పైరసీ చేస్తే తాటతీస్తాం!
posted on Apr 3, 2014 @ 4:31PM
ఈనెల 4న మోహన్‌బాబు ‘రౌడీ’ విడుదలవుతోంది. 11న అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ విడుదలకానుంది. జనాల్లో బాగా క్రేజ్ వున్న ఈ రెండు సినిమాలను పైరసీ చేసేయాలని పైరసీదారులు ఉవ్విళ్ళూరుతున్నారు. అలాంటి వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సినిమాలను పైరసీ చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తోంది. '
ఈ విషయమై గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు సినిమాల కాపీరైట్ హక్కులు ఫిలింఛాంబర్‌కే చెంది వున్నాయి. ఈ సినిమాల పూర్తి నిడివి వీడియో గానీ, కొద్ది భాగాలు ఎవరైనా వెబ్ సైట్స్ లో పెడితే వాళ్ళ సంగతి తేలుస్తామని ఛాంబర్ హెచ్చరిస్తోంది. ఇప్పటికే పైరసీలో బిజీగా వున్న 185 వెబ్ సైట్స్ ని (టొరెంట్స్, ఫోరమ్స్, బ్లాగ్స్, లింకింగ్ సైట్స్)ని మూసేయించడం జరిగిందని, ఇలాంటి ఘనకార్యాలకు పాల్పడే 74 మందిని రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాలలో, విదేశాలలో కూడా అరెస్ట్ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడం జరిగిందని ఛాంబర్ వెల్లడించింది.
పైరసీ కార్యక్రమాలు చేసే వెబ్ సైట్స్ మీద ఫిలిం ఛాంబర్ యాంటీ పైరసీ సెల్ ఒక కన్నేసి వుంచిందని, ఎంతమాత్రం ఓవర్ యాక్షన్ చేసినా సదరు వెబ్ సైట్స్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఫిలిం ఛాంబర్ ఘాటుగా వార్నింగ్ ఇచ్చేసింది. పైరసీని ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.