జెనీలియా గర్భవతా?

    హిందీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్ళి చేసుకుని సెటిలైన జెనీలియా డిసౌజా తల్లి కాబోతోందా అనే సందేహాలు శుక్రవారం నాడు బాలీవుడ్‌లో షికార్లు చేశాయి. జెనీలియా తన భర్త రితేష్ దేశ్‌ముఖ్ నటించిన ‘ఎల్లో’ సినిమా ప్రివ్యూకి శుక్రవారం హాజరైంది. నల్ల టీ షర్టు, జీన్స్ ప్యాంట్‌తో ఆ కార్యక్రమానికి హాజరైన జెనీలియా పొట్ట కొంచెం ఎత్తుగా వుండటాన్ని గమనించిన ముంబై మీడియా ఆ ఫొటోలను నెట్‌లో పెట్టేసి జెనీలియా కడుపుతోందొహో అని ప్రచారం చేసేశారు. ఈమధ్యకాలంలో కూడా జెనీలియా తల్లి కాబోతోందని పుకార్లు రావడం, సదరు పుకార్లను జెనీలియా ఖండించడం జరిగింది. అయితే శుక్రవారం నాడు జెనీలియా పొట్ట ఎత్తుగా వున్న ఫొటో కూడా దొరకడంతో ముంబై మీడియా మరోసారి రెచ్చిపోయింది. దాంతో ఈసారి జెనీలియా కాకుండా ఆమె మేనేజర్ జెనీలియా తల్లి కాబోవడం లేదు. టీషర్ట్ ఎత్తుగా కనిపించిందే తప్ప లోపల మీరు అనుకుంటున్న మేటర్ లోపల ఏమీ లేదని వివరణ ఇచ్చాడు.

పైరసీ చేస్తే తాటతీస్తాం!

        ఈనెల 4న మోహన్‌బాబు ‘రౌడీ’ విడుదలవుతోంది. 11న అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ విడుదలకానుంది. జనాల్లో బాగా క్రేజ్ వున్న ఈ రెండు సినిమాలను పైరసీ చేసేయాలని పైరసీదారులు ఉవ్విళ్ళూరుతున్నారు. అలాంటి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సినిమాలను పైరసీ చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తోంది. ' ఈ విషయమై గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు సినిమాల కాపీరైట్ హక్కులు ఫిలింఛాంబర్‌కే చెంది వున్నాయి. ఈ సినిమాల పూర్తి నిడివి వీడియో గానీ, కొద్ది భాగాలు ఎవరైనా వెబ్ సైట్స్ లో పెడితే వాళ్ళ సంగతి తేలుస్తామని ఛాంబర్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే పైరసీలో బిజీగా వున్న 185 వెబ్ సైట్స్ ని (టొరెంట్స్, ఫోరమ్స్, బ్లాగ్స్, లింకింగ్ సైట్స్)ని మూసేయించడం జరిగిందని, ఇలాంటి ఘనకార్యాలకు పాల్పడే 74 మందిని రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో కూడా అరెస్ట్ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడం జరిగిందని ఛాంబర్ వెల్లడించింది. పైరసీ కార్యక్రమాలు చేసే వెబ్ సైట్స్ మీద ఫిలిం ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ ఒక కన్నేసి వుంచిందని, ఎంతమాత్రం ఓవర్ యాక్షన్ చేసినా సదరు వెబ్ సైట్స్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఫిలిం ఛాంబర్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చేసింది. పైరసీని ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

శ్రీవారిని దర్శించుకున్న 'లెజెండ్' బాలయ్య

      నటసింహం నందమూరి బాలకృష్ణ చాలాకాలంగా ఎదురుచూస్తున్న విజయం ‘లెజెండ్’ ద్వారా దక్కడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా వుంది. లెజెండ్ చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా ఆ చిత్ర యూనిట్ గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆయన విజయ యాత్రను చేయడంతోపాటు పనిలోపనిగా తీర్థయాత్రను కూడా చేస్తున్నారు.   విజయ యాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సమీపంలోని ప్రసిద్ధ దేవాలయాలను దర్శిస్తున్నారు. సింహాచలం, విజయవాడ కనకదుర్గమ్మ గుడి, మంగళగిరి పానకాల స్వామి, తిరుమల వేంకటేశ్వరాలయం తదితర పుణ్యక్షేత్రాలకు బాలకృష్ణ వెళ్ళారు. ఈ విజయయాత్ర కమ్ తీర్థయాత్రలో భాగంలో బాలకృష్ణ మరిన్ని పుణ్యక్షేత్రాలను సందర్భించే అవకాశం వుందని తెలుస్తోంది.  

అలియా భట్ కిస్సు సూపరంట!

      మహేష్ భట్ తనయ, బాలీవుడ్ భామ అలియాభట్ ముద్దులు ఇవ్వడంలో బోలెడంత టాలెంటెడ్ గాళ్ అట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్. ఆ మాట ఎవరితో అన్నాడంటే సాక్షాతూ అలియా భట్‌తోనే అన్నాడు. ఈ కాంప్లిమెంట్‌ని అలియాభట్టే మీడియాకి చెప్పింది. ప్రస్తుతం అలియాభట్, అర్జున్ కపూర్ ‘2 స్టేట్స్’ అనే సినిమాలో నటిస్తున్నారు. రిలీజ్‌కి రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో వీళ్ళిద్దరూ పాల్గొంటున్నారు.   ముంబైలోని అనేక ప్రదేశాలలో ఈ జంట ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటోంది. ఈ కార్యక్రమాలలో క్లోజ్‌గా మూవ్ అవుతున్న వీళ్ళిద్దరినీ  చూసి వీళ్ళిద్దరూ సినిమాలో హీరో హీరోయిన్లు మాత్రమేనా.. లేక ఇద్దరి మధ్య ఏదైనా కెమిస్ట్రీ నడుస్తోందా అన్న సందేహాలు చూసేవాళ్ళకి కలుగుతున్నాయట. చూడ ముచ్చటగా వున్న ఈ జంట అందరి మధ్య క్లోజ్‌గా మూవ్ అవుతూ వుంటే జనం గుండెల్లో గిలిగింతలు పుట్టకుండా వుంటాయా? ‘2 స్టేట్స్’ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య కిస్సింగ్ సీన్లు కూడా వున్నాయి. అయినా మన అమాయకత్వం గానీ, ప్రస్తుతం బాలీవుడ్‌లో కిస్సింగ్ సీన్లు లేకుండా ఎవరూ సినిమాలు తీయడం లేదు కదా. కాకపోతే అలియా, అర్జున్ లాంటి జంట కిస్సు పెట్టుకుంటే ఆ జిల్‌జిల్లే వేరు. ‘2 స్టేట్స్’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఈ జంట ఓచోటకి వెళ్ళినప్పుడు మీడియావాళ్ళు అలియాని మీలో అర్జున్ కపూర్’కి నచ్చిన అంశాలేంటని అడిగారట. దానికి అలియా ఆల్చిప్పల్లాంటి కళ్ళని టపటపలాడిస్తూ, ‘నేను ముద్దు బాగా పెడతానని అర్జున్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు’ అని చెప్పేసింది. అలియా భట్ చెప్పిన సమాధానం విని అక్కడ వున్నవాళ్ళందరూ ముసిముని నవ్వులు నవ్వుకున్నారట.

ఆమెకి మగాడి అవసరం లేదట!

      సినిమాల్లో తన ఎరోటిక్ యాక్టింగ్‌తో మగాళ్ళని పిచ్చోళ్ళని చేసిపారేసిన ఆ హీరోయిన్‌ ఇప్పుడు తనకి మగాళ్ళ అవసరే లేదని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు... ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ షరాన్ స్టోన్. ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ సినిమాలో కాలుమీద కాలు వేసుకుని పోలీస్ ఇంటరాగేషన్‌లో పాల్గొనే సీన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సష్టించిన షరోన్ స్టోన్ వయసు పెరిగినా ఇప్పటికీ తాను హాట్ హీరోయిన్ అనే భావిస్తూ వుంటుంది.   ఇప్పటికీ ఆమె నటిస్తున్న సినిమాల్లో ‘అలాంటి’ సీన్లు కోకొల్లలు వుంటాయి. లేటెస్ట్ ‌గా షరోన్ స్టోన్ ఒక సంచలనాత్మక ఇంటర్వ్యూ ఇచ్చేసింది. తనకి ఇప్పుడు మగాడి అవసరమే లేదట. మగాడి అవసరం లేకుండానే తాను జీవించగలదట. మగాడితో కలసి వుండటం తనకిప్పుడు చాలా చిరాకు తెప్పించే విషయమట. ఒంటరిగా వుండటం అనేది తనకి ఇప్పుడు చాలా సంతోషాన్ని కలిగించే అంశమట.   ఒకప్పుడు హాలీవుడ్ శృంగార దేవతగా పేరు తెచ్చుకున్న షరోన్ స్టోన్ ఇప్పుడు సడెన్‌గా తనకు మగాడి అవసరం లేదని ప్రకటించడం ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది మగాళ్ళను హర్ట్ చేసిందో లెక్కలేదు. ఇప్పుడు షరాన్ స్టోన్ వయసు 56 యేళ్ళు. ఈ వయసులో ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చింది కాబట్టి పెద్దగా ప్రమాదం జరగలేదు. ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ రోజుల్లో ఇచ్చి వున్నట్టయితే ఎన్ని మగ గుండెలు ఆగిపోయి వుండేవో. కెరీర్ ఫేడింగ్ దశలో వున్న ఈ బామ్మగారు ప్రస్తుతం ‘ఫేడింగ్ గెలేలో’ అనే హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో కూడా బోలెడన్ని సరసాత్మక సన్నివేశాల్లో షరోన్ స్టోన్ నటించిందని తెలుస్తోంది.

ఆ ‘ఎక్స్’పోజింగ్ అవసరమా?

      సినిమాలో విద్యాబాలన్ ఎక్స్ పోజింగ్ చాలా ప్రత్యేకంగా వుంటుంది. మంచి పర్సనాల్టీ కావడంతో విద్యాబాలన్ ఎక్స్ పోజింగ్ చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. విద్యా ఎక్స్ పోజింగ్ లెవల్ గురించి చెప్పుకోవాలంటే ‘డర్టీ పిక్చర్’ శాంపిల్ చాలు. ‘డర్టీ పిక్చర్’ లాంటి సినిమాల ద్వారా విద్యాబాలన్ సినిమా రంగానికి చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెకు ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపిక చేసింది. సరే, ఈ విషయంలో బోలెడన్ని కాంట్రవర్సీలు వచ్చాయి. ‘పద్మశ్రీ’ పొందే అర్హత విద్యాకి ఎక్కడుందన్న విమర్శలు వెల్లువెత్తాయి.   ఇవన్నీ ఇలా వుంటే, సోమవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యా బాలన్ కూడా పురస్కారాన్ని అందుకుంది. విద్యాబాలన్ చక్కని చీరకట్టుతో రావడాన్ని దూరం నుంచి చూసిన చాలామంది పోన్లే పాపం సంప్రదాయబద్ధంగా వచ్చిందని అనుకున్నారు. అయితే విద్యాబాలన్ దగ్గరికొచ్చాకగానీ, అమ్మడు చేసిన ఎక్స్ పోజింగ్ బయట పడలేదు. ఎక్కడ చూపించాలో అక్కడ, ఎంత చూపించాలో అంత చూపిస్తూ విద్యాబాలన్ చేసిన ఎక్స్ పోజింగ్ అక్కడ వున్నవారి కళ్ళు చెదిరిపోయేలా చేసిందట. ఇతర సందర్భాల్లో ఈ ఎక్స్ పోజింగ్ ఓ పద్ధతిగా వుండేదిగానీ, దేశ ప్రథమ పౌరుడి దగ్గరకి, దేశంలో ఉన్నత అవార్డును అందుకోవడానికి వచ్చి ‘అలా’ ఎక్స్ పోజింగ్ చేయడం న్యాయం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవసరం లేని చోట ఎక్స్ పోజింగ్ చేయడం అవసరమా అని కామెంట్లు వినిపించాయి.  

బాలకృష్ణ డిసైడ్ అవ్వలేదట

    ప్రముఖ నటుడు, టిడిపి అధినేత వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ఎన్నికలలో పోటీచేసే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో చర్చించిన అనంతరం తాను ఎక్కడి నుండి పోటీ చేసేది చెబుతానని చెప్పారు. ఆయన నటించిన 'లెజెండ్' సినిమా హిట్ కావడంతో ఈ రోజు ఉదయం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..పార్టీ ఆదేశిస్తే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని అన్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీని బలపర్చడం తన బాధ్యతని..అలాగే అభిమానుల కోసం నటిస్తూ.. వినోదం పంచాల్సి ఉందని చెప్పారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలయ్య గత ఏడాది చెప్పారు. అప్పటి నుండి ఆయన పోటీ చేసే స్థానంపై చర్చతో పాటు ఉత్కంఠ కొనసాగుతోంది.

అయోమయ౦లో మెగా ఫ్యాన్స్

      పవన్ కళ్యాణ్ సొంతగా రాజకీయ కుంపటి పెట్టుకుని అన్నయ్యకి, ఆయన పార్టీకి వ్యతిరేకంగా వర్క్ చేస్తూ వుండటంతో ఇప్పుడు చిరు ఫ్యాన్స్ కి చిరు, రామ్ చరణ్ వైపు వుండాలా? లేక పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్ ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్‌కి తమ మద్దతు లేదని చిరు కుటుంబం ప్రకటించడంతో, గురువారం నాడు పవన్ వైజాగ్‌లో నిర్వహించే సభకి వెళ్ళాలా లేక హైదరాబాద్‌లో వున్న రామ్‌చరణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనాలా అని ఫ్యాన్స్ డోలాయమాన స్థితిలో వున్నారు.   ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి ఫ్యాన్స్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. అయితే చరణ్ ఫ్యాన్స్ మాత్రం హైదరాబాద్ బయల్దేరారని తెలుస్తోంది. పవన్ వైపే పూర్తిగా మొగ్గు చూపిన కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు. ఏం చేయాలో అర్థంకాని చాలామంది ఫ్యాన్స్ మాత్రం ఇంట్లోనే ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చోవాలని డిసైడైనట్టు తెలుస్తోంది. మొత్తంమీద పవన్ కళ్యాణ్ మీటింగ్ డే, రామ్ చరణ్ బర్త్ డే ఒకేరోజు రావడంతో ఫ్యాన్స్‌ అయోమయానికి గురయ్యారు.

మెగా ఫ్యామిలీ వార్: పవన్ వర్సెస్ చరణ్

      మెగా ఫ్యామిలీ లో విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. బాబాయితో అబ్బాయి 'ఢీ' కొనడానికి సిద్దమవుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేపు పవన్ కళ్యాణ్ వైజాగులో తన జనసేన పార్టీ మొట్టమొదటి సమావేశం నిర్వహించబోతుండటంతో, అదే రోజు రామ్ చరణ్ తేజ్ తన పుట్టిన రోజును గ్రాండ్ గా చేసుకోవడానికి హైదరాబాదు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో మెగాభిమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేయిస్తున్నారు. వీరికి అక్కడే భోజన ఏర్పాట్లు కూడా చేయడం చూస్తే..రేపు విశాఖలో జరిగే పవన్ సభకు మెగా అభిమానులను వెళ్ళకుండా అడ్డుకోనేందుకే అబ్బాయి ఈ ప్లాన్ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   రేపు సాయంత్రమే బాబాయ్ పవన్ కళ్యాణ్ తన మొదటి రాజకీయ సభను నిర్వహిస్తున్నారని తెలిసి కూడా రామ్ చరణ్ కూడా సరిగ్గా అదే సమయంలో సమాంతరంగా హైదరాబాదులో మరో సమావేశం నిర్వహించడంతో అభిమానులు బాబాయ్-అబ్బాయ్ లలో ఎవరినో ఒకరిని ఎంచుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. మరి మెగా అభిమానులు ఎవరికీ జై కొడతారో వేచి చూడాలి!  

పెళ్లి కోసం అంకిత పూజలు

      ‘ఐ లవ్ యూ రస్నా’ అంటూ అందరినీ అలరించి...అనంతరం నటిగా మారిన అంకిత ప్రస్తుతం పెళ్లి కోసం పూజలు చేస్తోంది. ఆమె తన కుటుంబ సభ్యలుతో కలిసి శ్రీకాళహస్తిశ్వరాలయంలో ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేయించుకుంది. ఈ సందర్భంగా వేదపండితులు అంకితతో ప్రత్యేక పూజలు చేయించి అనంతరం స్వామివారి దర్శనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందచేశారు.   స్వామివారి దర్శనం అనంతరం అంకిత విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి శివయ్య ఆశీస్సులతోనైనా వివాహం జరుగుతుందనే ఆశతో ఆయన సన్నిధిలో రాహుకేతు పూజలు చేయించుకున్నట్లు  తెలిపింది. తాను అమెరికాలో చదువుకుంటున్నానని ప్రస్తుతం  పెళ్లి చేసుకునే పనిలో ఉన్నానని... ఆ తర్వాత సినిమాలు చేయాలా వద్దా...? అనేది చెబుతానని అంటోంది. టాలీవుడ్ లో పెద్దగా ఆదరణ లేకపోవడంతో తమిళనాడుకు వెళ్లి, అక్కడ కూడా అవకాశాలు లేక అమెరికాలో స్టేజి షోలు చేసిన అంకిత, ఇప్పుడు పెళ్లిపనిలో పడిందన్న మాట.

పవన్ మీటింగ్ కు హాజరుకావద్దు: చిరు

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టేందుకు సిద్దపడుతుండటంతో చిరంజీవి తన అభిమాన సంఘాల నేతలకు స్వయంగా ఫోన్లు చేసి తన సోదరుడి సభకు వెళ్ళవద్దని చెపుతున్నట్లు సమాచారం. పార్టీ స్థాపన గురించి అధికారికంగా పవన్ ప్రకటించనున్న తరుణంలో చిరంజీవి రాష్ట్ర వ్యాప్తంగా గల తమ అభిమాన సంఘాల నాయకులతో ఢిల్లీనుంచి టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లుగా వినికిడి. రేపటి సమావేశాలకు వెళ్లరాదన్న ఆదేశాలను కొంతమంది చిరు అభిమానులు ధిక్కరిస్తూ మాట్లాడారట. అదే నిజమయితే, పదవుల కోసం ఇప్పటికే తన పరువు పోగొట్టుకొన్న ఆయన ప్రజల దృష్టిలో ముఖ్యంగా అభిమానుల దృష్టిలో మరింత చులకనవడం తధ్యం. పవన్ కళ్యాణ్ అభిమానులలో చాలా మంది ఆయన సినిమాలను చూసి కాక ఆయనలో ఉన్న మానవతా దృక్పధాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి అభిమానులయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ నటించిన అనేక సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్నప్పటికీ ఆయనపై వారి అభిమానం చెక్కు చెదరలేదు.

విశాల్ తో వస్తున్న అర్జున్ కూతురు

  యాక్షన్ కింగ్ అర్జున్ అంటే తెలియని వారుండరు. "జెంటిల్ మెన్", "ఒకే ఒక్కడు" వంటి చాలా సూపర్ హిట్ సినిమాలలో నటించి, తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. అయితే ప్రస్తుతం అర్జున్ కుమార్తె టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా "ధీరుడు" సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భూపతి పాండ్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విశాల్ సరసన ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్, ప్రేమ, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను "విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ" బ్యానర్లో విశాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ అందిస్తున్న ఈ పాటలను జూన్ 25న విడుదల చేయనున్నారు. జూలై మూడో వారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కండల వీరుడికి పెళ్లి మీద మనసాయె

      ఇన్నాళ్లుగా రకరకాల అఫైర్లతో కాలం గడిపేసిన బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఓ ఇంటివాడైపోతున్నాడు. ఈ సంవత్సరం తన బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై పలకాలని నిర్ణయించేసుకున్నాడు. రుమేనియా బ్యూటి లులియా వాంటర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఇండియా టుడే సదస్సులో సల్మాన్ స్వయంగా చెప్పాడు. కొద్ది రోజులుగా నిట్టూర్పులతో జీవితం గడుస్తోందని.. ఇక నిట్టూర్పులకు ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు సల్మాన్ వెల్లడించారు. తన తండ్రి ముస్లిం.. తల్లి హిందువు.. రెండో తల్లి కాథలిక్.. బావ పంజాబీ.. అయితే ఈసారి మా ఇంట్లోకి బయట దేశం నుంచి కోడల్ని తీసుకురావాలనుకుంటున్నానని సల్మాన్ చమత్కరించారు.

తెలుగు దర్శకుల సంఘం ఎన్నికల ఫలితాలు

  రెండు సంవత్సరాలకు సంబంధించిన తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు ఆదివారం హైదరాబాదులోని చలనచిత్ర వాణిజ్యమండలిలో జరిగాయి. తెలుగు సినీదర్శకుల సంఘం అధ్యక్షుడిగా వీరశంకర్ గెలుపొందారు. కృష్ణమోహన్ రెడ్డిపై వీరశంకర్ 17 ఓట్ల తేడాతో గెలుపొందారు.ఉపాధ్యక్షులుగా కాశీవిశ్వనాధ్, చంద్ర మహేష్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా మద్దినేని రమేష్, సంయుక్త కార్యదర్శులుగా సాయివెంకట్, కృష్ణమోహన్, కోశాధికారిగా కాదంబరి కిరణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బాలాజీ, మధుర శ్రీధర్ లు గెలుపొందారు. మొదటిసారిగా ఈసీ మెంబర్ గా పోటీచేసిన ప్రియదర్శిని ఘన విజయం సాధించారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు. ఈ కార్యవర్గం రెండేళ్ళపాటు కొనసాగుతుంది. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా అజయ్ కుమార్, అనిల్ కావూరి, నిమ్మకాయల కోటేశ్వర రావు, సి.హెచ్.లక్ష్మణరావు, బి.శ్రీనివాసరావు, సి.గంగాధర్ గెలుపొందారు.

'లెజెండ్' టైమ్ స్టార్ట్

      'సింహ'లో ఒకవైపు చూడు అన్న బాలయ్య 'లెజెండ్'లో తన రెండు వైపు కూడా చూపించబోతున్నాడు. చాలా కాలంగా బాక్స్ ఆఫీసు వేటలో ఎంతో ఆకలిగా ఉన్న నటసింహం 'ప్లూటు జింక ముందు ఊదు..సింహం ముందు కాదు' అంటూ బరిలోకి దిగబోతున్నాడు. నిన్న విడుదలైన 'లెజెండ్' ట్రైలర్ లో బాలయ్య తన విశ్వరూపం చూపించాడు. పవర్ ఫుల్ డైలాగులతో నిండి వున్న ఈ ట్రైలర్ చూస్తే 'సింహం' ఈ సారి టాలీవుడ్ రికార్డులన్నిటిని మింగేయడం ఖాయంగా కనిపిస్తోంది. జగపతి బాబు లుక్ కూడా సింహానికి పోటీగా ఉండడం, దానికి దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జతకావడంతో 'లెజెండ్' చరిత్రను తిరగరాస్తాడని నందమూరి అభిమానులు అంటున్నారు.  

బాహు"బలి"అయ్యాడా?

  యంగ్ రెబెల్ స్టార్.. యరక్కపోయి ఇరుక్కున్నాడా? తాత్కాలిక ఓదార్పు కోసం వెళ్లి కబంధహస్తాల్లో ఇరుక్కుపోయడా? ఇవే ఇప్పుడు అంతర్జాలంలో అత్యంత వేగంగా వైరస్ లా విస్తరిస్తున్న పుకార్లు. ఎక్కడ ఏ రాజకీయ సభలో ఎవరు ఎవరిని విమర్శించినా కౌంటర్ గా ప్రభాస్ కేంద్రంగా మారుతున్నాడు? షేర్లు, పోస్టులు , కామెంట్లు రూపంలో నెటిజన్ల వాల్ కు ఎక్కుతున్నాడీ రాజుల అబ్బాయి.   సినిమా ప్రమోషన్ కోసమేనా? మిర్చి సూపర్ హిట్ అయిన తరువాత ప్రారంభమైన ప్రభాస్ సినిమా బాహుబలి. ఈ సినిమా రాజమౌళి చెక్కుతున్నారు. అంటే ఇది రిలీజయ్యేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. ఈ మధ్యలో ఇంకో ప్రాజెక్ట్ ఒప్పుకునే అవకాశాలు లేవు. అంతవరకూ గ్యాసిప్స్ తో గ్లామర్ మేంటైన్ చేసేందుకు పనిగట్టుకుని కొందరు అభిమానులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారనే విమర్శలున్నాయి. అందుకే వీటిని సీరియస్ గా తీసుకోకుండా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని సినీవర్గాలు అంచనా వెస్తున్నాయి.   ప్రభాస్ అభిమానుల మీద, సినీ జనాలపైన అత్యంత ప్రభావంతంగా పనిచేసే హాట్ హాట్ గ్యాసిప్స్ ఫేస్ బుక్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. మతం మారాడా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ పై రూమర్లు సినిమా రంగం నుంఛి రాజకీయరంగం వైపు మళ్లాయి. కడపలో ఒకరిని మరొకరు విమర్శిస్తే.. కౌంటర్ గా విశాఖపట్నం ఓ వాయిస్ ప్రతిధ్వనిస్తోంది. ఏ ఒక్క రూమర్ పైనా ప్రభాస్ ఇప్పటివరకు స్పందించింది లేదు. ఆయన అభిమతం ఏమైనా మారిందా? మతం మారడం వెనుక కారణాలేంటి? అనే దానిపై నెటిజన్లు చర్చా కార్యక్రమాలు నడిపిస్తున్నారు.   రెబెల్ స్టార్ ని ఎదుర్కొనేందుకేనా? .. ఈ మధ్యే బీజేపీలో చేరిన సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మాలలే నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఆయనకు చెక్ పెట్టేందుకు సినీ ఇండస్ట్రీ లో కొందరు, మరి కొంతమంది రాజకీయ నేతలు పధకం ప్రకారం యంగ్ రెబెల్ స్టార్ ను కేంద్రంగా చేసుకుని రూమర్లు ప్రచారం చేయిస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.