కోలుకుంటున్న సత్య సాయిబాబా
అనంతపురం: సత్య సాయిబాబా ఆరోగ్యం మంగళవారం కాస్త మెరుగుపడింది. వెంటిలేటరు సాయంతో శ్వాస పీల్చుకోవడం, సీఆర్‌ఆర్‌టీ వ్యవస్థ సాయంతో కిడ్నీలు పనిచేయడం వంటివి మినహాయిస్తే మిగిలిన అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. ఈ మేరకు సత్యసాయి ఆసుపత్రి మంగళవారం ఉదయం, సాయంత్రం రెండు బులెటిన్లను విడుదల చేసింది. బాబాకు అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి డైరెక్టరు సఫయా ఒక వీడియో సీడీనీ విడుదల చేశారు. బాబా ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వస్తున్నారని ఆయన తెలిపారు. ఎవరినీ ఐసీయూలోకి అనుమతించడం లేదని, అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నలుగురు ప్రభుత్వ వైద్యుల బృందం ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిందని వెల్లడించారు.
సత్య సాయిబాబా ఆరోగ్యం మెరుగుపడాలని భక్తులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, హోమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచీ పుట్టపర్తిలోని ఆలయాల్లో భక్తులు మృత్యుంజయ హోమం, నవగ్రహాల హోమం, సర్వదేవతల ఆరాధన నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో రాత్రి పెద్ద సంఖ్యలో భక్తులు కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ దర్శన మందిరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తులు భజనలు, సాయినామ కీర్తనలు ఆలపిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు, సాయి విద్యార్థులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. బాబా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు పలువురు ప్రముఖులు మంగళవారం పుట్టపర్తికి వచ్చారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, విశ్వహిందూ పరిషత్తు అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్, జాతీయ విపత్తుల నివారణ సంఘం ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు ఆసుపత్రి వద్దకు వచ్చారు. వైద్య బృందంతో మాట్లాడారు.