శిలువ మోసిన లోక రక్షకుడు!!
posted on Apr 15, 2022 @ 9:30AM
ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో విభిన్న మతాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాలలో అయితే వాళ్లకు క్రైస్తవమొక్కటే ఉంటుంది. అందులోనే వారు తమ సకల జీవితాన్ని గడుపుతారు. భారతదేశంలో క్రైస్తవ మతం మొదలయ్యి మెల్లగా వ్యాప్తి చెందుతూ ఉంది.
ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. అందుకే ప్రతి ఊర్లో ఇప్పుడు చర్చిలు వెలిశాయి. మతం ప్రాతిపదికగా కాకుండా అందులో ఉన్న విషయం మూలంగా చూస్తే ప్రతి మతం ఓ గొప్ప మార్గమే. అలాంటి మార్గాలలో క్రైస్తవం కూడా ఒకటి. ఈ క్రైస్తవ మతానికి జీసస్ దేవుడు. ఈయనను తండ్రిగా భావిస్తారు. అలాంటి క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించేది, క్రిస్మస్ వేడుకల కంటే ఎంతో పవిత్రమైన సందర్భం గుడ్ ఫ్రైడే.
అసలు ఏమిటి గుడ్ ఫ్రైడే??
యేసుక్రీస్తును శిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడే గా చెప్పుకుంటారు. నిజానికి ఇదొక విషాద సంఘటన. అయితే క్రైస్తవ మతస్తులకు ఒక సంస్మరణ దినం లాంటిది. పాశ్చాత్య దేశాలలో దీనిని హొలీ ఫ్రైడే అని, బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే యేసు క్రీస్తును శిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడే గా, ఆ రోజున క్రీస్తును స్మరించుకుంటూ సమస్త క్రైస్తవ పౌరులు గుడ్ ఫ్రైడేను నిర్వహిస్తారు.
ఎందుకు పవిత్రమయ్యింది??
ఆ దేవుడి కుమారుడు యేసు ప్రభువు అయ్యాడు. ఆయన ఈ లోకానికి తగిన మార్గనిర్దేశకం చెయ్యడానికి వచ్చాడు. ఆయన భోధనల ద్వారా తన గొంతును వినిపించాడు. అయితే ప్రతి ఒక్కరికి మరణం అనేది అనివార్యం అయినట్టు యేసు ప్రభువుకు కూడా మరణం ఎదురయ్యింది. అయితే అది మరణం కాదు. ఆయన గొంతును అడ్డుకోవడానికి, ఆయన మాటలు రుచించని వాళ్ళు చేసిన మారణహోమం లాంటిది. ఆయన తన పని పూర్తిచేసుకుని మరణానికి లొంగిపోయారు. ఆయన వచ్చిన పని పూర్తయ్యింది అందుకే మరి. ఆయన శిలువ వేయబడిన రోజు లోకులకు పవిత్రదినమయ్యింది.
చివరి పలుకులు!!
యేసు ప్రభువు మానవాళికి తన సందేశాన్ని వినిపించాలని అనుకున్నారు. అలాగే వినిపించడం మొదలుపెట్టారు. ఈయన దేవుడి కుమారుడిని ఆయన్ను హతం చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు మొదలయ్యాయి. యేసు ప్రభువు శిష్యుడే డబ్బుకు ఆశ పడి, యేసు ప్రభువు ఉనికి తెలిపాడని. అది ముప్పై మూడు వెండి నాణేల కోసమని అందుకే గుడ్ ఫ్రైడే రోజున కొన్ని ప్రాంతాలలో ముప్పై మూడు సార్లు గంట కొట్టడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతోందని చెబుతారు.
ఇకపోతే యేసు ప్రభువును సజీవంగా శిలువ వేసి, ముళ్ళ కిరీటం పెట్టి, చేతులలో, కాళ్ళలో మేకులు దింపి చేసిన హింస తలచుకుని చర్చిలలో ఆయనకు విషాదగీతాలతో నీరాజనం అందిస్తారు.
పాపాలను కడిగివేసే రుధిర పుత్రుడు!!
మీ పాపాలను నాయందు వేయండి నేను భరిస్తాను అని అంటారు యేసు ప్రభువు. ఆయన శిలువ వేయబడినప్పుడు చిందిన ప్రతి రక్తపు బొట్టు సకల జనుల పాపాలను కదిగివేసిందని విశ్వశిస్తారు. ఇంకా యేసు ప్రభువు చివరగా చెప్పిన ఏడు మాటలను పదే పదే తలచుకుంటారు.
ఈస్టర్!!
గుడ్ ఫ్రైడే శుక్రవారం వస్తుంది. ఆరోజు శిలువ వేయబడ్డ యేసు ప్రభువు జరిగి మూడురోజుల తరువాత లేచాడని, అంటే ఆదివారం రోజున ఆయన సజీవంగా కనిపించారని చెబుతారు. ఆ సంతోష సందర్భంగా ఆదివారం రోజున ఈస్టర్ జరుపుకుంటారు. ఎంతో ప్రత్యేకంగా, పవిత్రంగా భావించే గుడ్డును ఈరోజు వీరి ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకుంటారు. ఇంకా గుడ్డు ఆకారంలో బోలెడు అలంకరణలు కూడా చేస్తారు. బైబిల్ లో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ గురించి ఎలాంటి ప్రస్థావనలు లేకపోయినా యేసు ప్రభువును స్మరిస్తూ వీటిని ఎన్ని ఏళ్లుగా జరుపుకుంటూనే ఉన్నారు.
◆ వెంకటేష్ పువ్వాడ