‘జంప్ జిలానీ’ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ
నటీనటులు: అల్లరి నరేష్ (ద్విపాత్రాభినయం), ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి, వేణుమాధవ్, రఘుబాబు, రావు రమేష్, హేమ. సంగీతం: విజయ్, నిర్మాత: అంబికా రాజు, దర్శకత్వం: సత్తిబాబు. టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ నటించిన ‘జంప్ జిలానీ’ బుధవారం విడుదలైంది. అల్లరి నరేష్ తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘హలో బ్రదర్’ సినిమా ఈ సినిమాకి స్ఫూర్తి అనే డౌట్ వచ్చినప్పటికీ ఇది తమిళంలో రూపొందిన ఒక సినిమాకి రీమేక్.
‘సత్యనారాయణ విలాస్’ అనే హోటల్ యజమానికి కవల కొడుకులైన సత్తిబాబు, రాంబాబుల కామెడీ కథ ఈ సినిమా. పాతతరం హోటల్‌ని నేటి పోటీ ప్రపంచంలో ఎలా డెవలప్ చేయాలా అని ఆలోచిస్తూ వుండే వ్యక్తి సత్తిబాబు అయితే, పరమ గాలిబ్యాచ్ రాంబాబు. సినిమా కథ హోటల్ కామెడీలోంచి ప్రేమలోకి మారి, ఆ ప్రేమను సక్సెస్ చేసుకునే ప్రయత్నంలో రాయలసీమ ఫ్యాక్షనిస్టుల మధ్యకి మళ్ళుతుంది. ఫ్యాక్షనిస్టులు సత్తిబాబును వెంటపడి తరుముతూ వుంటారు. వారి నుంచి సత్తిబాబు, రాంబాబు ఎలా తప్పించుకున్నారు. తమ ప్రేమను ఎలా సక్సెస్ చేసుకున్నారు? తమ హోటల్‌ని ఎలా డెవలప్ చేసుకున్నారన్నది ఈ సినిమా కథాంశం.
కామెడీ పాత్రలను ధరించడంలో బాగా ముదిరిపోయిన అల్లరి నరేష్ ఈ సినిమాలో కూడా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్‌గా పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో ఇరగదీశాడు. హీరోయిన్లు ఇద్దరూ అందాల ప్రదర్శనలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. రావు రమేష్ కామెడీతోపాటు విలనీని కూడా ప్రదర్శించే ప్రయత్నించారు. రఘుబాబు, వేణుమాధవ్ పాత్రలకు పెద్దగా సీన్ లేకపోయినా వాళ్ళు కూడా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు.
అలరి నరేష్ సినిమాలకు ప్రేక్షకులు వినోదం కోసం వెళ్తారు తప్పితే విజ్ఞానం కోసం కాదు. లాజిక్కులు వెతికేవారు ఎంజాయ్ చేయలేరేమోగానీ, హాయిగా నవ్వుకుందామని వెళ్ళిన ప్రేక్షకులు మాత్రం తమకు కావలసిన వినోదాన్ని ఈ సినిమా ద్వారా తప్పకుండా పొందుతారు.