వైఎస్ పథకాలు.. సోనియా ఆలోచనలే
హైదరాబాద్: ‘రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆలోచనలు..’ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పర్యవేక్షణకు ఇటీవల పిసిసి అధ్యక్షుడు డిఎస్ ‘మానిటరింగ్ కమిటీ’లను నియమించిన సంగతి తెలిసిందే. గాంధీభవన్‌లో డిఎస్ అధ్యక్షతన జరిగిన మానిటరింగ్ కమిటీల సమావేశానికి స్వల్ప సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు. ఎఐసిసి కార్యదర్శి కె.బి. కృష్ణమూర్తి హాజరుకాలేదు. మానిటరింగ్ కమిటీల్లో ఉన్న సభ్యులుగా మంత్రుల్లో ఇద్దరు హాజరుకాగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు వ్యక్తిగతం కావనీ, సోనియా గాంధీ ఆలోచనలని చెప్పినట్లు సమాచారం. మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలకు సరైన విధంగా అవగాహన కల్పించలేక పోతున్నామన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారని తెలిసింది.
ఇలాఉండగా సమావేశానంతరం డిఎస్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సమర్థవంతంగా అమలు చేయడానికి తమ ప్రభుత్వం బలంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులకు సహకారం అందిస్తూ, ఆ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులందరికీ అందేలా మానిటరింగ్ కమిటీలు చూస్తాయని ఆయన తెలిపారు. మానిటరింగ్ కమిటీలు జిల్లా స్థాయిలో కమిటీలతో సమీక్షా సమావేశాలను నిర్వహించాలని, అక్కడ జరిపే సమీక్షా సమావేశాల ఫొటోలను, నివేదికలను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కమిటీలు ప్రతి నెలా ఒకసారి సమావేశమై పిసిసికి నెలవారీ నివేదికలు పంపించాలని ఆయన సూచించారు.