అదే రిపీటవ్వుద్ది.. అయ్యింది
తనకు ఇష్టం లేని పని చేస్తే .. 'మళ్లీ ఇదే రిపీట్ అవ్వుద్ది' అంటూ బద్రీ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ డైలాగ్ కొడతాడు. నిజంగానే మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతోంది, అయ్యింది కూడా. మెగా ఫ్యామిలీ అనేది ఓ పెద్ద కోట అనుకుంటే, ఆ కోటకు నెమ్మదిగా బీటలు వారుతున్నాయన్న వాదనలకు వరుణ్ తేజ్ కొత్త సినిమా లాంచింగ్ కార్యక్రమం మరింత బలాన్నిచ్చింది.
ఇంతకుముందు రాంచరణ్ తేజ్ నటించిన రచ్చ సినిమా ఆడియో ఫంక్షన్ మొత్తమ్మీద ఎక్కడా పవన్ కనిపించలేదు. ఇక నాగేంద్రబాబు కుమారుడు వరుణ్ తేజ్ సినిమా లాంచింగ్ కార్యక్రమానికి పవన్ వచ్చాడన్న మాటే గానీ, ఎందుకొచ్చిందిరా భగవంతుడా అన్నట్లుగా మెట్ల మీద ఒక రకమైన ఫోజు పెట్టుకుని కూర్చున్నాడు. పవన్ వచ్చేటప్పుడు చాలా సందడి కనిపించినా, ఆ తర్వాత చిరంజీవి ఉండగా మాత్రం ఆ సందడి ఎక్కడా కనిపించనే లేదు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలకు కారణం ఏంటనే ప్రశ్నకు అనేక సమాధానాలు ఉంటాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ నాయకులను పరోక్షంగా ఉద్దేశించి.. వాళ్ల పంచెలూడదీసి కొట్టండి అంటూ పవన్ ఆవేశంగా మాట్లాడాడు. ఆ ప్రసంగాలలో వాడి, వేడి పార్టీ కొంతయినా బతికి బట్టకట్టడానికి ఉపయోగపడిందని అంటారు. కానీ అలాంటిది.. తర్వాతి కాలంలో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే విషయంలోనే సోదరులిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం.
ఇక ఆరెంజ్ సినిమా తీసిన తర్వాత నాగేంద్రబాబు ఎంత అప్పుల్లో కూరుకుపోయాడో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ సమయంలో దాదాపుగా ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని నాగబాబు బాధపడుతుంటే, ఎక్కడో విదేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ముందుగా ఫోన్ చేసి, అన్నయ్యా.. నువ్వు కంగారు పడకు, నేనున్నాను. రాగానే అన్నీ చూసుకుంటా అని చెప్పి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చిరంజీవి మాత్రం తన కొడుకు సినిమాయే అయినా.. దాని విషయంలో పెద్దగా పట్టించుకోలేదని.. తాపీగా కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి పర్వాలేదుగా, అంతా బాగానే ఉందిగా అంటూ పొడిపొడిగా మాట్లాడారని అంటారు. ఈ విషయం కూడా మెగా ఫ్యామిలీ ఐక్యతకు కొంత వరకు చేటు చేసింది.
ఇక తర్వాత కూడా రకరకాల కారణాలతో అన్నదమ్ముల మధ్య అంత ఎక్కువ సఖ్యత కనిపించలేదు. తాజాగా వరుణ్ తేజ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హావ భావాలు అందుకు అద్దం పట్టాయనే చెప్పక తప్పదు.