విశ్వమంత గీతానికి మూలపురుషుడు!!

భారతీయ సాహిత్యంలో మొట్టమొదటగా నోబెల్ బహుమతి అందుకున్నవారు రవీంద్రనాథ్ టాగోర్. ఈయన రచించిన గీతాంజలి కావ్య గ్రంథానికి నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచ సాహిత్యాన్ని కూడా శాసించగలిగే గొప్ప కవి, నాటక రచయిత, చిత్రాకారుడు రవీంద్రనాథ్ టాగోర్. ఈయన రెండవ అన్నయ్య ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో నియమితుడైన మొట్టమొదటి భారతీయుడిగా పేరు పొందాడు. దీని కారణంగా టాగోర్ గొప్ప కుటుంబానికి చెందినవాడని అర్థమవుతుంది. అయితే టాగోర్ బాల్యం నుండి కాస్త ప్రత్యేకంగానే ఉండేవాడు. ఆయన్ను గొప్ప కవిగా చేసిన సంఘటనలు, ఆయన జీవిత ప్రయాణం తెలిస్తే అందరిలోనూ తెలియని ఉత్సాహం మేల్కొంటుంది. బాల్యం, విద్యాభ్యాసం!! టాగోర్ 1861 సంవత్సరంలో జన్మించాడు. ఈయన చిన్నతనంలో బడికి వెళ్లాలంటే ఆసక్తి చూపించేవాడు కాదు. అలాగని మొద్దబ్బాయి అస్సలు కాదు. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, పెరటిలోకి వెళ్లి ప్రకృతిని చూసి ఆనందపడటం ఇష్టంగా ఉండేది. ఆ తరువాత వ్యాయామం చేయడం. గణితం, చరిత్ర, భూగోళం మొదలైన పాఠ్య పుస్తక విషయాలు నేర్చుకునేవాడు. ఆ తరువాత సాయంత్రం తోటలో తిరుగుతూ ఆంగ్లం నేర్చుకునేవాడు. ఈయనకు చిన్నతనం నుండే కథలు నతే చాలా ఇష్టం ఉండేది. ప్రతి ఆదివారం సంగీతం నేర్చుకునేవాడు. కాళిదాసు, షేక్ష్పియర్ మొదలైన వారి నాటకాలు, గ్రంధాలు ఇష్టంగా చదివేవాడు. ఆయన మాతృభాష అయిన బెంగాలీ మీద ప్రత్యేకంగా ప్రేమను పెంచుకున్నాడు.  ఆంగ్ల సాహిత్యం వైపు ప్రయాణం!! టాగోర్ గారు ఇంగ్లాండ్ లో ఒక పబ్లిక్ స్కూల్ లో చేరి ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు వినేవారు. ఇంకా ఎంతోమంది ఉపన్యాసాలు వినేవాడు. ఎంతోమందితో ఆంగ్లంలోనే సంభాషణలు జరిపేవాడు. ఆంగ్లంలో నాటకం, సంగీత కచేరీలు మొదలైన వాటికి వెళ్లి వాటిని ఎంతో శ్రద్ధగా వింటూ ఆంగ్లం మీద ఆంగ్ల సాహిత్యం మీద పట్టు తెచ్చుకున్నాడు. ఈయన బెంగాలిలో రచించిన ఎన్నో కవితలను ఏర్చి కూర్చి గీతాంజలిగా పేరు పెట్టాడు. దీన్ని  ఆంగ్లంలోకి అనువదించిన తరువాత టాగోర్ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది. శాంతినికేతన్!! గీతాంజలి మనుషుల మనసుల్లో ప్రేమతత్వాన్ని స్పర్శించి, దాన్ని వెలికి తీసే ఒక అద్భుతం. అయితే టాగోర్ పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో స్థాపించినదే శాంతినికేతన్ విశ్వవిద్యాలయం. ఇది అయిదు మంది పిల్లలతో మొదలై ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకుంది. అక్కడ విద్యను అభ్యసించిన వారికి ఒకానొక ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడటం ఎంతో గొప్ప విషయంగా భావించేవారు. గొప్ప క్రమశిక్షణ కలిగిన జీవితం వారికి సొంతమయ్యేది. మరొక కోణం!! టాగోర్ అంటే చాలామందికి కేవలం గీతాంజలి రచయితగా పరిచయం అవుతారు కానీ ఈయన నవలలు, నాటకాలు కూడా రాశారు. ఇంకా ముఖ్యంగా రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక వర్గాన్ని సృష్టించిన గొప్ప సంగీత పిపాసి ఈయన. ఈయన రచించిన నవలల్లో గోరా ఈయనకు  ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలాగే నాటకాలలో చిత్రాంగద నాటకం మంచి పేరు తెచ్చిపెట్టింది. సామాజిక చైతన్యం వైపు!! టాగోర్ కు సామాజిక స్పృహ ఎప్పుడూ ఎక్కువగానే ఉండేది. ఆయన జీతీయభావాలు పుష్కలంగా కలిగి ఉండేవాడు. తిలక్ ను బ్రిటీష్ ప్రభుత్వం బంధించినప్పుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజన సమయంలో ప్రముఖ పాత్ర పోషించాడు. చివరికి ఈయన రచించిన జనగణమన జాతీయగీతంగా మారి ఈ దేశం నిలిచి ఉన్నంత వరకు టాగోర్ ఉనికిని జీతంలో ప్రతిబింబిస్తూ ఉంది, ఉంటుంది. విశ్వకవి బిరుదును సొంతం చేసుకున్న ఈయన విశ్వాన్ని తన కలంతో శాసించాడు.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

అమ్మ ప్రేమ అజరామం!!

పెదవే పలికిన మాటల్లోనా తియ్యని మాటే అమ్మ అనే పాట పాడుతూ ఉంటే అమ్మ ప్రేమ అంతా చిన్నతనంలో మనల్ని ముంచెత్తిన పాలబువ్వతో సహా మళ్ళీ ఉయ్యాల ఊపినంత హాయిని కలిగిస్తుంది.  ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్నా కమ్మని కావ్యం అనే పాట మొత్తం వింటే బ్రహ్మకు కూడా అమ్మ ప్రేమ గొప్ప వరమే అని అర్థమవుతుంది.  సినిమాలలోనూ, కవితల్లోనూ, కథల్లోనూ ఇంకా మనుషుల జీవితలలోనూ ఎక్కడ చూసినా అమ్మ ప్రేమకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి, ఉన్నాయి కూడా. కానీ అమ్మకు అందుతున్న బహుమానం ఏమిటి?? ఆలోచిస్తే ఏమీ ఉండదు!! కనీసం అమ్మ కోసం ఏదైనా ఇచ్చినా అదంతా అమ్మ తన పిల్లలకు పంచిన ప్రేమకు సరితూగుతుందా?? ప్రశ్నార్ధకమే!! పైకి అమ్మను ఇంతగా ఆకాశానికి ఎత్తేసే మహామహులు అందరూ లోపల మాత్రం నిజంగా అంత ప్రేమగా, గౌరవంగా చూస్తుంటారా??  కేవలం అమ్మల్నే కాదు నాన్నల్ని కూడా ప్రేమగా చూడని పుత్రులు, పుత్రికలు పుష్కలంగా ఉన్న భారతదేశం ఇది. అయితే అమ్మానాన్నల్లో కూడా లింగవివక్షత ఎదుర్కొనేది, ఇది నాది అని ప్రత్యేకంగా దేనిగురించి చెప్పుకోలేని వ్యక్తి మాత్రం అమ్మే. నిజానికి పెళ్ళైన ప్రతి ఆడదానికి ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అయితే పిల్లలు పుట్టి, వలలు పెద్దయ్యి రెక్కలు వచ్చి ఎగిరిపోయాక, మరొక గూడు కట్టుకుని మరో కుటుంబాన్ని వాళ్లకోసం ఏర్పాటు చేసుకున్నాక అక్కడే నిజమైన కష్టాలు కానీ, నిజమైన సంతోషం కానీ ఎదురవుతుందేమో అమ్మలకు.  పిల్లలకు పుట్టిన పిల్లలంటే ప్రేమ, అన్నేళ్ళు కనిపెంచిన పిల్లలు మరొకరితో జీవితం పంచుకుంటూ సరిగ్గా ఉన్నారో లేదో అని బెంగ, కొడుకు కొడలితో ఉంటూ తనని ఎక్కడ మర్చిపోతాడో అనే ఇంసెక్యూరిటీ ఫీలింగ్, మనవళ్లు, మనవరాళ్లు పుట్టిన తరువాత పిల్లల్ని ముసలివాళ్ళ దగ్గరకు పంపలేని కొందరి కోడళ్ల స్వభావం, ఏముంది ఆ ముసలివాళ్ళ దగ్గర అనే చిన్నతనం. జీవితంలో ఎదుగుదలకు అడ్డంకి అనే ఒకానొక మూర్ఖత్వపు ఆలోచన. ఇలా కారణాలు ఏమైనా సరే సమాజంలో ఎన్నో కుటుంబాలలో ఎంతో మంది అమ్మలు మానసికంగా నలిగిపోతున్నారు. ఉద్యోగం చేసే మహిళ అయినా, వంటిట్లో హడావిడి పడే మహిళ అయినా, ప్రతిరోజూ కూలి పనికి వెళ్లి సంపాదించే మహిళ అయినా ఇలా పనులు ఏవైనా అమ్మ మాత్రం మొదట తన పిల్లల గురించి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచిస్తుంది. వాళ్ళను తనకు చేతనైనంత గొప్పగా పెంచాలని అనికుంటుంది. తన బిడ్డలు ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని కలలు కంటుంది. గొప్ప విజయాలు తన బిడ్డలు సాదించినప్పుడు ఆ విజయాలు అన్నీ తనవే అయినట్టు చిన్నపిల్లలా సంతోషపడుతుంది. అలాంటి అమ్మ మాత్రం చివరకు పిల్లల చేతుల్లో నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది.  మనిషికి కొత్త ప్రపంచాలు పరిచయం అయ్యే కొద్దీ అమ్మ ఒక పాత ప్రపంచం అవుతుందేమో అనిపిస్తుంది కొందరు ప్రవర్తించే తీరు చూస్తే. కానీ అమ్మ లేకుంటే పుట్టుక, చదువులు, గొప్ప విజయాలు ఇవేవీ సాధ్యమయ్యేవి కాదని అందరూ ఎందుకు గుర్తుచేసుకోరో…..  జీవితంలో అందరికీ ఒక్కో దశలో ఒక్కో విధంగా ఎన్నో ప్రపంచాలు పరిచయం అవుతూ ఉన్నా అమ్మను, అమ్మ ప్రేమను, అమ్మ బిడ్డను చూసుకునే బాధ్యతను మాత్రం వేరే ఎవరూ రీప్లేస్ గా చూడలేరు. ఇంకా చెప్పాలంటే జీవితంలో మధ్యలో ఎంట్రీ ఇచ్చే లైఫ్ పార్టనర్ కూడా తనకు బిడ్డ పుట్టగానే భర్త కంటే బిడ్డనే ఎక్కువగా చూస్తుంది. భర్త కోపం నుండి బిడ్డను కాపాడుకుంటుంది. బిడ్డ అలిగితే బుజ్జగిస్తుంది, కోపం పోగొట్టేలా ఎన్నో కథలు చెబుతుంది. చివరకు తన బిడ్డ పెద్దగయ్యి పెళ్లి చేసుకున్నా తన బిడ్డకోసం ఏదైనా చేస్తుంది.  కాబట్టి ఇక్కడ అర్థమయ్యేది ఒకటే. జీవితంలో కొత్త బంధాలతో ఒకటైనా అవన్నీ ఒక ఆడదానికి బిడ్డ పుట్టగానే చిన్నబోతాయి. ఈ ప్రపంచంలో ఎప్పుడూ తల్లీ-బిడ్డల అనుబంధమే మొదలు నుండి చివరి వరకు అలా సాగుతుంది. చాలా వరకు గమనిస్తే ప్రతి ఇంట్లోనూ భర్తల కంటే బిడ్డల్ని ప్రేమించే ఆడవాళ్లే ఎక్కువ.  అమ్మకు బిడ్డలంటే ప్రాణం. ప్రాణం పణంగా పెట్టి కనింది కదా!! మరి అలా కాకుండా ఎలా ఉంటుంది?? పెళ్ళైన వాళ్ళ విషయంలో అయినా ముసలితనంలోకి జారుకున్న వాళ్ళ విషయంలో అయినా అమ్మ, అమ్మ ప్రేమ, అమ్మ ఆరాటం ఉంటూనే ఉంటుంది.  పగలంతా సూర్యుడిలానూ…. రాత్రంతా చంద్రుడిలానూ…. నడిపించే కాలంలానూ….. అమ్మ ఎప్పుడూ ఒక బలంగా వెంట ఉంటుంది. అలాంటి అమ్మకు జోహార్లు….  ◆వెంకటేష్ పువ్వాడ.

వేసవి తాపం తీర్చుకుందామా??

వేసవి అంటే భయపడే కాలం వచ్చేసింది. ఒకప్పుడు వేసవి అంటే అదొక ఎంజాయ్మెంట్ ఉండేది. అన్ని కాలాలతోపాటు వేసవిని కూడా ఓ రేంజ్ లో ఇష్టపడేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే వేసవి కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా. పట్టణాల్లో ఎక్కడెక్కడో కృత్రిమజీవితాలలో పడిపోయిన వాళ్ళు కాస్త హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి తాము పుట్టిన ఊర్లకు తమ భార్యా పిల్లలతో కలసి పరుగులు తీసేవారు. అయితే కాలం  మారుతూ పల్లెల రూపాన్ని కూడా మార్చేసింది. పల్లెటూళ్లకే సొంతమైన చెరువులు, బావులు, కాలువలు, తాటి, కొబ్బరి, ఈత, మామిడి మొదలైన చెట్ల సందడి క్రమంగా తగ్గింది. ఉన్న కాసిన్ని దిగుబడులు కూడా అధిక వస్తాయని పట్టణాలకే వెళ్లిపోతాయి.  ఒకప్పుడు!! వేసవి వస్తుంది, కొడుకు లేదా కూతురు తమ పిల్లలతో కలసి వస్తారు అనుకుంటే బుట్టల కొద్దీ మామిడి పళ్లు తెచ్చిపెట్టేవాళ్ళు పెద్దోళ్ళు. కానీ ఇప్పుడు అంతా వ్యాపారమైపోయింది. భూస్వాముల పిల్లలు మాత్రమే అలాంటి జీవితాన్ని కొద్దో గొప్పో చూడగలుగుతారేమో. అయితే కాలం మారిపోయిందని మనుషులు అలాగే ఉండిపోరు కదా!! అందుకే వేసవిలో తీసుకునే ఆహారం మీదనే మనిషి ఈ వేడిని తట్టుకోగలుగుతాడు. మరి ఈ వేసవిలో ఏమి తింటున్నారు?? ఎలా తింటున్నారు?? ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటారు?? వేసవి తాపం తీర్చుకోవడానికి సులువైన మార్గాలు. వేడి తగ్గించుకోవాలి అంటే చలువ చేసే పదార్థాలు తీసుకోవాలి. శరీరంలో తేమ తొందరగా ఆవిరైపోయే ఈ కాలంలో ఎప్పుడూ తేమ శాతాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. నీళ్లు!! చాలామందికి నీళ్లు తాగడం నేర్చుకోవాల్సింది ఏముంది అనుకుంటారు. అయితే ఓ పద్దతిలో నీళ్లు తాగితే శరీరంలో తేమ శాతం బాగుంటుంది, ఉదయాన్నే పరగడుపున లీటరు నీళ్లు తాగడం మంచిది. ఇది ఏ కాలంలో అయినా శరీరమనే ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడుతుంది. బాగా దాహం వేసినప్పుడే అని కాకుండా ఈ వేసవిలో కొంచం నీళ్లు తాగుతూ ఉంటే మంచిది. అయితే ఫ్రిజ్ నీళ్లు చల్లగా ఉంటాయని, అవి దాహం తీరుస్తాయని అనుకోవద్దు. అవి ఇంకా శరీరంలో వేడి పెరగడానికి కారణం అవుతాయి. కుండలో నీరు శ్రేష్టం. పండ్లు!! ఈ కాలంలో లభించే పండ్లలో కూడా సాధారణంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సీజనల్ పండ్లను తినడం చాలా ముఖ్యం. పుచ్చకాయ నుండి వేడిని తగ్గించే సబ్జా గింజల వరకు అన్నీ హాయిగా తినేయచ్చు, తాగేయచ్చు. ఫ్రూట్ సలాడ్ లూ చేసుకోవచ్చు, ఫ్రూట్ జ్యుస్ లు చేసుకోవచ్చు. అయితే నేరుగా పండు తింటే ఆ పండులో ఉండే అన్ని రకాల పోషకాలు అందుతాయి.  ఉసిరి, నిమ్మ!! ఈ రెండు దాహాన్ని తీర్చడంలో ఎంతో గొప్పగా సహాయపడతాయి. ఆమ్లా జ్యుస్ బయట మార్కెట్లలో దొరుకుతుంది, లేక ఆమ్లా పొడి అయినా తెచ్చుకోవచ్చు. ఈ పొడిని నీళ్లలో వేసి అయిదు నిమిషాలు అలాగే ఉండనిచ్చి, అందులో ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవచ్చు. కేవలం దాహం తీర్చడమే కాదు, జీర్ణసమస్యలకు, రక్తం శుద్ధి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా నిమ్మ అన్ని చోట్లా ఉపయోగించే సిట్రస్ పండు. అధిక దాహం ఉన్నప్పుడు అరచెక్క నిమ్మరసం ఒక గ్లాసు నీళ్లలో పిండి ఇష్టమైనట్టు పంచదార లేదా ఉప్పు కలుపుకుని తాగచ్చు. పలుచని మజ్జిగ!! ఒక కప్పుడు పెరుగులో ఒక లీటరు నీళ్లు వేసి బాగా చిలికి అందులో కాసింత కొత్తిమీర, అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి తాగితే అద్భుతంగా ఉంటుంది. పెసరపప్పు!! అందరూ పప్పు, చారు వండటానికి కందిపప్పు వాడతారు. అయితే వేసవిలో పెసరపప్పును రీప్లేస్ చేసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది.  ఇలా అందరికీ అందుబాటులో ఉన్న వాటితోనే వేసవి తపాన్ని హాయిగా అధిగమించవచ్చు.  ◆వెంకటేష్ పువ్వాడ.

 డబ్బుకు కళ్లెం వేయండి ఇలా…!!

నెల చివరికి వచ్చిందంటే చాలామంది జేబులు కాళీ అవుతాయి. ఇంకా నెల నెలా జీతం తీసుకునే వాళ్ళ ఇళ్లలో అయితే పది రూపాయలు కావాలన్నా వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది.  ఏవైన అత్యవసర ఖర్చులు వచ్చాయంటే నెల చివరలో సతమతమైపోతారు. అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చేది అలాగే. కానీ వీటి గూర్చి ఎవరూ పెద్దగా ఆలోచన చేయరు. ఫలితంగా నెల చివర్లో ఆర్థిక ఇబ్బంది. నెల మొదట్లో, నెల మధ్యలో పిల్లల ఇష్టాలు, అవసరాలు తీర్చినట్టు, కుటుంబం గడిపినట్టు నెల చివర గడపలేము. అయితే వీటన్నిటికీ సులువైన మార్గాలున్నాయి. పక్కా ప్లానింగ్ వేసుకుంటే నెల మొత్తం ఓకేలాగా 100%  కాకపోయినా తృప్తి పడేలాగా గడిపేయచ్చు. సాలరీ రాగానే కట్టాల్సివన్నీ కట్టేస్తాం. ఆ తరువాత మిగిలేది కాస్తో కూస్తో. అయితే దేనికి ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు పెద్దగా ప్రాధాన్యత లేకున్నా చేతిలో డబ్బులున్నాయని షాపింగ్ కు వెళ్లడం, బయట రెస్టారెంట్లకు వెళ్లడం. ఏదో నచ్చిందని, మరేదో తక్కువ ధరకు ఆఫర్ లో వస్తుందని. ఇలా కారణాల వల్ల కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. నిజానికి వీళ్లే నెలచివర్లో ఇబ్బంది పడుతుంటారు కూడా. కట్టడి కాదు కట్టుబడి!! నిజమే!! చాలామంది ఖర్చుల విషయంలో కట్టడి చేసుకోవాలి అనుకుంటారు. అయితే కట్టడి కాదు చేయాల్సింది. కట్టుబడి ఉండటం. ప్రణాళికలో భాగంగా దేనికి ఎంత పెట్టాలి?? ఎంత అవసరం?? ఎంత ఖర్చుపెడుతున్నాం ఇలాంటివి ఆలోచించుకోవాలి. చేతిలో పైసా ఉంటే ఏదో ఒకటి కొనేయలని అనిపిస్తుంది. ఆన్లైన్ తో పడుతూ లేస్తూ!! ఆన్లైన్ లో  నగదు చెల్లింపులు వచ్చాక అంతా సులభం అయిపోయింది, సమయం ఆదా అయింది. కానీ డబ్బును మాత్రం చాలా సులువుగా ఖర్చుపెట్టేస్తున్నారు. ఒకప్పుడు డబ్బు అవసరం అయితే నాన్న బ్యాంక్ కు వెళ్ళాలి, క్యూలో నిలబడాలి, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలి. అప్పుడు దాన్ని అమ్మ ఏ డబ్బాలోనో, లేక బీరువాలోనో దాచి రూపాయి రూపాయి లెక్కబెట్టి మరీ బయటకు తీసేస్తుంది. అపుడు నెల చివర వచ్చినా ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ముఖ్యంగా అమ్మ పోపుల డబ్బాకు ఉన్న పవర్ అదేమో అనుకునేవాళ్ళం కూడా. కానీ అదంతా మనుషుల జాగ్రత్త కదా!! సేవింగ్స్ సర్వింగ్స్!! ప్రతి నెల సంపాదనలో సేవింగ్స్ అంటూ కొన్ని ఉంటాయి. వాటిని కూడా నేల నెల కట్టేస్తారు. అయితే వచ్చే తిరకాసు ఒకటే. నెల నెలా సేవింగ్స్ కంటే ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి పెద్ద మొత్తంలో కట్టాల్సి ఇన్సూరెన్స్ పాలసిలు  సినిమా చూపిస్తాయి.  అందుకే వాటికోసం ప్రతినెలా కొంత మొత్తం పక్కనపెట్టాలి. తద్వారా అవి భారం అవ్వవు. పొదుపు మంత్రం భవిత బంగారం!! పొదుపు పొదుపు అని తల తినేస్తున్నారేంటి అనిపిస్తుంది. కానీ పొదుపు అనేది పెద్దలకు కాదు పిల్లలకు కూడా. ఇంట్లో పిల్లలకు ఓ పిగ్గి బ్యాంక్ ఇచ్చి చూడండి. వాళ్ళ అనవసర ఖర్చులు పోయి సేవింగ్స్ లోకి జర్నీ స్టార్ట్ చేస్తారు. నిజం చెప్పాలంటే అలా పిల్లల సేవింగ్స్ ఏ పెద్దలను ఎన్నో సందర్భాలలో రక్షిస్తుంది కూడా. పొదుపు గురించి కొంత అవగాహన దాని రుచి తెలిసాక అనవసర ఖర్చులు చేయకుండా ఎంతో జాగ్రత్త పడతారు. పొదుపంటే పిసినారితనం కాదని, అది కూడా ఒక కళ అని తొందరలోనే గుర్తిస్తారు. లోకమంతా డబ్బులో కొట్టుమిట్టాడుతున్నపుడు, డబ్బుకు ఈ లోకమే దాసోహం అయినపుడు డబ్బు విషయంలో జాగ్రత్త ఉంటూ దాన్ని ఎలా వాడాలో, మనకు కష్టం రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచిస్తే తప్పేమీ లేదు, మనం, ముఖ్న పిల్లలు దాన్ని ఆచరణలో పెడితే అస్సలు తప్పు లేదు!!   ◆ వెంకటేష్ పువ్వాడ    

అక్షయతృతీయలో అంతరార్థం!!

భారతీయ మహిళ తళుక్కున మెరిస్తే, మెరుపంతా అందరి కళ్ళను ఇట్టే తనవైపు తిప్పేసుకుంటే, ఇంకా అందంగా, ఆకర్షణగా ఉన్న అమ్మాయి కనబడితే పుత్తడి బొమ్మ అనే పేరుతో పిలిచి మురిసిపోతారు.  పండుగ, ప్రత్యేక వేడుక వంటి వాటిలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు ప్రఝీ ఒక్కరు కనీసం ఒక్క అభారం అయినా పెట్టుకోకుండా ఉండరు. ఇంకా పెళ్లి కూతురో, ఆభరణాల కలెక్షన్ మీద ఎప్పుడూ హై క్లాస్ జీవితాలను గడిపేవాళ్లను గమనిస్తే ఎప్పుడూ బంగారం ఒంటి మీద పెట్టుకుని, బంగారం మెరిసినట్టే మెరుస్తూ ఉంటారు. ఇలా బంగారానికి బంగారం లాంటి మహిళలకు మధ్య ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు. మగవాళ్ళు కూడా ఉంగరాలు, బ్రేస్లేట్లు, మెడ గొలుసులు ధరించి తమ హుందాతనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.  ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆషాఢమాసం, అక్షయ తృతీయ వంటి సందర్బాలలోనూ, శ్రావణ మాసపు పెళ్లి వేడుకల ముందు బంగారం కొనుగోళ్లు ఎక్కువ. నిజం చెప్పాలంటే ఈ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు భారదేశంలో. కార్లు, విలువైన వస్తువులు కొనడం వల్ల కాలక్రమేణా అవి పాతబడేకొద్ది వాటి విలువ క్రమంగా తగ్గుతుంది కానీ పెరగదు. కయితే బంగారం మాత్రం కాలంతో పాటు తప్పకుండా రెక్కలు పెంచుకుని ధరల పరంగా పెరుగుతూనే ఉంది, ఉంటుంది కూడా.  ఈ కారణంగా భారతీయ మహిళలు డబ్బును బంగారానికి వెచ్చించడానికే ఎక్కువ ఇష్టపడతారు. భారతదేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరిగే రోజుల్లో అక్షయతృతీయ కూడా ఒకటి. ఎంతోమంది అక్షయతృతీయ రోజు బంగారం కొనడం ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తూ ఉంటారు కూడా. ధగధగధగ మెరిసిపోయే బంగారం ఇంటికి లక్ష్మీకళ తెచ్చిపెడుతుందని సగటు భారతీయ మహిళ నమ్మకం.  అక్షయ తృతీయ ప్రత్యేకత!! చాలామందికి అక్షయతృతీయ అంటే బంగారం కొనడం, లక్ష్మీదేవిని పూజించడం ఇవే తెలుసు. నిజానికి వ్యాపార ప్రకటనలు కూడా అక్షయ తృతీయ అంటే బంగారం కొనడమని, ఆరోజు బంగారం కొంటె ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుందని చెబుతారు. ప్రజలకు ఆశ ఎక్కువ. నేటి కాలంలో ధనవంతులు కావాలనే ఆశ ఉండనిది ఎవరికి?? అందుకే అక్షయతృతీయ రోజు బంగారం కొనడానికి చాలా కష్టాలు కూడా పడతారు.  కానీ అక్షయ తృతీయలో ఉండే అంతరార్థం ఏమిటో తెలుసా?? వైశాఖ శుద్ధ తదియ రోజు చేసే ఏ పూజ అయిన, యగమైనా, దానము అయినా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలనంటే ఆరోజు చేసే ఏ పని అయినా ఐశ్వర్యం పెంపొందెలా చేస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు.  ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలుగుతారు. ఇదీ నిజమైన అక్షయతృతీయ వెనుక ఉన్న రహస్యం. కాబట్టి కెవలం బంగారం, వెండి వంటి వస్తువులు కొనడానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మొదట ఆ మహావిష్ణువును పూజించి ఆయన కృపకు పాత్రులవ్వాలి.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

అతి విశ్వాసం వద్దు- ఆత్మ విశ్వాసం చాలు

మనుషులలో రెండు రకాలు ఉంటారు. ఆదర్శవంతులు, పనిమంతులు. సమాజ పురోభివృద్ధికి ఇద్దరూ అవసరమే. ఆదర్శవంతులైన వారికి ఆచరణాత్మకత ఉంటే మారుతున్న పరిస్థితుకకు అనుగుణంగా వారి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. తద్వారా కార్యరంగంలో తమ ప్రణాళికలను విజయవంతంగా అమలుపరచగలరు. కానీ పనిచేయడానికి అవసరమైన సాధ్యా సాధ్యాలను గమనించుకోకుండా తమ ఆదర్శాలనే అంటిపెట్టుకొని ,ఆయా రంగాలిలో అనుభవన్నీ పొంది వారి సలహాను వినకుండా,ఇతరల నుండి ఎటువంటి సలహాను తీసుకోవడానికి ఇష్టపడకుండా, మొండితనాన్ని చూపే వారిని అతివిశ్వాసం గలిగినవారిగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు జీవితంలో ఎప్పుడూ విమానం ఎక్కనివాడు తానే విమానం నడుపుతానుఅని అంటే ఎలా ఉంటుందో, ఎప్పుడూ చేతిలో తుపాకీ పట్టనివాడు యుద్ధానికి సిద్ధపడితే ఎలా ఉంటుందో, నీరు అంటేనే బయపడేవాడు సముద్రాన్ని ఈదుతాను అంటే ఎలా ఉంటుందో అతి విశ్వాసం కలిగినవాడు ప్రవర్తన కూడా అలా ఉంటుంది. మహా పరాక్రము శక్తి కలిగిన అభిమాన్యుణ్ణి చూడండి. అతను శక్తివంతుడే కానీ పద్మవ్యూహంలోకి వెళ్లడం తెలుసు, తిరిగి రావడం తెలీదు. ఇది అభిమాన్యుడికి కూడా తెలుసు కానీ అతి విశ్వాసంతో ఎలాగోలా తిరిగి రావచ్చు అని వెళ్లి ప్రాణాలు త్యాగం చేసాడు. దుర్యోధనుడు కూడా ఇదే తప్పు చేసాడు. శ్రీ కృష్ణుడే పాండవుల వైపు ఉన్నాడు. వారి శక్తి తెలుసు. అయినా ఫలితాన్ని అంచనా వేయక గుడ్డిగా కర్ణుణ్ణి నమ్మి సర్వం కోల్పోయాడు. కొంతమంది అద్భుతాలు చేయగల శక్తి కలిగినవాళ్లు ఉంటారు. అలాంటివాళ్లు తమ శక్తి తెలియక సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేసుకొని పని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. వారికి కొంచెం ప్రేరణ కలిగించి ఉత్తేజం కలిగించి,వారి శక్తిని వాళ్లకి గుర్తు చేయగలడం అవసరం. ఆ మరుక్షణమే  వాళ్లు అసాధ్యం అని అనుకున్న వాటిని కూడా సుసాధ్యం చేసి చూపిస్తారు. మహా బలవంతుడైన హనుమంతుడి సముద్రాన్ని దాటడానికి కావాల్సిన బలం శక్తి తనకు ఉన్నాయని తెలీదు. జాంబవంతుడు తన శక్తిని గుర్తు చేయగానే అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒక్క దూకులో సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మని చూసి లంకను కాల్చి వచ్చాడు. ◆స్వామి వివేకానంద "నేను బలహీనుణ్ణి అని ఎప్పుడూ చెప్పకూడదు. దిగజారుడుతనంలా కనిపించే ఆ పై పొర కింద ఎటువంటి గొప్ప శక్తులు దాగున్నాయో ఎవరికి తెలుసు? నీలో ఉన్న అపారమైన శక్తిని గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. నీవెనుక అనంత శక్తి సముద్రం, ఆనంద సాగరం ఉంది" అంటారు వివేకానంద. కనుక ఆత్మ విశ్వాసానికి అతి విశ్వాసానికి మధ్య ఉన్న సన్నని గీతను గమనంలో ఉంచుకొని మనం ముందుకు నడవాలి. అదే సమయంలో నీ శక్తిని నీవు గ్రహించక నిరాశ నిస్పృహలకు లోనుకాకు. ఆత్మ విశ్వాసమే మహాబలము. ◆ వెంకటేష్ పువ్వాడ  

డాన్స్ రాజా డాన్స్!!

ఇప్పుడు డాన్స్ ఏంటి అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ డాన్స్ అంటేనే ఉత్సాహం, డాన్స్ అంటే ఒక సందడి, ఇంకా కొందరికి డాన్స్ అంటే ఒక ఎమోషన్. డాన్స్ తో మనిషికి ఉన్న అవినాభావ సంబంధం ఇప్పటిదేమీ కాదు. డాన్స్ కు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. చతుష్షష్టి కళలలో  డాన్స్ కూడా ఒకటి.  అర్థమయ్యేలా  చెప్పాలంటే అరవైనాలుగు కళలలో డాన్స్ కూడా ఒకటి మరి. ఇంకా లలిత కళలలో డాన్స్ అమ్మాయిల సొగసును అబ్బురంగా మార్చేస్తుంది. ఇప్పుడు డాన్స్ గురించి ఎందుకనే విషయానికి వస్తే  డాన్స్ కు కూడా ఒక రోజును కేటాయించేసింది ఇంగ్లీష్ క్యాలెండర్.  దాని ప్రకారం మన ఏప్రిల్ నెలలో 29 వ తేదీన వరల్డ్ డాన్స్ డే ను జరుపుకుంటారట. ప్రత్యేకంగా ఒకరోజున ఇట్లా కేటాయించడం మనకు ఎలాగో నచ్చదు కానీ గుర్తు చేసుకుంటే మాత్రం బాగుంటుంది కదా!! నిర్లక్ష్యం!! ఒకప్పుడు కొన్ని కుటుంబాలలో సంప్రదాయం కింద సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి లలిత కళలు అమ్మాయిలకు, అబ్బాయిలకు చక్కగా నేర్పించేవారు. అయితే కాలం మారి ఉద్యోగాల గోలలు వచ్చి పడ్డాక చదవడం, ఉద్యోగం సంపాదించడం, ఉద్యోగానికి వెళ్లి రావడంతోనే జీవితం కూడా గడిచిపోతుంది. చిన్నప్పటి నుండి పిల్లలకు చదువుకోమని చావగొడుతూ ఇతర యాక్టివిటీస్ గురించి ఏమాత్రం ప్రోత్సాహం అదించకుండా ఉండటం వల్ల పెరిగేకొద్ది ఒకానొక కృత్రిమత్వం లో పడిపోయి పెద్దయ్యాక వాళ్లకు ఏమాత్రం జాలి, ప్రేమ, దయ వంటి గుణాలు కూడా లేకుండా తయారవుతున్నారు.  డాన్స్ మంత్రం!! ప్రస్తుతకాలంలో టీవీ లలో ఎక్కడ చూసినా డాన్స్ షో లు పిచ్చపాటిగా టెలికాస్ట్ అవుతుంటాయి. ఈమధ్య కొందరు అభిప్రాయం ఏమిటంటే అవి డాన్స్ షోలా లేక, సర్కస్ షోలా అని. టీనేజ్ లో ఉన్నవాళ్లు అయితే స్టేజి మీద చేసే రొమాన్సులు, చిన్నపిల్లలకు కూడా టూ పీసెస్ డ్రెస్ లు వేసి డాన్స్ చేయిస్తూ ఉంటే అందరూ వాళ్ళను ఎన్నో రకాలుగా ఏదోఏదో అనేస్తారు. అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఒకానొక అభిరుచి అనేది ఉంటుంది. అలాంటిదే ఈ డాన్స్ కూడా. సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు వేస్తున్న డాన్స్ లకు ఏ మాత్రం తగ్గకుండా, ఇంకొందరు ముందడుగు వేసి అలాంటి దుస్తులే వెతికి తీసుకుని డాన్స్ ఇరగదీస్తుంటారు. ఇదంతా ఒక ఫాషన్ అయిపోయింది. సంప్రదాయం!! నిజానికి లలిత కళలలో డాన్స్ ఒకటి అయి ప్రాచీన వారసత్వ సంపదగా కొనసాగుతూ వస్తోంది. నాటి నాట్య రూపకాలను చూసి ముచ్చటపడి, విదేశీయులు కూడా భారతీయ నాట్యాలను నేర్చుకుంటున్నారు. మన దేశంలో ఎంతోమంది కళాకారులు నాట్యానికి అంకితమై, నాట్యంలోనే జీవించారు. నాట్యానికి ఉన్న గొప్పదనం అందులో ఎన్నో కథలను సృజియించడం. పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృతి, జీవన విధానాలు వీటన్నింటినీ నృత్య రూపంకంలో ప్రదర్శించడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పైగా అందులో ఎంతో కళను బతికించే ఉద్దేశం, కళకు గుర్తింపు తీసుకురావడం కూడా ఉంటుంది. ఉపయోగాలు!! ఇట్లా ప్రాచీన నృత్యం అయినా, ప్రస్తుతం బీట్స్ మధ్య గంతులు వేసినా మొత్తం మీద మనిషి ఆరోగ్యానికి మాత్రం బోలెడు లాభం చేకూరుతుంది. పరిగెత్తడం, ఎగరడం నడుము తిప్పడం, వేగవంతమైన కదలికలు, స్లో మోషన్ లో వెలిబుచ్చే హవాభావాలు, దానికి తగిన భంగిమలు ఇలా అన్ని విధాలుగా శరీరం ఏకకాలంలో వ్యాయామం పొందుతుంది. ప్రతిరోజూ డాన్స్ ను ప్రాక్టీస్ చేసేవాళ్లకు ప్రత్యేకంగా వ్యాయామం అక్కర్లేదు. ఉల్లాసం, ఉత్సాహం!! డాన్స్ వేయడానికి మంచి సంగీతం కావాలి. మనిషి మూడ్ ను మార్చే శక్తి సంగీతానికి ఉంటుంది. ఆ సంగీతానికి శరీర కదలికలు కూడా తోడైతే మనుషుల్లో ఉన్న ఎన్నో రకాల ఒత్తిడులు ఇట్టే మాయమవుతాయి.  శరీరం అలసిపోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది.  శరీరంలో కొవ్వు శాతం ఉన్నవాళ్లు డాన్స్ మెల్లగా ప్రయత్నిస్తే ఎంతో ఫ్లెక్సిబుల్ బాడీ సొంతమవుతుంది. మిగతా అన్ని పనులలో ఎంతో చురుగ్గా ఉండగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇష్టమైన పని చేశామనే తృప్తి లభిస్తుంది.                      ◆ వెంకటేష్ పువ్వాడ.  

అంతర్జాతీయ భాష - అవకాశాల దిశ!!

ప్రస్తుత కాలంలో ఉద్యోగాల కోసం పోటీ విపరీతంగా ఉంటుంది. ముఖ్యముగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెడుతూ, పరిశ్రమలు స్థాపిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అయితే వచ్చిన చిక్కంతా భాష దగ్గరే. ఆ విదేశీ కంపెళలో పనిచేయడానికి ఆంగ్ల భాషలో ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలి. అయితే మన దేశంలో ఎంతోమంది ఇంగ్లీష్ సరిగా రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతిభ ఉన్నా భాష సరిగ్గా రాని కారణాన కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేక ఉద్యోగ అవకాశాల దగ్గర వెల్లకిలా పడుతున్నారు.  ఆంగ్లమంటే భయమా?? ఇంగ్లీష్ అనగానే చాలామంది తల కొట్టుకుంటారు. నిజానికి దానిని సబ్జెక్ట్ గా చూడకుండా మనం మాట్లాడే తెలుగులాంటి భాష అది కూడా అనే ఆలోచనతో దాని మీద కాస్త ఏకాగ్రత పెడితే ఇంగ్లీష్ పెద్ద కష్టమైనది కాదని ఎంతోమంది అంటారు. అంటే ఇంగ్లీష్ అంటే భయం వద్దు అని పరోక్షంగానే చెబుతున్నారు.  అవకాశాలు!! ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష. మాతృభాష ఏదైనా సరే కానీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కానీ, ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కానీ, అందరినీ అదుకునేది ఇంగ్లీష్ ఏ. ఇంగ్లీష్ అంతగా మనుషుల జీవితాలలో బాగమైపోయింది. పాశ్చాత్యుల భాషకు ఎందుకింత ప్రాధాన్యత ఇవ్వాలని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి మనుషులకు ఎన్నో అవకాశాలు కలిగేలా చేస్తున్నది ఇప్పుడు ఈ ఇంగ్లీష్ భాషనే. ఇంకా చెప్పాలంటే సాధారణ పాఠశాలలో పిల్లలకు బోధించడం దగ్గర నుండి, పెద్ద పెద్ద ఐటి సంస్థల వరకు ఇంగ్లీష్ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.  కాబట్టి మెరుగైన అవకాశాలు అందుకోవాలి అంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ భాషను కూడా మోయాల్సిందే. మెరుగు పడే జీవనశైలి!! అందరూ ఒక విషయం అర్ధం చేసుకోవాలి. భారతీయుల జీవితం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారి జీవితమే ఉత్తమమైనది అనుకోడానికి  వీల్లేదు. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో నివసించే వారి జీవితాలు వారికి అత్యుత్తమంగా అనిపిస్తాయి. కాబట్టి మనుషులు అవకాశాల పరంగా ప్రాంతాలు మారుతూ ఉంటే అక్కడి జీవనవిధానం, అక్కడి మనుషుల పరిచయాలు చూస్తుంటే మన జీవనసరలి ఎంతో మెరుగవుతుంది.  ప్రతి ఒక్క చోటా మనుషులను అనుసంధానం చేయగలిగేది భాష మాత్రమే. అందుకే మాతృభాషతో పాటు అంతర్జాతీయ భాష అయిన ఆంగ్లాన్ని నేర్చుకోవాలని చెబుతున్నారు. పొరపాటు ఎక్కడ?? నిజానికి  ఈ భాష గురించి అందరూ చేస్తున్న పొరపాటు. దాన్ని మార్కులు ఇచ్చే సబ్జెక్ట్ గా చూడటం. తెలుగులాగా  ఇంగ్లీష్ ను కూడా లైఫ్ స్టైల్ లో భాగం చెయ్యకుండా, దాన్ని సరైన విధంగా నేర్పించకుండా ఉండటం. వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వకపోవడం. బహుశా దీన్ని గుర్తించి కార్పోరేట్ పాఠశాలల్లో పూర్తిగా తెలుగు నిషిద్ధం చేసి ఇంగ్లీష్ నే అలవాటు చేస్తున్నట్టున్నారు. కానీ తెలుగు, ఇంగ్లీష్ రెండింటిని పిల్లలకు అలవాటు చేస్తే వారి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. నిజం చెప్పాలంటే అత్యుత్తమ మార్కులు లేకపోయినా కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల జీవితాల్లో బాగుపడినవాళ్ళు చాలా మంది ఉన్నారు.  మార్గం!! ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముఖ్యంగా చేయాల్సిన పని ఒకటి ఉంది. భయం తగ్గించుకోవడం, తప్పులు మాట్లాడతామేమో అని, వ్యాకరణ దోషాలు ఉంటాయని, ఎవరైనా నవ్వుతారని, ఎగతాళి చేస్తారని భయపడుతూ దానికి దూరంగా ఉంటే, ఆ ఇంగ్లీష్ కూడా అలాగే సమస్యగా కనిపిస్తుంది.  ఇంగ్లీష్ లో ఉన్న చిన్న ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్, పోయెమ్స్, మొదలైనవి చదువుతూ, ఇంగ్లీష్-తెలుగు నిఘంటువులో పదాలు సందర్భానుసారంగా మారుతున్న అర్థాలను గమనించుకుంటూ అర్థం చేసుకుంటే చాలా తొందరగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కాబట్టి భాషను చూసి భయపడద్దు!! దాన్ని లొంగదీసుకుంటే, అవకాశాలు మనకు లోబడుతాయి.                                ◆ వెంకటేష్ పువ్వాడ.  

భూమి ఏడుస్తోంది!!

ఈ ప్రపంచం పంచభూతాలతో నిండి ఉంది. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవన్నీ పంచభూతాలు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఈ ప్రపంచం ఎలా ఉండేదో!! ఆలోచిస్తే ఏమీ తోచదు. కాసింత ఉలికిపాటు కలుగుతుంది కూడా. మరి ఈ పంచభూతాలు లేకపోతే మనిషి మనుగడ ఈ భూ గ్రహం మీద ఉండేది కాదేమో. ఈ పంచభూతాలో మనుషుల్ని మోస్తున్న భూమి మహా ఓపిక కలిగినది. ఈ గ్రహం అవిర్భవించినప్పటి నుండి ఎన్నో కోట్ల జీవరాశులను మోస్తూనే ఉంది. కానీ మనిషి మాత్రం తనను మోస్తున్న భూమిని హింసకు గురిచేస్తున్నాడు. రోజురోజుకూ భూమిలో ఉన్న సారాన్ని తగ్గించేస్తున్నాడు. అలా చేసి భూమిని నిర్జీవంగా, ప్రాణమొదిలేసిన మనిషిలా మారుస్తున్నాడు.  కానీ భూమి మనిషిలాంటిది కాదు. బిడ్డ ఎన్ని తప్పులు చేసినా తల్లి క్షమంచినట్టు భూమి కూడా మనుషుల్ని మన్నించేస్తోంది. కానీ….. తల్లి లోపల కుమిలిపోయినట్టు భూమి కూడా లోపల ఏడుస్తోంది. ఇదే నిజం మరి. మనుషులు చేస్తున్న తప్పులు!! అభివృద్ధి అనే పేరు వెంట తోకలా పట్టుకుని మనిషి భూమిని ఎన్ని విధాలుగా కావాలో అన్ని విధాలుగా నాశనం చేస్తున్నాడు.  వాటిలో మొదటిది చెట్ల నరికివేత. చెట్లను నరికివేయడం, సాగు భూములుగా మార్చడం మనిషి చేసిన మొదటి తప్పు. పోనీ దానివల్ల మనవాళికి ఆహారం లభిస్తోంది అనుకుంటే, సేంద్రియ వ్యవసాయం వల్ల భూమి బాగానే ఉంది అనుకున్నా సంతోషంగానే ఉండేవాళ్ళం ఏమో కానీ  ఆ వ్యవసాయం కూడా రసాయనికం అయిపోయి భూమిని పూర్తిగా దాని సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మార్చేస్తోంది. మనిషి రసాయనికత వైపు వెళ్లి భూమికి అన్యాయం చేస్తున్నాడు. అదే కోవలోకి వచ్చే మరొక అంశం రియల్ ఎస్టేట్. కళ్ళు చెదిరే భవంతుల స్థానంలో పచ్చని వనాలు, తిండి గింజలు ఇచ్చే పంట పొలాలు అన్ని నిర్వీర్యమైపోయి ఉంటాయి. ఇంకా అవన్నీ పెకిలించి చదును చేసిన ఆ భూములు కూడా అంత పటిష్టంగా ఉండవు. అదే ప్రాంతాలలో అడ్డు అదుపు లేకుండా అడుగుల కొద్దీ బోర్లు వేయడం వల్ల భూమిలోపల ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  పారిశ్రామికత, రసాయనికత!! పారిశ్రామిక విప్లవం. అబ్బో ఫ్యాక్టరీలు మాయాజాలం అంతా ఇంతా కాదు. అందులో వెలువడే వ్యర్థాలు అన్నీ నీటిలోకి వెళ్లి, భూమిలోకి ఇంకి భూమిని విషపూరితం చేయడం అన్ని చోట్లా జరుగుతూ ఉంది.  తప్పు దిద్దుకోవాలి!! నిజంగా చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలి. మొదట చేయాల్సింది మనిషికి కనిపించినంత మేర నేలను సిమెంట్ తో నింపేయకుండా సహజమైన మట్టితో ఉండనివ్వడం.  చెట్లను పెంచాలి. నిజానికి చెట్లను పెంచడం వల్ల ఆ చెట్ల ద్వారా భూమి సారవంతం అవ్వడమే కాదు, ఆ చెట్లు రాల్చే ఆకులు, ఆ చెట్ల మీద నివసించే పక్షుల మల, మూత్రాలు, రాలిపడే కాయలు, పండ్లు ఇట్లా అన్నీ నేలకు సహజమైన పోషకాలను సంధిస్తాయి. నిజానికి ఈ సహజమైన ఎరువులను ఉపయోగించి చేసే సేంద్రియ వ్యవసాయం వల్ల భూమి బాగుండటమే కాకుండా వాటి ద్వారా పండే పంటలు కూడా మనిషి ఆరోగ్యానికి మంచి చేస్తాయి.  ప్రకృతికి హాని చెయ్యని భూమిలో తొందరగా కలిసిపోయి భూమికి హాని చెయ్యని వాటిని ఉపయోగించాలి. ముఖ్యంగా భూమిలో ఎన్నేళ్లయినా కరగని ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలి. భూమికి సారాన్ని పెంచే సహజసిద్ద ఎరువులకు నిలయమైన ఆవులను పెంచాలి. ఆవు ఉన్న భూమి ఎప్పటికీ గొడ్రాలవ్వదు. బుట్టల్లోనూ, ప్లాస్టిక్ బకెట్ల లోనూ, డ్రమ్ములలోనూ మొక్కల్ని పెంచి మురిసిపోయే బదులు నేరుగా నేలలో ఓ చెట్టును పెంచినా మంచిదే.  ఒకటి మాత్రం నిజం. మనం ఎప్పుడైతే మన ఆలోచనలను మంచి దారిలో మళ్లించామో అప్పుడే భూమి నవ్వడం మొదలుపెడుతుంది. మన పనులను బట్టి పచ్చని పసిరిక మొలకలు మన దోసిట్లో పెడుతుంది.                                   ◆వెంకటేష్ పువ్వాడ.  

సృజనాత్మక లోకం - ఆవిష్కరణల ప్రపంచం!!

ప్రపంచంలో మనిషి ఎప్పుడూ భిన్నమైన వాడే. ఏదో ఒక భిన్నత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ భిన్నత్వంతోనే ప్రపంచాన్ని భిన్నంగా మార్చేస్తాడు. దానినే నేడు అందరూ అభివృద్ధి అంటున్నారు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఈ మంచిచెడుల గురించి కాదిప్పుడు ప్రస్తావిస్తున్నది. మనం చెప్పుకుంటున్న అభివృద్ధి మానవాభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా సృజనాత్మకత మరియు ఆవిష్కరణ అనేవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. వాటినే కదా భిన్నత్వం అని చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఎవరూ చూడనిది, ఎవరికీ తెలియనిది, సులువైన మార్గాన్ని ముందుకు తెచ్చేవి. ఇలా అన్నీ కూడా సృజనాత్మకత, ఆవిష్కరణ అనే అంశాల మీద ఆధారపడి ఉంటాయి.  అలాంటి వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ఏప్రిల్ 21న ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, కొత్త ఆలోచనలను ఉపయోగించమని, కొత్త నిర్ణయాలు తీసుకునేలా మరియు సృజనాత్మకంగా ఆలోచించేలా ప్రజలను ప్రోత్సహించడం. అసలు ఏమిటి సృజనాత్మక మరియు ఆవిష్కరణ దినోత్సవ ప్రత్యేకత?? ఇది ఎప్పటి నుండి ఉంది?? మనకు ఇంతకుముందు పరిచయం ఉందా?? అని ప్రశ్నించుకుంటే చాలామందికి దీని గురించి తెలియదు.  మరి ఏమిటి ఈ దినోత్సవం??  ప్రపంచ సృజనాత్మక మరియు ఆవిష్కరణ దినోత్సవం మే 25, 2001న కెనడాలోని టొరంటోలో స్థాపించబడింది.  1977లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ క్రియేటివిటీలో సృజనాత్మకతను అభ్యసిస్తున్న కెనడియన్ మార్సి సెగల్ అనే వ్యక్తి ఈ దినోత్సవ వ్యవస్థాపకురాలు.   ఈరోజును ఎందుకు ఎలా స్థాపించారు?? కెనెడియన్ మార్సి సెగల్ అనే ఆమె నేషనల్ పోస్ట్‌లో 'కెనడా ఇన్ క్రియేటివిటీ క్రైసిస్' అనే హెడ్‌లైన్‌ని చదివిన మరుసటి రోజు ఈ దినోత్సవాన్ని రూపొందించాలని ఆమె నిర్ణయించుకుంది.  ఆమె ఆలోచన ప్రకారం, ప్రజలు కొత్త ఆలోచనలను రూపొందించడానికి మరియు కొత్త చర్యలు తీసుకోవడానికి మరియు ఫలితాలను సాధించడానికి వారి సహజ సామర్థ్యాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తే, అది ప్రపంచాన్ని, ప్రపంచంలో జీవిస్తున్న మనుషుల జీవితాలను మెరుగురుస్తుందని అభిప్రాయపడింది. ఆమె తన సహోద్యోగుల సహాయంతో ఏప్రిల్ 2002లో మొదటి క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేని నిర్వహించి,  సృజనాత్మకతను బయటపెట్టమని ప్రజలను ప్రోత్సహించింది. మొదటి నిర్వహణ ఎంతో మంచి విజయం సాధించడంతో దాన్ని అనుసరించి, అనేక సంఘాలు, ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో దేశాలు దీనిని జరుపుకోవడంలో చేరాయి.  యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏప్రిల్ 21, 2017న వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డేని జరుపుకోవాలని తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాల్లోని పౌరులు మరియు సంస్థలు సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కూడా.  ప్రపంచ ఆమోదం పొందిన తరువాత  మొదటి ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 2018లో జరుపుకుంది. దీని ప్రాముఖ్యత ఏమిటి?? సమాజంలోని ప్రతి వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఆవిష్కరణలు జరగాలని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.  ఇది సృజనాత్మకత మరియు సంస్కృతికి ప్రాధాన్యతనిస్తుంది, ఎందుకంటే ఇది ఆర్థిక విలువను అందించడమే కాకుండా, సమగ్ర సామాజిక అభివృద్ధికి దోహదపడే గణనీయమైన ద్రవ్యేతర విలువను కలిగి ఉంటుంది. మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, సృజనాత్మకత మరియు ఆవిష్కరణలు ఉపాధిని సృష్టించడంలో సహాయపడతాయని మరియు దేశం యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి వేగాన్ని అందించగలవని కూడా పేర్కొంది. ఇంకా చెప్పాలంటే  ప్రపంచం మొత్తం కరోనావైరస్ మహమ్మారితో పోరాడి ఆర్థికంగా, మానసికంగా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్న ఈ సమయంలో మన అంతర్గత సృజనాత్మకతను బయటకు తీసి మానసికంగా మరియు ఆర్థికంగా దృఢపడటానికి వినియోగించుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులలో ఈ సృజనాత్మక విప్లవం మొదలైతే దేశం కూడా ఆర్థిక మాంద్యం నుండి తొందరగా బయటపడగలదు.   కాబట్టి భిన్నత్వంలో ఏకత్వంగా చెప్పుకునే మన భారతదేశంలో విభిన్నంగా ఆలోచించి ఆవిష్కరణలు చేయడం, సృజనాత్మకతలో భారతాన్ని నింపడం తప్పేమి కాదు.                             ◆వెంకటేష్ పువ్వాడ.

కళయా... నిజమా..??

ఏదైనా పనిని ప్రత్యేకంగానో, ఆకర్షణగానో, కొత్తగానే చేస్తే ఎంతో బాగుంటుంది. మనం చేసే విధానం ఆ పనిని ఇంకా ఇంకా ఉన్నతంగా చూపెడుతూ ఉంటే ఖచ్చితంగా కళ తొంగిచూస్తోంది అనో లేక కళ తిష్ఠ వేసుకుంది అనో అంటాము. కాబట్టి కళ అంటే అందం, ఆ అందంతో పాటు సహజత్వం, సహజత్వంతో పాటు ఆకర్షణ, ఆకర్షణతో పాటు ప్రత్యేకత ఇలా ఒకదానికొకటి తోడయి దాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. అందుకే కళ అంటే ఒకానొక ప్రత్యేక విభాగం అయిపోతుంది.  కొందరికి ఈ కళల విషయంలో ప్రత్యేక అభిరుచి ఉంటుంది. మరికొందరు ఆ కళల సంగత్యంలో బతికేస్తూ ఉంటారు. అలాంటివాళ్ళు కాసింత కృత్రిమత్వం నుండి వేరైపోయి ఉంటారు కూడా. ఈ కళలు మనుషులను ప్రత్యేకంగా నిలబెడతాయి కూడా. అలాంటి కళల కోసం కలలు కనేవాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే మనిషిని కదిలించే గుణం కళకు ఉంది మరి. కళయా… నిజమా…..?? అరవై నాలుగు కళలు ఉన్నాయి. వీటినే చతుష్షష్టి కళలు అని అంటారు. వీటిలో సామాన్యమైన కళలు ఉన్నాయి, లలిత కళలు ఉన్నాయి.  ముఖ్యంగా లలిత కళలు ఎంతో ప్రత్యేకమైనవి. బొమ్మలు వేయడం, పాటలు పాడటం, సాహిత్యం, నాట్యం ఇవి మాత్రమే కాకుండా శిల్ప కళ మొదలైనవి భారతీయ వారసత్వ కళలుగా వస్తున్నాయి. అయితే కొందరు ఈ కళలలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో శ్రమిస్తూ ఉంటారు. మరికొంతమంది తమలో ఉన్న అసంబద్ధమైన విద్యను కళగా అందరి ముందు ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే కళ మీద ఉన్న కలను తీర్చుకోవడం ఎలా?? సాధన!! సాధనములు పనులు సమకూరు ధరలోన అంటాడు యోగి వేమన. అంటే దేనికైనా సాధన అవసరం అని అర్థం. కాబట్టి కళ అంటే నాలుగు రోజులు దాని వెంట పడి ఊగులాడటం కాదు. ఏళ్లకేళ్ళు సాధన అవసరం. అంతేకాదు ఎప్పటికప్పుడు దాన్ని కొత్తగా వ్యక్తం చేయగలుగుతూ ఉండాలి. దానికి ఎలాంటి అగౌరవం తీసుకురాకూడదు. ప్రేమ!! ప్రతి కళ మనిషికి గుర్తింపు తెచ్చేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించే ఆదాయ వనరు కూడా. అయితే ఈమధ్య కాలంలో ప్రతి కళను కేవలం ఆద్య వనరుగా మార్చేసుకుంటూ దాన్ని కృత్రిమంగా ఒంటబట్టించేసుకుంటున్నారు. అందుకే కళను ప్రేమిస్తే ఆ కళ మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అందుకే కళను ప్రేమించేవారికే ఆ కళ కూడా దగ్గరవుతుంది అంటారు.  విలువ!! విలువ తెలిసినప్పుడు దేనికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తారు. కాబట్టి కళకు ఉన్న విలువ తెలుసుకోవాలి మొదట. కళను కళగా కాక ఏదో టైమ్ పాస్ పనిగానో, గౌరవం లేనిచోటనో ప్రదర్శించి ఆ కళను అవమానించకూడదు. అప్పుడే ఆ కళలో ఉండే హుందాతనం మనిషిలో కూడా ప్రస్ఫుటం అవుతుంది. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే కళ ఒక అద్భుతమైతే దాన్ని అంతే అద్భుతంగా అవిష్కరించేవాడు కళాకారుడు అవుతాడు. కళ కోసం జీవితాన్ని ధారబోసిన ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాంటి గొప్ప కళాకారులకు, అలాంటి కళాకారులను ప్రపంచానికి అందించిన కళకు వేల వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కళను ప్రేమించండి, కళ మిమ్మల్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది.                                ◆వెంకటేష్ పువ్వాడ.  

సుందర చిరంజీవుడు హనుమంతుడు!!

  భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఎక్కువగా పూజలు అందుకునే దైవం, చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఆయన పేరునే ఒక శక్తిగా భావించి తలచుకునే వైనం, ప్రతి హిందువు ఎంతో భక్తిగానూ, మరెంతో సన్నిహిత భావంతోనూ కొలిచే దేవుడు హనుమంతుడు.  అంజనాసుతుడు లేదా అంజనాపుత్రుడు, ఆంజనేయుడు, హనుమంతుడు, మారుతి, భజరంగబలి ఇలా పేర్లు ఎన్నైనా మహా బలసంపన్నుడు, గొప్ప శక్తిశాలి అయిన హనుమంతుడి గురించి తెలియని వాళ్ళు ఉండరు. రామాయణంలో రాముడు అందరికీ ఎంత బాగా తెలుసో, ఆంజనేయుడు కూడా అందరికి అంతేబాగా తెలుసు.  పిల్లలు భయపడితేనో, చీకట్లో నడవాల్సి వస్తేనో, కష్టాలు ఉన్నప్పుడో, మానసిక సమస్యలు వేధిస్తూ ఉన్నప్పుడో ఇలా ఒక్కటనేమి మనిషికి నిత్యజీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు "జై భజరంగబలి" అనే ఒక్క మంత్రం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది.  హనుమంతుడి జననం!! హనుమంతుడు ఆ ఈశ్వర పుత్రుడని అంటారు. ఈశ్వరుడి తేజస్సు అంజనాదేవి గర్భంలో పెరిగి వైశాఖ బహుళ దశమి నాడు జన్మించాడు. అంజనాదేవి గారాల పట్టిగా పెరిగాడు. ఈయనకు అంజనాదేవి మొదట పెట్టిన పేరు సుందర అని. సుందర అంటే అందమైన అని. నిజానికి ఈ సుందరుడు పుట్టినప్పుడు చందమామ లాగా అందంగా ఉన్నవాడే. కానీ అల్లరిచేష్ట వల్ల ముఖంలో అపశ్రుతి వచ్చిపడింది. సుందరుడు హనుమంతుడు ఎలా అయ్యాడు?? అంజనాదేవి సుందరుడిని పడుకోబెట్టి పండ్లు తేవడానికి వెళ్ళింది. ఆమె వచ్చేలోపు నిద్రలేచి ఆకలి వేయడంతో ఆకాశంలో ఎరుపురంగులో ఉన్న సూర్యుడిని చూసి ఎర్రగా ఉన్న పండు అనుకుని ఎంతో వేగంతో ఆకాశంలోకి ఎగిరాడు, అది చూసిన సకల ప్రాణులు, దేవతా లోకలు ఆశ్చర్యపోయాయి. అప్పుడే ఇంద్రుడు ఐరావతం మీద వస్తుంటే ఐరావతం తెల్లని పండులాగా కనిపించింది. హనుమంతుడు అటువైపు తిరిగి ఐరావతం పట్టుకోబోయాడు, ఇంద్రుడికి కోపం వచ్చి వజ్రాయుధం ప్రయోగించాడు. అది హనుమంతుడికి తగిలి పడిపోయాడు. వాయుదేవుడు కోపించి గాలి స్తంభింపజేశాడు. సకలదేవతలు బ్రహ్మతో సహా వెళ్లి హనుమంతుడిని చిరాజీవిని చేసి, ఎన్నో వరాలు ఇచ్చారు. వజ్రాయుధం వల్ల గాయపడి హనుమన్తడు అయ్యాడు. కానీ హనుమంతుడు మునుల భార్యల చీరలు చింపేయడం, లారీ చేయడం వంటివి చేస్తుంటే ఇక ఆగలేని మునులు నీ శక్తి నీకే తెలియకుండాపోతుంది. ఒకరు గుర్తుచేస్తే తప్ప నీకు నీ శక్తి తెలియదు అని శాపం పెడతారు. అప్పటి నుండి హనుమంతుడు సాధారణ వానరుడిలాగే పెరిగాడు.  అమోఘమైన విద్యాభ్యాసం!! ఈయన సూర్యుడి దగ్గర చదువుకున్నాడు. గొప్ప పండితుడిగా మారాడు. ఇంకా చెప్పాలంటే హనుమంతుడికి రాని విద్య లేదు. కానీ ఇంత తెలిసినా ఏమి తెలియనట్టే ఉండటం జ్ఞానుల లక్షణం అన్నట్టు. ఈయన కూడా అలాగే ఉండేవాడు. సుందరకాండ!! ఆంజనేయుడికి రాముడికి పరిచయం తరువాత సీతమ్మను వెతకడానికి సాగిన ఆంజనేయుడు ప్రయాణమే సుందరకాండగా పిలవబడుతుంది. ఇది మొత్తం ఎంతో అద్భుతంగా ఉంటుంది. సుందరకాండ చదివిన వాళ్లకు విన్న వాళ్లకు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతారు.  ఏమి చెబుతుంది హనుమంతుని జీవితం!! హనుమంతుడు మహా బల సంపన్నుడు. గుర్తుచేస్తే తప్ప తన బలం తాను తెలుసుకోలేడు. చాలామంది సాధారణ మనుషులు కూడా ఇంతే. తమలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకోలేరు.  హనుమంతుడు కార్యసాధకుడు. ఆయన ఎంత కష్టమైన పనిని అయినా చేసి తీరతాడు. అలాంటి గుణం మనుషుల్లో చాలా తక్కువ ఉంటుంది. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని దాన్ని పెంచుకోవాలి. ఈయన గొప్ప వ్యాకరణ పండితుడు. వాచికం అద్భుతంగా ఉంటుంది. వాచికం అంటే మాట్లాడే గుణం, వ్యాకరణం అంటే భాషలో ఉన్న సకల విషయాలు అని అర్థం. అన్నిటి మీద ఈయనకు పట్టు ఉంది. ఎవరిదగ్గర ఎలా మాట్లాడాలి అనేది స్పష్టంగా తెలిసి ఉంటుంది. అలాంటివాడు కాకపోతే రావణాసురుడిని ఆకర్షించగలిగాడు. వాచికం గొప్పగా ఉన్నవాళ్లు ఎదుటివారిని తొందరగా ఆకర్షించగలుగుతారు. తమ మాటలతో ఎదుగువారిని ఒప్పించగలుగుతారు. ఈయన గొప్ప బుద్ధిశాలి. చిన్నతనం అంతా అల్లరిగా సాగినా హనుమంతుడు ఎంతో గొప్ప మేధస్సు కలిగినవాడు. సుగ్రీవుడికి మంత్రిగా ఉంటూ తన కర్తవ్యం నిర్వహించాడు. అంతేకాదు సుందరకాండలో లంకలో ప్రవేశించినప్పుడు హనుమంతుడి ప్రతిభ అడుగడుగునా కనబడుతుంది.  ఈయన చిరంజీవిగా వర్ధిల్లడం వల్ల రాముని అవతారం తరువాత రామ జపం చేస్తూ తపస్సులో మునిగిపోయాడని అంటారు. మనిషికి ఒకదశలో ఇలాంటి స్థితి అవసరమని చెప్పకనే చెబుతాడు. అష్టసిద్ధులకు ఈయన అధిపతిగా ఉంటాడు. అష్టసిద్ధులకు తొమ్మిదిరకాల వ్యాకరణాలను ధారబోసేది ఈయనే.  ఈవిధంగా చూస్తే హనుమంతుడి గురించి చెప్పుకున్నది తక్కువే. కానీ నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. జై భజరంగబళి అని ఆయన్ను తలచుకుని కార్యరంగాలలోకి ఉరకడమే ఇక.                                   ◆ వెంకటేష్ పువ్వాడ.

శిలువ మోసిన లోక రక్షకుడు!!

ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో విభిన్న మతాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాలలో అయితే వాళ్లకు క్రైస్తవమొక్కటే ఉంటుంది. అందులోనే వారు తమ సకల జీవితాన్ని గడుపుతారు. భారతదేశంలో క్రైస్తవ మతం మొదలయ్యి మెల్లగా వ్యాప్తి చెందుతూ ఉంది.  ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. అందుకే ప్రతి ఊర్లో ఇప్పుడు చర్చిలు వెలిశాయి. మతం ప్రాతిపదికగా కాకుండా అందులో ఉన్న విషయం మూలంగా చూస్తే ప్రతి మతం ఓ గొప్ప మార్గమే. అలాంటి మార్గాలలో క్రైస్తవం కూడా ఒకటి. ఈ క్రైస్తవ మతానికి జీసస్ దేవుడు. ఈయనను తండ్రిగా భావిస్తారు. అలాంటి క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించేది, క్రిస్మస్ వేడుకల కంటే ఎంతో పవిత్రమైన సందర్భం గుడ్ ఫ్రైడే. అసలు ఏమిటి గుడ్ ఫ్రైడే?? యేసుక్రీస్తును శిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడే గా చెప్పుకుంటారు. నిజానికి ఇదొక విషాద సంఘటన. అయితే క్రైస్తవ మతస్తులకు ఒక సంస్మరణ దినం లాంటిది. పాశ్చాత్య దేశాలలో దీనిని హొలీ ఫ్రైడే అని, బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే యేసు క్రీస్తును శిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడే గా, ఆ రోజున క్రీస్తును స్మరించుకుంటూ సమస్త క్రైస్తవ పౌరులు గుడ్ ఫ్రైడేను నిర్వహిస్తారు. ఎందుకు పవిత్రమయ్యింది?? ఆ దేవుడి కుమారుడు యేసు ప్రభువు అయ్యాడు. ఆయన ఈ లోకానికి తగిన మార్గనిర్దేశకం చెయ్యడానికి వచ్చాడు. ఆయన భోధనల ద్వారా తన గొంతును వినిపించాడు. అయితే ప్రతి ఒక్కరికి మరణం అనేది అనివార్యం అయినట్టు యేసు ప్రభువుకు కూడా మరణం ఎదురయ్యింది. అయితే అది మరణం కాదు. ఆయన గొంతును అడ్డుకోవడానికి, ఆయన మాటలు రుచించని వాళ్ళు చేసిన మారణహోమం లాంటిది. ఆయన తన పని పూర్తిచేసుకుని మరణానికి లొంగిపోయారు. ఆయన వచ్చిన పని పూర్తయ్యింది అందుకే మరి. ఆయన శిలువ వేయబడిన రోజు లోకులకు పవిత్రదినమయ్యింది. చివరి పలుకులు!! యేసు ప్రభువు మానవాళికి తన సందేశాన్ని వినిపించాలని అనుకున్నారు. అలాగే వినిపించడం మొదలుపెట్టారు. ఈయన దేవుడి కుమారుడిని ఆయన్ను హతం చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు మొదలయ్యాయి. యేసు ప్రభువు శిష్యుడే డబ్బుకు ఆశ పడి, యేసు ప్రభువు ఉనికి తెలిపాడని. అది ముప్పై మూడు వెండి నాణేల కోసమని అందుకే గుడ్ ఫ్రైడే రోజున కొన్ని ప్రాంతాలలో ముప్పై మూడు సార్లు గంట కొట్టడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోందని చెబుతారు. ఇకపోతే యేసు ప్రభువును సజీవంగా శిలువ వేసి, ముళ్ళ కిరీటం పెట్టి, చేతులలో, కాళ్ళలో మేకులు దింపి చేసిన హింస తలచుకుని చర్చిలలో ఆయనకు విషాదగీతాలతో నీరాజనం అందిస్తారు. పాపాలను కడిగివేసే రుధిర పుత్రుడు!! మీ పాపాలను నాయందు వేయండి నేను భరిస్తాను అని అంటారు యేసు ప్రభువు. ఆయన శిలువ వేయబడినప్పుడు చిందిన ప్రతి రక్తపు బొట్టు సకల జనుల పాపాలను కదిగివేసిందని విశ్వశిస్తారు. ఇంకా యేసు ప్రభువు చివరగా చెప్పిన ఏడు మాటలను పదే పదే తలచుకుంటారు. ఈస్టర్!! గుడ్ ఫ్రైడే శుక్రవారం వస్తుంది. ఆరోజు శిలువ వేయబడ్డ యేసు ప్రభువు జరిగి మూడురోజుల తరువాత లేచాడని, అంటే ఆదివారం రోజున ఆయన సజీవంగా కనిపించారని చెబుతారు. ఆ సంతోష సందర్భంగా ఆదివారం రోజున ఈస్టర్ జరుపుకుంటారు. ఎంతో ప్రత్యేకంగా, పవిత్రంగా భావించే గుడ్డును ఈరోజు వీరి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకుంటారు. ఇంకా గుడ్డు ఆకారంలో బోలెడు అలంకరణలు కూడా చేస్తారు. బైబిల్ లో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ గురించి ఎలాంటి ప్రస్థావనలు లేకపోయినా యేసు ప్రభువును స్మరిస్తూ వీటిని ఎన్ని ఏళ్లుగా జరుపుకుంటూనే ఉన్నారు.                                    ◆ వెంకటేష్ పువ్వాడ

ఒంటిమిట్ట కల్యాణ మహోత్సవం!!

కోదండరాముడంట అమ్మలాలా, కౌసల్య పుత్రుడంట అమ్మలాల అని పాడుతుంటే రామభక్తుల మనసు రమణీయంగా ఉంటుంది. చేతిలో కోదండం అనే ధనస్సు పట్టుకుని ఉంటాడు కాబట్టి ఈయన కోదండ రాముడయ్యాడని తెలుస్తుంది.  రామాయణంలో రామలక్ష్మణులు చిన్నగా ఉన్నప్పుడే విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం వాళ్లను తీసుకెళ్లడం. యాగరక్షణ తరువాత సీతమ్మ స్వయంవరానికి వెళ్లి అక్కడ శివదనస్సు విరిచి సీతమ్మను పెళ్లాడటం అందరికీ తెలిసిందే. అయితే అదంతా జరిగిపోయిన తరువాత కూడా రామలక్ష్మణులు ఒకసారి యాగరక్షణ కోసం వెళ్లినట్టు ఓ పురాణ కథనం ఉంది. దుష్టశిక్షణకై నడక!! మృకండుడు, శృంగుడు అని ఇద్దరు మహర్షులు ఉండేవాళ్ళు. వాళ్లిద్దరూ ఒక యాగం చేస్తుంటే రాక్షసులు ఆ యాగాన్ని అడ్డుకుంటూ ఆ మహర్షులను బాధపెట్టేవాళ్ళు. ఆ మహర్షులు ఇద్దరూ రాముడి దగ్గరకు వెళ్లి "రామా!! నువ్వు చిన్నతనంలోనే విశ్వామిత్రుడితో వెళ్లి యాగరక్షణ చేసావు కదా!! ఇప్పుడు మాక్కూడా అలాంటి రక్షణ కావాలి. మేము చేసే యాగం ఎలాంటి అడ్డంకులతో ఆగిపోకుండా నువ్వు  వచ్చి కాపాడు" అని అడగగా,  సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లిన ఆ రామచంద్రుడు యాగాన్ని రక్షించాడు. దానికి గుర్తుగా మృకండుడు, శృంగుడు ఇద్దరూ ఆ సీతారామ లక్ష్మణులను ఏకశిలలో చెక్కించారు. జాంబవంతుడు ఈ ఆలయంలో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసాడు. హనుమంతుడు లేని ఆలయం!! రాముడి బంటు హనుమంతుడు. రామనామం జరిగే ప్రతిచోటా హనుమంతుడు ఉంటాడు. రాముడున్న ప్రతిచోటా హనుమంతుడు ఉంటాడు. కానీ ఈ ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు. సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుడు లేని ఆలయం ఇదొక్కటేనని చెబుతారు. కారణం గురించి ఆలోచిస్తే రాముడికి, హనుమంతుడికి పరిచయం జరగకమునుపు ఇదంతా జరిగి ఉంటుందని పెద్దలు, చరిత్రకారులు చెబుతారు. విశేషాలు!! ఒంటిమిట్ట కోదండరామాలయానికి ఎంత చరిత్ర ఉందొ, అంతకు మించి విశేషాలు ఉన్నాయి. ఈ కోదండ రాముడిని స్తుతిస్తూ "అయ్యల తిప్పరాజు" శ్రీ రఘువీర శతకాన్ని రచించి ఈ కోదండరాముడికే అంకితమిచ్చాడు. ఈయన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అయ్యలారాజు రామభద్రుడి తాతగారు కావడం గొప్ప అంశం.  బమ్మెరపోతన తను రచించిన భాగవతాన్ని ఈ కోదండరాముడికే అంకితం ఇచ్చాడు. అలాగే వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి ఈ కోదండరాముడి దగ్గరే మందరం అనే పేరుతో వ్యాఖ్యానం రాసాడు.  ఈయన కొబ్బరి చిప్పలో బిక్షం ఎత్తి వచ్చిన డబ్బుతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని, దేవతా మూర్తులకు ఆభరణాలు చేయించడానికి, రామసేవ కుటీరాన్ని నిర్మించడానికి ఉపయోగించాడని చెబుతారు. ఇంకా ఎంతోమంది కవులు ఈ ఏకశిలానగరంలో రామునికి తమ కవిత్వంతో అర్చన చేసుకున్నారని చెబుతారు. బ్రహ్మోత్సవాల విశిష్టత!! ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ఎంతో గొప్పగా జరుగుతాయి. అన్నీకంటే ముఖ్యమైనది సీతారాముల కల్యాణం. పౌర్ణమి నాడు వెన్నెల వెలుగులో ఈ కల్యాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పౌర్ణమి రోజు వెన్నెలలో ఎందుకు జరుపుతారు అనే ప్రశ్నకు సమాధానంగా ఒక పురాణం కథనం ఉంది.  సాగర మథనం తరువాత మహాలక్ష్మిని నారాయణుడు భార్యగా స్వీకరించాడు. వీరి కల్యాణం పగటి సమయంలో జరుగుతుండటంతో చంద్రుడు తన బాధను మహాలక్ష్మీకి చేబుతాడట. నేను మీ కల్యాణం చూడలేకపోతున్నాను అని. అపుడు మహాలక్ష్మికి తమ్ముడిని తృప్తి పరచడానికి ఒంటిమిట్ట ఆలయంలో పౌర్ణమి వెలుగులో రాత్రిపూట మా కల్యాణం జరుగుతుంది చూసి ఆనందించు అని చెబుతుందట. అప్పటి నుండి పౌర్ణమి సమయంలో ఎంతో అద్భుతంగా జరుగుతూనే ఉంది ఈ కల్యాణం. రాష్ట్రాలు వేరైపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా ప్రకటించి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణంకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తోంది. ఏకాశిలానగరంలో పౌర్ణమి వెన్నెలలో సీతారాముల కల్యాణం, ఆ తరువాత రథోత్సవం చూసిరండి, ఆ రాముడి గురించి ఆలకించినా ఆలపించినా మైమరిచిపోతారు.                                 ◆వెంకటేష్ పువ్వాడ.  

మహావీరుడిని స్మరించుకుందాం!!

సత్యం, ధర్మం, అహింస వంటి విషయాలను బోధించి హింసాయుతమైన జీవితాలను మార్చాలని కృషిచేసినవారు ఎందరో ఉన్నారు. నిజనికి ఈ మార్గాన్ని చెప్పే మతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో జైన మతం ఒకటి. ఆధినాధుడు లేదా వృషభనాథుడు స్థాపించిన ఈ జైన మతానికి ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉన్నారు. వారిలో చివరివాడు, ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఈ మహావీరుడు. ఈయన కాలంలోనే జైన మతం వ్యాప్తి చెందింది. వర్థమానుడు….. మహావీరుడు!! వర్థమానుడు మహావీరుడు ఇద్దరూ ఒకటే. బీహార్ లో వైశాలి అనే నగరానికి సమీపంలో కుండ అనే గ్రామంలో క్రీ.పూ 599 సంవత్సరంలో క్షత్రీయ కుటుంబంలో మహారాజు సిద్ధార్థుడుమహారాణి త్రిషలకు  ఒక పిల్లవాడు పుట్టాడు.  ఆ పిల్లవాడికి వర్థమానుడు అని పేరు పెట్టారు. తల్లిదండ్రుల దగ్గర ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన వర్తమానుడు తన ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఈయన భార్య పేరు యశోధర. ఈయనకు ఒక కూతురు పుట్టిన తరువాత తన ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అన్నిటినీ వదిలేసి సన్యాసం తీసుకున్నారు.  సుదీర్ఘ తపస్సు!! ఈయన దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఆ పన్నెండేళ్ల కాలంలో ఆయనలో ఎన్నో రకాల ఆత్మానుభూతులు కలిగాయి.  సాలవృక్షం కింద ఈయన తపస్సు చేసిన ఈయన సర్వవ్యాపకత్వమైన జ్ఞానాన్ని సంపాదించారు. దాదాపు ముప్పై సంవత్సరాల పాటు అందరికీ జ్ఞానాన్ని బోధించారు. అంగ, మిథిల, కోసల, మగధ దేశాలలో ఈయన తన తత్వాలను ప్రచారం చేసాడు. త్రిరత్నాలు!! పంచవ్రతాలు!! సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మూడింటిని త్రిరత్నాలు అని అంటారు. ఈ మూడు మనిషి జీవితం మోక్షం సాధించడానికి మార్గాలు అని వర్తమాన మహావీరుడు ప్రతిపాదించాడు. సరైన విధంగా దేన్నైనా చూడటం(చూడటం అంటే ఇక్కడ దృష్టికోణం అని అర్థం), సరైన జ్ఞానం, సరైన జీవితం ఇవన్నీ మనిషి మోక్షసాధనకు మూలం అని చెప్పారు. ఇకపోతే పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనే దానిని కలిపి పంచవ్రతాలు రూపొందించాడు.  పంచవ్రతాలు మనిషి జీవితంలో పాటించడం ఎంతో ముఖ్యమని, వాటిని పాటిస్తూ త్రిరత్నాలలో జీవిస్తే మనిషి మోక్షానికి పాత్రుడు అవుతాడని వర్తమాన మహావీరుడు చెప్పాడు. అలాగే ఈయన ఆ కాలానికే బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకించాడు. పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ, నిష్ఠగా తపస్సు చేస్తే ఎలాంటి వారు అయినా మోక్షాన్ని సాధించవచ్చని తెలియజేసారు. ఆదర్శ మార్గం!! అహింస అనే మార్గాన్ని ఆదర్శప్రాయంగా స్వీకరించి దాన్ని ఆచరించి బానిసత్వంలో ఇరుక్కుపోయిన భారతదేశానికి స్వతంత్ర్యాన్ని తీసుకురావడానికి కృషి చేసిన వారిలో మహాత్మ గాంధీ ఒకరు. ఈయన స్వయంగా వర్తమాన మహావీరుడి భోధనలకు ప్రభావితమై తన జీవితాంతం అహింసా  మార్గాన్ని అనుసరించారు.  ఈయన ఒక్కరే కాదు. వర్థమహా వీరుడి మార్గంలో  గాంధీ గారు, గాంధీ గారి మార్గంలో వెళ్లి ఆంధ్రరాష్ట్రాన్ని సాధించి పెట్టిన మరొకరు పొట్టిశ్రీరాములు గారు.  ఇలా వర్తమాన మహావీరుడి బోధనలను మార్గదర్శకంగా తీసుకుని ధన్యులు అయినవాళ్ళు ఎందరో. అలాంటి వర్తమాన మహావీరుడిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవాలి. ఆయన మార్గాలను వీలున్నంతవరకు పాటించాలి.                                     ◆ వెంకటేష్ పువ్వాడ.

ధర్మరాజ దశమి సందేశం!!

యముడు అంటే అందరికీ భయం. యముడి పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్టే అని భావిస్తారు అంతా. అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైనవాడు. భూలోకంలో మనుషులు ఎంత తప్పులు చేసినా, దేవుళ్లను పూజించి వాళ్ళ పాపాలు పోయేట్టు ప్రయత్నాలు చేసినా యముడి దగ్గర మాత్రం ఎవరి ఆటలు సాగవు. చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే. భూలోకంలో ధనిక, పేద వర్గాలు ఉన్నా ఆ యముడి దగ్గర అందరూ మరణించి ఆయన ముందుకు వెళ్లిన జీవులే అవుతారు. అందుకే సమన్యాయం చేయడంలో యముడిని మించినవాడు లేడు. అందుకే యముడిని ధర్మరాజు అని కూడా పిలుస్తారు.  ఏమిటీ ధర్మరాజ దశమి!! చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు. ఈ దశమి రోజు యముడిని పూజిస్తే  మరణభయం తొలగిపోతుందని పెద్దలు, మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా నచికేతుడి కథ వినడం ఈ ధర్మరాజ దశమి రోజు జరుగుతుంది.  ఎవరు ఈ నచికేతుడు?? పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతడినే ఉద్దాలకుడు అని కూడా అంటారు. ఈయన కొడుకే నచికేతుడు.  ఏమిటీ నచికేతుడి కథ!! వజాశ్రవుడు ఒక యాగం చెయ్యాలి అనుకున్నాడు. ఆ యాగంలో తన దగ్గరున్న సంపదలు అన్నీ దానం చేసేయ్యాలి. కానీ వాజశ్రవుడు యాగం అయిపోయిన తరువాత అక్కడికి వచ్చిన వాళ్లకు తనదగ్గరున్న ఆవులలో పలు ఇవ్వలేని, ఒట్టిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నాడు. అది నచికేతుడికి నచ్చలేదు "ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏంటి?? ఒకపని చెయ్యండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి" అన్నాడు నచికేతుడు.  కొడుకు ఏదో పిల్ల చేష్టతో అలా అంటున్నాడనుకుని నన్ను విసిగించద్దు అన్నాడు వాజశ్రవుడు. అయినా కూడా నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చిరవరకు విసిగిపోయిన వాజశ్రవుడు "నిన్ను యముడికి ఇస్తాను" అన్నాడు. ఆ తరువాత తొందరపాటులో అన్నానని ఆ మాటలు పట్టించుకోవద్దని చెబుతాడు  కానీ యాగం జరిగిన పవిత్ర స్థలంలో అన్నమాట జరగకుంటే మంచిదికాదని నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళాడు. యముడి దర్శనం తొందరగా దొరకలేదు. ఆ తరువాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక "మీ నాన్న ఏదో మాటవరుసకు అంటే నువ్వు వచ్చేసావా వెళ్లిపో. నీకు మూడు వరాలు ఇస్తాను అన్నాడు. నచికేతుడి మూడు వరాలు!! యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగానే నచికేతుడు మొదటగా  1.నేను తిరిగి వెళ్తే మా నాన్న నామీద కోపం చేసుకోకూడదు అని అడుగుతాడు. తరువాత స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పు. అంటాడు. మూడవ కోరికగా  మరణం తరువాత ఏమి జరుగుతుంది అని అడుగుతాడు. మొదటి దానికి యముడు సరేనంటాడు. రెండవదానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అనే పేరు పెడతాడు. (స్వర్గం అంటే భయం లేని స్థితి అంటారు ఇందులో) మూడవ ప్రశ్నకు బదులుగా నువ్వు చిన్నవాడివి నీకు అవన్నీ తెలియవు, చెప్పినా అర్థం కావు అంటాడు యముడు. కానీ నచికేతుడు మొండిపట్టు పట్టడంతో  బ్రహ్మజ్ఞానం భోదిస్తాడు. అదే ఆత్మజ్ఞానంగా చెప్పబడుతుంది. ఆత్మజ్ఞానం కలిగినవాడు మరణాన్ని గురించి తొణకడు. ధర్మరాజ దశమి రోజు నచికేత యజ్ఞం చేసినవారికి మరణ భయం ఉండదనేది ఇందుకే. అందుకే ఈ ధర్మరాజ దశమి ఎంతో ప్రాముఖ్యం పొందింది. స్వామి వివేకానంద అంటాడు. నచికేతుడి లాంటి పదిమంది శిష్యులను నాకు ఇస్తే ఈ దేశాన్ని మార్చేస్తాను అని. అంటే నచికేతుడు గుణంలోనూ, పట్టుదలలోనూ ఆలోచనల్లోనూ ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని ప్రత్యేకంగా చెప్పాలా??                                          ◆వెంకటేష్ పువ్వాడ.  

ఉత్తరాయణ విశిష్టత!! 

సంవత్సరాన్ని ఆరు ఋతువులు, పన్నెండు మాసాలుగా విభిజించినట్టు అందరికీ తెలుసు. అయితే ఉత్తరాయణం, దక్షిణాయణం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ కొంతమంది కూడా తెలుగు సంవత్సరాన్ని చక్కగా తెలుసుకుని, దాన్ని పాటించేవాళ్లకే అర్థమవుతుంది. సాధారణంగా మహావిష్ణువు దక్షిణాయణంలో నిద్రపోయి, ఉత్తరాయణంలో నిద్ర నుండి మేల్కొంటాడని, అందుకే ముక్కోటి ఏకాదశి రోజున పెద్ద ఎత్తున భక్తులు  దర్శనానికి వెళ్తారు.ఇక శాస్త్ర పరంగా చూస్తే సూర్యుడు దక్షిణదిక్కుకు దగ్గరలో ఆరు నెలల పాటు, ఉత్తర దిక్కుకు  ఆరు నెలల పాటు ప్రయాణిస్తాడు. ఇదంతా భూమద్యరేఖ, అక్షాoశ, రేఖాoశాల వల్ల కలిగే మార్పుగా అర్ధం చేసుకోవచ్చు. ఉత్తరాయణం తెలుగు సంవత్సర ప్రకారం పుష్యమాసంలో మొదలై ఆషాడ మాసంలో ముగుస్తుంది. ఈ ప్రారంభం పగటి సమయం తక్కువగా ఉండి, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది కారణం  సూర్యుడు ఉత్తర దిక్కు వైపు ఉండటం వల్ల భూమండలానికి దూరంగా ఉంటాడు. నమ్మకం!! చాలామంది ఉత్తరాయణంలో చనిపోయేవాళ్లకు మళ్ళీ జన్మ ఉండదని, దేవుడు కృపకు పాత్రులయ్యి ఆ దేవుడి సమక్షాన్ని చేరుకుంటారని చెబుతారు. అదే దక్షిణాయణంలో మరణించేవారు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ, కర్మలు చేస్తూ, ఆ కర్మల తాలూకూ ఫలితాలను అనుభవిస్తారని చెబుతారు. అయితే గీతలో కృష్ణుడు చెప్పే విషయం ఒకటుంది. వెలుగు- చీకటి, జ్ఞానం-అజ్ఞానం!! ఉత్తరాయణ ప్రారంభం కాసింత చీకటి కాలం ఎక్కువే ఉన్నా క్రమంగా అది తగ్గి వెలుగు పరుచుకుంటూ ఉంటుంది. ఈ వెలుగు అనేది మనిషి జ్ఞానానికి ప్రతీక కాబట్టి ఈ ఉత్తరాయణ కాలాన్ని జ్ఞానవంతమైన కాలంగా పేర్కొంటారు తప్ప వెలుగున్న కాలంలో చస్తే మోక్షం తక్కుతుందని అర్థం కాదు. జ్ఞాని అయిన మనిషి మంచి, చెడు విచక్షణ వంటివి కలిగి ఉంటాడు. ఆలోచనా పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది జ్ఞానిలో. అంటే ఉత్తరాయణం జ్ఞానిని తెలిపితే, దక్షిణాయణం అజ్ఞానిని సూచిస్తుంది. అంటే జ్ఞానిగా మరణించేవాడు ఉత్తమ గతులు పొందుతాడు అని అర్థం. దేవదేవతా నమామ్యహం!! భారతీయ హిందూ సంప్రదాయంలో దేవుళ్ళ ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. భక్తులు ఎన్నో విధాలుగా దేవతలను సేవిస్తారు. పూజలు, వ్రతాలు, నోములు, దీక్షలు ఇలా ఎన్నో దేవుళ్ళను ప్రసన్నం చేసుకోవడానికి చేస్తారు. అయితే మనుషులకు పగలు, రాత్రి ఎలాగో,దేవుళ్ళకు ఉత్తరాయణం, దక్షిణాయణం అలాంటివేనని కాబట్టి ఉత్తరాయణంలో దేవతలు మెలకువగా ఉంటారని పండితులు చెబుతారు. అంటే ఈ ఉత్తరాయణంలో చేసే పూజలు, వ్రతాలు ఎంతో గొప్ప పలితాన్ని ఇస్తాయనమాట. అందుకే ఈ కాలంలో కోర్కెల నిమిత్తం తలపెట్టే దైవ కార్యాలకు పలితాలు తొందరగా లభిస్తాయని కూడా నమ్ముతారు. ఇకపోతే చీకటి కాలం నుండి వెలుగులోకి సూర్యుడు పయనం అవ్వడం ఇక్కడి ప్రత్యేకత. అదే మకర సంక్రాంతిగా తెలుగువారి పెద్ద పండుగగా చాలా గొప్పగా నిర్వహించుకుంటారు. పంటలు పండి ధాన్యం ఇంటికి చేరి, అవి అమ్మగా చేతులకు డబ్బులొచ్చి రైతులు అందరూ ఎంతో సంతోషంగా ఉండటం దేశానికి మంచిది. రైతు సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇలా ఉత్తరాయణ ప్రారంభమే ఓ గొప్ప ఆశతో మొదలవుతుంది కాబట్టి ఈ ఉత్తరాయణం శాస్త్రపరంగానూ, ఆధ్యాత్మిక పరంగానూ అందరికీ మంచి చేయాలని కోరుకుందాం. ◆ వెంకటేష్ పువ్వాడ

ఆరోగ్యానికొక అవకాశమిద్దాం!!

అవకాశం జీవితాలను ఎన్నో మలుపులు తిప్పే అద్భుతం అని చెప్పవచ్చు. అది రంగం ఏదైనా, వ్యక్తులు ఎవరైనా, పరిస్థితులు ఎలాంటివైనా అవకాశం అంటే అదృష్టమే. అవన్నీ మనిషి సామాజికంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మనిషి ఏదైనా సాధించాలంటే మొదట ఆరోగ్యవంతుడిగా ఉండాలి. దురదృష్టవశాత్తు నేటి కాలంలో సంపూర్ణ ఆరోగ్యవంతులు కరువయ్యారు.  కొన్నేళ్ల కిందట పల్లెల్లో కష్టం చేసుకుని బతికే వాళ్లకు ఎలాంటి జబ్బులు రావడం లేదు, వాళ్ళ జీవితకాలం పట్టణాల్లో నివసించేవాళ్ళతో పోలిస్తే ఎక్కువ అని చెప్పుకునేవాళ్ళం. వాళ్ళ కష్టమే కాకుండా వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా వాళ్ళ శారీరక దృఢత్వానికి కారణం. అయితే నూతన ఒరవడికి ఆకర్షించబడని జీవులు అంటూ ఉండరు. ముఖ్యంగా మనుషులు కొత్తవాటి వైపు చాలా తొందరగా అడుగులు వేస్తారు. అది శుభపరిణామమే అయినా వాటిలో ఉన్న నష్టాలు వాటిలో ఉంటాయి అనే విషయాన్ని మొదట తెలుసుకోరు. ఫలితాలే మనుషుల ఆరోగ్యాలు రోజురోజుకు క్షీణించడం.  మనిషి సగటు జీవితకాలం క్రమంగా తగ్గిపోవడం. ఇవన్నీ చూసి కేవలం ఆందోళనతోనే పైకి పోయేంత బలహీనులున్నారంటే మనిషి మానసిక శారీరక స్థాయి నిలకడగా లేకుండా ఎంత కంపనాలకు లోనవుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆరోగ్యానికి ఒక అవకాశం ఇవ్వాలి ఇప్పుడు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మన ఆరోగ్యానికి మనమే ఒక అవకాశం ఇచ్చుకుందాం. అదేంటి అంటారా……. చూద్దాం మరి. ఆహారం!!  ఆరోగ్యం ముఖ్యంగా ఆహారం మీదనే ఆధారపడి ఉంది. ఆహారం శక్తికి మూలవనరు. శక్తి ద్వారా శరీర సామర్థ్యము పెరుగుతుంది. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. ముఖ్యంగా ఆడవాళ్లు ఆహారం విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎముకలు, నరాల బలహీనత వంటి సమస్యలు కొనితెచ్చుకోవద్దు. ఎందుకంటే ఓ దశలో ఆడవాళ్లు బిడ్డల్ని మోయాలి, తమ శరీరంలో ఆ బిడ్డల ఎదుగుదల బాగుండాలి అంటే ఆడవాళ్లు మెజ్నదు బాగుండాలి. అలాగే వయసుకు తగ్గట్టు అందుబాటులో ఉన్న వాటిలోనే సమర్థవంతమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే బాగుంటాము. ఇంకా ముఖ్యంగా బయట ఆహారాన్ని వదిలెయ్యాలి. శుభ్రత!! ఆరోగ్యం విషయంలో శుభ్రత ముఖ్యమైనది. వండుకునే కూరగాయలను శుభ్రంగా కడిగి వండుకోవడం నుండి, వంటగది, ఇల్లు, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వరకు అన్నిరకాలుగా శుభ్రత ఉండాలి. ఒకేసారి పెద్ద మొత్తం వండి వాటిని అలాగే పెట్టి వాటిని మళ్ళీ తినడం బదులు అవసరమైనప్పుడు కొద్దిగా వండుకోవడం ఉత్తమం. సమయం వేస్ట్ అవుతుందనే ఆలోచనతో ఒకేసారి వండుకోవద్దు. తప్పనిసరిగా ఆహారపదార్థాలు కానీ, సరుకులు కానీ నిల్వ చేసుకోవాల్సి వస్తే ఆ ప్రదేశాలను, కంటైనర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. జాగ్రత్తలు!! జాగ్రత్తల వల్ల సమస్యలు రాకుండా ఉండవచ్చు, వాటిని దూరంగా ఉంచవచ్చు.  బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించడం. ఎక్కడ ఉమ్మి వేయకుండా ఉండటం, గుంపుగా ఉన్న చోట తినకుండా ఉండటం, ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జన చేయకుండా ఉండటం. తుమ్ములు వచ్చినప్పుడు కర్చీఫ్ అడ్డు పెట్టుకోవడం. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు రద్దీ ప్రాంతాలకు వెల్లకపోవడం మంచిది. మాంసాహారం ఏదో చెడు చేస్తుంది అని చెప్పడం కంటే దాన్ని కూడా జాగ్రత్తగా వాడిస్తాం మంచిది. వీలైతే తాజాగా ఉన్న మాంసం తీసుకోవడం మంచిది. కాసింత ధర ఎక్కువైనా హాస్పిటల్ కు వెళ్లే గోల తప్పుతుంది కదా.  దగ్గరగా దగ్గరగా….. దేనికి దగ్గరగా ఉండాలి అని ప్రశ్న వద్దు. మనిషి శరీరం ఆ ప్రకృతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పంచభూతాల కలయిక అయిన ఆ ప్రకృతి, మనిషి శరీరం రెండూ కూడా ఓకేలాంటివి. అందుకే వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండేలా అయితే మంచిది. ఇంకా మనిషి శరీరాన్ని పటిష్టం చేసి రోగనిరోధక శక్తిని పెంచే మన ప్రాచీన మార్గాలు అయిన ఆయుర్వేదం, యోగ, ప్రాణాయామం వంటివి ఎంతో గొప్పగా దోహదం చేస్తాయి.  పైన చెప్పుకున్నట్టు అన్నివిధాల ఆలోచించి మన ఆరోగ్యానికి మనమే అవకాశం ఇచ్చుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం పదిలం.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

తనదాకా వస్తే కానీ

అది ఓ మారుమూల పల్లెటూర్లోని చిన్న పెంకుటిల్లు. పెద్దగా సంపద లేకపోయినా ఆ ఇంట్లో సంతోషానికి మాత్రం లోటు లేదు. ఓ భార్యాభర్తా, వారికి ఓ కొడుకూ కూతురు... ఇలా నలుగురూ హాయిగా ఆ ఇంట్లో జీవిస్తుండేవారు. వాళ్లు మిగిల్చిన చిన్నా చితకా ఆహారం మీద ఓ ఎలుక బతుకుతూ ఉండేది. ఇలా ఉండగా ఓ రోజు ఆ ఇంటి యజమాని ఏదో కొత్త వస్తువుని తీసుకురావడం ఆ ఎలుక గమనించింది. అదేమిటా అని తన కన్నంలోంచి చూసిన దాని గుండె పగిలిపోయింది. తనని పట్టేసేందుకు యజమాని ఒక బోను తీసుకువచ్చాడు.   ఎలుక లబోదిబోమంటూ పెరట్లోకి పరుగులెత్తింది. ఆ ఇంటి పెరట్లో ఒక కోడి, మేక, పొట్టేలు ఉన్నాయి. ముందుగా కోడి దగ్గరకి వెళ్లి ‘మీ యజమాని నాకోసం ఒక బోను తీసుకువచ్చాడు. అది ఎవరికైనా హాని చేయవచ్చు జాగ్రత్త! వీలైతే దాన్ని నీ కాళ్లతో లాగి అవతల పారేయ్‌,’ అంటూ హెచ్చరించింది ఎలుక.   ఎలుక మాటలకు కోడి నవ్వేస్తూ- ‘నీ కోసం తెచ్చిన బోనుతో నాకు ప్రమాదం ఎలా ఉంటుంది. నేను దాని జోలికే పోను. నువ్వే జాగ్రత్త!’ అంది. అయినా ఎలుక తన పట్టు విడవకుండా పక్కనే ఉన్న మేక, పొట్టేలు దగ్గరకు కూడా వెళ్లి ఇదే హెచ్చరికను చేసింది. కానీ వాటి నుంచి కూడా కోడి చెప్పిన జవాబులాంటి సమాధానమే వినిపించింది.   తన మాటని ఎవ్వరూ వినకపోగా, తనని హేళన చేయడంతో ఎలుక చిన్నబుచ్చుకొని తన కలుగులోకి చేరింది. ఇక మీదట తనే కాస్త జాగ్రత్తగా ఉండేందుకు నిర్ణయించుకుంది. ఆ రోజు రాత్రి బోనులో ఏదో పడిన చప్పుడి వినిపించింది. అదేమిటా అని తెలుసుకునేందుకు ఇంటి యజమానురాలు ఆసక్తిగా బయటకి వచ్చింది. అంతే! బోనులో తోక ఇరుక్కుపోయిన ఓ త్రాచుపాము పడగ మీద ఆమె కాలు పడింది. తన తల మీద కాలు పడితే పాము ఎందుకు ఊరుకుంటుంది. వెంటనే యజమానురాలిని ఒక్క కాటు వేసింది.   యజమానురాలి అరుపులు విన్న యజమాని వెంటనే పాముని చావబాది, భార్యని వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. వైద్యుడు ఏదో చికిత్స చేసి పంపాడే కానీ, రోజులు గడిచేకొద్దీ యజమానురాలి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. భార్యకు నయమయ్యేందుకు భర్త అన్ని ఉపాయాలూ పాటించడం మొదలుపెట్టాడు. అలా ఎవరో అతనికి కోడిమాంసంతో చేసిన కషాయంతో గుణం కనిపిస్తుందని చెప్పగానే వెంటనే పెరట్లోని కోడిని ఒక్క వేటు వేశాడు.   రోజులు గడిచినా యజమానురాలి ఆరోగ్యంలో ఎలాంటి మార్పూ రాలేదు సరికదా మరింత క్షీణించసాగింది. దాంతో ఆమెను ఆఖరిసారి చూసేందుకు దగ్గరి బంధువులంతా తరలి వచ్చారు. మరి వారందరికీ భోజనం ఎలా! అందుకని ఆ రోజు వారికి ఆహారంగా మేకని బలిచ్చారు. ఇక మరో వారం గడిచేసరికి యజమానురాలు కన్నుమూసింది. ఆమె అంత్యక్రియల కోసమని బంధువులతో పాటుగా వీధివీధంతా కదిలి వచ్చింది. ఆ రోజు వారికి ఆహారంగా పొట్టేలు తల తెగిపడింది. ఇదంతా తన కలుగులోంచి చూస్తున్న ఎలుక మాత్రం బతుకుజీవుడా అనుకుంది.   ‘సంఘంలో బతుకుతున్నప్పుడు, ప్రతి ఒక్కరి సమస్యా ఇతరులని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది’ అన్న సూత్రం ఈ కథలో బయటపడుతుంది. కష్టం మనది కాదు కదా! అనుకుని దాన్ని అశ్రద్ధ చేస్తే చివరికి అదే కష్టం మన తలుపు తట్టే రోజు వస్తుంది. అలా కాకుండా తోటివారి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తే, అది మనకి తెలియకుండానే ఏదో లాభాన్ని అందిస్తుంది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.