ప్రమాదం నుండి తప్పించుకున్న శ్రావణ భార్గవి

  యువ గాయని శ్రావణ భార్గవి పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది. విజయవాడలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న శ్రావణ భార్గవి కారును రాంగ్ రూట్ లో వస్తున్న ఓ ట్రాక్టర్ డీకొట్టబోగా, అంతలోనే అప్రమత్తమైన కారు డ్రైవర్ దాన్ని తప్పించబోయి అదుపు తప్పి డివైడర్ ను డీకొట్టింది. అదృష్టం కొద్ది అదే సమయంలో కారు టైరు పగిలిపోవడంతో కారు అక్కడికక్కడే ఆగిపోయింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల శివారులోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రావణ భార్గవి భర్త, సింగర్ హేమచంద్ర సంఘటన స్థలానికి చేరుకొని, ఆమెను మరో కారులో విజయవాడకు తీసుకెళ్ళాడు.

అక్కినేని మృతి... ప్రముఖులు సంతాపం

      అక్కినేని నాగేశ్వరరావు మరణంపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్స్ అధినేత , దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అక్కినేనితో తన అనుబంధం విడదీయలేనిదని అన్నారు. అక్కినేని లేరనేది నమ్మలేని నిజమని ఆయన అన్నారు. ఏఎన్నార్ భౌతికకాయన్ని సందర్శించి ఆయన నివాళులు అర్పించారు. అక్కినేనితో కలిసి తాను 14 సినిమాలు చేశానన్నారు. తామిద్దరం ఒక కంచం ఒకే మంచం అనేలా ఉండేవారిమని, నాటికి… నేటికీ అక్కినేని అందరికి ఆదర్శమని ఆయన అన్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మహా వృక్షం రాలిపోయిందన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రపరిశ్రమకు రెండు పిల్లర్లుగా ఉండేవారని అన్నారు. అక్కినేనితో తాను తీసిన ‘ప్రేమ్ నగర్’ చిత్రం తన జీవితంలో ఓ శక్తిలా మారిందన్నారు. ఆ సినిమాతో అప్పటివరకూ తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను తట్టుకున్నట్లు చెప్పారు. అక్కినేని కుటుంబంతో బంధుత్వం కూడా ఉందని ఆయన మరణం బాధాకరమని రామానాయుడు అన్నారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి, డీకే అరుణ, తమిళనాడు గవర్నర్ రోశయ్య తదితరులు అక్కినేని మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రముఖులు…. అక్కినేని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియాలు గురువారం ఎర్రగడ్డ స్మశానవాటికలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం వరకూ అభిమానుల సందర్శనార్థం అక్కినేని పార్థీవ దేహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఉంచుతారు.

అక్కినేని నాగేశ్వరరావు అస్తమయం

      వెండితెర మీద మరో శకం ముగిసింది.. ఎన్నో అజరామర చిత్రాలు, అపురూప పాత్రలతో వెండితెర మీద తనదైన నటనను ప్రదర్శించిన సినీనట శిఖరం అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూశారు.. గత కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాదితో బాధపడుతున్న అక్కినేని మంగళవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు..   అక్కినేని ఈ నాలుగు అక్షరాలు వింటే చాలు తెలుగు ప్రేక్షకుడి హృదయంలో ఒక ఆనందపు పిల్లతెమ్మెర ప్రత్యక్షమవుతుంది. ఆపేరును తలుచుకుంటేనే చాటు ప్రపంచంలోని విషాదమంతా ప్రేక్షకుల గుండెల్ని పలకరించి వెలుతుంది.. ఆయన డైలాగులు. ప్రేక్షకుల మనోరంజనాలు. ఆయన డ్యాన్సులు తెలుగు సినిమాకు మేలిమలుపులు, ఆయన నటన తెలుగు సినిమాకు ఓ నిఘంటువు.. ఒక బాలరాజు, ఒ దేవదాసు, ఒక విప్రనారాయణ, ఒక దసరాబుల్లోడు. ఒక భక్తతుకారం, ఒక దొంగరాముడు, ఒక డాక్టర్‌ చక్రవర్తి, ఒర మహాకవి క్షేత్రయ్య.. ఇలా ఆ మహానటుని నట ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు.. ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలకు జీవం పోసిన మహానటుడు అక్కినేని తెలుగు సినీ జగత్తుకు చిరపరిచితమైన పేరు అక్కినేని తెలుగు సినిమా నటనకు ఆయన అభినయం ఓ అలంకారం, తెలుగు సినిమా పాత్ర పోషణకు ఆయన కదలిక ఓ సంచలనం.. తెలుగు సినిమా నృత్యాలకు ఆయన స్టెప్పులు ఓ ఉత్తేజం. ఆయన గొంతు భావోద్వేగాల సంచలనం.. మొత్తం తెలుగు సినిమా గమనానికి ఆయన జీవితం ఓ సాక్ష్యం కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరలో ఉన్న ఓ చిన్న గ్రామం రామాపురం.. 80 ఏళ్ల క్రితం ఆ పక్కగ్రామానికి కూడా సరిగా తెలియని ఈ ఊరు ఇప్పుడు మాత్రం ప్రపంచ పటంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగు సినిమా భవిష్యత్తును శాసించగలిగే ఓ మహానటున్ని వెండితెరకు అందించిన ఆ గ్రామం తెలుగు కళామతల్లికి తన వంతు సేవ చేసింది.. వెండితెర మీద మహానటునిగా ఎదగాల్సిన అక్కినేనిని బడిలో పుస్తకాల మధ్య కూర్చోటానికి విధి కూడా ఒప్పుకోలేదు అందుకే చిన్న వయసులోనే నటన మీద ఉన్న ఆసక్తితో నాటకాలు వేయడం ప్రారంభించారు అక్కినేని.. ఆ అనుభవమే ఆయన్ను వెండితెర వైపు నడిపించింది.. 1940లో 17 ఏళ్ల వయసులోనే ధర్మపత్ని సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు అక్కినేని నాగేశ్వరరావు.. తరువాత పలు చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ చేసిన ఆయన 1944లో సీతారామ జననం సినిమాతో హీరోగా మారారు.. హీరోగా నటించిన తొలి చిత్రంలోనే శ్రీ రామునిగా నటించి మెప్పించారు అక్కినేని.. తొలి సినిమాతోనే అపూర్వ విజయం అందుకున్న అక్కినేని తరువాత వరుసగా బాలరాజు, కీలుగుర్రం లాంటి సినిమాలతో తిరుగులేని స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.. రెండు వందలకు పైగా చిత్రాల్లో ఎన్నో అపురూప పాత్రలతో తెలుగు సినిమా కళామ తల్లికి నటనా సత్కారం చేశారు అక్కినేని.. సాంఘిక చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు తెలుగు సినిమా తెరపై నటనకు నవ్యభాష్యాన్ని తెలిపాయి.. ముఖ్య భగ్న ప్రేమికుడిగా ఆయన పొషించిన పాత్రలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. లైలా మజ్ను, దేవదాసు లాంటి సినిమాల్లొ ఆయన నటకు ప్రేక్షకులు కనక వర్షమే కురిపించారు.. ముఖ్యంగా 1953లో రిలీజ్‌ అయిన దేవదాసు సినిమా అక్కినేని నట ప్రస్థానంలో కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు.. శరత్‌చంద్ర  ఛటర్జీ రాసిన దేవదాసు పాత్రను ఎంతో అద్భుతంగా తెర మీద ఆవిష్కరించిన అక్కినేని ఆ పాత్రను తరువాత ఎవరు పోషించిన ఆయన పరభాషా నటులతో కూడా భేష్‌ అనిపించుకున్నారు,... కేవలం ప్రేమికుడిగానే కాదు.. వెండితెర మీద మహా భక్తునిగా కూడా ఆయన అద్భుత నటనను ప్రదర్శించారు.. స్వతహాగా నాస్తికుడు అయిన అక్కినేని తెర మీద మాత్రం మహాభక్తునిగా ఎన్నో పాత్రలకు తన అద్భుత నటనతో జీవం పోశారు.. వెండితెరకు బంగారు మెరుగులు దిద్దిన మహానటుడు ఏయన్‌ఆర్. ఆయన  ఒక నటవిశ్వరూపం. ప్రతీ పాత్ర పోషణలో ఆయన తీసుకునే జాగ్రత్తలు ..ఇన్నాళ్ల నట ప్రస్థానంలో ఆయన ప్రతీ నిమిషం పాటించిన క్రమ శిక్షణ ..వృత్తిపరమైన ప్రేమ...ఆయన్ను మహోన్నత సినీ శిఖరంలా నిలబెట్టాయి. అక్కినేని సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎన్నో గెలుపు ఓటములు చూశారు. ఓడిన ప్రతీసారీ కొత్త పాఠం నేర్చుకుని...గెలిచిన ప్రతీసారి తనను తాను కొత్తగా మలుచుకుని ..నిత్యవిద్యార్ధిలా జీవితంలో ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నటుడిగా...నిర్మాతగా ఆయన ప్రదర్శించే నియమ నిబద్ధతలు సినీ ఇండస్ట్రీకి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఒక నటుడిగా ఎదిగి..ఒక మనిషిగా ఒదిగి...ఎదిగే కొద్ది ఒదగమనే మాటకు నిలువెత్తు నిదర్శనంలా అనిపిస్తారు...అక్కినేని. రొమాంటిక్ కింగ్...ట్రాజెడీ కింగ్ ..నట సమ్రాట్‌ ..ఇలా ఎన్నో బిరుదులు ఆయన్ని వరించాయి. 1980లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్న అక్కినేని...దానికి ముందే పద్మశ్రీ...ఆ తర్వాత పద్మభూషణ్ ..అటు తర్వాత దాదా ఫాల్కే... పద్మవిభూషణ్ ..ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ప్రతీ అవార్డును అందుకున్నారు...మన అక్కినేని, నటన మీద ఉన్న మక్కువ తో 90 ఏళ్ల వయసులో కూడా మనం సినిమాలో నటించటానికి అంగీకరించారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ చిత్రానికి శ్రీకారం చుట్టిన ఆరోగ్యం సహకరించకపోవటం ఆ షూటింగ్‌కు విరామం ప్రకటించారు.. అయితే వెండితెర మీద తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న అక్కినేని తెలుగు ప్రజలను, సినీ అభిమానులను దిగ్‌బ్రాంతికి గురి చూస్తూ తిరిగిరాని లోకాలకు తరళిపోయారు.. పసివయసులోనే నటినిగా మారిన ఆయన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు..

చరణ్ ఎవడు కలెక్షన్లు

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన "ఎవడు" చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకొని, అత్యధిక కలెక్షన్లను రాబడుతోంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, కాజల్ ప్రత్యేక పాత్రలో నటించారు. చెర్రీ సరసన శృతి హాసన్, ఎమి జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. "ఎవడు" చిత్రం కలెక్షన్ల వివరాలు మీకోసం.   Area                            9 days Share( in crores) Nizam                               10.60 Ceded                                 6.82 Nellore                                1.78 Krishna                               2.11 Guntur                                 3.13 Vizag                                   3.98 East Godavari                      2.93 West Godavari                     2.40 Total AP Share                   33.75  

మస్తుగా ఎంజాయ్ చేసిన తారలు

  స్టార్ హీరో, స్టేటస్, పదవి, హొదా అనేవి లేకుండా 80వ దశకంలో సినీతెరకి పరిచయమై, ఆయా ప్రాంతీయ భాషల్లో సినీప్రపంచాన్ని ఏలిన కొంతమంది తారలంతా ఒక్కచోట కలిసారు. తారలు దిగివచ్చిన వేళ అంటే ఇదేనేమో మరి. ఎవరి పనుల్లో వారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆనాటి తారలు ఒక్కదగ్గర చేరి సంతోషంగా గడిపారు. ఈనెల 18న చెన్నైలోని మోహన్ లాల్ ఫామ్ హౌజ్ ఈ వేడుకకి వేదికైంది. ఇందులో భాగంగా రజినీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్, బాలక్రిష్ణ, రాధిక, రమ్యక్రిష్ణ, వెంకటేష్, అర్జున్, భానుచందర్, నరేష్, రాధ, సుహాసిని, సుమలత,సుమన్, మోహన్, రమేష్ అరవింద్, జయరాం, ఖుష్బూ, నదియా, మేనక, సరిత, అంబిక ఇలా 32 మంది సినీప్రముఖులు ఈ పార్టీలో పాల్గొని సందడి చేశారు. వచ్చే ఏడాది మళ్ళీ కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఏడాది కమల్ హాసన్, నాగార్జున వంటి తారలు కూడా హాజరవ్వాలని వీరు అనుకున్నారట. ఇంతమంది తారలు కలిసి ఎంజాయ్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో హాల్ చల్ చేస్తుంది.

ఇంకా పిల్లను చూడలేదు: రెబెల్ స్టార్

  తన నటనతో రెబెల్ స్టార్ గా పేరుతో పాటుగా, అశేష అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు కృష్ణంరాజు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'నేను నటించిన "తాండ్ర పాపారాయుడు", "భక్త కన్నప్ప" వంటి చిత్రాలను అదే క్వాలిటీతో ఇప్పుడు తీయడం దుస్సాహసం. ఈ ఏడాది నుండి మా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ నుంచి ఏకధాటిగా సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. ముందుగా నా దర్శకత్వంలోనే "ఒక్క అడుగు" చిత్రం తెరకెక్కించబోతున్నాను. అవినీతిని పునాదులతో సహా పెకలించేయాలన్నది ఆ చిత్ర ప్రధాన కథాంశం. ఇందులో ప్రభాస్,నేను కలిసి నటిస్తున్నాం. అదే విధంగా కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ కొన్ని చిన్న చిన్న చిత్రాలను కూడా రూపొందించాలానే ఆలోచన ఉంది' అని అన్నారు. ప్రభాస్ గురించి మాట్లాడుతూ... ఓ నటుడికి ఎప్పుడో కానీ రాని అవకాశం ప్రభాస్ కు చాలా త్వరగా "బాహుబలి" చిత్రంతో వచ్చింది. ఈ సినిమా కోసం 2015 వరకు వేచి చూడాల్సిందే. ఆ తర్వాత ప్రభాస్ కు పెళ్లి చేయబోతున్నాం. కానీ ఇంకా అమ్మాయిని చూడటం మొదలు పెట్టలేదు. ప్రభాస్ తో "భక్త కన్నప్ప" సినిమాను నేనే రీమేక్ చేస్తాను" అని అన్నారు.

చైతు ఆటో పాటలు విడుదల

  నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం "ఆటోనగర్ సూర్య". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో విడుదలైంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్లో, మ్యాక్స్ ఇండియా పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దేవాకట్టా దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ... కల నిజమైంది. ఈ సినిమాకోసం భావోద్వేగంతో కూడిన ప్రయాణం చేశాం. ఈ సినిమాతో నాకెలాంటి ప్రశంసలు వచ్చినా కూడా అవి దేవకట్టాకే చెందుతాయి. వరుసగా పది సినిమాలు దేవకట్టాతో చేయమంటే కళ్ళు మూసుకొని పనిచేస్తాను. అంత నమ్మకాన్నిచ్చారు" అని అన్నారు. సమంత మాట్లాడుతూ... కొన్నిసార్లు దేవుడు కష్టాలు ఇస్తాడు. అవన్నీ విజయం విలువ తెలియడానికే. దేవకట్టా ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. ఈరోజు కోసం నేను చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నా. ఈ సినిమాలో కొత్త నాగచైతన్యని చూస్తారు" అని అన్నారు.

చెర్రీకి అక్కడ కూడా ఎక్కువేనంట

  చరణ్ నటించిన "ఎవడు" చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన హీరోయిన్ ఎమిజాక్సన్ చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించడంతో తన సంతోషాన్ని మీడియాతో పంచుకుంది. "చరణ్ తో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చెర్రీతో డాన్సులు చేసే ఛాన్స్ దొరికింది. బాలీవుడ్ లో చరణ్ కు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దర్శకుడు వంశీ నా పాత్రను అద్భుతంగా తెరకెక్కించారు. దిల్ రాజు బ్యానర్లో పనిచేయటం ఎప్పటికి మర్చిపోలేను. ఈ సినిమా విజయం నాలోని కాన్ఫిడెన్స్ ను మరింతగా పెంచింది. ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులందరికీ నా స్పెషల్ థ్యాంక్స్" అని అన్నారు.

అదే పవనిజమంటున్న వైవియస్

  వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేయ్" ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చౌదరి మాట్లాడుతూ... "స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఆదర్శంతో సినిమాల్లోకొచ్చి, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నేను మీలాగే పవన్ అభిమానిని. నా తొలి చిత్రాన్ని ఆయనతోనే చేయాలనుకున్నాను కానీ కుదర్లేదు. నిజాయితీగా నడుచుకోవడం, నిస్వార్థంగా సహాయం చేయడం, ఎంత పెద్దదైనా సాధించగలమనే మనో ధైర్యం పవన్ కళ్యాణ్ లక్షణాలు. అదే హ్యుమనిజం.. అదే పవనిజం. తనకంటూ ఓ బాణీని ఏర్పాటు చేసుకున్న నటుడు పవన్. ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు. తేజ్ చాలా బాగా నటించాడు. చక్రి అద్భుతమైన సంగీతం అందించాడు" అని అన్నారు.

ఎన్టీఆర్‌ 18వ వర్ధంతి

      రాముడైనా ,కృష్ణుడైనా, రావణుడైనా, దుర్యోధనుడైనా వెండి తెర దేవుడిగా తెలుగు ప్రేక్షుకుల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న ఒకే ఒక్క నటుడు నందమూరి తారక రామారావు .నిజమైన దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకో భక్తా అంటే, నువ్వు దేవుడేంటి... మా ఎన్టీవోడు లాగా లేవే అనే స్ధాయిలో ప్రజల హృదయాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్న తెరవేల్పు.. ఎన్టీఆర్. కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయనాయకునిగా తెలుగు సినీ ప్రతిష్ఠని, తెలుగు జాతి గౌరవాన్ని నిలిపిన యుగ పురుషుడు ఎన్.టి.ఆర్. ఈ రోజు ఆ మహానటుని వర్ధంతి సందర్భంగా ఆ తెరవేలుపును ఓ సారి స్మరించుకుందాం..   తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనుభావుడు.. తెలుగువారు అన్నగారు అని పిలుచుకునే ఎన్.టి.ఆర్., 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు . నటనపై ఆసక్తితో సబ్ రిజిష్ట్రార్ ఉద్యోగాన్ని వదులుని మద్రాసు చేరుకున్నారు. ఎల్ .వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ` మనదేశం ` సినిమా తో తొలి సారిగా కెమెరా ముందు కొచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత తెలుగు సినీరంగంలో ఎదురులేని నటుడిగా వెలుగొందారు. ఎన్టీఆర్‌ సినీ జీవితాన్ని మలుపుతిప్పిన సినిమా పాతాలభైరవిఈ  సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ స్టేటస్‌ అందుకున్నాడు ఎన్టీఆర్‌.. ఆ తరువాత వరుసగా మల్లీశ్వరీ పెళ్లిచేసిచూడు, లాంటి సినిమాలతో ఎన్టీఆర్‌ కీర్తీ శిఖర సమానంగా ఎదిగింది.. ఇక ఆ తరువాత వచ్చిన మిస్సమ్మ చిత్రంలో ఎన్టీఆర్‌ నటనకు యావత్‌ ఆంద్ర దేశం దాసోహం అంది. ఎన్టీఆర్‌ నటజీవితంలో మరో మైలు రాయి మాయాబజార్‌.. ఈ సినిమాలో తొలిసారిగా కృష్ణుడిగా కనిపించిన ఎన్టీఆర్‌ ఆ తరువాత ఏకదాటిగా 18 సార్లు అదే పాత్రను ధరించి రికార్డు సృష్టించారు.. ప్రపంచంలో మరె నటుడు ఇలా ఒకే పాత్రను అన్ని సార్లు పొషించి మెప్పించిన దాఖలాలు లేవు.. అది కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమైన అద్భుత విషయం.. పాజిటివ్‌ పాత్రలల్లో ఏ స్థాయిలో మెప్పించారో నెగెటివ్‌ రోల్స్‌లోనూ అదే స్థాయిలో అలరించాడు ఎన్టీఆర్‌.. ముఖ్యంగా రావణాబ్రహ్మ, కీచకుడు లాంటి పాత్రల్లో ఎన్టీఆర్‌ నటన అమోఘం అనిర్వచనీయం.. పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సాంఘీకం. ఇలా ఆయన చేయని జానర్‌ లేదు, ఆయన పోషించని పాత్రాలేదు.. నటునిగా కొనసాగుతున్న సమయంలో ఏడాదికి 10 సినిమాలు రిలీజ్‌ చేస్తూ అభిమానులను అలరించేవారు ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌ నట జీవితంలో మరో మేలి మలుపు లవకుశ.. రామునిలోని వీరత్వం మాత్రమే తెలిసిన ప్రజలకు ఆయనలో దయాగుణం బాధ లాంటి భావాలను కూడా కళ్లకు కట్టినట్టుగా చూపించాడు ఎన్టీఆర్‌.. హుందాగా కనిపించే పాత్రలతోనే కాదు.. బిచ్చగాడిగా, పిచ్చివాడిగా అవిటి వాడిగా ఇలా ఏ పాత్రకైన న్యాయం చేసిన అసలు సిసలు నటుడు ఎన్టీఆర్‌.. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అయ్యాడు.. అంతేకాదు హీరోగా కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే ఓ వృద్ద పాత్రలో నటించి కూడా మెప్పించాడు ఎన్టీఆర్‌.. ఇక దానవీర శూరకర్ణ సినిమాలో దుర్యొధనుడి పాత్రలో ఎన్టీఆర్‌ నటనకు మరెవరు సాటి రారనే చెప్పాలి... అంతలా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది ఆ పాత్ర.. భారత ఇతిహాస, చారిత్రక పాత్రల్లో ఎవరూ పోషించనన్ని పాత్రలను వెండితెరపై ఆవిష్కరించారు ఎన్.టి.ఆర్. బహుశా ఆయన పోషించని పాత్రలు వేళ్లపైనే లెక్కపెట్టవచ్చు. సాంఘిక చిత్రాల్లోనూ సినిమా సినిమాకు తన వేషధారణలో మార్పును చూపెట్టేవారు. ఇంకా చెప్పాలంటే సినిమాకో అవతారం ఎత్తేవారు. అందుకే.. ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో సుస్థిరస్థానం ఏర్పాటు చేసుకోగలిగారు. వెండితెర మీదను కాదు రాజకీయల్లోనూ తనదైన ముద్రను వేశారు ఎన్టీఆర్‌..  పార్టీని స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే కాంగ్రెస్‌ పార్టీ లాంటి జాతీయ పార్టీని మట్టి కరిపించి తెలుగు వాడి సత్తా ఏంటో నిరూపించారు. తెలుగు ఆత్మగౌరవ నినాదంతో ప్రజలకు ముందుకు వచ్చిన ఎన్టీఆర్‌కు ఆ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. అఖండ విజయం కట్టబెట్టారు.. అందుకే తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు మాట వినబడుతున్నంతకాలం.. తెలుగు పదం బతికున్నంత కాలం ఎన్టీఆర్‌ అనే పేరు ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.. అదే ఎన్టీఆర్‌ అన్న మాటకు ఉన్న పవర్‌..

రేయ్ కోసం పవన్ అభిమానులు

  సాయిధరమ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "రేయ్" చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో విడుదల కాబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్నాడు. అయితే మాములుగా పవన్ వస్తున్నాడు అంటేనే అంచనాలు ఒక రేంజులో ఉంటాయి. కానీ పవన్ మూడో పెళ్లి చేసుకున్నాడు అనే వార్తలు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తన ఫ్యామిలీకి సంబంధించిన కార్యక్రమానికి విచ్చేస్తున్నాడు అని తెలియడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ కార్యక్రమంలోనైన పవన్ తన మూడో పెళ్లి గురించి మాట్లాడుతాడేమోనని అందరు ఎదురుచూస్తున్నారు.

సుచిత్ర సేన్ కన్నుమూత

  ప్రముఖ బెంగాలి నటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సుచిత్రాసేన్ (82) (మూన్ మూన్ సేన్ తల్లి) ఈరోజు ఉదయం కోల్‌కతాలోని బెల్లే వ్యూ ఆసుపత్రిలో మరణించారు. ఆమె గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈనెల 3నుండి ఆమె పరిస్థితి మరింత విషమించడంతో ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్ లోకి మార్చి వైద్యం అందిస్తున్నారు. కానీ ఆమెకోలుకోలేకపోయారు. ఆమె కుమార్తె మరియు మనుమరాళ్ళు అందరూ పక్కన ఉండగానే ఆమె కనుమూసారు. (పాత)దేవదాసు సినిమాలో ఆమె నటనకు ఉత్తమనటి అవార్డు అందుకొన్నారు. బెంగాలీ సినిమాలలో ఆమెకు ఒక ప్రత్యెక స్థానం, గౌరవం ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెను అత్యంత ప్రతిష్టాత్మకమయిన ‘వంగ విభేషణ్’ బిరుదుతో సత్కరించింది.

ఉదయ్ సభలో విషిత కన్నీరు

  నటుడు ఉదయ్ కిరణ్ ఇటీవలే ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఉదయ్ సంస్మరణ సభ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ సభకు ఉదయ్ భార్య విషిత, అక్కాబావలు శ్రీదేవి, ప్రసన్న, తండ్రి మూర్తి, ఉదయ్ మేనేజర్ మున్నాలు హాజరయ్యారు. ఈ సభలో విషిత మాట్లాడుతూ... ఉదయ్ నా ఊపిరి. ఆయన లేడనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. అంటూ విషిత ఒక్కసారిగా కన్నీటి పర్యంతమవ్వడంతో అక్కడున్నవారి హృదయాలను మరింత కలచివేసింది. రేపు ఎలా గడుస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. బాధలో ఉన్న తనకు తన వదిన శ్రీదేవి ఎంతో మోరల్ సపోర్ట్ అందించారని, కానీ రేపు ఆమె కూడా వెళ్ళిపోతున్నారని విశిత బాధపడింది. ఉదయ్ అంతిమ యాత్రలో పాల్గొన్న అభిమానులకు ఈ సందర్భంగా ఆమె కృతఙ్ఞతలు తెలిపారు.

దిల్ రాజుకీ, మహేష్‌కీ క్లాష్?

      ‘1.. నేనొక్కడినే’, ‘ఎవడు’ సినిమాల రిలీజ్ సంగతేమోగానీ, ఈ సినిమాల రిలీజ్ పుణ్యమా అని స్టార్ హీరో మహేష్‌బాబు, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మధ్య క్లాష్ ఏర్పడింది. మహేష్‌బాబు హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. మహేష్ కూడా దిల్ రాజు నిర్మాణంలో నటించడానికి ఆసక్తిగా వున్నాడు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు కూడా ఆమధ్య ముమ్మరంగా జరిగాయి. అయితే ఇద్దరికీ లేటెస్ట్‌ గా క్లాష్‌ వచ్చింది. దీనికి కారణం వీరిద్దరి సినిమాలే.   మహేష్ నటించిన ‘1’, దిల్ రాజు నిర్మించిన ‘ఎవడు’ సినిమాలు రెండు రోజుల తేడాతో ఈమధ్య విడుదలైన విషయం తెలిసిందే. రెండు భారీ సినిమాలు రెండు రోజుల తేడాతో విడుదల కావడం సినిమా వ్యాపార సూత్రాల రీత్యా సరైన పద్ధతి కాదు. రెండు సినిమాలు ఒకదానితో మరొకటి పోటీపడి రెండు సినిమాలూ నష్టపోయే ప్రమాదం వుంది. రెండు సినిమాలూ బాగున్నా రెండిటికీ కలెక్షన్లు రావు. ఒక సినిమా బాగుండి రెండో సినిమా బాగా లేకపోతే బాగాలేని సినిమా నిర్మాత నిలువునా ఆరిపోయే ప్రమాదం వుంది.  ఆ ప్రమాదాన్ని ఆపాలన్న ఉద్దేశంతో మహేష్‌బాబు దిల్ రాజుని ‘ఎవడు’ సినిమా విడుదలను రెండు వారాలపాటు వాయిదా వేసుకోవాలని కోరాడని సినీ వర్గాల సమాచారం. ఎలాగూ తనతో సినిమా తీయడానికి దిల్ రాజు ఉత్సాహం చూపిస్తున్నాడు కాబట్టి తాను అడిగినదానికి దిల్ రాజు ఒప్పకుంటాడని మహేష్ భావించాడు. అయితే దిల్ రాజు మాత్రం చాలా కూల్‌గా అలా కుదరదని చెప్పేశాడు. తన సినిమా విడుదల ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, ఇంకా వాయిదా వేసే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని మహేష్‌కి నిర్మొహమాటంగా చెప్పేశాడు. దాంతో మహేష్ ఇలా అయితే నేను నీతో సినిమా చేసే విషయాన్ని పునరాలోచించుకోవాల్సి వస్తుందని చెప్పాడట.  నీతో సినిమా లేకపోతే పాయె నేను మాత్రం ‘1’కి పోటీగా ‘ఎవడు’ రిలీజ్ చేయడం ఖాయమని చెప్పేశాడు. అన్నట్టుగానే ఆ సినిమాకి పోటీగా ఈ సినిమాని రిలీజ్ చేశాడు. టోటల్‌గా జరిగిందేమిటంటే, ‘1’ సినిమా మీద ‘ఎవడు’ సినిమా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇది మహేష్ బాబుకి మరింత ఆగ్రహాన్ని తెప్పించినట్టు సమాచారం.

చక్కనయ్య చిక్కిపోయాడు!

      చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. అయితే ఈ సామెత మాత్రం చక్కనయ్యలకి వర్తించదని ఇప్పుడు రాష్ట్రంలో తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ అర్థమవుతోంది. చక్కనయ్య చిక్కితే ఉన్న అందం కూడా పోగొట్టుకుంటాడని నిరూపణ అయింది. ఇంతకీ ఆ చిక్కిన చక్కనయ్య ఎవరయ్యా అంటే, ఇంకెవరయ్యా.. సూపర్‌స్టార్ మహేష్‌బాబు! ఈమధ్యకాలంలో టాలీవుడ్‌ కుర్ర హీరోలకి సిక్స్ ప్యాక్ పిచ్చి బాగా పట్టుకుంది. ఎవరుబడితే వాళ్ళు సిక్స్ ప్యాక్ చేసిపారేస్తున్నారు. చివరికి హీరోగా మారిన కమెడియన్ సునీల్ కూడా సిక్స్ ప్యాక్ చేసేశాడు. మహేష్‌బాబు బావ, చిన్నసైజు హీరో అయిన ..... కూడా ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాడు. అయితే అది సిక్స్ ప్యాక్‌లా కాకుండా ముక్కలు చెక్కలుగా ‘టెన్ ప్యాక్’లా కనిపించింది.. అది వేరే సంగతి!   ఇలా ఎవడు పడితే వాడు సిక్స్ ప్యాక్ చేసేస్తున్నాడు.. మా హీరో మాత్రం సిక్స్ ప్యాక్ చేయడం లేదన్న బాధ మహేష్ బాబు అభిమానుల్లో వుండేది. మహేష్‌కి కూడా ఆ ఫీలింగే కలిగినట్టుంది. ‘1’ (నేనొక్కడినే) సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాడు. ఏం సిక్స్ ప్యాకో ఏంటో గానీ, ఆ ఎక్సర్‌సైజులూ వాటి వల్లనేమోగానీ, మహేష్ బాబు ముఖం టూమచ్‌గా చిక్కిపోయింది. ‘1‘ సినిమాలో మహేష్‌ సిక్స్ ప్యాక్‌ని చూపించీ చూపించకుండా చూపించి వదిలేశారు. అయితే పీక్కుపోయిన మహేష్ ముఖాన్ని చూడలేక ప్రేక్షకులు విలవిలలాడిపోయారు. ముఖ్యంగా మహేష్‌ని ఆరాధించే ఆడపిల్లలయితే మనసు కష్టపెట్టుకున్నారు. ఈ ఆవేదనని అర్థం చేసుకున్నట్టున్నాడు అందుకే మహేష్‌బాబు ఈ పాయంట్ మీద తన వివరణ ఇచ్చాడు. సిక్స్ ప్యాక్ చేయడం వల్ల ఈ సినిమాలో తన ముఖం బాగా పీక్కుపోయినట్టు కనిపిస్తోందని తానే చెప్పాడు. అంటే సినిమాకి వెళ్ళబోయేవాళ్ళు తన ఫేస్‌ని చూసి ఫీలవకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇలా చెప్పాడన్నమాట. ఈ ముందు జాగ్రత్త ఏదో సిక్స్ ప్యాక్ చేయకముందు వున్నట్టయితే చిక్కిపోయిన చక్కనయ్యని చూడాల్సిన పరిస్థితి తెలుగు ప్రేక్షకులకు వచ్చేది కాదు కదా?!

పాపం ‘1’ నిర్మాతలు!

      మహేష్‌బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ‘1’ (నేనొక్కడినే) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా గురించి ‘బోల్తాకొట్టింది’ అనే మాటను ఉపయోగించడానికి బాధగా వున్నా, ఈ సినిమా ఎందుకు తీశారో అర్థంకాక అయోమయానికి గురవుతున్న ప్రేక్షకులను చూశాక ఇలాంటి ఘాటు పదాలు పడటం న్యాయమే అనిపిస్తోంది. పైగా ఈ విషయాన్ని ఇప్పుడు కొత్తగా అంటున్నదేం కాదు. సినిమా మొదటి ఆట పూర్తయిన క్షణం నుంచే ప్రేక్షకులు, మీడియా, సినిమా వర్గాలు ముక్తకంఠంతో అంటున్న మాట ఇది.   భారీ వ్యయంతో సినిమాలు నిర్మించడంలోను, భారీ విజయాలను సాధించడంలోనూ టాలీవుడ్‌లో ‘దూకుడు’ చూపించిన 14 రీల్స్ సంస్థ ప్రస్తుతం సినిమా పరిశ్రమలోని పాకుడు రాళ్ళమీద కాళ్ళు వేసి బోర్లాపడిపోయింది. ప్రస్తుతం బాక్సాఫీసు దగ్గర పాకుతోంది. ‘వన్’ పేరుతో సినిమా తీసి ‘లాస్ట్’ అవడం ఒక విచిత్రం. ఆ విచిత్రానికి నిదర్శనంగా 14 రీల్స్ సంస్థ నిలిచింది. బాక్సాఫీసు దగ్గర సగర్వంగా నిలబడి ‘నేనొక్కడినే’ అని చాటాల్సిన సినిమా నేను థియేటర్లలో కలక్షన్లు వసూలు చేసేది ‘ఒక్క... డేనే’ అనాల్సిన పరిస్థితి వస్తే ఆ సినిమా నిర్మాతల పరిస్థితి ఊహించడానికి వీల్లేకుండా వుంటుంది. ‘1’ సినిమా మీద అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఏ కొద్దిగా బాగున్నా ఎక్కడికో వెళ్ళిపోయేది. అయితే సగటు ప్రేక్షకులకు ఎంతమాత్రం అర్థంకాకుండా వున్న ఈ సినిమా ఎక్కడకు వెళ్ళాలో అక్కడికే వెళ్ళిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   సినిమా రంగాన్ని ప్రస్తుతం నిర్మాతల కొరత కనిపిస్తోంది. సక్సెస్‌ల శాతం బాగా తగ్గిపోయిన సినిమా రంగానికి రావడానికి ఇప్పుడు చాలామంది జంకుతున్నారు. గతంలో వరుసగా సినిమాలు తీసిన సీనియర్ నిర్మాతలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలు తీయడం అంతటి తెలివితక్కువ పని మరొకటి లేదని చేతులు ముడుచుకుని కూర్చున్నారు. కోట్లు గుమ్మరించి రూపాయలు ఏరుకోవాల్సిన రోజులొచ్చేశాయ్. ఇలాంటి స్థితిలో సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తున్న నిర్మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత సినిమా రంగం మీదే వుంది. హీరోలు, దర్శకుల మీద ఆ బాధ్యత మరింత ఎక్కువగా వుంది. హీరోలు, దర్శకుల డామినేషన్ పెరిగిపోయిన ప్రస్తుత ఇండస్ట్రీలో నిర్మాత పరిస్థితి క్యాషియర్ కంటే ఘోరంగా తయారైంది. కోట్లుకు కోట్లకు డబ్బు పెట్టడం మినహా సినిమా నిర్మాణానికి సంబంధించిన ఏ విషయంలోనూ ‘వేలు’ పెట్టడాన్ని స్టార్లు, దర్శకులు సహించలేకపోతున్నారు. ‘1’ సినిమా విషయంలో నిర్మాతలకు ఎన్నో విషయాలలో ఎన్నెన్నో సందేహాలు వచ్చినప్పటికీ, వాటిని అటు హీరో గానీ, ఇటు దర్శకుడు గానీ ఎంతమాత్రం పట్టించుకోకపోవడంతో షూటింగ్ సమయంలో ప్రేక్షకపాత్ర వహించారు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులు లేకపోవడంతో నెత్తీనోరు బాదుకుంటున్నట్టు సమాచారం. పాత రోజుల్లో మూడు గంటలకు పైగా సినిమా నిడివి వుండేది. ప్రస్తుతం ఏ తెలుగు సినిమా అయినా రెండు గంటల ఇరవై నిమిషాల కంటే పది క్షణాలు ఎక్కువైనా ప్రేక్షకులు భరించలేరని అందరూ భావిస్తూ వుంటారు. ఇలాంటి టైమ్‌లో ‘1’ సినిమా ఏకంగా మూడు గంటల పాటు సా....గి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. ఈ సినిమాని నిర్మించిన సంస్థ పేరులోనే ‘14 రీల్స్’ అని వుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా దర్శకుడు సుకుమార్ 18 రీళ్ళ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ సినిమా నిడివి విషయంలో మొదటి నుంచీ నిర్మాతలు అనుమానాలు వ్యక్తం చేసినట్టు సమాచారం. సినిమా నిడివి తగ్గించు మహాప్రభో అని దర్శకుడు సుకుమార్ దగ్గర ఎంత మొత్తుకున్నప్పటికీ హీరో మహేష్ దగ్గర మాంఛి పలుకుబడి వున్న దర్శకుడు నిర్మాతల మాటని ఎంతమాత్రం ఖాతరు చేయలేదని, సినిమా నిడివి ఒక్క నిమిషం కూడా తగ్గించలేదని తెలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు దూరం కావడానికి నిడివి కూడా ప్రధాన కారణమని సినిమారంగ వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. సినిమా విడుదలైన తర్వాత దర్శకుడికి జ్ఞానోదయమై 20 నిమిషాల నిడివి తగ్గించినా అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. ముల్లు వెళ్ళి ఆకు మీద పడినా, ఆకు వెళ్ళి ముల్లుకు తగిలినా చివరికి ఆకే డ్యామేజ్ అయిపోతుందన్నట్టు పొరపాటు ఎవరిదైనప్పటికీ నష్టం మాత్రం నిర్మాతలు అనుభవించాల్సి వస్తోంది. ఈ సినిమా అపజయం కారణంగా నిర్మాతలు ఆర్థికంగా భారీ స్థాయిలో  నష్టాలు మూటగట్టుకోవడం తప్పదని సినిమా వ్యాపారవర్గాలు అంటున్నాయి.