అలనాటి నటి సూర్యకళ ఇకలేరు!

  పాతతరం నటీమణి సూర్యకళ (80) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సూర్యకళ భరతనాట్యంలో శిక్షణ పొందారు. నటనపై ఆసక్తితో చెన్నై చేరుకున్న సూర్యకళ ‘నా చెల్లెలు’ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. అక్కనేని, అంజలీ దేవి నటించిన ‘సువర్ణ సుందరి’ చిత్రంలో విలనీతో కూడిన పాత్రలో నటించారు. ‘బాల నాగమ్మ’లో ఆమె ధరించిన పాత్రకి మంచి గుర్తింపు లభించింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నటిగా మంచి గుర్తింపు పొందారు సూర్యకళ. తమిళంలో శివాజీగణేశన్ నటించిన ‘అందనాళ్’ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన సూర్యకళ మొత్తం 5 వందలకు పైగా చిత్రాల్లో నటించారు. సూర్యకళ భర్త సెల్వరాజ్ పదేళ్ల క్రితమే మరణించారు. సూర్యకళకు పద్మశ్రీ అనే కూతురు ఉన్నారు. సూర్యకళ అంత్యక్రియలు మంగళవారం చెన్నైలో జరిగాయి.

ఆ కుక్కకి హార్ట్ ఎటాక్ ఖాయం!

  చైనాలో నివసించే ఆ కుక్కకి త్వరలో హార్ట్ ఎటాక్ రావడం ఖాయం. ఎందుకంటే సదరు కుక్కకి సిగరెట్లు తాగడం బాగా అలవాటు అయిపోయింది. విపరీతంగా పొగ తాగితే మనుషులకి హార్ట్ ఎటాక్ వస్తుంది. అలాంటిది ఆఫ్ట్రాల్ కుక్కకి రాదా? చైనాలోని బీజింగ్‌లో ఓ పెంపుడు కుక్కకు పొగ తాగడం టూమచ్‌గా అలవాటు అయిపోయింది. ఈ కుక్కగారికి రెండేళ్ళ వయసున్నప్పటి నుంచి ఆ కుక్క ఓనర్ దీనికి పొగ తాగడం అలవాటు చేశాడు. ఇప్పుడు ఆరేళ్ళ వయసున్న ఈ కుక్క రోజూ నిద్ర పోయేముందు ఒక్క సిగరెట్ తాగి తీరుతుందట. ఒకవేళ సిగరెట్ ఇవ్వకపోతే మొరిగి మొరిగి గోల చేస్తుందట. పైగా ఈ కుక్క ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగదు. కేవలం యూక్సీ బ్రాండ్ సిగరెట్లను మాత్రమే తాగుతుంది. ఈ కుక్కకి సిగరెట్లు తాగడం అలవాటు చేసిన ఓనర్ ఇప్పుడు తల పట్టుకుంటున్నాడు. తన కుక్కకి హార్ట్ ఎటాక్ వస్తుందేమోనని భయపడిపోతున్నాడు.

అలియాభట్‌ బతికిపోయింది!

  బాలీవుడ్ హీరోయిన్‌, దర్శకుడు మహేష్ భట్ ముద్దుల కూతురు అలియాభట్‌కి భూమ్మీద నూకలున్నాయి. అందుకే కారు ప్రమాదం నుంచి తప్పించుకుంది. తన సహనటుడు వరుణ్ ధవన్‌తో కలిసి అలియాభట్‌ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఓ పోలీసు అధికారి కారు ఢీకొంది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు మాత్రం కాలేదు. తాము తాజాగా నటించిన 'హంప్టీ శర్మా కీ దుల్హనియా' చిత్రం ప్రమోషన్ కోసం అహ్మదాబాద్ వెళ్లిన ఆలియా, వరుణ్ ఎయిర్ పోర్టు నుంచి వెళ్తుండగా వెనకనుంచి వచ్చిన ఓ పోలీసు అధికారి కారు వీరి కారుని ఢీకొట్టింది. దాంతో కారు వెనుక అద్దం పూర్తిగా బద్దలైపోయింది. గాజు ముక్కలు వెనక సీట్లో కూడా పడ్డాయి. అయితే పోలీసు అధికారి వాహనం చివరి క్షణంలో వేగాన్ని అదుపు చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది.

అమ్జాద్ అలీఖాన్ సరోద్ గాయబ్!

  ప్రముఖ భారతీయ సరోద్ విద్వాంసుడు, పద్మవిభూషణ్ ఉస్తాద్ అమ్జాద్ అలీఖాన్ గురించి తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన సరోద్ వాయిద్యాన్ని చేత పట్టి రాగాలు పలికిస్తూ వుంటే తన్మయులు కానివారెవరైనా వుంటే వారిని వినికిడి లోపం వున్నవారిగా పరిగణించవచ్చు. గత 45 సంవత్సరాలుగా ఆయన ఒకే సరోద్ వాయిద్యం మీద ఆయన రాగాలు పలికిస్తున్నారు. ఆయనకు బాగా ఇష్టమైన సరోద్ అది. అయితే ఇప్పుడు ఆ సరోద్ ఆయన దగ్గర లేదు. ఎందుకంటే తాజాగా లండన్‌లో సరోద్ కచేరీ ఇచ్చిన ఆయన లండన్ ఎయిర్‌లైన్స్.కి చెందిన విమానంలో ఢిల్లీకి తిరిగి వస్తున్నారు. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని.. అమూల్యమైన ఆ సరోద్‌ని లండన్ ఎయిర్ లైన్స్ సిబ్బంది ఎక్కడో పారేశారు. ఉస్తాద్ అమ్జాద్ అలీఖాన్ లండన్ నుంచి భార్యతో కలసి వచ్చారు. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్.లో దిగిన తర్వాత లగేజీని సరిచూసుకుంటే సరోద్ వుండే పెట్టె కనిపించలేదు. దాంతో ఆయనకి, ఆయన భార్యకి గుండెలు ఆగినంత పనైంది. అమూల్యమైన సరోద్ కనిపించకపోవడంతో ఉస్తాద్ సాబ్ దిగులుపెట్టేసుకున్నారు. దాదాపు 5 గంటల పాటు ఎయిర్‌ పోర్ట్ అంతా తిరిగి పనికొచ్చేవాడిని, పనికిమాలినవాడిని అందరిని తన సరోద్ బాక్స్ ఎక్కడైనా కనిపించిందా అని ఆయన అడిగారు. ఎవర్నడిగినా సమాధానం దొరకలేదు. సరోద్ పారేసిన బ్రిటీష్ ఎయిర్‌‌లైన్స్ గాడిదలయితే సరోదా.. అంటే ఏంటి అని ప్రశ్నించారు. వారికి సరోద్ అంటే ఏంటో వివరిస్తే, మాకు తెలియదని పెదవులు విరిచేశారట. ఆ తర్వాత తాపీగా అలాంటి వస్తువేదైనా మేం లండన్‌లో మరచిపోయి వుంటే రేపటి విమానంలో వచ్చే అవకాశం వుందని కూల్‌గా చెప్పారట. తన సరోద్ విషయంలో బ్రిటీష్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అమ్జాద్ అలీఖాన్ వాపోతున్నారు. 45 ఏళ్ళుగా తన శరీరంలో ఒక భాగంగా వున్న సరోద్ తనకు కనిపించకపోయసరికి తాను తన శరీరంలో భాగాన్ని కోల్పోయినట్టుగా భావిస్తున్నానని ఆయన అంటున్నారు.

‘ఆటోనగర్ సూర్య’ తోక కట్!

‘మనం’ విజయంతో మాంఛి ఊపులో వున్న అక్కినేని నాగచైతన్య సినిమా ‘‘ఆటోనగర్ సూర్య' శుక్రవారం విడుదలైంది. ‘మనం’ సాధించిన విజయం ముందు ‘ఆటోనగర్ సూర్య’ సాధించిన ఫలితం తేలిపోయినట్టు వుందన్న అభిప్రాయాలు ప్రేక్షకులలో, ట్రేడ్ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌‍లో అనవసర సన్నివేశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయ పడటంతో వెంటనే దర్శక నిర్మాతలు మేలుకుని నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సినిమా సెకండాఫ్‌లో ఎక్కువగా వుండటంతోపాటు అనవసరంగా భావించిన కొన్ని సీన్లు కట్ చేసి 12 నిమిషాల నిడివి తగ్గించారు. శనివారం నుంచి ట్రిమ్ చేసిన సినిమానే అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు దేవా కట్టా చెబుతూ, ‘‘ఈ సినిమా నిడివి ఎక్కువైందనే అభిప్రాయం వెలువడటంతో, ద్వితీయార్థంలో 12 నిమిషాలు ట్రిమ్ చేశాం. నిడివి తగ్గింది కాబట్టి, సినిమా స్పీడ్ పెరుగుతుంది. ట్రిమ్ చేసిన వెర్షన్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు.

ఆటోనగర్ సూర్య: షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ

  తారాగణం: అక్కినేని నాగచైతన్య, సమంత, సాయికుమార్, జె.పి., భరణి, బ్రహ్మానందం, వేణుమాధవ్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్రీకాంత్, నిర్మాత: కె. అచ్చిరెడ్డి, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా. ‘మనం’ సినిమా అందించిన విజయం తర్వాత ఆ ఉత్సాహంతో నాగచైతన్య, సమంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎప్పటి నుంచో విడుదలవుతానని ఊరిస్తు్న్న ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ఎట్టకేలకు శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికొస్తే, కథానాయకు సూర్య చిన్నప్పుడు ఒక రైలు ప్రయాణం సందర్భంగా తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. అతన్ని మేనమామ (సాయికుమార్) కూడా ఆదరించడు. దాంతో సూర్య ఆటోనగర్‌లోని ఓ మెకానిక్ దగ్గర పెరుగుతాడు. తన తల్లిదండ్రుల మరణానికి కారణమైన మేయర్‌ మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేయడం, ఆటోనగర్‌లో అక్రమాలను ఎదిరించే ప్రయత్నం చేయడంతో సూర్య పదహారేళ్ళ వయసులోనే జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత సూర్య జీవితంలోకి ఎవరెవరు ప్రవేశిస్తారు? అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అతని తల్లిదండ్రులు ఎందుకు హత్యకు గురయ్యారు? సూర్య చివరికి తాను అనుకున్నది సాధించగలిగాడా అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నాగచైతన్య యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా నటించాడు. ప్రశంసనీయమైన నటన ప్రదర్శించాడు. ఎప్పటి నుంచో మాస్ ఇమేజ్ కోసం తపిస్తున్న నాగచైతన్య దాహాన్ని ఈ సినిమా కొంతవరకు తీర్చిందని చెప్పవచ్చు. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ద్వారా నాగ చైతన్య మాస్ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. నాగ చైతన్యకు హిట్ పెయిర్ అయిన సమంత ఈ సినిమాలో సూర్య మరదలిగా నటించింది. గ్లామర్ ప్రధానంగా ఈ పాత్ర సాగింది. కొన్ని సన్నివేశాలలో సమంత ప్రశంసనీయమైన నటన ప్రదర్శించింది.‘సురా..సురా’ అంటూ సాగే పాటలో సమంత తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. సమంతకు తండ్రిగా, నాగచైతన్యకు మేనమామగా, యూనియన్ లీడర్‌గా నటించిన సాయికుమార్‌కి ఇలాంటి పాత్రలు కొట్టినపిండి కావడంతో చాలా ఈజ్‌గా పోషించారు. దర్శకత్వం: వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న దేవా కట్టా మరోసారి తనలోని దర్శకుడి మెరుపులను ఈ సినిమాలో మెరిపించారు. ఈ సినిమాకి మాటల రచయిత కూడా తానే అయిన దేవా కట్టా ఆ రంగంలోనూ తనకు ప్రతిభ వున్న విషయాన్ని నిరూపించుకున్నారు. మొత్తమ్మీద యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

గీతికా త్యాగి కేసు: డైరెక్టర్‌కి బెయిల్ మంజూరు

  వెర్సోవాలో ఆత్మ, వాట్ ద ఫిష్, వన్ బై టు సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి గీతికా త్యాగిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ దర్శకుడు సుభాష్ కపూర్ బెయిలుపై విడుదలయ్యారు. డైరక్టర్ సుభాష్ కపూర్ ఆమధ్య వచ్చిన 'జాలీ ఎల్ఎల్‌బీ' చిత్రానికి దర్శకుడు. సుభాష్ కపూర్ తన సన్నిహితుడు ధనీష్ రాజాతో కలిసి 2012 మేలో ముంబైలోని గీతికా త్యాగి నివాసానికి వెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆమె ఏప్రిల్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన గౌరవాన్ని దెబ్బతీసేందుకు సుభాష్ ప్రయత్నించాడంటూ గీతికా త్యాగి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సుభాష్ కపూర్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేసి అంధేరీ కోర్టులో ప్రవేశపెట్టారు. అంధేరీ కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది.

మృత్యువు కూడా వారిని విడదీయలేదు!

  రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన భార్యాభర్తలు ప్రేమలత, శాంతిలాల్ జైన్ ఎంతో అన్యోన్యంగా వుంటారు. వీరిద్దరూ కొంతమంది బంధువులతో కలసి ఢిల్లీ నుంచి గౌహతికి విమానంలో వెళ్తున్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హేమలత తనకు గుండెలో నొప్పిగా వుందని చెప్పింది. పైలెట్ విమానాన్ని అర్జెంటుగా వెనక్కి మళ్ళించి ఢిల్లీలో లాండ్ చేశాడు. బంధువులు ప్రేమలతని హుటాహుటిగా ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అయితే ఆస్పత్రిలో ఆమె మరణించింది. ఆమె మరణించారని వైద్యులు అలా ప్రకటించాలరో లేదో ప్రేమలత భర్త శాంతిలాల్ జైన్ గుండెపోటుతో కుప్పకూలి ప్రాణం వదిలారు. అలాగే రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మరణించిన సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం కుకులూరు వద్ద భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.

సెల్‌ఫోన్ వుందా?.. మీకో గుడ్ న్యూస్!

  మీ దగ్గర సెల్ ఫోన్ వుందా.. ఆ సెల్ ఫోన్‌లో మీరు గంటల తరబడి మాట్లాడుతూ వుంటారా.. పోనీ అప్పుడప్పుడు అయినా మాట్లాడుతూ వుంటారా? సెల్ ఫోన్ రేడియేషన్ కారణంగా అనారోగ్యం కలుగుతుందేమోనని భయపడుతూ వుంటారా? అయితే మీకో గుడ్ న్యూస్.. సెల్ ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఎంతమాత్రం ప్రమాదకరం కాదు.. ఇన్నాళ్ళూ సెల్ ఫోన్ రేడియేషన్ ప్రమాదకరమని అందరూ భావిస్తు్న్నారు. అయితే అలా భయపడాల్సిన అవసరమే లేదని నిపుణులు చెబుతున్నారు. ఇక మనం హాయిగా ఎంతసేపైనా సెల్ ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. సెల్ ఫోన్ నుంచి గానీ, సెల్ టవర్ నుంచి గానీ వెలువడే రేడియేషన్ ప్రమాదాకారి కాదని నిపుణులు తేల్చి చెప్పారు. సెల్ టవర్లు, సెల్ ఫోన్ల రేడియేషన్ వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని, సెల్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ రాదని ప్రకటించారు. అలాగే సెల్ ఫోన్ల ద్వారా గానీ, సెల్ టవర్ల ద్వారా గానీ కేన్సర్ వ్యాధి వచ్చే అవకాశం కూడా లేదని ప్రకటించారు.

వాట్స్ యాప్ పుణ్యమా అని బతికిపోయాడు!

  మనం ఫోన్లలో సొల్లు కబుర్లు మెసేజ్ చేసుకోవడానికి ఉపయోగించే వాట్స్ యాప్ ఒక యువకుడి ప్రాణం కాపాడింది. నమ్మబుద్ధి కావట్లేదా.. ఇది నిజం. ఈ సంఘటన కర్నాటకలో జరిగింది. ఢిల్లీకి చెందిన గౌరవ్ అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ తన ఫ్రెండ్స్‌తో కలసి బెంగుళూరుకు దగ్గర్లోని మధుగిరి హిల్స్ దగ్గరకి పర్వతారోహణ కోసం వెళ్ళాడు. తనతోపాటు వచ్చినవారు మర్నాటి నుంచి పర్వతారోహణ చేయాలని అనుకుంటే, గౌరవ్ మాత్రం తాను ఒక్కడినే వెళ్ళి కొండ ఎక్కుతానంటూ బయల్దేరాడు. గౌరవ్ పర్వతారోహణ చేస్తూ వుండగా పట్టుతప్పిపోయి ఒక లోయలో పడిపోయి స్పృహతప్పిపోయాడు. పర్వతారోహణ చేసి వస్తానని చెప్పిన గౌరవ్ ఎంతసేపటికీ తిరిగి రాకపోయేసరి అతని ఫ్రెండ్స్.కి భయం వేసింది. గౌరవ్ ఏ ప్రాంతంలో పర్వతారోహణ చేయడానికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. గౌరవ్ కోసం ఫోన్ చేసిన అతని ఫ్రెండ్స్‌కి ఫోన్ అందుబాటులో లేదని మెసేజ్ వస్తోంది. అప్పుడు వాట్స్ యాప్ ద్వారా గౌరవ్ ఫోన్ ఏ లొకేషన్‌లో వుందో కనుక్కుని అక్కడకి వెళ్ళి వెతికితే ఒక లోయలో గౌరవ్ కనిపించాడు. సమయానికి అతన్ని కాపాడి ఆస్పత్రిలో చేరిస్తే బతికి బయటపడ్డాడు. గౌరవ్ ఫోన్‌లో వాట్స్ యాప్ లేకపోతే గౌరవ్ ఈసరికి ప్రాణాలు కోల్పోయేవాడే!

షార్ట్ ఫిలిం విజేతకు చెక్ ప్రదానం చేసిన రవిశంకర్ కంఠమనేని

  ఇప్పుడు షార్ట్ ఫిలిం యుగం నడుస్తోంది. షార్ట్ ఫిలిమ్స్ రూపకర్తలు మెయిన్ స్ట్రీమ్ సినిమా దర్శకులుగా ఎదుగుతున్నారు. దర్శకులు కావాలని కృషి చేస్తున్న ఎంతోమంది ప్రతిభకు కొలమానంగా షార్ట్ ఫిలిమ్స్ నిలుస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన తెలుగువన్‌ షార్ట్ ఫిలిం దర్శకులను ప్రోత్సహిస్తోంది. తెలుగువన్ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకున్న అనేకమంది యువతీయువకులు అద్భుతమైన షార్ట్ ఫిలిమ్స్.ని రూపొందించి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. తెలుగువన్ అందించిన షార్ట్ ఫిలిం అవకాశం మెట్టు ఎక్కిన చాలామంది తమ ప్రతిభతో మరిన్ని మెట్లు ఎక్కి సినిమా రంగానికి చేరువయ్యారు కూడా. షార్ట్ ఫిలిం దర్శకులను ప్రోత్సహించడంలో భాగంగా తెలుగువన్ నెలనెలా ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శకుడికి పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 16 ఏప్రిల్ నుంచి 15 మే వరకు తెలుగువన్ ప్రోత్సాహంతో రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్.లో పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘ఐ మిస్ హర్’ షార్ట్ ఫిలిం ఉత్తమ షార్ట్ ఫిలింగా ఎంపికయింది. ఈ షార్ట్ ఫిలిం రూపొందించిన ఉత్తమ దర్శకుడు పవన్ కుమార్‌కి తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ రవిశంకర్ కంఠమనేని పదివేల రూపాయల చెక్‌ని ఇచ్చి ప్రోత్సహించారు. షార్ట్ ఫిలిం రూపకర్తలకు తెలుగువన్ అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకుని మరిన్ని ఉత్తమ షార్ట్ ఫిలింలను రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.

పిల్లల్ని కనే తీరిక లేదు: విద్యాబాలన్

  బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌కి నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో పెళ్ళయి రెండేళ్ళవుతుంది. ఇంతవరకు ఆమె కడుపులో నలుసు పడలేదు. ఈమధ్యకాలంలో విద్యాబాలన్ కడుపులో నలుసు పడిందని, త్వరలో ఆమె తాను గర్భిణిని అన్న విషయం బహిరంగంగా ప్రకటిస్తుందన్న రూమర్లు వచ్చాయి. ఇలా రూమర్లు వస్తూ వుండటంతో విద్యాబాలన్ దంపతులకు సన్నిహితులైన చాలామంది విద్యాబాలన్‌కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నారట. అబ్బాయి పుడితే ఏ పేరుపెడతావ్... అమ్మాయి పుడితే ఏ పేరు పెడతావ్ అని ప్రశ్నలతో వేధిస్తున్నారట. ఆలులేదు.. చూలు లేదు కొడుకుపేరు... అన్నట్టుగా తనకు వస్తున్న ఫోన్ కాల్స్.ని తట్టుకోలేక విద్యాబాలన్ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన వివరణ ఇచ్చేసింది. తాను ప్రస్తుతం గర్భిణిని కాదని, ప్రస్తుతం తనకు గర్భం ధరించే ఆలోచన గానీ, పిల్లల్ని కనే తీరిక గానీ లేదని చెప్పింది. ఏవిటో... ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలంటారు.. విద్యాబాలన్‌కి పెళ్ళి ముచ్చట లేటుగానే తీరింది. పిల్లల ముచ్చట తీరడానికి ఇంకా ఎంత లేటవుతుందో ఏం పాడో.. అయినా మనకెందుకులే!

‘అంజాన్’తో 150కోట్లపై కన్నేసిన సూర్య

    బాలీవుడ్‌ సినిమా మార్కెట్ 100 కోట్ల క్లబ్‌ను దాటి.. 300కోట్ల క్లబ్‌లో ఎప్పుడో చేరిపోయింది. ఇప్పుడు అక్కడ చిన్న సినిమాకి హిట్ టాక్ వస్తే చాలు 100 కోట్ల సినిమా క్లబ్ లో ఈజీగా చేరిపోతుంది. బాలీవుడ్ తరువాత 100 కోట్లను టచ్ చేసిన సినిమాలు తమిళ్ లోనే వున్నాయి. లేటెస్ట్ గా హీరో సూర్య తన ‘అంజాన్’ చిత్రంతో 150కోట్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాదీ అంతటా పాపులారీటి వున్న హీరోలలో ఒకరు సూర్య. ఆయన చిత్రాలు తమళంతో పాటు తెలుగులోను క్రేజ్ ఎక్కువే. ఇప్పుడు ఆయన చేస్తున్న ‘అంజాన్’ చిత్రం 150కోట్లను క్రాస్ చేస్తుందని ఆ చిత్ర నిర్మాతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ బాషాలలో ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి సంగీతం యువన్ రాజా అందిస్తున్నారు.

‘ఆటోనగర్ సూర్య’ విడుదలకు సమస్య!

  నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘మనం’ సినిమా ఈమధ్య విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో వీరిద్దరు కలసి నటించిన మరో చిత్రం ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం మీద ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాని ఈనెల 27న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఒక ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించారు. తాను ఈ సినిమా కోసం రెండు కోట్లు రుణం ఇచ్చారని, తన రుణం తీర్చకుండానే సినిమాని విడుదల చేస్తున్నారంటూ గుంటూరుకు చెందిన ఒక ఫైనాన్షియర్ కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు ఈ సినిమాని జులై 10వ తేదీ వరకు విడుదల చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో మరోసారి ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం విడుదలకు అవరోధాలు ఏర్పడ్డాయి.

‘ఊహలు గుసగుసలాడే’ బుజ్జి రివ్యూ!

   బ్యానర్: వారాహిచలనచిత్రం, నటీనటులు: నాగశౌర్య, రాశి ఖన్నా, నిర్మాత: సాయి కొర్రపాటి, దర్శకత్వం: శ్రీని అవసరాల. ఇది ముగ్గురు వ్యక్తుల కథ. నాగశౌర్య (న్యూస్ రీడర్), శ్రీని అవసరాల (టీవీ ఛానల్ ఓనర్), రాశీ ఖన్నా (డెంటిస్ట్) వీరే ఆ ముగ్గురు వ్యక్తులు. నాగ శౌర్య రాశీ ఖన్నాని చూసీ చూడగానే లవ్వులో పడిపోతాడు. అయితే నాగ శౌర్య ప్రేమ ప్రతిపాదనని రాశీ ఖన్నా చెత్తబుట్టలో పారేస్తుంది. దాంతో ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నాగ శౌర్య శ్రీని అవసరాల ఓనర్ అయిన టీవీ ఛానల్లో న్యూస్ రీడర్‌గా చేరతాడు. పెళ్ళీడు వచ్చిన శ్రీని అవసరాల తనకు నచ్చే అమ్మాయి కోసం వెతుకుతూ వుంటాడు. ఒక సందర్భంలో రాశీ ఖన్నా ఫొటో చూసి అతను కూడా లవ్వులో పడిపోతాడు. ఆమెనే పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయిపోతాడు. ఆ తర్వాత ఈ ముగ్గురి మధ్య ఎలాంటి డ్రామా జరిగిందనేది ఈ సినిమా కథ. కామెడీ, రొమాన్స్ సమపాళ్ళలో కలసిన సినిమా ఇది. పాత తరహా కథతో రూపొందిన సినిమా అయినా కథనం కొత్తగా వుంటుంది. సినిమా చూస్తున్నంతసేపూ ఫ్రెష్ సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నాగ శౌర్య నటుడిగా మంచి మార్కులనే సంపాదించుకున్నాడు. అతనికి ఈ సినిమా శుభారంభాన్ని ఇచ్చింది. ఇక కథానాయిక రాశీ ఖన్నా ఈ సినిమాలో చాలా ప్రాధాన్యం వున్న కథానాయిక పాత్ర ధరించింది. ముద్దుముద్దుగా కనిపిస్తూ చక్కని నటన ప్రదర్శించింది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా కూడా మారిన అవసరాల శ్రీనివాస్ తనదగ్గర విషయం వుందని నిరూపించుకున్నాడు. నిర్మాణ విలువలతో చిత్రాలను రూపొందించే వారాహి సంస్థ తమ స్థాయిలోనే ఈ సినిమాని నిర్మించింది.

అద్దె గర్భం ద్వారా మంచు లక్ష్మికి అమ్మతనం!

  ఇటీవలి కాలంలో చాలామంది అద్దె గర్భం ద్వారా (సరోగసి) మాతృత్వ మధురిమలు పొందుతున్నారు. ఈ జాబితాలో ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మి కూడా చేరారు. ఈమధ్యకాలంలో ట్విట్టర్‌లో యాక్టివ్‌గా వున్న మోహన్ బాబు శనివారం నాడు ‘‘రేపు మధ్నాహ్నం ఓ ముఖ్యమైన విషయాన్ని ప్రకటించబోతున్నా. అది నాకు, నా కుటుంబానికి అది చాలా ఆనందకరమైన వార్త’’ అని ట్విట్ చేయడంలో ఆ వార్త ఏమిటా అన్న ఆసక్తి అందరిలోనూ కలిగింది. ఆదివారం ఉదయం ఆ సస్పెన్స్.ని మంచు కుటుంబమే తొలగించింది. సరోగసి విధానం ద్వారా తన కుమార్తె లక్ష్మి తల్లైనట్టు మోహన్ బాబు అధికారికంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.మరోవైపు మంచు మనోజ్ కుడా ‘‘నా ప్రియమైన సోదరికి సరోగసి ద్వారా అమ్మాయి పుట్టింది. మామగా నాకు ప్రమోషన్ లభించింది’’ అని ట్విటర్ లో ట్వీట్ చేశారు.

‘గోవిందుడు...’ మీద రూమర్లన్నీ అబద్ధాలే!

  రామ్‌చరణ్, కాజల్ జంటగా, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విషయంలో బోలెడన్ని పుకార్లు వచ్చాయి. ఈ సినిమా కథ నచ్చలేదని రామ్‌చరణ్ సినిమా ఆపేశాడని, ఆ తర్వాత ఈ సినిమా కథ మార్చారని, మెగా ఫ్యామిలీ ఇంటర్‌ఫియరెన్స్ వల్ల కృష్ణవంశీ ఇబ్బంది పడుతున్నాడని పుకార్లు వినిపించాయి. ఈ పుకార్లన్నీ పచ్చి అబద్ధాలని నిర్మాత బండ్ల గణేష్ స్పష్టం చేశారు. రామ్ చరణ్‌కి జ్వరం రావడం, ఈ సినిమాలో ప్రధాన పాత్రని ధరిస్తున్న తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ని మార్చడం కారణంగా సినిమా షూటింగ్ ఆగింది తప్పితే మరో కారణమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘గతంలో మా సంస్థ ‘గబ్బర్‌సింగ్’ సినిమా తీస్తున్నప్పుడు ఇలాగే రూమర్లు వ్యాపించాయి. ఆ రూమర్లని అబద్ధాలు చేస్తూ మేము ఘన విజయం సాధించాం. అదే ‘గోవిందుడు అందరివాడేలో’ విషయలో కూడా రిపీట్ అవుతుంది. మొదట మా సినిమాలో ప్రధాన పాత్ర కోసం తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ని తీసుకున్నాం. ఆయనపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించాం. రాజ్‌కిరణ్ అద్భుతంగా నటించారు. అయితే... ఆయన నటన తెలుగు నేటివిటీకి దూరంగా ఉందని అనిపించింది. అందుకే... ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నాం. ఈ చిన్న చిన్న అవాంతరాల కారణంగా చిత్రీకరణలో జాప్యం జరిగింది. అంతేతప్ప ఈ సినిమాని ఆపేయమని చిరంజీవి గారు అన్నారని వచ్చిన వార్తలు రూమర్స్. అసలు చిరంజీవి గారు ఇంతవరకు ఈ సినిమా రషెస్ కూడా చూడలేదు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామానాయుడు సినీ విలేజ్‌లో ప్రత్యేకంగా నిర్మించిన ఇంటి సెట్‌లో జరుగుతోంది.

తెలంగాణా శకుంతల ఇక లేరు

  మహారాష్ట్రలో పుట్టి తెలుగు సినీ పరిశ్రమనే తన స్వంత ఇంటిగా మార్చుకొన్న తెలంగాణా శకుంతల ఇక లేరు. ఆమె శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాదులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ, ఆమె దారిలోనే గుండెపోటు కారణంగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. శకుంతల మాతృబాష మరాటి అయినప్పటికీ ఆమెకు తెలంగాణా మాండలికంపై ఉన్న అసాధాణమయిన పట్టుతో ప్రేక్షకులను మెప్పించి తెలంగాణా శకుంతలగా ప్రసిద్దిగాంచేరు.   తెలుగు ప్రేక్షకులకు మహానటి స్వర్గీయ సూర్యాకాంతం లేని లోటును భర్తీ చేయగల అంతటి సమర్దురాలయిన శకుంతల దొరికినందుకు చాలా సంతోషించారు. కానీ ఆమె కూడా అకస్మాత్తుగా మరణించారు. మరాటి నాటకరంగంలో మంచి నటిగా పేరు తెచ్చుకొన్న ఆమె 1981లో ‘మా భూమి’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి పాండవులు పాండవులు తుమ్మెద (2014) సినిమాలో చివరి సారిగా నటించారు. ఈ మూడు దశాబ్దాలలో ఆమె 70కి పైగా తెలుగు సినిమాలలో నటించారు. ఆమె నటించిన నువ్వు నేను, ఒక్కడు, లక్ష్మి, నీకు నాకు, మా నాన్న చిరంజీవి, రాజన్న వంటి సినిమాలు ఆమె అపూర్వ నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ఆమెకు ఇరువురు కుమారులున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదులో ఆమె అంత్యక్రియలు జరగవచ్చును. తన అద్భుతమయిన నటనతో తెలుగుచిత్ర సీమకు ఒక నిండుదనం తెచ్చిన తెలంగాణా శకుంతల మరిక లేరనే ఈ వార్తను జీర్ణించుకోవడం కష్టమే.