ధోనీకి అనుకూలిస్తున్న గ్రహాలు
posted on Apr 2, 2011 @ 12:36PM
ముంబై: ప్రపంచ కప్ పోటీల పైనల్ మ్యాచుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివల్ల భారత్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై విజయం సాధిస్తుందని చెబుతున్నారు. 1983లో కపిల్ దేవ్‌కు అనుకూలించిన గ్రహగతులే ప్రస్తుతం ధోనీకి విజయం చేకూర్చే విధంగా ఉన్నాయని చెబుతున్నారు. కపిల్ దేవ్ సేన ప్రపంచ కప్ టైటిల్ గెలిచింది శనివారంనాడేనని, ఇప్పుడు కూడా పైనల్ శనివారమే జరుగుతోందని, ఇది కూడా ధోనీ సేనకు అనుకూలిస్తుందని చెబుతున్నారు.
శని భారత్‌కు అనుకూలంగా ఉన్నాడని వారంటున్నారు. గురుడు కూడా భారత్‌కు అనుకూలంగా ఉన్నాడని చెబుతున్నారు. అయితే, ఆటలపై ప్రభావం చూపే కుజుడు మాత్రం కాస్తా ఆటంకంగా ఉన్నాడని, హోమాలూ పూజల వల్ల కుజుడి ప్రభావం తగ్గుతుందని అంటున్నారు. ప్రస్తుత గ్రహగతులు తప్పకుండా ధోనీకి సహకరిస్తాయని చెబుతున్నారు. శనికి గురువు అయిన ధనిష్ట నక్షత్రంలో ఈ మ్యాచు జరుగుతోందని, కేతువూ శని మిత్రులని, ధోనీ నక్షత్రం ఇందుకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. పైగా గ్రహాలు శ్రీలంక కెప్టెన్ సంగక్కరకు అనుకూలంగా లేవని చెబుతున్నారు.