పోలవరంలో రాజకీయాలు మిళితం చేయడం సబబేనా?
posted on Jul 13, 2014 @ 12:02PM
పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపడంపై జరుగుతున్న రగడ ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య మరింత దూరం పెంచుతోంది. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర విభజన బిల్లులో చేర్చడం, ముంపు గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేయాలనే నిర్ణయాలు ఈనాడు కొత్తగా తీసుకొన్నవి కావని ఇప్పుడు ఆందోళన చేస్తున్న వారందరికీ తెలుసు. ఆనాడు ప్రశ్నించని నేతలు, పార్టీలు అన్నీకూడా నేడు ఉద్యమిస్తున్నాయి. విశేషమేమిటంటే ఈ సమస్యను సృష్టించిన కాంగ్రెస్ పార్టీకూడా ఆందోళనలో పాల్గొంటోంది. అంటే ఈ అంశాన్ని కూడా అన్ని పార్టీలు ప్రాంతీయ సమస్యగా మార్చి దానిని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయే తప్ప గిరిజనుల సంక్షేమం గురించి మాత్రం ఆలోచించడం లేదని స్పష్టమవుతోంది. రాజకీయ పార్టీలు అన్నీ కూడా కేవలం రాష్ట్ర సరిహద్దులు మార్చడంపై గట్టిగా వాదిస్తున్నాయి తప్ప, ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవబోతున్న గిరిజనుల పునరావాసం గురించి కానీ వారికి దక్కవలసిన ప్యాకేజీ గురించి కానీ మాట్లాడక పోవడం చూస్తే, వారి ఈ అందోళనల వెనుక నిబద్దత ఏపాటిదో అర్ధం అవుతుంది.
“తాము ప్రాజెక్టుకు వ్యతిరేఖించడం లేదు కేవలం ప్రాజెక్టు డిజైన్ మార్చమని మాత్రమే కోరుతున్నాము. ఆవిధంగా చేసినట్లయితే గిరిజనులు నష్టపోరని” అనేకమంది రాజకీయ నేతలు వాదిస్తున్నారు. కానీ సరిహద్దులు మార్చకుండా ప్రాజెక్టు డిజైన్ మార్చడం సాధ్యమేనా? డిజైన్ మారిస్తే వేరే ప్రాంతానికి, అక్కడ ఉండే గిరిజనులకో, మరొకరికో నష్టం జరగదని ఖచ్చితంగా చెప్పగలరా? పోనీ ముంపు గ్రామాల నిర్వాసితుల బాధ్యత పూర్తిగా వారే తీసుకోగలరా? అనే విషయాల గురించి ఎవరూ ప్రస్తావించడం లేదు.
ఇటువంటి భారీ ప్రాజెక్టులు నిర్మించిన ప్రతీసారి, ప్రతీ చోట ఎవరో ఒకరు నష్టపోతుంటారు, పల్లెలు నీట మునుగి అదృశ్యమవుతుంటాయి. ఇదివరకు ప్రాజెక్టులు కట్టినప్పుడు నిర్వాసితులకు సరయిన న్యాయం జరిగేదికాదన్న మాట వాస్తవం. కానీ, ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు కూడా పూర్తి చైతన్యవంతమయి ఉన్నందున, నిర్వాసితులకు పూర్తి న్యాయం జరిగే అవకాశం ఉంది. జరగకుంటే వారి తరపున పోరాడేందుకు రాజకీయ పార్టీలున్నాయి. ప్రజా సంఘాలున్నాయి. వారి హక్కులను రక్షించి న్యాయం చేసేందుకు బలమయిన న్యాయ వ్యవస్థలున్నాయి. అందువలన నేడు ఉద్యమిస్తున్న వారందరూ నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసిన తరువాతనే ప్రాజెక్టు పనులను మొదలు పెట్టాలని కోరితే సబబుగా ఉంటుంది తప్ప, ప్రాంతీయ, రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకొని, అసలు ప్రాజెక్టు కట్టకుండా అడ్డుపడతామనడం వివేకమనిపించుకోదు.
ఇంతవరకు భారతదేశంలో కట్టిన అనేక ప్రాజెక్టులకు స్థానిక ప్రభుత్వాలు, ప్రజలు, నిర్వాసితులు ఇదేవిధంగా అడ్డుపడి ఉండి ఉంటే నేడు మన దేశంలో, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఒక్క ప్రాజెక్టు కూడా ఉండేది కాదు. అందువల్ల ప్రజలు, రాజకీయ పార్టీలు ఏ ప్రాంతానికి చెందినవారయినా సరే సంకుచిత దృష్టితో కాక జాతీయ దృక్పధంతో వ్యవహరించాలి. లేకుంటే ఆ పరిధి క్రమంగా మరింత కుచించుకుపోయి ఒకే రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలో ప్రజలు కలహించుకొనే దుస్థితి ఏర్పడుతుంది. రేపు ఆంధ్రాలోనో లేక తెలంగాణాలోనో కొత్తగా ఏదయినా ప్రాజెక్టు లేదా సంస్థ స్థాపించవలసి వస్తే అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఇదే విధంగా రాజకీయం చేస్తూ అడ్డుపడితే రాష్ట్రాల అభివృద్ధి ఏవిధంగా సాధ్యమో అందరూ ఈ సందర్భంగా ఆలోచించాలి.
పోలవరం ప్రాజెక్టు వల్ల కొన్ని వందల గ్రామాలు నీట మునుగుతాయి, దాదాపు రెండు లక్షల మంది గిరిజనులు నిర్వాసితులవుతారు. నిజమే! కానీ వారి బాగోగుల పట్ల ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు, నేతలకు నిజంగానే ఆసక్తి ఉంటే, రెండు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కలిసి మాట్లాడుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వారికి ప్రస్తుతం ఉన్నజీవనపరిస్థితుల కంటే ఇంకా మంచి జీవన పరిస్థితులు కల్పించవచ్చును. వారి పునరావాసం, రక్షణ, సంక్షేమం, అభివృద్ధి వంటి బాధ్యతలను ఎవరు ఏమేరకు ఏవిధంగా ఏర్పాటు చేయాలో మాట్లాడుకొంటే బాగుంటుంది. కానీ గిరిజనుల పేరుతో రాజకీయాలు చేయడం, లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును అడ్డుకోవాలని చూడటం వివేకమనిపించుకోదు.