Read more!

అక్షయతృతీయలో అంతరార్థం!!

భారతీయ మహిళ తళుక్కున మెరిస్తే, మెరుపంతా అందరి కళ్ళను ఇట్టే తనవైపు తిప్పేసుకుంటే, ఇంకా అందంగా, ఆకర్షణగా ఉన్న అమ్మాయి కనబడితే పుత్తడి బొమ్మ అనే పేరుతో పిలిచి మురిసిపోతారు. 

పండుగ, ప్రత్యేక వేడుక వంటి వాటిలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు ప్రఝీ ఒక్కరు కనీసం ఒక్క అభారం అయినా పెట్టుకోకుండా ఉండరు. ఇంకా పెళ్లి కూతురో, ఆభరణాల కలెక్షన్ మీద ఎప్పుడూ హై క్లాస్ జీవితాలను గడిపేవాళ్లను గమనిస్తే ఎప్పుడూ బంగారం ఒంటి మీద పెట్టుకుని, బంగారం మెరిసినట్టే మెరుస్తూ ఉంటారు. ఇలా బంగారానికి బంగారం లాంటి మహిళలకు మధ్య ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు. మగవాళ్ళు కూడా ఉంగరాలు, బ్రేస్లేట్లు, మెడ గొలుసులు ధరించి తమ హుందాతనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. 

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆషాఢమాసం, అక్షయ తృతీయ వంటి సందర్బాలలోనూ, శ్రావణ మాసపు పెళ్లి వేడుకల ముందు బంగారం కొనుగోళ్లు ఎక్కువ. నిజం చెప్పాలంటే ఈ బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు భారదేశంలో. కార్లు, విలువైన వస్తువులు కొనడం వల్ల కాలక్రమేణా అవి పాతబడేకొద్ది వాటి విలువ క్రమంగా తగ్గుతుంది కానీ పెరగదు. కయితే బంగారం మాత్రం కాలంతో పాటు తప్పకుండా రెక్కలు పెంచుకుని ధరల పరంగా పెరుగుతూనే ఉంది, ఉంటుంది కూడా. 

ఈ కారణంగా భారతీయ మహిళలు డబ్బును బంగారానికి వెచ్చించడానికే ఎక్కువ ఇష్టపడతారు. భారతదేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరిగే రోజుల్లో అక్షయతృతీయ కూడా ఒకటి. ఎంతోమంది అక్షయతృతీయ రోజు బంగారం కొనడం ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తూ ఉంటారు కూడా. ధగధగధగ మెరిసిపోయే బంగారం ఇంటికి లక్ష్మీకళ తెచ్చిపెడుతుందని సగటు భారతీయ మహిళ నమ్మకం. 

అక్షయ తృతీయ ప్రత్యేకత!!

చాలామందికి అక్షయతృతీయ అంటే బంగారం కొనడం, లక్ష్మీదేవిని పూజించడం ఇవే తెలుసు. నిజానికి వ్యాపార ప్రకటనలు కూడా అక్షయ తృతీయ అంటే బంగారం కొనడమని, ఆరోజు బంగారం కొంటె ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుందని చెబుతారు. ప్రజలకు ఆశ ఎక్కువ. నేటి కాలంలో ధనవంతులు కావాలనే ఆశ ఉండనిది ఎవరికి?? అందుకే అక్షయతృతీయ రోజు బంగారం కొనడానికి చాలా కష్టాలు కూడా పడతారు. 

కానీ అక్షయ తృతీయలో ఉండే అంతరార్థం ఏమిటో తెలుసా??

వైశాఖ శుద్ధ తదియ రోజు చేసే ఏ పూజ అయిన, యగమైనా, దానము అయినా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలనంటే ఆరోజు చేసే ఏ పని అయినా ఐశ్వర్యం పెంపొందెలా చేస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. 

ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవాసం చేసి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలుగుతారు.

ఇదీ నిజమైన అక్షయతృతీయ వెనుక ఉన్న రహస్యం. కాబట్టి కెవలం బంగారం, వెండి వంటి వస్తువులు కొనడానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మొదట ఆ మహావిష్ణువును పూజించి ఆయన కృపకు పాత్రులవ్వాలి.


                                 ◆వెంకటేష్ పువ్వాడ.