ఉప ఎన్నికల తర్వాత రాజీనామాలు?
posted on Apr 2, 2011 @ 12:26PM
హైదరాబాద్: కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి ఉప ఎన్నికలు ముగిసిన తర్వాతనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలకు ముందే రాజీనామాలు చేయాలని కొంత మంది శాసనసభ్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే, వారిని వైయస్ జగన్ ఆపుతున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల తర్వాత పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటాయని, ఆ సమయంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే దాని ప్రభావం తమకు అనుకూలంగా ఉంటుందని వైయస్ జగన్ చెబుతున్నట్లు సమాచారం. వైయస్ జగన్ వెంట దాదాపు 23 మంది కాంగ్రెసు శాసనసభ్యులు, ఇద్దరేసి ప్రజారాజ్యం, తెలుగుదేశం శాసనసభ్యులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత దాదాపు 27 మంది శాసనసభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయని జగన్ వారికి చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఉప ఎన్నికల తర్వాత మరింత మంది తెలుగుదేశం, కాంగ్రెసు శాసనసభ్యులు తన వైపు రావచ్చుననేది జగన్ అంచనాగా చెబుతున్నారు. కాగా, జగన్ వర్గానికి చెందిన తమ పార్టీ శాసనసభ్యులపై ఉప ఎన్నికలకు ముందే చర్యలు తీసుకోవాలని కడప జిల్లా కాంగ్రెసు నాయకులు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెసు శాసనసభ్యులుగా కొనసాగుతూ బహిరంగంగా వారు మద్దతు ప్రకటిస్తున్నారని, ఉప ఎన్నికల ఇంచార్జీలుగా పనిచేస్తున్నారని, దాని వల్ల తాము కాంగ్రెసు తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి ఇబ్బందులు ఏర్పడతాయని వారు వాదిస్తున్నారు. ఒక వేళ ఆ ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెసు నాయకత్వం చర్యలకు ఉపక్రమించినా, పూర్తిగా తొలగించడానికి నెలకు పైగానే సమయం పడుతుందని జగన్ తన వర్గానికి చెందిన శాసనసభ్యులకు చెబుతున్నట్లు సమాచారం. అందువల్ల ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాలని ఆయన వారికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది.