మధుర క్షణాల కోసం ఎదురుచూపులు
posted on Apr 2, 2011 @ 12:45PM
ముంబై: భారత్-శ్రీలంకల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం జరుగనున్న ఫైనల్ పోరులో టీమిండియానే కప్ గెలుస్తుందని నూట ఇరవై కోట్ల మంది క్రికెట్ అభిమానులు, ప్రజలు ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో, మహేంద్ర సింగ్ ధోనీ సేన ప్రపంచకప్ నెగ్గితే శ్రీకాళహస్తికి జట్టును తీసుకొస్తానని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ తెలిపారు. కోట్లాది ప్రజల ఆకాంక్ష నెరవేరితే తప్పకుండా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియాను శ్రీకాళహస్తికి తీసుకొస్తానని శ్రీకాంత్ మొక్కుకున్నారు. అలాగే బౌలింగ్, బ్యాటింగ్‌లో పటిష్టంగా బరిలోకి దిగుతున్న శ్రీలంకతో భారత్‌కు గట్టిపోటీ తప్పదని 1983లో భారత్‌కు ప్రపంచకప్ సాధించిపెట్టిన అప్పటి టీమిండియా సారథి కపిల్ దేవ్ జోస్యం చెప్పాడు. కానీ ఏది ఏమైనా ఇండియానే గెలుస్తుంది. పాకిస్థాన్‌పై గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా తప్పక ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశాడు. మరోవైపు 1983 క్యాలెండర్ 2011 క్యాలెండర్ ఒకేవిధంగా ఉండటంతో భారత్ కప్ గెలుస్తుందని అబిమానులు అనుకుంటున్నారు. శ్రీలంక మ్యాచ్‌లో సచిన్, సెహ్వాగ్‌లు చెలరేగి ఆడుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రముఖులు, సినీతారలు వీక్షించనున్నారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఈ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఇకపోతే.. ఫైనల్ పోరులో భారత్‌ను మట్టికరిపించాలని శ్రీలంక వ్యూహం రచిస్తోంది. సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ జోరుకు బ్రేక్ వేయాలని శ్రీలంక కోచ్ ఆటగాళ్లకు సూచించారు. ఇంకా శ్రీలంక మిడిలార్డర్ ఆందోళనకరంగా ఉందని మాజీ కెప్టెన్ రణతుంగ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కెనడాతో మ్యాచ్ నుంచి జయవర్ధనే సరిగ్గా ఆడలేకపోతున్నాడని రణతుంగ తెలిపాడు. ఇక వాఖండే స్టేడియం తొలుత బ్యాటింగ్ చేసే వారిదే విజయమని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకమని, మొదట బ్యాటింగ్ పిచ్‌కు అనుకూలిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఫైనల్ పోరుకు తీవ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో స్టేడియం ప్రాంగణంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఐదువేల మంది పోలీసు బలగాలను మోహరించారు.
కాగా, వరల్డ్‌కప్‌ను నెగ్గితే భారత క్రికెటర్లకు మరో బంపర్ ఆఫర్. కప్ సాధిస్తే టీమిండియా ఆటగాళ్లకు ఒక్కో కారు చొప్పున ఇచ్చేస్తామంటూ హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) శుక్రవారం ప్రకటించేసింది. టోర్నీ కార్ల భాగస్వామి అయిన హెచ్ఎంఐఎల్ క్రికెటర్లకు వెర్నా వర్షన్ కార్లను అందజేయనున్నట్లు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హాంగ్ వూ పార్క్ తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రపంచకప్‌కు ఇంకొక్క అడుగు దూరమే ఉన్న నేపథ్యంలో సామాన్యుల నుంచి దేశాధినేతల వరకూ క్రికెట్ మంత్రమే జపిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. క్షణం తీరిక లేకుండా ఉండే ప్రధాని మన్మోహన్ సింగ్, యుపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలు ఫైనల్లో ధోనీసేన విజయాన్ని కాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మొహాలీలో పాక్‌ను ఓడించిన టీమిండియా... ఫైనల్స్‌లో శ్రీలంకను కూడా చిత్తుచేయాలని ఆకాంక్షించారు. జాతి యావత్తూ మధుర క్షణాల కోసం ఉద్విగ్నంగా ఎదురు చూస్తుందని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా భారత సైన్యానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక అస్సాం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉన్న సోనియా గాంధీ కూడా సెమీస్‌లో పాక్‌ను చిత్తుచేసిన ధోనీసేన ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాలని అన్నారు.