ప్రపంచకప్ ఎవరిదో?
ముంబయి : ప్రపంచకప్ అంతిమ ఘట్టానికి చేరింది. భారత్, శ్రీలంక జట్టు తుదిపోరుకు సిద్ధం అయ్యాయి. వాంఖడే స్టేడియం వేదికగా టైటిల్ పోరుకు బరిలోకి దిగనున్నాయి. శనివారం మధ్యాహ్నాం జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తొలిసారి పూర్తిగా ఆసియా జట్ల మధ్యే జరుగుతోంది. భారత్ కప్పు గెలుచుకోవాలని, మువ్వన్నెల పతాకను సమున్నతంగా ఎగరేయాలని యావత్తు దేశం ఆకాంక్షిస్త్తోంది. ధోనీ సేన గెలుపు కోసం ఇండియా అంతటా ఒకటే ఎదురు చూపు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్, శ్రీలంక జట్లకు ఇది మూడో ఫైనల్. మొదటి ఫైనల్లో విజేతగా నిల్చిన భారత్ తర్వాతి ఫైనల్లో ఓటమిపాలైంది. లంకదీ సరిగ్గా అదే పరిస్థితి. ఫైనల్ చేరిన తొలిసారి జగజ్జేతగా నిలిచి, రెండో ప్రయత్నంలో విఫలమైంది. ముచ్చటగా మూడోసారి తుదిపోరుకు అర్హత పొందిన ఈ రెండు జట్లలో అంతిమవిజేత ఎవరో కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఈ మ్యాచ్‌ను గెలుచుకుని మురళికి అంకితమివ్వాలని శ్రీలంక జట్టు ఉబలాటపడుతోంది. భారత క్రీడాభిమానులు సచిన్ వందో సెంచరీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
శ్రీలంక జట్టుకు మురళి ఏ విధంగా కొండంత అండగా ఉంటున్నాడో, భారత జట్టుకు సచిన్ కూడా అంతే! పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ మాదిరిగా ఈ మ్యాచ్ కూడా అత్యంత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇరు జట్లు కప్ గెలుచుకోగల సత్తా ఉన్నవే. ఇంతకుముందు ఒక్కొక్కసారి టైటిల్ విజేతగా నిలిచినవే. ఇరు జట్లలోనూ అద్భుతమైన క్రీడాకారులున్నారు. అయితే బౌలింగ్‌లో మాత్రం శ్రీలంక కొంత పైచేయిగా కనిపిస్తోంది. ముత్తయ్య మురళీధరన్, మలింగ, పెరీరా, కులశేఖర, అజంతా మెండిస్ వంటి ఉద్దండులైన బౌలర్లున్నారు. భారత జట్టు ప్రధానంగా జహీర్ ఖాన్,యువరాజ్‌పై ఆధారపడుతోంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. శ్రీలంక బ్యాటింగ్ కూడా అత్యంత పటిష్టంగా ఉంది. ఉపుల్ తరంగ, తిలక రత్నే దిల్షన్ అద్భుతమైన ఆరంభాన్ని అందిస్తున్నారు. వారిలో ఒకరు విఫల మైనా సంగక్కర వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మహేలా జయవర్ధనే కూడా రెండు మ్యాచ్‌ల్లో రాణించాడు. ఆంజెలో మాథ్యూస్ ఫిట్‌నెస్‌తో లేనందున రణదీవేను జట్టులోకి తీసుకుంటున్నట్లు శ్రీలంక జట్టు అధికారికంగా ప్రకటించింది.
ముత్తయ్య మురళీధరన్ ఆడటం అనుమానమేనని గురువారం వార్తలొచ్చాయి. అతడు కండరాల నొప్పి నుండి కోలుకున్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం నెట్‌ప్రాక్టీస్ చేశాడు. భారత జట్టులో ఆశిష్ నెహ్రా స్థానంలో శ్రీశాంత్ చేరే అవకాశాలున్నాయి. ఈ టోర్నమెంట్‌లో శ్రీశాంత్ బంగ్లాదేశ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆడాడు. మళ్లీ చివరి మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించనుంది. ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఇప్పటి వరకు ఇన్నింగ్సుకు 274 పరుగుల సగటున 2194 పరగులు చేసింది. శ్రీలంక ఇన్నింగ్సుకు 242 పరగుల సగటున 1933 పరగులు చేసింది. అయితే, భారత్ 58 వికెట్లు కోల్పోగా, శ్రీలంక 40 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఈ విషయంలో శ్రీలంకదే పైచేయిగా ఉంది. లోయర్ ఆర్డర్ మాత్రం శ్రీలంక కన్నా భారత్ మెరుగ్గా ఆడినట్లు కనిపిస్తోంది. భారత లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ 304 పరగులు చేయగా, శ్రీలంక బ్యాట్స్‌మెన్ 172 పరుగులు చేశారు. మొత్తంగా చూస్తే, భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వాంఖడే స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టూ అయిదువేల మంది పోలీసులు మోహరించారు. ముంబయి మొత్తం భద్రతా వలయంలో ఉంది.