నగరం హైదరాబాద్ కు దీటుగా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

తెలంగాణాలో రీ-ఎంట్రీకి వైకాపా రెడీ

  వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు, కార్యకర్తలతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. తెలంగాణాలో మళ్ళీ తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే అసలు వైకాపా తెలంగాణాను ఎందుకు విడిచిపెట్టి బయటకు వచ్చేసిందనే ప్రశ్నకు ఇంతవరకు వైకాపా జవాబు చెప్పకపోయినా దానికి అనేక సమాధానాలు కనబడుతున్నాయి.   ఎన్నికల తరువాత కేంద్రంలో మళ్ళీ యూపీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే మాటయితే దానికి మద్దతు ఇచ్చే షరతుపైనే జగన్మోహన్ రెడ్డికి బెయిలు దొరికిందనే వార్తలు నిజమనుకొంటే, తెరాసతో జత కట్టాలనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే, వారి విజయానికి అవరోధం కలిగించకుండా వైకాపా తెలంగాణాను విడిచిపెట్టి ఉండవచ్చును. లేదా అటు తెలంగాణాలో తెరాస, ఇటు ఆంధ్రాలో వైకాపా మద్దతు పొందవచ్చనే కాంగ్రెస్ వ్యూహం అమలుచేసేందుకే వైకాపా తెలంగాణాను విడిచిపెట్టి ఉండవచ్చును. లేదా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కోసం తెలంగాణాలో కనీసం ప్రచారం కూడా చేయలేని పరిస్థితులో తెలంగాణాను అంటిపెట్టుకొని రెండు చోట్లా నష్టపోవడం కంటే, సమైక్యాంధ్ర సెంటిమెంటుతో ఆంధ్రప్రదేశ్ లో బలంగా నిలద్రొక్కుకోవచ్చనే అంచనాతో వైకాపా తెలంగాణా విడిచిపెట్టి ఉండవచ్చును. కానీ కాంగ్రెస్, వైకాపాల వ్యూహాలు, అంచనాలు అన్నీ తలక్రిందులయ్యి రెండు చోట్ల ఆ రెండు పార్టీలు ఓడిపోయాయి.   ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించవలసిన అవసరం వైకాపాకు లేదు. కానీ తెరాసతో అంతో ఇంతో సఖ్యత ఉంది కనుక తెలంగాణాలో మళ్ళీ అడుగుపెట్టేముందు ఆ పార్టీతో తమ సత్సంబంధాల గురించి తప్పక ఆలోచించవలసి ఉంటుంది. కానీ తెలంగాణాలో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నందున, తెరాసను డ్డీకొనేందుకే ఆయన మొగ్గు చూపుతున్నారని భావించవలసి ఉంటుంది.   సార్వత్రిక ఎన్నికలు ముగిసి తెలంగాణాలో తెరాస పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ పార్టీకి ఇతర పార్టీల మద్దతు అవసరం లేదని తెలిసినప్పటికీ వైకాపా మద్దతు ఇచ్చేందుకు సిద్దమయింది. ఒక సమైక్యవాద పార్టీ, విభజనవాద పార్టీకి మద్దతు ఇవ్వడమే వింత అనుకొంటే, తెరాస నేతలు ఆంద్ర ప్రజలను, ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ ఏనాడూ కూడా వైకాపా నోరువిప్పి మాట్లాడిన దాఖలాలు లేవు. వైకాపాతో మిత్రత్వం పాటిస్తూ వచ్చిన తెరాస నేతలు ఇంతవరకు నేరుగా దాని జోలికి పోనప్పటికీ, అడపా దడపా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్సార్ మీద ఘాటు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వైకాపా తెలంగాణాలో పునః ప్రవేశించాలనుకొంటే తప్పనిసరిగా తెరాసను డ్డీ కొని, తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శించక తప్పదు. అదేవిధంగా వైకాపా తెలంగాణాలో అడుగుపెట్టేందుకు నిశ్చయించుకొన్న మరుక్షణం నుండి తెరాస కూడా ఆ పార్టీపై, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నేరుగా విమర్శలు గుప్పించడం తధ్యం.   ఇక తెలంగాణాను అర్దాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయినా వైకాపా, ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినంత మాత్రాన్న తెలంగాణా ప్రజలు దానిని ఆదరిస్తారని ఆశించడం అవివేకమే అవుతుంది. పైగా తెరాస నేతలు స్వర్గీయ వై.యస్సార్ హయంలోనే తెలంగాణాను దోపిడీకి గురయిందని గట్టిగా చేసిన ప్రచారం వలన ప్రజలు వైకాపాను నమ్మే పరిస్థితిలో లేరు.   జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసుల కారణంగా ఇప్పటికే మసకబారిన వైకాపా ప్రతిష్ట ఈ నిర్ణయంతో మరింత మసకబారవచ్చును. ఏవిధంగా అంటే ఇంతవరకు కేవలం తెదేపా మాత్రమే వైకాపాను, దాని అధ్యక్షుడిని గట్టిగా విమర్శిస్తోంది. కానీ ఇకపై తెదేపాతో బాటు, తెరాస, టీ-కాంగ్రెస్, బీజేపీలు కూడా స్వర్గీయ వై.యస్సార్ ను, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన హయాంలో జగన్ క్విడ్ ప్రో వ్యవహారాల గురించి మాట్లాడటం మొదలు పెట్టడం తధ్యం కనుక వైకాపా ప్రతిష్ట మరింత మసకబారడం కూడా తధ్యం. అందువల్ల ఇంతకు ముందు వైకాపా తెలంగాణాను విడిచిపెట్టడం ఎంత తప్పో, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలనుకోవడం కూడా అంతకంటే పెద్ద తప్పవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణా విద్యుత్ సమస్యలకు ఎవరు బాధ్యులు?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, “రాష్ట్రంలో ప్రస్తుత కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాలే కారణమని ఆరోపిస్తూ, మరో మూడేళ్ళలో రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు తీరిపోతాయని హామీ ఇస్తున్నారు. కానీ ఆయన ఎన్నికల సమయంలో తెరాస అధికారంలోకి రాగానే రోజుకి 8గంటలు చొప్పున విద్యుత్ ఇస్తామని, మూడేళ్ళ తరువాత రోజుకి 24గంటలు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి మరిచిపోయి, ఇప్పుడు గత ప్రభుత్వాలను నిందిస్తున్నారు. అంటే ఆయనకు ఎన్నికల సమయంలో తెలంగాణాలో విద్యుత్ పరిస్థితి గురించి తెలుసుకోకుండానే హామీలు ఇచ్చేరా? లేక తెలిసీ ఎన్నికలలో గెలవడానికి ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ హామీ ఇచ్చేరా? అనే విషయం ఆయనే వివరించాలి.   నిజానికి చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేప్పట్టే సమయానికి ఆంధ్ర,తెలంగాణా రెండు రాష్ట్రాలలో కూడా తీవ్ర విద్యుత్ సమస్య ఉండేది. కానీ ఈ నాలుగు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ సమస్యల నుండి క్రమంగా బయటపడుతుంటే, తెలంగాణా రాష్ట్రం మాత్రం ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. అందుకు తెలంగాణా ప్రభుత్వం వేరేవరినో కాక తనను తానే నిందించుకోక తప్పదు. ఎందువలన అంటే తెలంగాణాలో తీవ్ర విద్యుత్ కొరత ఉందని గ్రహించినప్పుడు, తక్షణమే అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఉండి ఉంటే నేడు సమస్య ఇంత తీవ్రం రూపం దాల్చేది కాదు. కానీ కేసీఆర్ పొరుగునున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో, అటు కేంద్రప్రభుత్వంతో యుద్ధం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చేరు తప్ప ఏనాడు వారి సహకారం తీసుకొని ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయలేదు. కేంద్ర విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ ఓ సందర్భంగా మాట్లాడుతూ ‘కేంద్రం తెలంగాణకు సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రప్రభుత్వాన్ని కలిసే ఆలోచనే చేయలేదు’ అనడం గమనిస్తే తెలంగాణా ప్రభుత్వ ప్రయత్నలోపం ఉందని అర్ధమవుతోంది.   అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోగలిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి కారణంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘నిరంతరాయ విద్యుత్ సరఫరా పైలట్ ప్రాజెక్టును రాష్ట్రం సాధించుకోగలిగింది. అదేవిధంగా రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా సమస్య కూడా పరిష్కరింపబడటంతో, విద్యుత్ ఉత్పత్తి కూడా మెరుగుపడింది. ఒకవేళ తెలంగాణా ప్రభుత్వం కూడా ఇరుగుపొరుగు రాష్ట్రాలతో, కేంద్రప్రభుత్వంతో సానుకూల ధోరణి వ్యవహరించి ఉండి ఉంటే, బహుశః పరిస్థితి వేరేలా ఉండేదేమో?

సంక్షేమ కార్యక్రమాలకు శాశ్విత నిధులు, వ్యవస్థ ఏర్పాటు అవసరమా?

  ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకొంటూ తెదేపా ప్రభుత్వం ఈ నెల రెండవ తేదీ నుండి వృద్ధులు, వితంతువులు మరియు వికలాంగుల పెన్షన్లు రూ. 1000-1500 వరకు పెంచింది. రాష్ట్ర విభజన, ఆర్ధిక లోటు, పంట రుణాల మాఫీ, విద్యార్ధుల ఫీజు రీ-ఇంబర్స్ మెంటు వంటి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇది అదనపు భారమేనని చెప్పక తప్పదు. కానీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లను చెల్లించడానికే సిద్దమయింది.   అయితే ప్రభుత్వం ఈ కొత్త పెన్షను పధకం అమలుచేయడం మొదలుపెట్టిన వెంటనే కొత్తగా 5,23,000 మంది పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకొన్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు తెలిపారు. ఒక్క కృష్ణా జిల్లా నుండే 43,900 మంది దరఖాస్తు చేసుకొన్నారని ఆయన తెలిపారు. వారిలో అర్హులయిన వారిని గుర్తించి ప్రభుత్వ వెబ్ సైటులో పెడతామని తెలిపారు. అందువలన ఇదొక నిరంతర ప్రక్రియ అని స్పష్టమవుతోంది.   ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా పెన్షన్లు ఇచ్చినప్పటికీ అవి నామమాత్రంగా కేవలం రూ.200-500 మాత్రమే ఉండేవి. కనుక ప్రభుత్వానికి అదొక ఆర్ధిక భారంగా ఎన్నడూ కనబడలేదు. కానీ ఇప్పుడు రూ.1000-1500 వరకు పెన్షన్లు ఇస్తుండటంతో కొత్తగా దరఖాస్తు చేసుకొంటున్న వారితో కలిపి చూసుకొన్నట్లయితే, ఆ భారం మరింత పెరుగుతుందని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కానీ నిసహ్హాయులయిన వృద్ధులను, వితంతువులను మరియు వికలాంగులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కనుక ఈ పెన్షన్లను తప్పనిసరిగా కొనసాగించవలసి ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోలేదని ఆ భారం తిరిగి ప్రజలపై వేసినా లేకపోతే ఏదో వంకపెట్టి అర్హులకు పెన్షను ఇవ్వకుండా తప్పించుకొనే ప్రయత్నం చేసినా ప్రజలు ప్రభుత్వాన్నే తప్పుపడతారు. కానీ బోగస్ లబ్దిదారులను నిర్దాక్షిణ్యంగా ఏరివేయడం ద్వారా కొంత ఆర్ధిక భారం తగ్గించుకోవడమూ చాలా అవసరమే.   ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంత గొప్పగా లేకపోయినప్పటికీ, త్వరలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, సాఫ్ట్ వేర్ హార్డ్ వేర్ సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు, మెట్రో రైల్ ప్రాజెక్టు వంటివన్నీ వచ్చినట్లయితే ఆర్ధికంగా రాష్ట్రం కోలుకోగలదు. అప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమం నిరంతరం సజావుగా సాగేందుకు అవసరమయిన నిధులను, అందుకు అవసరమయిన ఒక ప్రత్యేక వ్యవస్థను శాశ్విత ప్రాతిపదికన ప్రభుత్వం ఏర్పాటుచేసుకోవడం మంచిది.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి తధ్యం

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న మూడేళ్ళలో రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీరుస్తానని ప్రజలకు గట్టిగా భరోసా ఇస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణాలో మొత్తం 6,000 మెగావాట్స్ సామర్ధ్యంగల మూడు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు తెలంగాణ జెన్ కో సి.యం.డి. డి. ప్రభాకర్ రావు మరియు బీ.హెచ్.ఈ.యల్. సంస్థ సి.యం.డి. బి. ప్రసాదరావు నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సచివాలయంలో ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేసారు. మొత్తం రూ.30, 000 కోట్లు ఖర్చుతో ఈ మూడు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను మూడేళ్ళలోనే నిర్మించబోతున్నారు.   వాటిలో ఒకటి రామగుండం(1200 మెగావాట్స్), ఇంకొకటి కొత్తగూడెం(800 మెగావాట్స్), మరొకటి ఇందూరు-మణుగూరు మధ్య (4,000 మెగావాట్స్) వద్ద నెలకొల్పుతారు. కొత్తగూడెం వద్ద నెలకొల్పబోయే విద్యుత్ ప్లాంటు కోసం ఇప్పటికే జెన్ కొ స్థల సేకరణ పూర్తిచేసింది. రామగుండంలో ప్రస్తుతం నడుస్తున్న యన్.టీ.పీ.సి. ప్లాంటు ఆవరణలోనే ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి సంస్థను నిర్మిస్తారు. కనుక ముందుగా ఈ రెండు ప్రాంతాలలో నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇందూరు-మణుగూరు మధ్య ఇంకా స్థల సేకరణ జరుగవలసి ఉంది. త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తవగానే అక్కడ కూడా నిర్మాణపనులు ఆరంభమవుతాయి.   ప్రస్తుతం తెలంగాణాలో వారానికి ఒకరోజు పవర్ హాలిడేను అమలు చేస్తుండటంతో పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను ఆకర్షించడం చాలా కష్టమవుతుంది. కనుక వీలయినంత త్వరగా ఈ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తిచేయాలని బీ.హెచ్.ఈ.యల్. సంస్థ సి.యం.డి. బి. ప్రసాదరావును కేసీఆర్ కోరారు. తెలంగాణాలో రైతులు వ్యవసాయం కోసం ప్రధానంగా బోరు బావుల మీద ఆధారపడుతుంటారు. కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్యను అధిగమించేందుకు గట్టిగా కృషిచేస్తూనే, మరోవైపు తెలంగాణాలో రైతాంగానికి ఈ విద్యుత్ సమస్యల నుండి విముక్తి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సిద్దం చేస్తున్నారు.   ఆ ప్రయత్నంలోనే భాగంగానే రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురయున్న గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్దరించి, వాటి ద్వారా వ్యవసాయానికి నీళ్ళు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేసారు. చిరకాలంగా ఫ్లోరో సిస్ సమస్యతో బాధపడుతున్న నల్గొండ జిల్లా నుండే ఈ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణ కార్యక్రమం మొదలుపెట్టేందుకు కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. త్వరలోనే ఈ కార్యక్రమం మొదలవవచ్చును.   వచ్చే మూడేళ్ళలో అదనపు విద్యుత్ ఉత్పత్తి మొదలయితే రాష్ట్రంలో గృహ, పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. అదే సమయంలో ఈ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ద్వారా వ్యవసాయానికి తగినంత నీళ్ళు అందజేయగలిగితే క్రమంగా విద్యుత్ భారం కూడా తగ్గు ముఖం పడుతుంది. రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు కుదురుకొన్నట్లయితే ఇక తెలంగాణా రాష్ట్ర ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోతుంది. తెలంగాణాలో ఇప్పుడు రాజకీయ సుస్థిరత నెలకొని ఉంది కనుక బహుశః రానున్న ఐదేళ్ళలోనే ఈ మార్పు స్పష్టంగా కనబడవచ్చును.

పంట రుణాల మాఫీపై వైకాపాకు ఆరాటం దేనికి?

  ఆంధ్రప్రదేశ్ రైతుల పంట రుణాలను మాఫీ చేయడమే కాదు వారిని పూర్తిగా రుణ విముక్తులను చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా పంట రుణాలను మొత్తం ఒకేసారి మాఫీ చేయడం సాధ్యపడదు కనుక ఐదు దశలలో రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. ముందుగా ఈనెల మొదటివారం నుండి మొదటి దశ పంట రుణాలను మాఫీ కార్యక్రమం మొదలుపెడదామని భావించినప్పటికీ, కేవలం పంట రుణాలే కాక, రైతులకు సంబంధించిన అనేక సమస్యలను శాశ్విత ప్రాతిపదికన పరిష్కరించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం ‘రైతు సాధికారిక సంస్థ’ను ఏర్పాటు చేసి దాని ద్వారానే ఈ మొదటి దశ పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందువలన ఈ నెల మొదటి వారం నుండి మొదలవుతాయనుకొన్న పంట రుణాల మాఫీ కార్యక్రమం మరో మూడు వారాల ఆలశ్యంగా అంటే దీపావళి నుండి మొదలుపెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.   ఈ పంట రుణాల మాఫీ అంశాన్ని అందిపుచ్చుకొని రాజకీయ లబ్ది పొందుదామని తపిస్తున్న వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని ఉవ్విళ్ళూరుతున్నప్పటికీ, తీరాచేసి తాము ఉద్యమం మొదలుపెట్టిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలను మాఫీ కార్యక్రమం మొదలుపెడితే ప్రజలలో అభాసు పాలవుతామనే భయంతో వెనుకంజ వేస్తోంది. అందువలన ఈ అంశంపై ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ రోజులు నెట్టుకొస్తోంది.   ఆ పార్టీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు పంట రుణాలను మాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెపుతూ కాలక్షేపం చేయకుండా ఇకనయినా ఎప్పుడు మాఫీ చేస్తుందో ప్రకటించాలని, ఈ రుణాల మాఫీ అంశంపై ప్రభుత్వం బ్యాంకర్లతో కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. ‘రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుందని’ అడిగినట్లుంది ఆయన తీరు. పంట రుణాల మాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంత స్పష్టంగా తన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించినా ఇంకా ఇటువంటి డిమాండ్లు చేయడం కేవలం రైతులను ఆకట్టుకోనేందుకేనని అర్ధమవుతూనే ఉంది.   రైతుల సంక్షేమం పట్ల తమకే చాలా నిబద్దత ఉన్నట్లు వారికోసం పోరాడుతున్నట్లు వైకాపా నటిస్తోంది. కానీ నిజానికి వైకాపా ఉద్దేశ్యం రైతుల సంక్షేమం కోసం పోరాడటం కాదు. కేవలం ఆ అంశాన్ని వాడుకొని తన రాజకీయ ప్రత్యర్ధి అయిన అధికార తెదేపాపై బురద జల్లుతూ తను రాజకీయ లబ్ది పొందడానికే. ఒకవేళ వైకాపాకు నిజంగా రైతుల సంక్షేమం గురించి అంత తపన ఉంటే తెలంగాణాలో రైతుల గురించి కూడా మాట్లాడి ఉండేది. కానీ అక్కడ రైతుల సంక్షేమం కంటే తెరాసతో ఉన్న సత్సంబంధాలను నిలుపుకోవడానికే ప్రాధాన్యతనిస్తోంది. కనుక ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వాన్ని పలెత్తు మాటనదు. కానీ ఆంద్ర ప్రజలను, ప్రభుత్వాన్ని, పాలకులను దొంగలు దోపిడీదారులని విమర్శిస్తున్న తెరాసను ఎన్నడూ పలెత్తు మాటనకపోయినా, ఆంద్ర ప్రభుత్వాన్ని కించపరిచేందుకు మాత్రం వైకాపా ఏ అవకాశాన్ని వదులుకోకపోవడం గమనిస్తే పంట రుణాలను మాఫీపై ఆపార్టీ నిబద్దత ఏపాటిదో అర్ధమవుతోంది. నిబద్దత లేని సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసినందుకు వైకాపాకు ప్రజలు ఎన్నికలలో గుణపాటం నేర్పారు. మళ్ళీ ఇప్పుడు సున్నితమయిన ఈ అంశంపై కూడా రాజకీయాలు చేస్తే ప్రజల చేతిలో భంగపాటు తప్పకపోవచ్చును.

‘స్వచ్చ భారత్’ ఆరంభ శూరత్వం కాకూడదు

  మోడీ ప్రభుత్వం ప్రకటించిన ‘స్వచ్చ భారత్’ కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా మొదలయింది. కేంద్రప్రభుత్వానికి భారతదేశాన్ని పరిశుభ్రంగా మార్చాలనే ఆలోచన కలగడమే ఒక మంచి శుభపరిణామం అనుకొంటే, ప్రధాని మోడీ ప్రకటించిన ఈ కార్యక్రమానికి దేశంలో అన్ని రాజకీయ పార్టీల నుండి మంచి సానుకూల స్పందన రావడం మరో మంచి పరిణామమని చెప్పవచ్చును. అదేవిధంగా ప్రజలు, వివిధ స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ సంస్థలు, పరిశ్రమలు అన్నీ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనేందుకు స్వచ్చందంగా ముందుకు రావడం గమనిస్తే, సమర్దుడయిన నాయకుడు ఆచరణ యోగ్యమయిన కార్యక్రమాలతో ముందుకు వచ్చినట్లయితే యావత్ దేశ ప్రజలు ఆయనకు తమ పూర్తి సహకారం అందించేందుకు ఎల్లపుడు సంసిద్దంగానే ఉంటారని మరో మారు రుజువు చేసారు.   అయితే సాధారణంగా ఇటువంటి గొప్ప ఆలోచనలు, ఆశయాలు, కార్యక్రమాల అమలులో ఆరంభ శూరత్వం మాత్రమే కనిపిస్తుంటుంది. కొన్ని రోజులో వారాల తరువాత ఇటువంటి కార్యక్రమాలు అటకెక్కిపోతుంటాయి. మంత్రులు అందరూ ఏదో ఒక్కరోజు చీపుర్లు పట్టుకొని రోడ్ల మీద హడావుడి చేసినంత మాత్రాన్న దేశం శుభ్రమయిపోదు. అందువలన ఈ ‘స్వచ్చ భారత్’ కార్యక్రమాన్ని ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తే తప్ప మోడీ ఆశయం నెరవేరదు. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగిన విధంగా తమ కార్యాచరణ, పధకాలు రూపొందించుకోవాలి.   ఈ మహాయజ్ఞంలో ప్రజలు, వివిధ సంస్థలు పాల్గొనేలా చేసి అందుకు వారికి ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తే మంచి ఫలితాలు కనబడవచ్చును. ప్రజలు కూడా తమ ఇళ్ళను ఏవిధంగా పరిశుభ్రంగా ఉంచుకొంటారో అదేవిధంగా తమ వీధులను, గ్రామాలను, పట్టణాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొనేలా చైతన్యపరచాలి. బహిరంగ ప్రదేశాలలో విధిగా శుభ్రత పాటించాలనే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పాలి. అవసరమయితే సింగపూరులో లాగ జరిమానాలు వేసినా తప్పులేదు. కానీ అంతకంటే ముందు బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత పాటించేందుకు అవసరమయిన సౌకర్యాలు అంటే చెత్త బుట్టలు, మరుగు దొడ్లు వాటిని సూచించే బోర్డులు వంటివన్నీ ప్రభుత్వమే ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అందుకు వివిధ సంస్థల సహాయసహకారాలు కోరవచ్చును.   అయితే ఇటువంటి విషయాలన్నిటినీ బాల్యం నుండే పిల్లలకు నేర్పిస్తూ వారి ‘మైండ్ సెట్’ మార్చగలిగితే ఇప్పుడు మొదలు పెట్టిన ఈ మహాయజ్ఞాన్నిఆ భావి భారత పౌరులు కూడా కొనసాగించగలుగుతారు. ఏమయినప్పటికీ మోడీ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి, ఒక గొప్ప కార్యక్రమం మొదలుపెట్టింది. దానిని ఇదే స్పూర్తితో, పట్టుదలతో నిష్టగా ఇకముందు కూడా కొనసాగిస్తే అభినందించవలసిందే.

వైకాపాపై జయలలిత కేసు ఎఫెక్ట్

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపింపబడి జైలుకు వెళ్ళిన తరువాత, సహజంగానే అందరి దృష్టి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళింది. ఆయనపై సీబీఐ ఏకంగా 11 చార్జ్ షీట్లు దాఖలు చేసింది. వాటిలో ప్రతీదీ కూడా చాలా తీవ్ర నేరారోపణలతో కూడుకొన్నదే కనుక వాటిలో ఏ ఒక్క కేసులో ఆయన దోషిగా తేలినా మళ్ళీ ఆయన జైలులోకి వెళ్ళక తప్పదని అందరికీ తెలుసు.   ఈ కేసుల వ్యవహారంలో ఆయన తరచూ కోర్టుకి వెళ్లి వస్తున్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ జయలలిత జైలుకి వెళ్ళినప్పటి నుండి అందరిరూ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్, ఆయన పార్టీ భవిష్యత్, ఆ పార్టీని నమ్ముకొన్నవారి భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందనే ఆలోచిస్తున్నారు. ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ, వైకాపా యం.యల్.ఏ.లు, నేతలలో తమ రాజకీయ భవిష్యత్ పట్ల ఆందోళన నెలకొని ఉండవచ్చును. ఒకవేళ ఈరోజు కర్ణాటక హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టు కూడా ఆమెకు అదే శిక్ష ఖరారు చేసినట్లయితే అది నేరుగా వైకాపా నేతలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.   ఎన్నికల ప్రచార సమయంలో నరేంద్ర మోడీ చెప్పిన అనేక అంశాలను క్రమంగా ఇప్పుడు అమలు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అవినీతినిపరులపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారో అందరికీ తెలుసు. మోడీ తమ పార్టీ కేంద్రంలో అధికారం చేప్పట్టిన ఏడాదిలోగానే అవినీతి కేసులపై విచారణ వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లే అధికారం చేప్పట్టిన వెంటనే రాజకీయ నేతలు విదేశాలలో దాచిన నల్లధనాన్ని వెలికి తీసేందుకు నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసారు. ఆ కమిటీ సుప్రీంకోర్టుకి తన తొలి నివేదిక అందించింది కూడా. మోడీ అధికారం చేప్పట్టి ఇప్పటికే నాలుగు నెలలుపైగా గడిచిపోయాయి కనుక నేడో రేపో జగన్మోహన్ రెడ్డి యొక్క సీబీఐ కేసుల విచారణ కూడా వేగవంతం అయ్యే అవకాశం ఉందని భావించవచ్చును.   ఆయనపై సీబీఐ కేసులే కాక ఇంకా డిల్లీలో ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ కేసులు కూడా సాగుతున్నాయి. కేంద్రం సహాయ సహకారాలు లేకపోతే వీటన్నిటి నుండి తప్పించుకోవడం కష్టమేనని చెప్పవచ్చును. కానీ  ఈ కేసులలో కేంద్రం ఆయనకు సహాయపడే అవకాశం లేదని స్పష్టమవుతోంది కనుక ఆయన మంచి లాయర్లు పెట్టుకొని ఈ కేసులలో ఏ ఒక్కటి కూడా విచారణ ముగియకుండా ఎంతకాలం సాగదీయగలరనే దానిపైనే ఆయన భవిష్యత్, ఆయన పార్టీ భవిష్యత్, పార్టీ నేతల భవిష్యత్ ఆధారపడుందని అర్ధమవుతోంది.   రాజకీయనేతలెవరూ కూడా తమ భవిష్యత్ అగమ్యగోచరంగా కనబడితే ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉండబోరు. ఎన్నికల ముందు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు దూకేసిన నేతలు దానిని నిరూపించి చూపారు. వైకాపా అధికారంలోకి వస్తుందనే అంచనాలతో ఆ పార్టీలోకి చేరిన నేతలు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కేసులు వల్ల తమ రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని అనుమానం కలిగిన మరుక్షణమే ఆ పార్టీలో నుండి బయటకు దూకేయడం తధ్యం.   తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉంది కనుకనే ఆపార్టీ అధ్యక్షురాలు జయలలిత జైలుకి వెళ్ళినా ఆ పార్టీ నేతలు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. కానీ రాష్ట్రంలో వైకాపా అధికారంలో లేదు. ప్రతిపక్షంలో ఉంది. మరో ఐదేళ్ళ వరకు ఎన్నికలు కూడా రావు. కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డిపై కేసుల విచారణ వేగవంతమయినట్లయితే వైకాపా నేతలు నమ్మకంగా ఆ పార్టీని అంటిపెట్టుకొనే ఉంటారని భావించలేము. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి కూడా ఒకవేళ జయలలిత పరిస్థితే ఎదురయినట్లయితే పార్టీని కాపాడుకొనేందుకు అవసరమయిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళనాడు రాజకీయ అనిశ్చితి ఆంధ్ర, తెలంగాణాలకు వరంగా మారనుందా??

    జయలలిత జైలుపాలవడంతో తమిళనాడు రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు ఎంతో కొంత మేలు చేయకపోవని మార్కెట్ నిపుణులు అంచనా వేయడం చూస్తుంటే ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు దొరికిందని సంబరపడ్డట్టుంది. పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో తమిళనాడు రాష్ట్రం చాలా ముందుంది. అందుకే ఆ రాష్ట్రానికి $13బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయి. ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన ఫార్ట్యూన్-500 కంపెనీలలో నిస్సాన్, ఫోర్డ్, హుండాయ్, మిత్సుబిషి, యమహ, డెల్, డైమ్లర్, డెల్ఫీ వంటి కొన్ని కంపెనీలు తమిళనాడులో అనేక ఏళ్ల క్రితమే తమ సంస్థలను స్థాపించి చాలా సజావుగా వ్యాపారాలు నిర్వహించుకొంటున్నాయంటేనే ఆ రాష్ట్రం పెట్టుబడులకు ఎంత అనువయిన ప్రదేశమో స్పష్టమవుతోంది. అందుకు ప్రధాన కారణం కరుణానిధి నేతృత్వంలోని డీ.యం.కె. పార్టీ, జయలలిత నేతృత్వంలోని ఏ.ఐ.ఏ.డీ.యం.కె.పార్టీలు రాజకీయంగా ఎంత ద్వేషించుకొంటున్నా, తమ విభేదాలు ప్రభుత్వ పాలసీలను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడటమేనని చెప్పవచ్చును. అందుకే అక్కడ ఎన్ని సార్లు ప్రభుత్వాలు మారినా రాష్ట్రంలోకి పరిశ్రమలు, పెట్టుబడుల ప్రవాహం మాత్రం యధాతధంగా కొనసాగుతోంది.   కానీ ఇప్పుడు అక్రమాస్తులకేసులో జయలలితకు జైలు శిక్షపడటంతో ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని వ్యాపార, పారిశ్రామిక వర్గాలలో కొంచెం ఆందోళన మొదలయిందని మార్కెట్ నిపుణులు చెపుతున్నారు. కానీ జయలలితకు నమ్మినబంటు వంటి పన్నీర్ సెల్వంకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించబడ్డాయి కనుక ఆయన జయలలిత ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలలో ఎటువంటి మార్పులు, చేర్పులు చేసే సాహసం చేయబోరు కనుక రాష్ట్రంలో పెట్టుబడులకు డోకా ఉండబోదని మళ్ళీ వారే శలవిస్తున్నారు.   అయితే జయలలితకు బెయిలు దొరుకుతుందా లేదా? ఆమెకు పై కోర్టులు కూడా అదే శిక్షను ఖరారు చేస్తాయా? లేక ఆమె శిక్షను తగ్గిస్తాయా? వంటి అనేక అంశాలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలపైనే కాదు, పరిశ్రమలు, పెట్టుబడులపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. రాష్ట్రంలో ఏర్పడిన ఈ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు అభివృద్ధిలో పోటీపడుతున్న ఆంధ్ర-తెలంగాణా రాష్ట్రాలకు ఎంతో కొంత మేలు చేయవచ్చని వారు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా చాలా ఆకర్షణీయమయిన ఐ.టీ.,పారిశ్రామిక విధానాలు ప్రకటిస్తుండటం, పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక రాయితీలు, తాయిలాలు ఇవ్వజూపుతుండటం వంటివి, ఇప్పుడు తమిళనాడులో కొత్తగా పెట్టుబడులు పెట్టదలచుకొన్న వారిని పునరాలోచనలో పడేయవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఈ ఊహాగానాలను తేలికగా కొట్టిపడేస్తోంది. రాజకీయాలకు అతీతంగా తమ ప్రభుత్వ పాలసీలు కొనసాగుతున్నదున, ప్రస్తుత రాజకీయ అనిశ్చితి మార్కెట్లు, పెట్టుబడులు, పరిశ్రమలపై ఎటువంటి ప్రభావము చూపదని దృడంగా నమ్ముతోంది. ఆ వాదనలో కూడా బలం ఉందని చెప్పవచ్చును. ఎందుకంటే ఇన్నేళ్ళలో తమిళనాడు రాష్ట్రంలో అనేక సార్లు ఇటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ వాటి కారణంగా ఏనాడూ అక్కడి నుండి పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోలేదు. ఇప్పుడు కూడా అంతేనని ప్రభుత్వ వాదన. పరిశ్రమలు, పెట్టుబడిదారులు కూడా వడ్డించిన విస్తరివంటి తమిళనాడును కాదనుకొని, ఏవిధంగాను స్థిరపడని ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు బయలుదేరిపోతాయని ఊహించలేము.   తమిళనాడు రాష్ట్రంలో ఈ పరిస్థితులు సద్దుమణిగేలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాను సంపాదించు కోగలిగితే, అది తప్పకుండా తమిళనాట పెట్టుబడులను రాష్ట్రంవైపు ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. ఆ భరోసాతోనే హీరో మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ చెన్నైకి అతిసమీపంలో ఉన్న చిత్తూరు జిల్లా శ్రీసిటీలో తమ సంస్థను స్థాపించడానికి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత త్వరగా ప్రత్యేక హోదా సాధించుకోగలదనే అంశం కూడా తమిళనాట పరిశ్రమలు, పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చును. ముఖ్యంగా తమిళనాడులో పెట్టుబడులు పెట్టాలా వద్దా? అని ఇంకా ఊగిసలాడుతున్న వారిని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ‘ప్రత్యేక హోదా’ చాలా ఊరిస్తోంది. అందుకే జయలలిత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ ప్రధాని మోడీకి లేఖ వ్రాసిన సంగతిని ఈసందర్భంగా నిపుణులు గుర్తుకు చేస్తున్నారు. ఏమయినప్పటికీ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా తమ కొత్త పాలసీలతో, తాయిలాలతో తమిళనాట పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చును.  

కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందే ఎదురుదెబ్బలు

  మూలిగే ముసలి నక్క మీద తాటిపండు పడినట్లు సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పాలయిన కాంగ్రెస్ పార్టీ నెత్తిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చిపడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షపార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (యన్.సి.పి.) అధికార కాంగ్రెస్ పార్టీతో సీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆ పార్టీతో తెగతెంపులు చేసేసుకొని ఒంటరి పోరాటానికి సిద్దపడింది. అది అంతటితో ఆగితే బాగుండేది. మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బలీయమయిన రాజకీయ శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న యన్.సి.పి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు సైతం వెనుకాడకుండా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయకతప్పలేదు.   మరొక 15రోజులలో ఎన్నికలు ముంచుకు వస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం చాలా పెద్ద దెబ్బే. కానీ కాంగ్రెస్ కష్టాలు అంతటితో ముగియలేదు. నెల రోజుల క్రితమే మహారాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేప్పట్టిన తెలంగాణాకు చెందిన సీనియర్ బీజేపీ నేత విద్యాసాగర్ రావు, పద్ధతి ప్రకారం ప్రతిపక్ష పార్టీలయిన బీజేపీ శివసేనలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? అని అడిగారు. ఆ రెండు పార్టీలు అందుకు సిద్దం కాకపోవడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్నుఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని అడగకుండా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని కేంద్రానికి లేఖ వ్రాసి పడేసారు.   సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కేంద్రం ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ హడావుడిగా నిన్న మంత్రివర్గ సమావేశం గవర్నరు ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసేయడం, దానిని తక్షణమే రాష్ట్రపతికి పంపగానే ఆయన కూడా దానిపై ఆమోదముద్ర వేసేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చేసింది. అంటే బీజేపీకి చెందిన గవర్నరు విద్యాసాగర్ రావు చేతిలోకి సర్వాధికారాలు వచ్చేసాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగయినా గెలిచి మహారాష్ట్రలో స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని తహతహలాడుతున్న బీజేపీకి ఈ పరిణామాలన్నీ కలిసి వచ్చే అంశాలుగా మారగా, అవినీతి ఊభిలో కూరుకుపోయిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ ఊహించని పరిణామాలన్నీ ఎదురుదెబ్బలే అవుతాయి.   అందుకే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర గవర్నరు పృథ్వీరాజ్ చవాన్నుఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని అడగకుండా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసి సాంప్రదాయాలను తుంగలో తొక్కారని విరుచుకు పడుతోంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు తన రాజకీయ ప్రయోజనాలను దృష్టి ఉంచుకొని ఇదే విధంగా వ్యవహరించింది కనుక ఇప్పుడు దాని గోడు ఎవరూ పట్టించుకోలేదు.   సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ చేతిలో నుండి అధికారం జారిపోవడం, మిత్రపక్షమయిన యన్.సి.పి.తో సహా ఈసారి బీజేపీ, శివసేనలను కూడా ఎన్నికలలో ఎదుర్కోవలసి రావడం ఇత్యాది అంశాలన్నీ ఆ పార్టీ విజయావకాశాలను కుచించివేసేవిగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో, బీజేపీకి, శివసేనకు, యన్.సి.పి.కి కూడా అంతే ముఖ్యం కనుక ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి.

జయలలిత రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా?

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష రూ.100వంద కోట్ల జరిమానా విదించింది. ఆమెతో బాటు ఆమె స్నేహితురాలు శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఒక్కొక్కరికీ నాలుగు సం.ల జైలు శిక్ష మరియు రూ.12కోట్ల జరిమానా విదించబడింది. కోర్టు శిక్షలు ఖరారు చేయడంతో పోలీసులు వారందరినీ పరప్పన అగ్రహారంలోని జైలుకు తరలించి అక్కడ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈరోజు శనివారం కావడం తరువాత కోర్టులకు దసరా శలవులు మొదలవుతుండటంతో జయలలిత ఆమె అనుచరులకు మరో వారం పదిరోజుల వరకు బెయిలుకు అప్పీలు చేసుకొనేందుకు కూడా అవకాశం లేదు కనుక అంతవరకు జైలులో ఉండక తప్పదు. వారందరికీ నాలుగేళ్ళు జైలు శిక్ష పడినందున వారు కర్నాటక హైకోర్టులోనే అప్పీలు చేసుకోవలసి ఉంటుంది. హైకోర్టు వారికి బెయిలు మంజూరు చేస్తుందా లేదా అనే విషయాన్ని పక్కనబెడితే, ఆమె తన పదవులకు రాజీనామా చేసినా చేయకున్నా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆమె తన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పదవులు రెండూ కోల్పోతారు. అంతే కాదు జైలు శిక్ష పడినందున మరో పదేళ్లవరకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. అంటే ఆమె రాజకీయ జీవితానికి ముగింపు వచ్చినట్లే భావించవచ్చును.   ఇక మరో అతి పెద్ద సమస్య కోర్టు విధించిన రూ.100 కోట్ల జరిమానా. ఆమెతో సహా మిగిలిన ముగ్గురూ కూడా ఎలాగు హైకోర్టుకి అక్కడా ఎదురుదెబ్బ తగిలితే సుప్రీంకోర్టుకి వెళతారు కనుక జరిమానా చెల్లింపు విషయంలో పై కోర్టులు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సమర్దించవచ్చును, లేదా రద్దు చేయవచ్చును లేదా కొంత తగ్గించవచ్చును. కనుక ప్రత్యేక న్యాయస్థానం విదించిన జరిమానా గురించి ఆలోచించడానికి ఇంకా సమయం ఉందని చెప్పవచ్చును.   ఒకవేళ పై కోర్టులు కూడా ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సమర్దిస్తే, వారందరికీ మరిన్ని కష్టాలు తప్పవు. ఎందువలన అంటే వారు నలుగురు కలిసి రూ.130 కోట్లు ఎక్కడి నుండి తీసుకు వచ్చేరో దానికి లెక్క, దానికి మళ్ళీ పన్ను చెల్లించారా? లేదా?వంటి కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి.   ఏమయినప్పటికీ ఈ కోర్టు తీర్పుతో ఇప్పటి వరకు దివ్యంగా వెలిగిపోతున్న జయలలిత రాజకీయ జీవిత ప్రభ ఒక్కసారిగా ఆరిపోయినట్లయింది. ఆమె ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ ఈ దెబ్బ నుండి తేరుకోవడం బహుశః ఆమె వల్ల కాక పోవచ్చునేమో. అదే జరిగితే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు జరిగే అవకాశం ఉంది.

తెలంగాణాపైకి జగనన్నబాణం దూసుకు రాబోతోందా?

  వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణా నుండి ఎందుకు బయటకు వచ్చిందో అందరికీ తెలుసు. అప్పుడు వద్దనుకొన్న తెలంగాణాకే మళ్ళీ తిరిగివెళ్ళి అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర విభజన తరువాత కూడా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలమయిన రాజకీయ శక్తిగా నిలబడటం చూసి బహుశః ఆయనకు జ్ఞానోదయం అయిఉండవచ్చును. కానీ ఆ కారణంగానే తిరిగి తెలంగాణలోకి ప్రవేశించాలని భావిస్తే మాత్రం అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లవుతుంది. ఎందుకంటే తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నప్పుడు, రాష్ట్ర విభజనకు ముందు ఆ తరువాత నేటికీ కూడా తెదేపా తెలంగాణాలో దృడంగా నిలబడి ఉంది. కానీ, తెలంగాణా ప్రజల సెంటిమెంటును గౌరవిస్తామని చెపుతూ వచ్చిన వైకాపా రాష్ట్ర విభజన జరుగుతోందని పసిగట్టగానే రాత్రికి రాత్రి తెలంగాణా నుండి బయటపడి సమైక్యరాగం అందుకొంది.   ఇక తెదేపాకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణాలో మిత్రపక్షంగా ఉంది కనుక అక్కడ ఆ పార్టీ మద్దతు ఉంది. కానీ వైకాపాకు ఇటు ఆంధ్రాలో కానీ అటు తెలంగాణాలో గానీ ఎన్నికల మిత్రులే తప్ప శాశ్విత మిత్రులు ఎవరూ లేరు. ఒకవేళ ఇప్పుడు తెలంగాణాలో పునః ప్రవేశం చేసినట్లయితే తెదేపాతో పాటు కాంగ్రెస్, తెరాస, బీజేపీలను డ్డీ కొనవలసి ఉంటుంది.   వైకాపా తెలంగాణాను విడిచిపెడుతున్నప్పుడు, తనను నమ్ముకొన్న తెలంగాణా నేతలను, కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డున వదిలేసిపోవడంతో, వారిలో చాలా మంది తెరాసను, ఇతర పార్టీలను ఆశ్రయించక తప్పలేదు. అందువలన తెలంగాణాలో వైకాపా దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని చెప్పవచ్చును. మళ్ళీ ఇప్పుడు తెలంగాణాలో పార్టీని పునర్నిర్మించుకోవాలంటే అందుకు చాలా ప్రయాసపడవలసి ఉంటుంది. అంతకంటే ముందు తెలంగాణా ప్రజల విశ్వాసాన్ని పొందవలసి ఉంటుంది. కానీ ఆ రెండు సాధ్యం కావని చెప్పవచ్చును. ఎందువలన అంటే వైకాపా తెలంగాణా ను వదిలిపెట్టి బయటకు వెళ్లిపోయినప్పుడే అది ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఇక తెలంగాణాలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవాలంటే స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణా లో పర్యటించి పార్టీని నిర్మించుకోవలసి ఉంటుంది. కానీ ఆయన తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేఖంగా ఆయన చేసిన సమైక్య ఉద్యమాల కారణంగా ఆయన ఇప్పుడు తెలంగాణాలో అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడి ఉనప్పుడు స్వయంగా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు.   బహుశః అందుకే మళ్ళీ తన అమ్ముల పొదిలో నుండి తనకు బాగా అచ్చి వచ్చిన, తను జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడిన ‘షర్మిల’ అనే బాణాన్ని మళ్ళీ బయటకు తీస్తున్నారు. కానీ శంఖంలో పోస్తే కానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లుగా మొన్న హైదరాబాదులో ఆయన నివాసంలో జరిగిన తెలంగాణా నేతల సమావేశంలో ఖమ్మం యంపీ పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి ద్వారా తెలివిగా ఆ ప్రతిపాదన చేయించారు. ‘తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను షర్మిలకు కట్టబెట్టాలనే’ ఆయన ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి దానిని కాదనకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కనుక తెలంగాణపైకి ఆయన సందిస్తున్న బాణం ఎప్పుడయినా రివ్వున దూసుకు రావచ్చును.   అయితే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడా జైల్లో ఉన్నారు కనుక అప్పుడు షర్మిల, విజయమ్మలు పార్టీని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించ వలసి వచ్చింది. కానీ ఆయన ఇప్పుడు బయటనే ఉన్నప్పుడు ఆయనే స్వయంగా తెలంగాణాలో పర్యటించి పార్టీని బలోపేతం చేసుకోవచ్చు కదా? తెరాస నుండి తెలంగాణా ప్రజల నుండి ఎదురయ్యే వ్యతిరేఖతను ఎదుర్కోకుండానే తెలంగాణాలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకోవడం సాధ్యమేనా? అనే ధర్మ సందేహం చాలా మందికి కలగవచ్చును. సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే ముందుగా తన నమ్మకమయిన బాణాన్ని తెలంగాణా మీదకు వదిలిపెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారని చెప్పవచ్చును. ఒకవేళ ఆ బాణం ఇదివరకులాగే ఎటువంటి అడ్డంకులు లేకుండా రివ్వున తెలంగాణాలో దూసుకుపోతే, ఆ వెనుకే జగన్మోహన్ రెడ్డి తన ‘ఓదార్పు రధం’ అధిరోహించి తెలంగాణా పునః ప్రవేశం చేయవచ్చును.   కానీ తనకు ఎంతో బలముందని చెప్పుకొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆయన ఓదార్పు రధం ఎన్నికల కురుక్షేత్రంలో క్రుంగిపోయి ఓటమి పాలయినప్పుడు, తనకు అసలు బలం లేని చోట తోడుగా ప్రజాసైన్యం కానీ, స్వంత సైన్యం గానీ లేకుండా చాలా బలంగా ఉన్న శత్రుసేనలను ఏవిధంగా జయించేద్దామని బయలుదేరుతున్నారో ఆయనకే తెలియాలి.