వేటూరి జయంతి
సినీ తోటలోని పాటలు చెట్టుకు...కొమ్మకొమ్మకు సన్నాయిలు పూయించి....రాగాల పల్లకిలో ప్రేక్షకుల్ని ఊయలలూగించిన పాటల మాంత్రికుడాయిన...తెలుగు పాటను పరవళ్లు తొక్కించి, ఉరకలెత్తించిన గీతర్షి ఆయన!తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేసి ఆకుచాటు పిందెను, కొండమీద చందమామను పదాలతో సాక్షాత్కరించజేసిన పదచిత్రకారుడు వేటూరి.
బ్రాహ్మణకుటుంబంలో 1936 జనవరి 29న జన్మించారు వేటూరి సుందరరామమూర్తి.నిత్యం వేదఘోషల మధ్య… సంస్కృత మంత్రోచ్ఛారణల నడుమ పెరిగిన బాల వేటూరికి అచేతనంగానే ఆ సాహిత్యం… అందులోని లయ… పదగాంభీర్యత ఆకట్టుకున్నాయి. ఇలా పుట్టిన వ్యక్తి ఆ తర్వాత కాలంలో తెలుగు ప్రేక్షకలోకానికి పాటల నైవేద్యం పెట్టే పదార్చకుడిగా మారుస్తుందని వేటూరి సైతం ఊహించలేదు.
వేటూరి కెరీర్- మొదట జర్నలిస్ట్‌గా మొదలైంది. వార్తా రచన, రిపోర్టింగ్‌లోని సైతం ఆయన భావగర్భితమైన ప్రయోగాలు చేసేవారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలలో ఆయన పాత్రికేయ జీవితం… కళాతపస్వి కె.విశ్వనాథ్- పిలుపుతో సినీగేయ రచయితగా కొత్త మలుపు తిరిగింది. అలా సుందరరాముడు- ‘ఓ సీత కథ’ సినిమా ద్వారా… విశ్వనాథుడు అంటే శివుడి నిర్దేశకత్వంలో పాటని పరవళ్లు తొక్కించాడు. వేటూరి కలం సోకిన సినీ సంగీత నాదం ఝమ్మంది. పాదం సయ్యంది. ప్రేక్షకుల తనువులు ఆ నాదంతో పాటే ఊగాయి.
1970 దశకంలో తెలుగు సినిమా పాటల ప్రపంచానికి పిల్ల తెమ్మరలా వచ్చి… ప్రభంజనమై వీచి… సునామీలా చుట్టుముట్టినవాడు – వేటూరి. కృషి + క్రియేటివిటీ కలసిన ఆయన గీతర్షి అయ్యారు. మహాపురుషుడయ్యారు. తెలుగునేల మీద తరతరాలకూ తరగని పాటల నిధి అయ్యారు.రేక్షకుల మనోభావాలను చదివినట్లుగా వారు సినిమా నుంచి ఏం ఆశిస్తున్నారో ఏ సరసాన్ని, ఏ శృంగారాన్ని కోరుకుంటున్నారో ఆ అంశాలను మేలి ముసుగు భావనలతో తన పాటలో పలికించడంలో వేటూరికి వేటూరే సాటి. ఈ పాటల వేటగాడు- ఆకుచాటు పిందె లోని అందాలను రమ్యంగా వ్యక్తీకరించి వానపాటల ట్రెండ్‌కు నాంది పలికాడు.
1983 నాటికి తెలుగు యూత్‌లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వారిలోని ఎమోషన్స్‌కి తగినట్లుగా పాటలోని వరుసలు… వారి హృదయ వరుసలు ట్యూన్ అయ్యేలా రాసి గర్ల్‌ఫ్రెండ్ నచ్చిన తర్వాతి ఆనందాన్ని ఇంగ్లీష్ పదాలైన ఛాన్సు, రొమాన్సు, యురేకా వంటి ప్రయోగాలతో నభూతో నభవిష్యతి అన్న తరహాలో అందించాడు.ఆదికవి వాల్మీకి ‘శోకం నుంచే శ్లోకం పుడుతుంది అన్నాడు. అలాగే ఈ సినీకవి తను రాసిన పాటల్లో అద్భుతమైన సింబాలిజమ్‌ను అలాగే కవితాత్మను సైతం ప్రవేశపెట్టారు. సప్తపది సినిమాలోని గోవుళ్లు తెల్లన… అనే పాటలోని చరణంలో ఈ భావాన్ని అనన్య సామాన్యంగా వ్యక్తీకరించాడు. పిల్లన గ్రోవికి నిలువెల్లా గాయాలనీ… అందులోంచి రసవంతమైన గేయాలు వస్తాయని భావగర్భితంగా చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి సినీ గేయ రచనకు కూడా నంది అవార్డును 1977లో ప్రకటించినపుడు ఆ అవార్డును వేటూరి అందుకున్నారు.సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నవతా కృష్ణంరాజు నిర్మించిన 'పంతులమ్మ' చిత్రంలో రాసిన 'మానస వీణ మధు గీతం మన సంసారం సంగీతం' గీతానికిగాను అందుకున్నారు.ఆ తరువాత 'శంకరాభరణం'లోని 'శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా' గీతానికి 'కాంచనగంగ' చిత్రంలోని 'బృందావని వుంది యమునా నది ఉంది మధురాపురి ఉంది కాళింది ఉంది' గీతానికి, ప్రతిఘటన చిత్రంలోని 'ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో.... రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాటలే వున్నాయి.
తెలుగు సినిమా పాట దశనూ దిశనూ మార్చిన సినీకవి వేటూరి సుందరరామ మూర్తిని ఎంత ప్రశంసించినా తక్కువే. ఆయన మధుర గీతాలు అభిరుచిగల శ్రోతలను అలరిస్తూనే వుంటాయి.