జగన్ పార్టీ వైపు చూస్తోన్న జయప్రద

హైదరాబాద్: సినీనటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రద వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఎన్నికల తర్వాత ఆమె వైయస్ జగన్ పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే, పార్లమెంటు సభ్యురాలిగా పదవీకాలం ముగిసిన తర్వాత, ఎన్నికలకు ముందే ఆమె వైయస్సార్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తన నాయకుడు అమర్‌ సింగ్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అప్పటి నుంచి ఆమె తనకు అవకాశం ఉన్న పార్టీవైపు చూస్తున్నారు. జయప్రద రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టాలని కూడా చాలా కాలం నుంచే అనుకుంటున్నారు.

ఆ విగ్రహ నిమజ్జనమే బాబాకు కీడు?

ధర్మవరం: పుట్టపర్తి గ్రామ దేవత అయిన సత్తెమ్మ విగ్రహాన్ని నిమజ్జనం చేసి, కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే ప్రస్తుతం సత్యసాయి ఆరోగ్యం ఆందోళనకరంగా మారడానికి కారణమని పలువురు స్థానికులు భావిస్తున్నారు. దీంతో సత్తెమ్మ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన బుక్కపట్నం చెరువు వద్దకు చేరుకుని.. విగ్రహాన్ని వెతికి తీసే పనిలో పడ్డారు. పుట్టపర్తి గ్రామదేవత సత్తెమ్మ విగ్రహం దెబ్బతిన్నదంటూ దాని స్థానంలో నూతన విగ్రహాన్ని ఆరు నెలల క్రితం సత్యసాయిబాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ ప్రతిష్ఠ చేయించారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి సత్యసాయి కుటుంబంలో అరిష్టం చోటు చేసుకుందన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం సత్యసాయి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడానికి ఇది కూడా ఒక కారణమన్న భావన పలువురు భక్తుల్లో వ్యక్తమవుతోంది. నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు పురాతన విగ్రహాన్ని బుక్కపట్నం చెరువులో పడేశారు. దీంతో సోమవారం ఒక మహిళకు సత్తెమ్మ దేవత ఆవహించి తన పూర్వపు విగ్రహాన్ని తొలగించినందువల్లనే పుట్టపర్తిలో అరిష్టాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నట్టు భక్తుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 10గంటల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు బుక్కపట్నం చెరువు వద్దకు చేరుకుని జనరేటర్ల ద్వారా లైట్లు అమర్చుకుని చెరువులోకి దిగి పురాతన విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సత్యసాయి బాబాలో చలనం

పుట్టపర్తి: సత్యసాయి బాబా కళ్లలో స్వల్ప చలనం కనిపించిందని ఆయన సమీప బంధువులు తెలిపారు. సోమవారం రోజు రాత్రి బాబా బంధువులు ఐసియులోనికి వెళ్లి ఆయనని పలకరించారు. దాంతో బాబాలో స్వల్పంగా చలనం కనిపించినట్లు వారు చెప్పారు. కాళ్లు కూడా కదిపినట్లు వారు తెలిపారు. భక్తులు ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లమని వారు కోరారు. సత్యసాయి బాబా ఆరోగ్యం క్షీణించిందని తెలిసి భక్తులు ఆందోళన చెందుతున్నారు. బాబాని తమకు చూపించాలని వారు డిమండ్ చేస్తున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. బాబా చికిత్స పొందుతున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్దకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన వాహనాలపై స్థానికులు రాళ్లు రువ్వారు. జిల్లా కలెక్టర్ జనార్ధన రెడ్డి వాహనాన్నికూడా అడ్డుకున్నారు. దాంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయారు. జాయింట్ కలెక్టర్ అనిత, ఆర్టీఓలను అడ్డుకున్నారు. జర్నలిస్టులను కూడా వెళ్లిపొమ్మని చెప్పారు. దీంతో ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పిస్తున్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక బలగాలు తరలి వచ్చాయి. సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నా.. చికిత్సకు శరీరం సహకరిస్తోందని సిమ్స్ డెరైక్టర్ సఫాయా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి 11 గంటల తర్వాత నాలుగో మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. బాబాకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామన్నారు. ఇన్‌ఫెక్షన్ అధికం కాకూడదనే ముందు జాగ్రత్తతో ఐసీయూలోకి ఎవరినీ అనుమతించడం లేదన్నారు.

జగన్‌ వ్యాఖ్యలపై వీహెచ్ మండిపాటు

హైదరాబాద్ : వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్‌ను కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు వదలిపెట్టడం లేదు. పులివెందుల, కడప ఉప ఎన్నికలు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి మధ్య సమరమని వైయస్ జగన్ ఆదివారంనాడు కడప జిల్లాలో చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. అటువంటి వ్యాఖ్యలు చేసిన వైయస్ జగన్ అవివేకి అని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యలు వైయస్ జగన్ దురుసుతనానికి నిదర్శమని అభిప్రాయపడ్డారు. సోనియాను, రాజీవ్ గాంధీని వైయస్ రాజశేఖర రెడ్డి గౌరవించేవారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని దోపిడీదారుడని తాను ఏనాడూ అనలేదని ఆయన స్పష్టం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కష్టపడి పదవి తెచ్చుకుంటే వైయస్ జగన్ వైయస్ మరణంతో పదవి సాధించాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు.   వైయస్ జగన్ వ్యాఖ్యలపై ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా మండిపడ్డారు. వైయస్ జగన్ వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఎక్కడున్నా కాంగ్రెసు అభ్యర్థులు గెలవాలనే కోరుకుంటుందని ఆయన అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే వైయస్ జగన్ ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి చివరి క్షణం వరకు సోనియా నాయకత్వంతోనే ఉన్నారని ఆయన చెప్పారు. పులివెందుల, కడప అభ్యర్థుల ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.

ధోనీ సేన అందుకున్న ట్రోఫీ ఒరిజినలే

ముంబయి: ధోనీ సేన అందుకున్న వరల్డ్ కప్ ట్రోపీ నకిలీదంటూ వస్తున్న వార్తలను ఐసీసీ కొట్టిపారేసింది. ట్రోఫీ ఒరిజినల్‌దేనని స్పష్టం చేసింది. ఫైనల్ మ్యాచ్‌కు ఒకరోజు ముందే ఒరిజినల్ ట్రోఫీ బీసీసీఐ దగ్గరకు చేరిందని స్పష్టం చేసింది. టీమిండియాకు అందించిన ట్రోఫీ ఎట్టి స్థితిలోనూ నకిలీది కాదని చెప్పింది. ధోనీ సేనకు అందించిన ట్రోఫీపై ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2011 లోగో ఉందని, దాని కోసమే 14 జట్లు పోటీ పడ్డాయని వివరించింది. కస్టమ్స్ అధికారుల స్వాధీనంలో ఉన్నది ప్రమోషన్ కోసం వాడిన ట్రోఫీ మాత్రమేనని చెప్పింది. అది ఎప్పుడూ దుబాయ్‌లోని ఐసిసి కార్యాలయంలో ఉంటుందని చెప్పింది. 2011 లోగో కాకండా దానిపై ఐసిసి కార్పొరేట్ లోగో ఉంటుందని ఐసిసి స్పష్టం చేసింది. ఆ ట్రోఫీని తీసుకుని తాము దుబాయ్‌కి తరలిస్తామని చెప్పింది. తమ వద్ద ఉన్నది నమూనా ట్రోఫీయో, అసలు ట్రోఫీయో తమకు తెలియదని కస్టమ్స్ అధికారులు అంటున్నారు.

అవకాశం వస్తే ఆంధ్రా నుంచే పోటీ

తిరుపతి: తనకు రాష్ట్ర రాజకీయాల్లో అవకాశం వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేస్తానని సినీ నటి జయప్రద చెప్పారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మళ్లీ అవకాశం వస్తే ఆంధ్రా నుంచి పోటీ చేసి పునఃరాజకీయ ప్రవేశం చేస్తానన్నారు. తన పుట్టినరోజున శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ యేడాది ధోనీ సేన విశ్వవిజేతగా నిలిచిన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం మరింత ఆనందంగా ఉందన్నారు. తనకు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు తొలుత అనుకూలంగా లేకపోవడంతో ఉత్తరప్రదేశ్ నుండి పోటీ చేశానని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

జూన్ లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు

హైదరాబాద్: రాష్ట్రంలో జూన్ నెలలో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని, సంక్షోభాలు తలెత్తుతాయని పంచాంగ కర్తలు అంటున్నారు. అయితే ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా ఉండదని భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని చెబుతున్నారు. శ్రీఖరనామ ఉగాది పర్వదినం సందర్భంగా సోమవారం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రభుత్వం తరఫున పంచాంగ పఠనం జరిగింది. ప్రముఖ జ్యోతిష్కుడు సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ పఠనం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ ఉప సభాపతి నాదెండ్ల మనోహర్, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడుతాయని సుబ్రహ్మణ్మ శర్మ చెప్పారు. ప్రజలకు ప్రభుత్వాలు మంచి పాలన అందిస్తాయని చెప్పారు. పంటలు కూడా బాగానే పండుతాయని ఆయన చెప్పారు. ఆర్థికంగా రాష్ట్రానికి ఇబ్బందులు తప్పవని, అయితే ఆ ఇబ్బందులను ప్రభుత్వం అధిగమిస్తుందని ఆయన అన్నారు. జూన్ 5వ తేదీ నుంచి ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. కాగా, తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలకు సంతోషం కలగాలని ఆయన ఆశించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీఖర నామ సంవత్సర పంచాంగాన్ని విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఉగాది పురస్కార అవార్డులను ప్రదానం చేశారు.

సోనియా-వైఎస్‌ల మధ్యే ఉప ఎన్నికల పోరు

కడప: కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల సమరం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, దివగంత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డిల మధ్య జరుగుతున్న పోటీ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కడప జిల్లా ప్రొద్దుటూరులోని జూటూరు కళాక్షేత్రంలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డికి జరిగిన అభినందన సభలో జగన్ మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర రాజకీయాల్లో జరిగే మార్పులకు కడప ఉపఎన్నికలు శ్రీకారం చుడుతాయన్నారు. పురుడు పోసుకోకముందే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు నాంది పలికిందన్నారు. ఈ పార్టీని మొగ్గలోనే తుంచి వేసేందుకు అధికార కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతుందని ఆరోపించారు.

ఆకాశంలో అద్భుతం

ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. సోమవారం రాత్రి సమయంలో శనిగ్రహం భూమికి దగ్గరగా రానుంది. దీనివల్ల ఈ గ్రహం అత్యంత ప్రకాశవంతంగా కనువిందు చేయనుంది. దీనిని టెలిస్కోప్‌ల లాంటి పరికరాల అవసరం లేకుండానే మామూలుగానే వీక్షించవచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ భారీ గ్రహం బంగారువర్ణంలో మెరిసిపోతూ కనిపిస్తుందని ఆ సంస్థ కార్యదర్శి రఘునందన్ తెలిపారు. ఈ గ్రహం చుట్టూ వలయాలతో మే నెలవరకు కనిపిస్తుందన్నారు. భూమికి అభిముఖంగా ఒక వైపు శనిగ్రహం, మరో వైపు సూర్యుడు ఉంటారని, ఫలితంగా సోమవారం రాత్రి ఈ మూడు గ్రహాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో దర్శనమిస్తాయన్నారు. శనిగ్రహంపై పరిశోధనలు చేయదలచిన వారి ఇది ఓ మంచి అవకాశమన్నారు. ఈ గ్రహాన్ని రాత్రంతా చూడొచ్చన్నారు. టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ సహాయంతో చూస్తే, శనిగ్రహం చుట్టూ ఉండే వలయాలు కనిపిస్తాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌ వెల్లడించింది.

ఒకే కుటుంబ సమరంగా మారిన ఉప ఎన్నికలు

హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ఆర్ సతీమణి వైఎస్.విజయలక్ష్మిపై తాను పోటీ చేసేందుకుసిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్.సౌభాగ్యమ్మ తన కుటుంబ సభ్యుల వద్ద అన్నట్టు సమాచారం. వచ్చే నెలలో కడప, పులివెందుల ఎంపీ, అసెబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్ వివేకానంద రెడ్డి ఉత్సుకత చూపిస్తున్నారు. అయితే, తుది నిర్ణయం మాత్రం కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లో ఉంది. కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కడప స్థానం నుంచి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, పులివెందుల స్థానం నుంచి వైఎస్.విజయలక్ష్మీలు పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల స్థానం నుంచి వివేకానంద పోటీ చేయడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. కానీ, కడప పార్లమెంటుకు లేదా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు అధిష్టానం వివేకాకే వదిలి వేసినట్టు సమాచారం. ఒక సమయంలో వివేకాను పార్లమెంటు అభ్యర్థిగా పోటీకి నిలిపి పులివెందులలో తప్పుకోనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. పులివెందులలో పోటీ తప్పుకోవడం ద్వారా వైయస్ అంటే అధిష్టానానికి అభిమానం ఉందనే సానుభూతిని కడపకు ఉపయోగించుకోవాలని చూసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి వివేకా సతీమణి సౌభాగ్యమ్మ మాత్రం అంగీకరించలేదని వినికిడి. తన భర్త కడప పార్లమెంట్‌కు పోటీ చేయాలని నిర్ణయిస్తే తాను పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తానని చెప్పినట్టు సమాచారం. ముఖ్యంగా, వైఎస్.విజయలక్ష్మిపై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో ఉప ఎన్నికల పోరు రాజకీయ పార్టీల కంటే ఒకే కుటుంబం సమరంగా మారింది.

యుగానికి ఆది ఉగాది

"బ్రహ్మ" గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభింtచు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర ఆరంభం దినంగా పరిగణిస్తాం. అందుచేత ఈ ఉగాది పర్వ శుభదినాన అందరూ ప్రాతఃకాలమున నిద్రలేచి అభ్యంగనస్నానమాచరించి నూతన వస్త్రములు ధరించి మంగళ ప్రదమైన మావిడాకులు రంగవల్లికలు ముంగిట అలంకరించుకుని వసంతలక్ష్మిని స్వాగతిస్తూ.. షడ్రచులతో సమ్మిళతమైన ఉగాది ప్రసాదాన్ని, పంచాగానికి, సంవత్సర దేవతకు నివేదనచే తమ తమ భావజీవితాలు మృదుమధురంగా సాగించాలని ఆకాంక్షిస్తూ, ఉగాది పచ్చడి స్వీకరిస్తూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడిని వైద్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధినిరోధక శక్తిని ఇస్తుందని కూడా చెప్తారు. ఆ పచ్చడిలోని షడ్రరుచులలోని తీపి-చేదులో మానవ మనుగడలకు ప్రతీకలై నిలుస్తూ ఉంటాయని అంటుంటారు. ఇక తెలుగువారి సంప్రదాయాల్లో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్టులను ఆహ్నానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశమందు పంచాంగ శ్రవణము చేస్తారు. ఆ రోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభశుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావిజీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు. ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల, తిథితో సంపదను, వారంతో ఆయుష్షు, నక్షత్రంతో పాపప్రక్షాళ, యోగం వలన వ్యాధి నివృత్తి కావడం, కరణంవల్ల గంగాస్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం. మరి ఈ ఉగాది సర్వులకు ఆయురారోగ్యాలు, సంపదలు, సుఖమయజీవనాన్ని అందించాలని ఆశిస్తూ.. తెలుగువన్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు..!

తెలుగు లోగిళ్ళలో ఉగాది శోభ

హైదరాబాద్: తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని తెలుగుప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. శ్రీ ఖర నామసంవత్సరం  ప్రారంభ సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పంచాంగశ్రవణాలు నిర్వహించారు. తెలుగు లోగిళ్ళు మామిడాకుల తోరణాలతో పండగ శోభను సంతరించుకున్నాయి. కాగా, ఉగాది పండుగ రోజున శ్రీరామ చంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకుని, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయండి. తిలకధారణ, నూతన వస్త్రాల ధారణ అనంతరం భగవంతుడిని పూజించాలి. పూజానంతరం పెద్దల ఆశీస్సులను పొందడం, దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయి. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఏ రోజున వుంటే ఆ రోజున ఉగాది పండుగ పరిగణిస్తారు. ఇంకా బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున శ్రీరామునిని ఆరాధించడంతో పాటు శక్తి ఆరాధనకు కూడా విశిష్టమని పురోహితులు చెబుతున్నారు.

బాబా ఆరోగ్యానికి ప్రస్తుతం ముప్పేమిలేదు

అనంతపురం: భగవాన్ సత్యసాయిబాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్య సంచాలకులు రావిరాజ్ మీడియాకు వెల్లడించారు. బాబా ఆరోగ్యానికి ప్రస్తుతం ముప్పేమిలేదని, ఎవరూ కూడా ఆందోళన చెందకూడదన్నారు.. బాబాకు వెంటిలేటర్ అమర్చినట్టు... బ్లడ్ ప్లెషర్ మామూలు స్థితిలోనే వుందని... శరీరంలో యూరిన్ లెవల్ ఎక్కువగా ఉండటంతో బాబాకు డయాలిసిస్ నిర్వహించారని తెలిపారు. హార్ట్‌బీట్‌లో మార్పులు రావడంతో ఐఏబీపీ పరికరాన్ని అమర్చి పరిస్థితిని పరిశీలిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మూత్రపిండాల పరిస్థితి మెరుగుపడకపోతే సీఆర్‌ఆర్‌టీ పరీక్షలు నిర్వహించాల్సివుందన్నారు.

'సీఎం వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా'

హైదరాబాద్: తెలంగాణ కంటే రాయలసీమ వెనుకపడిందన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావు అన్నారు. కరీంనగర్ కన్నా చిత్తూరు వెనుకబడి ఉందని చెప్పడం సరికాదని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. విధాన సభలోనే సాక్షాత్తు మంత్రి ఓ శాసనసభ్యునిపై దాడి చేస్తే క్షమాపణలతో సరిపెట్టడం వదిలేశారని ఆరోపించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణపై రహస్య నివేదిక ఇవ్వడం నీచాది నీచం అని వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీని తాము గుర్తించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రహస్య నివేదిక ఇవ్వవలసిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. నేతలను ప్రలోభ పెట్టమని ఓ కమిటీ చెప్పడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు హైదరాబాదులో సమావేశం అయి తెలంగాణపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. అనంతరం కేకేమీడియాతో మాట్లాడారు. జూపల్లి కృష్ణారావు తన రాజీనామాను ఉపసంహరించుకోవాలని కేకే కోరారు.

భారత జట్టుపై ఐసీసీ జరిమానా

ముంబై: ప్రపంచకప్ విజేత భారత జట్టుపై ఐసీసీ మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో జరిమానావిధించాడు. వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయంకంటే ఎక్కువ సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయకపోవడంతో మ్యాచ్ రెఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. స్లో ఓవర్ రేట్ నిబంధన 2.5.1 ను అతిక్రమించడంతో భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఐసీసీ విధించిన జరిమానాను భారత జట్టు అంగీకరించడంతో ఎలాంటి వివాదం చోటుచేసుకోకుండానే ఈ విషయం సద్దుమణిగింది. ఇదిలావుండగా ప్రపంచకప్ ఎలెవన్ లోకి సచిన్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ ను ఎంపిక చేసినట్టు ఐసీసీ ప్రకటించింది.