ప్రజల వద్దకే ప్రభుత్వం, పరిపాలన
posted on Jul 16, 2014 8:20AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో హైదరాబాదు నుండే పరిపాలన కొనసాగించవలసివస్తున్నందున, ప్రభుత్వం తమకు అందుబాటులో లేదనే భావన రాష్ట్ర ప్రజలలో కలుగుతోందని గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కో జిల్లాలో వారానికి రెండు రోజులు చొప్పున మొత్తం 13జిల్లాలలో ‘సంచార రాష్ట్ర పరిపాలన’ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
ఈ ప్రయోగంలో భాగంగా ఈరోజు, రేపు చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈరోజు ఉదయం 10.30గంటలకు జిల్లాలో ద్వారకాతిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకొన్న తరువాత కామవరపుకోట, దేవులపల్లి, గురువాయి గూడెం తదితర ప్రాంతాలలో చంద్రబాబు నాయుడు ప్రజలు, రైతులను కలిసి వారి సమస్యలను స్వయంగా తెలుసుకొంటారు. సాయంత్రం జంగారెడ్డి గూడెం చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. ఈ రెండు రోజుల పర్యటనలలో ఆయన వెంట వ్యక్తిగత సిబ్బందితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు ఉంటారు. జిల్లాల పర్యటనలో ఉన్న రెండు రోజులలో సచివాలయంలో సాగే రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలను ఆ అధికారి ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ, అక్కడి నుండే పర్యవేక్షిస్తుంటారు. ఈవిధంగా వారానికి రెండు రోజులు రాష్ట్రంలో, ఐదు రోజులు సచివాలయంలో ఉంటూ పరిపాలన చేయడంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం ఏర్పడకూడదనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై పూర్తి స్పష్టత వస్తే కానీ ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడి నుండే పరిపాలన సాగిస్తే, మిగిలిన జిల్లాల ప్రజలలో అపోహలు మొదలవుతాయనేది కూడా ఈ ప్రయోగానికి మరో కారణమని తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రజలందరినీ మెప్పించడానికి ప్రతీ జిల్లాలో ఒక రాజధాని ఏర్పాటు చేయడం అసాధ్యం. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు రాష్ట్ర ప్రజలు చాల మంది సానుకూలంగానే ఉన్నారు గనుక, ముందే ప్రకటించినట్లుగా అక్కడే తాత్కాలికంగా సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకొని, మిగిలిన జిల్లాలలో వివిధ విద్యా, వైద్య, రవాణా, పారిశ్రామిక, సాఫ్ట్ వేర్ తదితర సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చును.
రాష్ట్ర ప్రజలందరూ తమ తమ జిల్లాలలో మంచి అభివృద్ధి జరగాలనే ఉద్దేశ్యంతోనే తమ జిల్లాలలో రాజధానిని ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తున్నారు తప్ప కేవలం రాజధాని కోసం కాదు. అందువల్ల విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేయడంలో ఎటువంటి సమస్యలు లేనట్లయితే, అక్కడికే రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలను తరలించి, మిగిలిన అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందేవిధంగా ప్రణాళికలు రూపొందించుకొని ప్రకటిస్తే మంచిదేమో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పూర్తి అందుబాటులో ఉండాల్సిన అవసరం చాలా ఉంది కనుక పరిపాలనా వ్యవస్థలను వీలయినంత త్వరగా రాష్ట్రానికి తరలించడమే మంచిదని మిత్రపక్షానికి చెందిన బీజేపీ నేతలు, ప్రతిపక్ష నేతలు, ప్రజలు కూడా భావిస్తున్నారు.