భారీ భద్రతలో వాంఖెడే స్టేడియం
posted on Apr 1, 2011 @ 4:05PM
ముంబై: క్రికెట్ ప్రపంచ కప్‌కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వచ్చిన దృష్ట్యా శనివారం భారత్-శ్రీలంక మధ్య తుది పోరు జరుగనున్న వాంఖెడే స్టేడియం, పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత రాష్టప్రతి ప్రతిభా పాటిల్, శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించనుండటంతో కల్పించిన పటిష్టమైన భద్రతతో వాంఖెడే స్టేడియం దుర్భేద్యమైన కోటను తలపిస్తోంది. 32వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించగలిగే సామర్థ్యం ఉన్న వాంఖేడ్ స్టేడియం చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో తనిఖీలను ముమ్మరం చేశారు. నాకాబందీలను తీవ్రతరం చేశారు. వాంఖేడ్ స్టేడియం వద్ద ముంబయి పోలీసులతో పాటు నేషనల్ సెక్యూరిటి గార్డ్స్ టీమ్‌లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌కు చెందిన బలగాలు మోహరించి ఉన్నాయి. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. స్టేడియంపైన, చుట్టుపక్కల ప్రాంతాల గగనతలాన్ని ‘నో ఫ్లైయింగ్ జోన్’గా ప్రకటించారు. స్టేడియం లోపల, బయట 180కి పైగా సిసిటివిలను అధికారులు అమర్చారు. ప్రేక్షకులను నిశితంగా గమనించేందుకు ఒక ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు డిప్యూటి పోలీస్ కమిషనర్ (ఆపరేషన్స్) రాజ్‌కుమార్ వత్కార్ చెప్పారు.