వదినమ్మ పై పోటీ చేస్తా
posted on Apr 2, 2011 8:59AM
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో తన అన్న వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి, తన వదినమ్మ వైఎస్.విజయలక్ష్మిపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, కడప ఉప ఎన్నికల్లో సెంటిమెంట్‌కు ఎలాంటి తావులేదన్నారు. మే నెలలో కడప, పులివెందుల స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్.వివేకానంద రెడ్డి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మి పోటీ చేస్తారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల పోటీపై వైఎస్.వివేకా శుక్రవారం స్పందిస్తూ వదినమ్మపై పోటీ చేయాలన్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. అదేసమయంలో అధిష్టానం ఏదైనా చెపితే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. వైయస్ విజయమ్మపై పోటీ చేయడానికి వివేకానంద రెడ్డి విముఖత ప్రదర్శిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వివేకానంద రెడ్డి మాటలు ఆ వార్తలను ఖండిస్తున్నాయి. కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంటును వాడుకోవడానికి పులివెందులలో కాంగ్రెసు పార్టీ విజయమ్మపై కాంగ్రెసు పార్టీ పోటీకి దిగకపోవచ్చునని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో పాటు వివేకానంద రెడ్డి కూడా అప్పుడే ఖండించారు. కడప పార్లమెంటు సీటుతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థులు ఉంటారని వారు చెప్పారు. కడప పార్లమెంటు సీటులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్‌పై వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని పోటీకి దించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.