అలసట వీడని వలస ప్రయాణం !!

  ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో ఎక్కువగా కనబడేది వలస. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పొట్టకూటి కోసం కొందరు, బతుకు తెరువు కోసం కొందరు, బతుకును ఇంకా మెరుగు పరుచుకోవాలని కొందరు, ఆశాజనకమైన జీవితంలో అందలాలు ఎక్కాలని కొందరు ఇలా కారణాలు ఎన్నో ఉన్నా వలస అనేది నేటి భారతాన్ని పత్తి పీడిస్తున్న పెద్ద సమస్య.పల్లెల నుండి పట్టణాలకు, పట్టణాల నుండి రాష్ట్రాలకు, రాష్ట్రాల నుండి దేశాలకు సాగుతున్న ఈ వలస దారుల పరంపర భారతదేశ అభివృద్ధినిపై కూడా ప్రభావం చూపిస్తోందని చెప్పవచ్చు. ఒకప్పుడు!! గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు పడక, పంటల కళ లేక, కరువు తాండవించి, భూములు బీడెక్కి తిండి గింజ లేక, కొనుక్కోవడానికి పైసా చేతిలో లేక ఎన్నో అవస్థలు పడేవాళ్ళు. అలా గ్రామీణ ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలలో ఒకరో ఇద్దరో పట్టణాలకు వెళ్లి అక్కడ భవన నిర్మాణ పనులు, రోడ్డు నిర్మాణ పనులు, ఫ్యాక్టరీలలో పనులు, రోజు వారీ కూలీలుగా ఇలా ఎన్నో పాత్రలలోకి మారిపోయి నాలుగు కాసులు జేబులో నింపుకుని, తాము తిని అంతో ఇంతో పల్లెల్లో ఉన్న కుటుంబాలకు కూడా పంపేవారు.  అయితే ఈ వలస కూడా క్రమంగా కొత్త పుంతలు తొక్కుతూ వస్తోంది. నయా వలసల మేళా!! నిజానికి  ఏదో కాలం బాగోలేక పల్లెల్లో బాగుకు బారమై పట్టణాలకు వెళ్ళడాన్ని వలసగా చిత్రించిన సమాజం, నేటి ధనవంతులు, విద్యాదికులు చేస్తున్నదానికి ఆ పదాన్ని అపాదించడానికి తటపటాయిస్తుంది ఎందుకో మరి. చక్కని చదువు, మంచి ఉద్యోగం, ఆశించినంత వేతనం. ఇవన్నీ ఉన్నా నేటి యువత విదేశాలకు వినీలాకాశంలో రెక్కలు కట్టుకుని వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ఎంతో మేధస్సు కలిగిన భారత యువత తమ తెలివితేటలను పక్క దేశాలకు అమ్మేస్తూ వారి చెంతన అతిథులుగా ఉంటున్నారు. నిజానికి ఈ డిజిటల్ యుగంలో అన్ని చోట్లా తమదైన ముద్ర వేస్తున్న వాళ్లలో భారతీయులే ఎక్కువ ఉన్నారు. అదే ప్రతిభ పుట్టిన దేశం కోసం వినియోగిస్తే భారత్ కూడా సాంకేతిక అభివృద్ధిలో కొత్త దారుల్లో పరుగుపెట్టి, నిరుద్యోగ విలాపాన్ని తగ్గించుకుంటుంది. ఇలా కొత్తరకపు విద్యావంతుల వలస కూడా భారతదేశ ఆర్థిక, అభివృద్ధి, సామాజిక తీరుపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. విదేశాలకు తరలిపోవడం ఒక స్ట్రేటజీగా భావిస్తున్న వాళ్ళు ఆ రెక్కల లోకం అంతా ఆకాశం లాంటిదే అని, ఎప్పటికీ పుట్టిన దేశమే నడక నేర్చిన భూమే తల్లిలాంటిదని తెలుసుకునే సమయం రావాలి. రంగుల జీవితం, మాటల మాయలో గందరగోళం!! ఇవన్నీ ఒక ఎత్తైతే అసలైన వలస మరొకటి ఉంది. ఎక్కువ జీతం ఇస్తారనే ఆశతో కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాలకు వలస పోతున్న వాళ్ళు భారతదేశంలో కోకొల్లలు. తీరా అక్కడికి వెళ్ళాక అడ్డమైన చాకిరీ చేయలేక ఆ అరబ్బుల హింసలు భరించలేక, దొంగ వీసాలు, వీసా కాలం చెల్లిపోయి తిరిగి రాలేక సతమతం అవుతున్న వాళ్ళు ఎందరో!! వాళ్లలో ఆడవాళ్ళ జీవితాలు మరీ ఘోరంగా ఉంటాయి.  పిల్లలను చదివించాలని, పెళ్లిళ్లు చేయాలని, తిండి లేక అల్లాడుతున్న కుటుంబాల కళ్ళలో వెలుగు నింపాలని ఇలా ఎడారి దేశాలకు వలస పోయి, అక్కడ దుర్భరమైన జీవితాలు వెళ్లదీస్తున్న వారిని ఉద్దేశిస్తూ సినిమాలు, సాహిత్యంలో కథలు, కథల పుస్తకాలు కూడా వెలువడ్డాయి అంటే ఆ జీవితాలు ఎంత ప్రభావితం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.  సమైక్య సంపాదనే పరిష్కారం!! జీవించడం ఖరీదుగా మారిపోతోంది. కాలంతో పాటు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకరి సంపాదనతో జీవించం ఈ కాలంలో ఎంతో కష్టం. అందుకే సమైక్య సంపాదనే జీవితాలు బాగుండటానికి పరిష్కారమని అర్థం చేసుకోవాలి. కనీసం రెండు చేతుల సంపాదన సాధ్యమైతే కుటుంబం కాస్త ప్రశాంతంగా ఉండగలదు. ముఖ్యమైన సూత్రం!! అందరూ చదువుకుంటేనే ఉద్యోగం అనుకుంటారు. చదువుకు ఉద్యోగానికి సంబంధం ఉన్న, చదువు లేకుండా వ్యాపారాలు చేస్తూ విజృంభిస్తున్న ఎన్నో జీవితాలు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి చదువును చదువుగా చూస్తూ, చదువు ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని, జీవితానుభవాల ద్వారా సమాజాన్ని చదువుతూ సంపాదనకు సోపానాలు నిర్మించుకోవాలి. లేకపోతే వలస అనే రాకాసి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. ◆ వెంకటేష్ పువ్వాడ

పంచభూతాల ఆకలి తీర్చాలి!! 

ఈ ప్రపంచాన్ని నిలబెడుతున్నవి ఏవి అంటే పంచభూతాలే. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవన్నీ అద్భుతాలు. హేతువాదులు భూతం లేదు వాతం లేదు అని కొట్టి పడేసినా వాటిని సైన్స్ పరంగానూ, సోషల్ పరంగానూ ఆవరణాలు, భౌతిక రసాయన కేంద్రకాలు అని మాట్లాడినా మొత్తం మీద ప్రపంచాన్ని రక్షిస్తున్నవి అవే. అయితే మనిషి తన స్వార్థంతో వీటిని అంతకంతకూ అదుపులో పెట్టాలని, అణచాలని చూస్తున్నాడు. కానీ అది ఎంత తప్పో అపుడపుడు ప్రకృతీ వైఫరిత్యాల ద్వారా అర్థమవుతూనే ఉన్నా చీమ కుట్టినట్టు కూడా అనిపించదు మనిషికి. చెట్లను నరికేస్తాడు, పచ్చదనాన్ని అనిచేస్తాడు, ప్రవాహలను అడ్డుకుని ప్రాజెక్టులు కడతారు, నీటిని, గాలిని కాలుష్యం చేస్తాడు. ఇట్లా మనిషి తన పరిధిలో ఉన్న ప్రతి దాన్ని అడ్డుకుంటూ ఆ ప్రకృతిని కూడా శాసించాలని చూస్తున్నాడు. ఈ పంచభూతాలకు ప్రకృతి అని, దాన్ని కూడా ఒక దేవతగా భావించి పూజించే ప్రత్యేకత మన భారతదేశానిది. అయితే క్రమంగా పాశ్చాత్య దేశాల ప్రభావం మన దేశ పౌరులపై పడి ఆ ప్రకృతిని హింసిస్తున్నాడు మనిషి. చెట్లు ఆరోగ్యానికి మెట్లు. చెట్లు నాటడం అంటే గొప్ప యజ్ఞం చేయడం. మొక్క నాటి సంరక్షించి దాన్ని పెంచి పెద్ద చేస్తే వంద యజ్ఞాలు పూర్తి చేసినంత పుణ్యం వస్తుంది. అది ప్రకృతికి సేవ చేసినట్టే అవుతుంది. ఆ ప్రకృతి ఆకలి తీర్చినట్టే అవుతుంది. భూమి తాపం తీర్చాలి!! ఎక్కడ చూసినా సిమెంట్ తో కప్పబడిన రహదారులే. ఇంటి ముంగిలి నుండి, రహదారులు పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇళ్లలో కూడా చలువరాతి బండలు పరిచి ఉంటాము. ఇంకా ఒకదాని మీద మరొకటి అంతస్థుల మీద అంతస్తులు అవన్నీ కలసి మనిషి మనుగడకు ఎంత సమస్య తెచ్చిపెడుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. మనిషి పుట్టాక జీవితకాలంలో ఎలా మార్పులు చెందుతూ ఉంటాడో అలాంటిదే ఈ భూమి విషయంలో కూడా జరుగుతుంది. అయితే మనిషి ఎన్ని దశలు మారినా శరీరానికి తగిన పోషణ ఇవ్వడం మాత్రం మానుకోడు. మరి భూమి విషయంలో ఎవరూ ఆలోచించరేం. ఒకప్పుడు ఎక్కడ చూసినా మట్టి నేల. వర్షం పడితే ధారగా భూగర్భంలోకి చొచ్చుకుపోయే నీళ్లుఇప్పుడు కాంక్రీటు రోడ్ ల మీద ప్రవహించి చివరికి ఏ మురికి కాలువలోనో కలసిపోతున్నాయి. పలితంగా భూమిలోపల విపరీతంగా వేడి పెరిపోయి అది భూకంపాలకు, భూమి నిస్సారతకు కారణం అవుతోంది. జలకాలుష్యం, వాయు కాలుష్యం! ఇవి రెండూ తలచుకుంటే  బాబోయ్ అనిపిస్తుంది. ఒకప్పుడు నదీ జలాలకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, పుష్కరాలు జరుపుతూ ఉంటే అదంతా ప్రకృతీ ఆరాధనలో భాగంగా ఉండేది. అయితే ఫ్యాక్టరీలు ఏర్పడ్డాక వాటి వ్యర్థాలు నీళ్లలోకి వదులుతూ జలకాలుష్యం బాగా పెరిగిపోయింది. కానీ మూర్ఖుల వాదన ఎలా ఉంటుంది అంటే నదీజలాల ప్రత్యేక పూజలు వల్లే జలకాలుష్యం జరుగుతోందని వాదిస్తారు. అంతేనా ప్రకృతిని ఆరాధించడం మూర్ఖత్వం అని కూడా అంటారు.  మన భారతీయులకు ప్రతిభ లేదు, వారు కనిపెడుతున్న అన్ని రకాల యంత్రాల సహయంతోనే నేడు మనిషి ఎంతో సంతోషంగా ఉంటున్నాడు అని గొంతు అరచి చెప్పే నాస్తిక, మూర్ఖత్వ వాదులకు ఆ యంత్రాల వల్ల వెలువడుతున్న పొగే వాయు కాలుష్యానికి మూలమని తెలియదు ఎందుకో!! ఒకప్పటి మహర్షుల నుండి ఇప్పుడు కూడా అక్కడక్కడా  జరుగుతున్న యజ్ఞాలు, యాగాలు, హోమాలు వంటివి వాయు కాలుష్యాన్ని శుద్ధి చేయడానికి ఎంతో గొప్పగా దోహదపడతాయని అందరూ వాదించే సైన్స్ పరంగానే ఆధారాలు లభ్యమవుతున్నా మనుషులు మాత్రం తమ పద్దతి మార్చుకోరు. పద్దతిగా  ఉండేవాళ్లను ఉండనివ్వరు. ఇప్పుడేం చెయ్యాలని సందేహమా!! పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పంచభూతాల ఆకలి తీర్చాలి. నీటిని శుద్ధి చేస్తూ వాతావరణాన్ని మార్చుకోవాలి. కాలుష్యాన్ని నివారించాలి. భూమి తాపాన్ని తగ్గించాలి. నదులు సముద్రాలు పిల్ల కాలువలు వీటిని కలుషితం చేయకూడదు. ఇన్ని సంవత్సరాల నుండి మనిషి ప్రకృతిని ఇష్టమొచ్చినట్టు వాడుతూ గందరగోళం చేసాడు కాబట్టి ఇప్పుడు ప్రకృతికి రుణాన్ని తిరిగిచ్చేయాలి. ప్రకృతిని పసిపాపలా చూసుకోవాలి. ◆ వెంకటేష్ పువ్వాడ

ముక్తి మార్గానికి తొలిమెట్టు!!

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్టికీమ్| అయుక్తః కామకారేణ ఫలే సక్తి నిబధ్యతే ॥ యుక్తుడు అయిన వాడు కర్మఫలములను వదిలిపెట్టి, పరమ శాంతిని పొందుతాడు. యుక్తుడు కాని వాడు కోరికలు తీరడం కోసం కర్మలు చేస్తూ, ఆ కర్మఫలముల ఆసక్తితో బంధనములకు లోనవుతున్నాడు. కర్మఫలాన్ని వదిలిపెడితే ఏం జరుగుతుంది. కర్మఫలాన్ని ఆశిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు పరమాత్మ, బంధనములకు కారణం ఆశ. మోక్షమునకు కారణం ఆశ లేకుండా ఉండటం. ఆశను వదిలిపెడితే బంధనములు ఉండవు. జ్ఞానం, ఆత్మ శాంతి కలుగుతుంది, ఆశతో కర్మలు చేస్తే బంధనాలు, దుఃఖము, పతనము కలుగుతుంది. ఆశగానీ ప్రతిఫలాపేక్ష గానీ లేకుండా కర్మలు చేస్తే చిత్తము నిర్మలంగా ఉంటుంది. అప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు. శాంతిని పొందుతారు. కాబట్టి కర్మయోగమైనా జ్ఞాన యోగమైనా పొందేది శాంతి. కాని కర్మయోగంతో కలిగే శాంతి తాత్కాలికము. జ్ఞాన యోగంతో కలిగే శాంతి శాశ్వతము. అందుకే దానిని ప్రశాంతి అంటే ప్రకృష్టమైన శాంతి అని అన్నారు. కాబట్టి యుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వాడు. ఏ కర్మచేసిన ఈ పని నేను చేస్తున్నాను అనే కరత్వభావనతో కాకుండా, ఈ పని నా స్వలాభం కోసం చేస్తున్నాను అని కాకుండా, ఈ పని భగవంతుని పరంగా చేస్తున్నాను. దీని ఫలితం భగవంతునికే అర్పిస్తున్నాను అనే భావనతో చేయాలి. అలా చేస్తే ముందు మనసు నిర్మలం అవుతుంది. తరువాత ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆఖరున ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. అయుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి లేని వాడు ఏ పని చేసినా తన స్వలాభం కొరకే చేస్తాడు. కర్మబంధనములలో చిక్కుకుంటాడు. తీవ్రమైన అశాంతికి గురి అవుతాడు. కాబట్టి ఆర్జించే ధనము, సిరిసంపదలు, పదవులు శాంతిని ఇవ్వలేవు. పైగా అవి పోతాయేమో అనే నిరంతర భయంతో అశాంతికి గురి అవుతాడు. ఈ శ్లోకంలో "నిభధ్యతే" అని వాడారు. అంటే ఆశతో, ప్రతిఫలాపేక్షతో కర్మలు చేస్తే బంధనములు తప్పవు అని నిర్ద్వంద్వంగా చెప్పాడు. కాబట్టి ముందు ఆశ, ప్రతిఫలాపేక్ష వదిలిపెట్టాలి అని తెలుస్తూ ఉంది. ఈ శ్లోకంలో పరమాత్మ పరమ శాంతి కలగడానికి మార్గం ఏమిటి అనేది. స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మానవుడూ మనశ్శాంతిని వెదుకుతున్నాడు. మనశ్శాంతి కొరకు బాబాలను, దేవుళ్లను, తీర్థయాత్రలను ఆశ్రయిస్తున్నాడు. కాని మనశ్శాంతి తన చేతిలోనే ఉందని తెలుసుకోలేకపోతున్నాడు. అదే అజ్ఞానము, అవిద్య, కేవలం, మనసులో నుండి ఆశను దూరం చేసి, ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తే ఆత్మశాంతి దానంతట అదే వస్తుండ్హి. ఇదే ఇందులో రహస్యం కాకుండా ఆశతో ఫలితం ఆశించి పనులు చేస్తే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాలను తాత్కాలికంగా మరిచిపోవడానికి సాయంత్రం బార్లను, డ్రగ్సును ఆశ్రయిస్తున్నారు. చేయవలసిన పని చేయడం లేదు. చేయకూడని పని చేస్తున్నారు. అదే నాకంతా తెలుసు అని అహంకారము, ఏమీ తెలియని తనం అంటే అవిద్య, కేవలము మనస్సును ఇటు నుండి అటు మళ్లిస్తే సరిపోయేదానికి రోజూ వందలు వేలు తగలేస్తున్నారు. అప్పులపాలై అప్పులు తీర్చలేక, దుఃఖంతో మరలా అదే వ్యసనానికి బానిస అవుతున్నారు. కాబట్టి ముందు మనలో ఉన్న తెలియనితనాన్ని పోగొట్టుకుంటే, బుద్ధి సక్రమంగా పని చేస్తుంది. విచక్షణా జ్ఞానం వస్తుంది. ఏ పని చేయాలో ఏపని చేయకూడదో, చేసే పని ఎలా చేయాలో అనే విషయం తెలుస్తుంది. మనస్సు ప్రాపంచిక విషయాల నుండి నివృత్తి మార్గంలోకి మళ్లుతుంది. అదే ముక్తిమార్గానికి తొలిమెట్టు. ◆ వెంకటేష్ పువ్వాడ  

కొత్త సంవత్సరపు లాంఛనం??

వచ్చేస్తోంది వచ్చేస్తోంది ఆంగ్ల సంవత్సరం కొత్త సంఖ్యను మోసుకొచ్చేస్తోంది. నిజానికి అన్ని సంఖ్యల లాగే ఇది కూడా, ఈ సంవత్సరం తరువాత మళ్ళీ ఇంకో కొత్త సంఖ్య, ఇంకో కొత్త సంవత్సరం. ఇట్లా మారుతున్న సంఖ్యలు చూసుకుని మురిసిపోతే జీవితం  మారిపోతుందా??  కొత్త సంవత్సరం అనగానే ఎక్కడలేని హుషారుతో, సంప్రదాయ పండగలకు కూడా చేయనంత హడావిడి చేస్తూ కేకులు, స్వీట్లు, నైట్ పార్టీలు, విందులు, వినోదాలు ఇలా ఒకటి, రెండు కాదు. ఇక ముఖ్యంగా చెప్పుకుంటే అందరికీ తెలిసిన విషయం ఈ కొత్త సంవత్సర వేడుకలలో ఇంత హంగామా సృష్టించే వాళ్లలో యూత్ ఏ ఎక్కువ. ముందు రోజు రాత్రి  మొత్తం పార్టీలతో, పబ్బులలో గడుపుతూ, వీధులన్నీ బైక్ లలో చక్కర్లు కొడుతూ చేసే గోలలో సంతోషాన్ని చూసుకునే వాళ్ళు కొందరు.  నిజానికి మన భారతీయులు పంచాంగం పరంగా తెలుగు సంవత్సరాదిని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉగాదికి ప్రాధాన్యం  ఇవ్వాలని చెప్పుకున్నా, ఈ ఆంగ్ల సంవత్సరాన్ని వేడుకగా చేసుకోవడంలో తప్పేమీ లేదనే అభిప్రాయం కూడా నిజమే కావచ్చు. అయితే!! ఈ కొత్త సంవత్సర సందర్భంగా చాలామంది కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా సంవత్సరం ప్రారంభమయిన కొన్ని రోజులకు తూ తూ మంత్రంగా సాగుతుంటాయి. కొత్త నిర్ణయాలు సాధ్యాసాధ్యాలు చూసుకునే తీసుకోవాలి!! నిర్ణయం తీసుకోవడం సమస్య కాదు. కానీ దాన్ని జీవితంలో అమలుపరచడం కొద్దిగా కష్టం. నిజానికి అది కూడా కష్టం కాదు, ఆ నిర్ణయం పట్ల సీరియస్ గా ఉన్నవాళ్లు అయితే దాన్ని తప్పకుండా పాటిస్తారు కూడా. కానీ ఎటొచ్చి ఆ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక ఫాషన్ గానూ, స్టేటస్ గానూ భావించి నలుగురిని అట్రాక్ట్ చేయడానికి చేసేవి అవుతున్నాయి చాలామంది విషయంలో. ఛాలెంజ్ లు ఒత్తిడులు వద్దు! ఈ ఇయర్ స్టార్టింగ్ నుండి నేను బరువు తగ్గడం మొదలు పెట్టేయాలి. ఈసారి అయినా డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు మానుకోవాలి. ఈసారి ఎదో ఒక విధంగా జాబ్ కొట్టాలి.  ఇలాంటి మాటలు చాలామంది దగ్గర చూస్తుంటాం. ఇలాంటి ఛాలెంజ్ లు మీరైతే తీసుకోవద్దు. అసలు ఛాలెంజ్ ఎందుకు చేసుకోవాలి. పేరుకు కొత్త సంవత్సరమే అయినా  కాలం ఏమి కొత్తగా ఎవరికోసం ఆగదు, ఎదురుచూడదు. ప్రత్యేకంగా ఎవరికోసం కాస్త మెల్లగా జరగదు. అలాంటప్పుడు ఇలాంటి ఒత్తిడి పెంచే ఛాలెంజ్ లు తీసుకుని తరువాత ఆ ఒత్తిడి వల్ల ఉన్న ప్రశాంతత పోగొట్టుకోకుండా. ఉండటం ఉత్తమం. అలాగని అలాంటివి వ్యర్థం అనడం లేదు. కానీ ఆ చేసేది ఏదో ఛాలెంజ్ లా కాకుండా లైఫ్ స్టైల్ లో ఒక భాగం చేసుకుంటే ఆహా!! రోజులో అదీ ఒక ప్రాముఖ్య విషయంగా మారి సమస్యలను సులువుగా తగ్గిస్తుంది. నిన్నటి కంటే ఈరోజు!!  ఈరోజు కంటే రేపు!! ఉత్తమంగా ఉండాలని చెప్పడం పరిపాటి. అందులో అర్థం మనుషులు మెరుగవాలని. ఎలా అవుతారు అంటే కొన్ని మంచి అలవాట్లు లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోవాలి.  పుస్తక పఠనం!! ప్రపంచ జ్ఞానాన్ని అందించేవి పుస్తకాలు. అలాంటి పుస్తక పఠనాన్ని లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోవాలి. మొబైల్ లో గంటల తరబడి బ్రౌజింగ్ చేసెబదులు కనీసం రోజులో గంట సేపు అయినా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. ఇదొక గొప్ప అలవాటుగా మారితే జీవితంలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది. ఆలోచన నుండి, జీవితంలో ఆచరించే ఎన్నో విషయాల్లో స్పష్టత తెలుసుకుంటారు. ఆరోగ్యం!! ప్రస్తుతం భారతదేశం యావత్తు బాధపడుతున్న సమస్యలు ఆరోగ్యపరమైనవే. అన్నీ జబ్బులు, విపత్తులు. వీటి ద్వారాయా మనిషి శారీరకంగా నష్టపోతున్నాడు.. అలాంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆహారం, అలవాట్లు, దినచర్య వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటూ తమను తాము రక్షించుకోవాలి. వ్యసనాలకు దూరంగా!! ఏ అలవాటు అయినా మరీ అతి అయితే అది వ్యసనమే అవుతుంది. మంచి విషయాలు అయినా సరే వ్యసనం అవ్వడం మంచిది కాదు. ఏది ఎంతలో ఉండాలో అంత ఉంటే మంచిది. ఎందుకంటే వ్యసనంగా మారే ప్రతిదీ జీవితంలో మిగతా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మంచి విషయలు కూడా వ్యసనం కాకూడదు. ఎవరి సంతోషం వాళ్ళ చేతుల్లో!! నిజమే. ఎవరి సంతోషం వాళ్ళ చేతుల్లో ఉండాలి. కొన్ని నిర్ణయాలు, కొన్ని ఇష్టాలు, కొంత స్వేచ్ఛ ఇవన్నీ అంతో ఇంతో ప్రతి మనిషికి ఉండాలి. అలా ఉంటే సంతోషం కోసం ఎక్కడో వెతనక్కర్లేదు. అది మనసులోనే ఉంటుంది అప్పుడు. కాబట్టి కొత్త సంవత్సరాన్ని ఛాలెంజ్ ల పరంపరలో కాకుండా లైఫ్ స్టైల్ తో లాంఛనంగా ప్రారంభించండి. ◆ వెంకటేష్ పువ్వాడ  

పోలిక…కారాదు పొలికేక!!

"ఆ పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో ఎంతబాగా చదువుతాడో, నువ్వూ ఉన్నావు. వేలు తగలడేస్తున్నా చదవనే చదవవు. ఏమి చేస్తాం అంతా మా కర్మ" ఒక ఇంట్లో కొడుకుపై ఒక తండ్రి గొంతు ఇది. "అసలు ఆడపిల్లలా ఉండనే ఉండవు. ఈ చుట్టుపక్కల నీలాంటి అమ్మాయిలు అసలు ఉండరు. నువ్వు ఒక్క పని చేయవు, ఎప్పుడు చూసినా మగరాయుడిలా ఉంటావు. ఏమీ లేకపోయినా ఆ చదువు ఉందని నీకు తెగ పొగరు. చక్కగా ఇంటి పని వంట పని నేర్చుకోమంటే అది ఇదీ చెప్పి ఎగ్గొడుతుంటావు. నువ్వు అడపిల్లగా పుట్టాల్సిన దానివి కాదు" మరొక ఇంట్లో కూతురి మీద  తల్లి ప్రచండ యుద్ధం ఇది. "అసలు నువ్వెప్పుడైనా నన్ను సుఖపెట్టావా?? సంపాదించడం సరిగా చేతకాదు. బొత్తిగా తెలివిలేని మనిషిని కట్టబెట్టారు మా వాళ్ళు. మా అక్క మొగుడు చూడు ఎంత పని చేస్తాడు, ఎంత తెలివిగా ఉంటాడు, ఎంత బాగా సంపాదిస్తాడు. మా తమ్ముడు నీకంటే, నా కంటే చిన్నోడు అయినా వాడే నయం. పెళ్ళానికి బంగారం తీసాడు, పిల్లల పేరున డిపాజిట్లు వేసాడు. నువ్వూ ఉన్నావు ఎందుకూ" సంసారంలో ఓ భార్య చేతిలో నలిగిపోతున్న భర్త పరిస్థితి ఇది. నాకు ఈ డ్రెస్ వద్దు, మా క్లాస్మేట్ వేసుకున్న డ్రెస్ బాగుంది అలాంటిది కావాలి" ఓ బుడ్డోడి మొండితనం. "మా ఫ్రెండ్స్ అందరి దగ్గరా మొబైల్స్ ఉన్నాయి, నాకు తీసివ్వండి లేకపోతే అన్నం తినను" తల్లిదండ్రుల దగ్గర ఓ కూతురి బ్లాక్మైల్. "వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చాయో, ఒకే స్కూల్, ఒకే తరగతి, ఒకే టీచర్ ను. అయినా నువ్వు ఒట్టి మొద్దు శుంఠవు" ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై మండిపాటు. పరిస్థితులు, సందర్భాలు, వ్యక్తులు ఇలా అన్నీ వేరు అయినా అక్కడ తొంగిచూసే కారణం 90% పోలిక. ఈ పోలిక ఎలాంటిదంటే సముద్రం ఎంతో ఆహ్లాదంగా ఉన్నా దానిలో దిగితే ఇక గల్లంతు అయిపోయే మనిషిలా, ఆ పొలికకు గురయ్యే మనిషి మనసు అంతే ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.  ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరొక మనిషికి భిన్నంగా ఉంటాడు, భిన్నంగా ఆలోచిస్తాడు, అట్లాగే జీవన సరళి, దానికి తగ్గ శక్తి సామర్త్యాలు కూడా భిన్నంగా ఉంటాయి.  కాబట్టే మనుషులు చేసే పనులలో బిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరూ దాని గురించి ఆలోచించరు. సాదారణంగా మనిషి సామర్థ్యము 90% అంతర్గతమైనదే. కేవలం 10% మాత్రమే బాహ్య ప్రభావాలకు లోనవుతూ ఉంటుంది. కానీ ఆ పదిశాతం ఏర్పాట్లు సరిగా సమకూర్చి, మిగిలిన తొంభై శాతాన్ని దెబ్బ తీస్తూ ఆ వ్యక్తి సరిగా ఉండటం లేదని పోల్చి చూడటం ఎంత వరకు సమంజసం. పుటైన దగ్గర నుండి ప్రతి దశలోనూ, ప్రతి విషయంలోనూ ఇలాంటి పోలిక పెళ్లి చూడటం, పోల్చుకోవడమనే వలయంలో పడి, ప్రతి మనిషి తమలో ఉన్న ప్రత్యేకతను చేతులారా కోల్పోతున్నారు అంటే ఆశ్చర్యంగానూ, బాధగానూ ఉంటుంది. ప్రతి మనిషి అంతర్గత శక్తి సామర్త్యాలను గుర్తించుకుని వాటిని క్రమంగా మెరుగుపరుచుకుంటూ ఉంటే ఒకనాటికి ఆ విషయంలో ఎంతో గొప్ప ప్రావీణ్యత పొందిన వారిగా గుర్తింపు పొందగలుగుతారు.  అంతేకానీ సమాజాన్ని చూస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను చూస్తూ పోల్చుకుని, చేతకాని వాళ్ళలా ఏమీ రాదు అనుకుంటూ  ఉంటే మానసిక సంఘర్షణ ఎక్కువై. చివరకు నిజంగానే చేతకాని వాళ్ళలా మారే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే ఎవరినీ ఎవరూ ఇతరులతో పోల్చుకోరాదు, ఎవరినీ ఇతరులతో పోల్చి తక్కువ చేసి చూడరాదు. ప్రపంచంలో ప్రతి వస్తువుకూ దేని ప్రత్యేకత దానికి ఉన్నట్టే మనిషికి కూడా ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని వారిదైన జీవితాన్ని ప్రోత్సహిస్తే, ఈ పోలికలు పొలికేకల్లా గందరగోళం సృష్టించవు జీవితాలలో. ◆ వెంకటేష్ పువ్వాడ

సహాయానికి రెక్కలు ఇవ్వద్దు!!

  మనిషికి ఉన్న గొప్ప గుణాలలో సాటి మనిషికి సహాయం చేయడం కూడా ఒకటి. నిజానికి ఇలాంటి సహాయగుణం అందరికీ ఉండదు కూడా. అడపాదడపా బయట వాళ్లకు సహాయం చేస్తూ ఉండే వాళ్ళు నా అనుకున్న వాళ్లు సమస్యల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఇంకెంత ముందుంటారో మాటల్లో చెప్పక్కర్లేదు. అయితే  ఈ సహాయ గుణం మెండుగా ఉన్నవాళ్లు పెద్ద తప్పు చేస్తున్నారని ఎవరో కొందరికే అర్థమవుతుంది. సహాయమా సోమరితనాన్ని పోషించడమా?? అసలు సహాయం అంటే ఎలా ఉండాలి?? సమస్యలకు పరిష్కారం చూపేలా ఉండాలా లేక పూర్తిగా సమస్య నుండి బయటపడేలా చేయాలా?? సమస్య నుండి బయట పడేస్తే ఆ సమస్య నుండి బయట పడినవాళ్ళు సంతోషంగా ఉంటారేమో కానీ ఆ సమస్య తాలూకూ ఇబ్బంది తెలియకుండా సమస్యను సమస్యగా అర్థం చేసుకోలేరు వాళ్ళు అన్నది ఒక ముఖ్య విషయం. చెప్పుకోవడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజం కూడా. సమస్యలలో ఉన్నపుడు ఆ సమస్యను భరించే సామర్థ్యాన్ని, లేదా దాన్ని అధిగమించే మార్గాన్ని చూపించాలి. అంతే కానీ ఒక కాలువ దాటడానికి ఇబ్బంది పడుతున్నపుడు ఇతవతల గట్టు నుండి అవతల గట్టుకు తీసుకెళ్లి కూర్చోబెడితే మధ్యలో ఉన్న ఆ కాలువ లోతు, దాని ప్రవాహ వేగం, దాన్ని తట్టుకుని దాటగలిగే నేర్పు ఇవన్నీ అర్థం కావు. సరిగ్గా ఇదే విషయమే సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి. అనుభవమే ఆప్తమార్గం!! సమస్య వచ్చిందీ అని మొర పెట్టుకోగానే సహాయ గుణం కలిగిన వాళ్ళు పరిగెత్తికుంటూ వెళ్లి, అయ్యో పాపం అనుకుంటూ తమలో ఉన్న నేర్పు, చాకచక్యంతో ఆ సమస్యను చిటికెలో పరిష్కరిస్తే అవతలి వాళ్లకి ఆ సమస్య ఎలా అర్థమవుతుంది అనే విషయం అర్థం చేసుకున్నవాళ్ళు పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. సలహాలు ఇస్తారు. ఫలితంగా సమస్యను నేరుగా భరిస్తూ పరిష్కరించుకునే అవకాశం బాధితులకు లభిస్తుంది. అదే సమస్య మరొక్కసారి ఎదురైనప్పుడు ఎవరి సహయమూ లేకుండా సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. అదే అనుభవం నేర్పే పాఠం. అనుభవం ఇచ్చే ధైర్యం. అత్యుత్సాహం అనర్థదాయకం!! కొందరుంటారు. వాళ్లకు నేర్పు ఎక్కువగా ఉంటుంది. సమస్యలను అధిగమించే నైపుణ్యం ఉంటుంది. అయితే ఇతరులు సమస్యలలో ఉన్నపుడు అత్యుత్సాహంతో వాళ్ళ  ముందు తమ ప్రతిభను చూపెట్టాలనో, వాళ్ళను ఆకర్షించాలనో వాళ్ళ సమస్యను తమ సమస్యగా భావించి సులువుగా పరిష్కరిస్తారు. దీని ఫలితంగా జరిగేది ఒకటే ఆధారపడిపోయే గుణాన్ని ఎదుటి వ్యక్తిలో పెంచడం. ఇలా ఆధారపడే గుణం పెరిగిపోతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఎంత చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకోలేక సహాయం కోసం చుట్టూ చూసే స్తాయికి దిగజారిపోతారు. కాబట్టి సహాయం ఎప్పుడూ అత్యుత్సాహంతో చేయకూడదు. ఎదుటి వారి సమస్యను దాని ప్రభావాన్ని బట్టి సలహా, సూచన, పరిష్కార మార్గం అన్నిటి తరువాత స్వయంగా తోడ్పాటు అందించడం వంటివి చేయాలి. అంతేకానీ ఎదుటి వారి సమస్యను మనది చేసుకుని వాటిని పరిష్కరిస్తూ ఉంటే మనం ఈ సమాజంలో చేతకాని వాళ్ళను తయారుచేస్తున్నట్టే లెక్క. పై విషయాలు అన్ని గమనిస్తే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఇదే రకమైన మార్గాలు అనుసరిస్తూ ఉంటారు. అంటే తమ పిల్లలను తామే చేతగానివాళ్లుగా తయారుచేస్తున్నారని అర్థం.  ఇలా మీ సహాయానికి రెక్కలు ఇచ్చి, పిల్లల రెక్కలు ఎదగనివ్వకుండా, వాటి సహాయంతో వాళ్ళు స్వయంగా ఎగరలేకుండా చేయకూడదు. చేశారంటే తల్లిదండ్రులు, పిల్లలు కూడా నష్టపోతారు సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ  

మీరు షాపింగ్ ఎందుకు చేస్తున్నారో తెలుసా?

తెల్లారిలేస్తే ఎదో ఒకటి కొనాలనిపిస్తుందా? కనిపించిందల్లా కొనకుండా ఉండలేకపోతున్నారా? అయితే.."కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్" ఉందేమో చూసుకోండి అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఆ మధ్య ప్రజల షాపింగ్ అలవాట్లు ఎలా ఉన్నాయో చూద్దామని... స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ "స్కూల్ ఆఫ్ మెడిసిన్" పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. అందులో తేలిన విషయం... ప్రతి 20మందిలో ఒకరికైనా ఈ "కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్" ఉందని... ఏమంత అవసరం లేని వస్తువులని కూడా కొనెయ్యటం, తరుచూ షాపింగ్ మాల్స్ కి వెళ్ళటం, తెల్లారి లేచి ఎదో ఒకటి కొనాలనే తాపత్రయం... ఇదో రుగ్మత స్థాయికి చేరి, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా... ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునే స్థాయికి చేరటం గమనించారు. ఆ అధ్యయనంలో ముఖ్యంగా ఆడవారిలో, అలాగే టీనేజ్ వారిలో ఈ డిజార్డర్ ఎక్కువగా ఉందట. మరి మీరు కూడా అవసరానికి షాపింగ్ చేస్తున్నారా లేక అనవసరంగా కేవలం సరదా కోసం షాపింగ్ చేస్తున్నారో తెలుసుకొని జాగ్రత్తపడితే మంచిది.  

జనారణ్యంలో అడవి మృగాల ఆర్తనాదాలు!! 

మనుషులు నివసిస్తున్న ఈ పట్టణాలు, గ్రామాలు వగైరాలను జనారణ్యం అని పిలుస్తుంటారు  అడవిలో ఉండేది మృగాలు అది మృగాల అరణ్యం అయితే, మనుషులు నివసిస్తున్న ఈ ప్రాంతాలను జనారణ్యం అంటుంటారు. మనుషులు కానీ  జంతువులు కానీ నివాస ప్రాంతాలను బట్టి జీవితాన్ని కొనసాగించడం పరిపాటి. అయితే మనుషుల్లో కూడా కాస్త మార్పులు వచ్చి మృగ లక్షణాలు పెరుగుతూ, తను అనుకున్నది సాధించడం అనే ఒక అహంకారపు గుణాన్ని బాగా పెంపొందించుకున్నారు. ఇలాంటి మనుషులను చాలామంది జంతువులతో పోలిక పెట్టి మాట్లాడుతూ ఉంటారు కూడా.  ఇక ఈ మనుషులు చాలా తెలివైనోళ్లు, తను ఈ ప్రపంచాన్ని ఈ ప్రకృతిని క్రమంగా అక్రమించుకుంటూ పోతున్నాడు. వాటికి తగ్గట్టు చట్టాలను రూపొందించుకుంటాడు, తరువాత అక్రమాలు చేసి డబ్బు సమకూర్చుకుంటాడు. ఈ భూమండలంలో భూమి, నీరు, అడవులు ఉండాల్సిన శాతంలో క్రమంగా అడవులను భూమిగా మారుస్తూ పోతున్నాడు. ఫలితంగా అడవుల శాతం మాత్రమే కాదు, నీతి శాతం ముఖ్యంగా భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ అడవులలో నివసిస్తున్న అడవి జంతువుల ఆవేదన ఎవరూ అర్థం చేసుకోలేనిది. అడుగు భూమిని ఎవడైనా ఆక్రమిస్తే ఎన్నో గొడవలు, పంచాయితీలు, కోర్ట్ కేసులు ఎంతో తతంగం చేసే మనుషులు జంతువుల ప్రపంచం అయిన అడవులను అక్రమిస్తూ తిరిగి వాటినే మళ్లీ శిక్షకు గురిచేస్తూ ఉంటారు. అటవీ  విసీర్ణం తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న జంతువులకు ఆహారం నీరు కొరత ఏర్పడి చచ్చిపోతున్నాయి. మరికొన్ని మనుషుల చేతుల్లోనే అదృశ్యమవుతున్నాయి. అలాంటి చిన్న జంతువులను ఆహారంగా వేటాడే పెద్దజంతువులు ఈ చిన్న జంతువుల సంఖ్య తగ్గిపోవడమూ, నీటి కొరస్థ ఏర్పడటం వల్ల దిక్కుతోచని స్థితిలో అటవీ  మార్గం నుండి జనవాసాల మధ్యకు వస్తున్నాయి.  కానీ మనిషి ఏమి చేస్తాడు. అలా జనాల మధ్యకు వచ్చిన మృగాలను  కొట్టడమో, గాయపరచడమో చేస్తాడు. ముఖ్యంగా పాములు  కనబడితే 90% మంది వాటిని వెంటనే చంపేయడం జరుగుతోంది. పులులు, సింహాలు వంటి పెద్ద మృగాలంటే మనుషులు భయపడతారు కాబట్టి అటవీ శాఖ వాళ్లకు సమాచారం ఇచ్చి వాటిని పట్టిస్తుంటారు. ఇక గమనించదగ్గ విషయం ఏమిటంటే తన కంటే తక్కువ స్థాయి ఉన్న జంతువులను అయినా ప్రాణులను అయినా మనిషి నిరంతరం అణిచివేస్తూనే ఉంటడం అది జంతువులే కానక్కర్లేదు కనీసం మనుషులు అయిన తమకంటే తక్కువ స్థాయి ఉన్నవాళ్లను అణిచివేయడం సహజం.  కానీ ఏ ప్రాణి ప్రాధాన్యత, ఏ ప్రాణి జీవించే హక్కు దానిదే అని గుర్తించి దేని ప్రపంచాన్ని దానికి వదిలేయడం ఉత్తమం కదా!! కానీ స్వార్థంలోనూ, అభివృద్ధిలోనూ ఉన్న మనుషులకు వాటి ప్రపంచాన్ని అక్రమించుకోవడం పెద్ద తప్పుగా అస్సలు అనిపించదు. ఫలితంగా ప్రతిరోజూ పేపర్లలోనూ, టీవీ లలోనూ వార్తలు చూస్తూనే ఉంటాము. మనుషుల మధ్యకు సింహం లేదా పులి అని. పులి హల్చల్ అని, సింహం వీరవిహారం అని. కానీ వాటి కోణంలో వాటి మనసుతో ఆలోచిస్తే తిండి, నీళ్లు దొరక్క మనుషుల మధ్యకు వచ్చి మనుషులు పెడుతున్న హింసకు గురవుతూ ఆ గందరగోళంలో ఎవరినో ఒకరిని కరవడమో, వెంబడించడమో చేస్తాయి. ఆ మాత్రం అర్ధం చేసుకోలేని మనుషులు ఆ దేవుడు ఇచ్చిన విచక్షణా జ్ఞానాన్ని ఏమి చేస్తున్నట్టు.  మనుషులలో మృగాలుగా మారిపోతూ మృగాలను హింసిస్తున్నట్టా?? కొత్త చట్టాలు తెచ్చుకుని అంతటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలనే మూర్ఖపు ఆలోచనలో ఉన్నట్టా?? ◆ వెంకటేష్ పువ్వాడ  

పుస్తకాల పండుగ వచ్చేసిందోచ్!!

ఇదేంటిది బడిలో పిల్లలకు సెలవు ఇచ్చినపుడు ఎగిరి గంతేసి సంబరపడినట్టు అనుకుంటారు చాలామంది! కానీ ఆ సంతోషం ఎలాంటిదో పుస్తక ప్రియులకే బాగా తెలుస్తుంది.  హైదరాబాద్ వినాయక చవితి ఉత్సవాలు, ఖైరతాబాద్ గణేష్ రాజసం, పొంగలి కుండల బోనాలను నెత్తిన పెట్టుకుని తన్మయత్వమైపోయే బోనాల జాతర, ఒక్కేసి పువ్వేసి సందామామా ఒక్కజాము ఆయె సందామామా అనుకుంటూ పువ్వులో తేలే తెలంగాణ బతుకమ్మ పండుగ. ఇలా వీటితో సమానంగా హైదరాబాద్ లో ప్రాధాన్యత సంతరించుకున్నది పుస్తకాల ప్రదర్శన. 1985 సంవత్సరంలో మొదటిసారిగా జరిగిన ఈ పుస్తక ప్రదర్శన ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈనాడు 34 వ సారి అందరినీ కనువిందు చేయబోతోంది. కాగితాల రెక్కలు కట్టుకుని ఎక్కడెక్కడి నుండో ఎగిరొచ్చి అందరికీ ఎన్నెన్నో కథలు, కవితలు, చరిత్ర సాక్ష్యాలు, ఆత్మకథలు, సామాజిక సమస్యలు, సమాధి అయిపోయిన నిజాలు ఇట్లా ఎన్నింటినో తనలో నింపుకుని, తనకోసం లక్షల మంది వస్తున్నట్టే, లక్షల మంది కోసం పుస్తకమూ పతంగమంత మనసుతో వచ్చి వాలిపోనుంది. ఒకటా… రెండా… మూడా…. ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసే దుకాణాల సంఖ్య మెల్లిగా పెరుగుతూ వస్తోంది. చివరి ఏడాది కరోనా కారణంగా పుస్తకప్రదర్శన అసలు జరలేదు. అందుకే  ఈసారి కరోనాను దృష్టిలో ఉంచుకుని నిబంధనల మధ్య, నియమాల మధ్య ఎంతో జాగ్రత్తగా నిర్వహించబోతున్నారు. సుమారు 250 పుస్తకాల దుకాణాలు ఏర్పాటు కానున్నాయని సమాచారం. అంటే వందల కొద్దీ పుస్తకాల దుకాణాలు, లక్షలకొద్దీ పుస్తకాల పలకరింపులు. ప్రముఖులు, రచయితల మెరుపులు!! ప్రజలలో పుస్తకాల పట్ల ఆసక్తిని పెంచి పాఠకాదరణను పెంపొందించే దిశగా చేస్తున్న ప్రయత్నమే ఇది. ప్రముఖ రచయితల పుస్తకాలు పుస్తక పడదర్శనలో ఉండటమే కాదు బోలెడు మంది రచయితలు కూడా ఆ పుస్తక దుకాణాల దగ్గర ఉంటూ తమ అభిమాన పాఠకులను అంతే అభిమానంగా పలకరిస్తూ ఉంటారు. ఇంకా ఎందరో సెలబ్రిటీలు కూడా పుస్తక ప్రదర్శనకు విచ్చేసి పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. సాయంత్రం పూట చార్మినార్, బేగం బజార్ ఎంత రద్దీగా సందడిగా ఉంటుందో అంతకంటే సందడి పుస్తక ప్రదర్శన జరిగినన్ని రోజులు ఉంటుంది . కొంచం ఇష్టంగా మరికొంచెం జాగ్రత్తగా!! ఏడాది విరామం తరువాత మళ్ళీ పుస్తక ప్రదర్శన ఎలా ఉండబోతోంది అంటే చాలా రోజుల తరువాత తమ స్నేహితులను కలుసుకోవడానికి ఎంత ఉవ్విళ్లూరుతారో అంత సంతోషంగా ఉంది ప్రస్తుతం భాగ్యనగరం. అయితే ఆ సంతోషంలో జాగ్రత్తలు మరచిపోకూడదు. ఎవరి ప్రాథమిక కర్తవ్యం వారిది అన్నట్టుగా ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి. మరియు శానిటైజర్ వెంట ఉంచుకోవాలి. ఇంకా వీలైనంత వరకు గుంపులు గుంపులుగా ఉన్న చోటికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటే అదే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. ప్లానింగ్ తో హ్యాపీ హ్యాపీగా!! పెద్ద అరటి ఆకు, దాని నిండా విందు భోజనం. అందులో ఎన్నో అద్భుతమైన షడ్రుచులు. పొట్ట ఏమో చిన్నది. ఏది తినాలో అర్థం కాదు. పుస్తకాలు అంటే ఇష్టపడే వాళ్లకు కూడా సేమ్ ఇదే సమస్య ఎదురవుతుంది పుస్తక ప్రదర్శనలో. బోలెడు పుస్తకాలు ఎదురుగా ఉంటాయి, అన్నీ కొనాలని అనిపిస్తుంది.  చేతిలో బడ్జెట్ కూడా వెక్కిరిస్తూ ఉంటుంది. కొందరి సలహాలు, మరికొందరి అభిప్రాయాలతో బుక్స్ కొనేసి ఆ తరువాత అయ్యో వేరే తీసుకుని ఉంటే బాగుండేమో అనే పరిస్థితిలోకి వెళ్లకుండా హాయిగా హ్యాపీగా ఒక చిట్టా రాసుకుని వెళ్లి తీసుకోవడం మంచిది. పర్లేదు డబ్బుదేముంది అనుకునేవాళ్ళు అయితే లక్షణంగా ప్రతి స్టాల్ తిరిగి విలక్షణమైన పుస్తకాలను ఎంచుకోవచ్చు. అయితే నేటి డిజిటల్ యుగంలో పిడిఎఫ్ ల రూపంలో ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వచ్చినా పుస్తకాన్ని  చేత్తో పట్టుకుని, ప్రతి పేజీని స్పర్శిస్తూ అక్షరాలను మనసులోకి ఒంపుకునే ఫీల్ వేరే ఏ విధంగానూ రాదన్నది అందరూ ఒప్పుకునే విషయం. గుండె జేబులలో(మనసులలో) పదిలంగా పది కాలాల పాటు పుస్తకాన్ని నిలబెట్టడానికి, సాహిత్య సమీరాలను ఎప్పుడూ వీచేలా చేయడానికి పుస్తక ప్రియుల కోసం అవకాశం వచ్చింది.  తెలంగాణ కళాభారతి మైదానం(ఎన్టీఆర్ స్టేడియం)లో పుస్తకాల జాతరకు పోదాం పదండి అందరూ….!! ◆ వెంకటేష్ పువ్వాడ  

అవినీతికి  నీతి పాఠాలు చెప్పాలిప్పుడు!! 

ప్రస్తుత సమాజంలో ప్రతి పని కొన్ని నిర్ణీత షరతులకు లోబడి జరుగుతుంది. అయితే ఆ పనిని అదే షరతులతో జరపకుండా లేదా జరగనివ్వకుండా వక్ర మార్గంలో స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం ఇష్టమొచ్చినట్టు చేసే వాళ్ళు ప్రస్తుతం బోలెడు మంది ఉన్నారు. పేరుకే రాజ్యాంగం, అందులో చట్టాలు. వాటిని కచ్చితంగా పాటిస్తూ ఉన్నవాళ్లు ఏ కొద్దీ మందో. ఆ కొద్దీ మందిని తప్పిస్తే మిగినవాళ్ళు అందరూ తమంతకు తాము కొత్త నియమాలను సృష్టించినట్టు దౌర్జన్యంతో బతికేస్తుంటారు. చట్టంలో కొన్ని పనులను చేయకూడదు అనే నియమాలు ఉంటాయి. కానీ వాటిని చేస్తూ ఆ చట్టాన్ని వెక్కిరించే ఉద్దండులు ఎందరో. ప్రస్తుత భారతదేశంలో అవినీతి వేళ్ళూనుకుపోయింది. ఎంతగా అంటే మాటల్లో చెప్పలేనంతగా. అన్ని రంగాలలో, అన్ని కార్యకలాపాలలో, అన్ని విధాలుగా ఈ అవినీతి జరుగుతూనే ఉంది, ముఖ్యంగా ఈ అవినీతి ఉక్కు పిడికిలిలో ఇరుక్కుపోయేది చిన్న స్థాయి, పేద, మధ్య తరగతి ప్రజలు. తమ జీవితాలకు, తాము పొందవలసిన ఎన్నింటినో అవినీతి మూలంగా కోల్పోతున్నారు. దీని వెనుక సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాలు ఎన్నో ఉండచ్చు. అర్హత కలిగిన పథకాలు పొందలేకపోవడం!! సగటు మనిషికి ప్రభుత్వం కొన్ని పథకాలు నిర్దేశించింది. అవి ఆహార భద్రత, ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత ఇలా జీవితంలో సగటు మనిషికి అవసరమైనవి అన్నీ. కానీ ఇక్కడ రాజకీయ కోణాలు ప్రభావం చూపిస్తాయి. ఆ పథకానికి పౌరుడు అర్హుడా, కాదా అని విషయం కాకుండా పార్టీ, నాయకుడి కోణంలో వాటిని కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా పౌరుడు నష్టపోతాడు. లంచాల పరంపర!! ప్రస్తుత కాలంలో లంచం ఒక సాధారణ విషయం అయిపోయింది. ఉద్యోగస్తుల బల్ల కింద, గోడల చాటున కరెన్సీ చేతులు మారడం పరిపాటి. మండల ఆఫీసులు, జిల్లా ఆఫీసులు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు వంటి చోట్ల ఈ లంచం లేకుండా పని జరగడం అంటూ ఉండదు. ఒకవేళ అది లేకుండా పని జరుగుతుంది అంటే అది ఏ రాజకీయ నాయకుడి రికమెండషనో అయి ఉంటుంది. ఇలా సాధారణ వ్యక్తి లంచాలు ఇచ్చుకుంటూనో, రాజకీయ నాయకుల దయాదక్షిణ్యాల వల్లనో బతుకుసాగిస్తూ ఉంటాడు. ఇది ఒక విషయం అయితే రెండోవైపు ఇంకో విషయం ఉంటుంది. అర్హత లేకపోయినా పలుకుబడితో, రాజకీయ అండతో సామాన్యులకు వెళ్లాల్సిన లబ్ధిని కాజేసేవారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు, పెన్షన్లు, ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాలు దోచేసేవాళ్ళు. అక్రమంగా స్థలాలు కబ్జా చేసి రాజకీయ అండతో పెత్తనం చేలాయించే వాళ్ళు. పేదవాళ్ళ కడుపు కొట్టి దోపిడీ చేసేవాళ్ళు. వాళ్ళను మోసం చేసేవాళ్ళు.  ఇక విద్యార్థుల జీవితాలతో కులం పేరుతోనూ, రిజర్వేషన్ల పేరుతోనూ పై స్థాయి చదువులు చదవలేక పోతున్నవాళ్ళు. అధికారుల సంతకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నవాళ్లు. స్కాలర్షిప్పులు, రియింబర్స్మెంట్ లు రావడానికి చేతులు తడపాల్సిన  పరిస్థితిలో ఉన్నవాళ్లు. ప్రతిభ ఏమీ లేకున్నా ప్రభా పత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందేవాళ్ళు. వీటి వల్ల నిజమైన ప్రతిభ ఉన్నవారు ఎందరో నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఇదంతా సాధారణ అవినీతి అయితే రాష్ట్రాలు, దేశాల మధ్య దొంగ రవాణా, స్మగ్లింగ్, దొంగ నోట్లు, సైబర్ నేరాలు, డబ్బు అడ్డు పెట్టుకుని ఘోరమైన తప్పులకు శిక్షలు తప్పించించజకునే మహానుభావులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో. ఇవన్నీ  కూడా సగటు సాధారణ పౌరుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కానీ సిగ్గు పడాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వాలు ఈ అవినీతి కార్యకలాపాలను చూసి చూడనట్టు, నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతుంది. అందుకే సగటు పౌరుడు అవినీతికి వ్యరేకంగా మాట్లాడినా ఆ పౌరుడే మళ్ళీ శిక్ష అనుభవిస్తాడు. కాబట్టి అవినీతి అనేది పైనేక్కడో పెద్ద పెద్ద వేర్లతో విస్తరించుకుంది. అది కూకటివేర్లతో సహా పెకించుకుని నేల కూలిపోవాలి. కనీసం రేపటి పౌరులను అయినా అవినీతికి వ్యతిరేకంగా పెంచితే రేపటి భారతంలో కాసింత నీతిమాలిన జీవితాలు కనబడతాయేమో. అందుకే అవినీతికి నీతి పాఠాలు చెప్పాలి!!  ◆ వెంకటేష్ పువ్వాడ  

దీర్ఘ మేర ఆరోగ్య మ(శి)స్తు!!

జీవితంలో ఎంత సంపాదించుకున్నా ఆరోగ్యం మంచిగా లేకపోతే సంపాదించుకున్నది అంతా మనల్ని చూసి వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. అంతేనా ఆరోగ్యం సరిగా లేకపోతే సంపాదన  మొత్తం హాస్పిటల్స్ కు, డాక్టర్స్ కు శిస్తు కట్టినట్టు కట్టాల్సి వస్తుంది. ఇప్పట్లో రోగం లేని మనిషి అంటూ లేడు. బీపీలను, షుగర్లను వెంట పెట్టుకుని తిరుగుతూనే ఉన్నారు మనుషులు. ఒకప్పుడు జబ్బులనేవి తక్కువ. నిజానికి జీవితం ఖరీదు అవుతుంటే జబ్బులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. జీవితంలో ప్రతి ఒక్కటీ ఎంతో ఖర్చుతో సమకూర్చుకోవలసి వస్తుంది. అందుకే బాగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో ఆరోగ్య సమస్యలు అన్నిటికంటే ఒక మెట్టు పైనే ఉన్నాయి.   ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి??  గత యాభై సంవత్సరాలు ఇంకా కనీసం పది, ఇరవై సంవత్సరాలతో పోల్చుకుంటే జనాబాకు జబ్బుల దాడి ఎక్కువయ్యింది. అదేనండి సమస్యలు ఎక్కువ అయ్యాయి. కారణం ఏమిటి అని ఆలోచిస్తే వ్యవసాయ పంటలలో  పోషణ తగ్గింది. పెద్దలు చెబుతూ ఉంటారు ఒకప్పుడు గింజలు, విత్తనాల రుచి వేరు అని. అది నిజమే కావచ్చు. సేంద్రీయ వ్యవసాయం నుండి పురుగుమందులు ఉపయోగించి పంటలు పండించడం వల్ల రుచి తగ్గిందనేమాట వాస్తవం. అయితే ఇది కాకుండా మరొకటి ఉంది. అదే పాశ్చాత్యుల ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం.  పొరుగింటి పుల్లకూర రుచి!! ఓకేప్రాంతంలో ఉండేవాళ్ళు ఒకేరకమైన వాతావరణంలో ఉంటారు. పొరుగింటి పుల్లకూర తిన్నా పర్లేదు ఏమీ కాదు. విదేశాలు పూర్తిగా భారతదేశ వాతావరణానికి భిన్నంగా ఉంటాయి. అక్కడి వాతావరణం, అక్కడ పండే పంటలు వారు తింటారు. అయితే అవి తెచ్చి ఇక్కడ తినడం వల్ల వస్తున్నవే ఆరోగ్య సమస్యలు. వారు అక్కడ వాడే పదార్థాలు వారికి దొరికే స్వఛ్చమైనవి అయి ఉండచ్చు, కానీ అవి ఇక్కడికి పచ్చేసరికి  50% పైగా కలుషితం అవుతాయి. వాటి మీద లేబుల్స్ మెరుస్తూ, మేడ్ ఇన్ ఇండియా స్టిక్కర్లు అతికిస్తూ విదేశీ ఫుడ్ ఎంతగానో జనాల్లోకి చొచ్చుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ప్యాకింగ్ ఫుడ్స్ ను ఇన్స్టంట్ ఫుడ్స్ ను పరిచయం చేసింది విదేశీ వ్యాపారాలే. నిజానికి విదేశాలలో కూడా జీర్ణసంబంధ సమస్యలు, పేగు క్యాన్సర్లు ఎక్కువ. కారణం వారు తినే ఆహారం, వారి అలవాట్లు కూడా.  అవసరాలు, ఆహారం అయ్యో!! అయ్యో!! చాలా ఇళ్లలో ఆహారం విషయంలో అయినా నిర్లక్ష్యం చేస్తారు కానీ అవసరాలు తీర్చుకోవడంలో మాత్రం అస్సలు తగ్గేది లేదు. నిజానికి ప్రతి కుటుంబంలో ఆహార ఆవశ్యకత గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ అని చెప్పచ్చు. ఏ రోగమో, రొప్పో వచ్చినప్పుడు మందులతో ఆ రోగానికి  టెంపరరీ సొల్యూషన్స్ వెతుక్కోవడం, శరీర సామర్థాన్ని  రోజు రోజుకూ దిగజార్చుకోవడం, అలా ఆరోగ్యాన్ని ఖూనీ చేసుకునే లెజెండ్స్ ఎక్కువయ్యారని చెప్పచ్చు. మన భారతదేశానికి మహర్షులు ప్రసాదించిన ఆయుర్వేదాన్ని కాదని చిటికెలో తలనొప్పులు, గొంతు గరగరలు తగ్గించే ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారపడి జీవితకాలన్ని తగ్గించుకుంటున్నారు.  అందుకే జీవితంలో సంపాదించే దానిలో మొదట ఆహారం కోసం ఎక్కువ మొత్తం వెచ్చిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఉండాలి. అలా ఉంటేనే ఇప్పటి కాలంలో ఆరోగ్యం సొంతమవుతుంది. ఆయుర్వేదంలో సూచించబడిన ఎన్నో అద్భుత మొక్కలను రోజువారీ సమస్యలలో ఉపయోగించవచ్చు. పలితం శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.  లేదూ సరిపడని తిండి, వ్యతిరేకమైన అలవాట్లు ఫాలో అవుతామని అంటే అలాగే కానివ్వండి. అయితే సంపూర్ణ ఆరోగ్యం కోల్పోయి దానికి శిస్తు కడుతూ శిక్ష అనుభవిస్తారు తప్పనిసరిగా!! ◆ వెంకటేష్ పువ్వాడ  

అందంతో విశ్వాన్ని గెలిచేసింది!! 

చాలామంది అందంది ఏముందిలే మనసు బాగుండాలి కానీ అంటారు. అవును నిజం మరి అందం లేకపోయినా మనసు బాగుంటే చాలు. కానీ అదే మనుషులు ఇతరులలో  లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు అందం ఉన్నా వ్యర్థమే. అయితే మనసు, అందం రెండూ ఉన్నవాళ్లు కొంతమంది ఉంటారు. కానీ బయటకు ఎక్కువగా తెలియదు వీళ్ళందరి గురించి కారణం వాటి గురించి అందరికీ తెలిసే సందర్భం రాకపోవడమే. అందాన్ని మనసును స్ఫూర్తి వంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి విశ్వానికి అంతటికీ విజేతగా నిలిచిన మన భారతీయ మగువ విజయాన్ని చూస్తే గర్వాంగానూ, ముచ్చటగాను అనిపిస్తుంది. 2000 సంవత్సరంలో లారా దత్తా మిస్ యూనివర్స్ గా ఎంపికైన తరువాత సుమారు 21 సంవత్సరాలకు భారతదేశం ఖాతాలో మిస్ యూనివర్స్ కిరీటం చేరడం పట్ల దేశం మొత్తం ఆనంద సంబరాల్లో ఉందనే చెప్పాలి.  సంధూ విజయ కేతనం!! పంజాబ్ రాజధాని చండీఘడ్ కు చెందిన హర్నాజ్ కౌర్ సంధూ భారతదేశం నుండి చివరిసారిగా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ గా లారా దత్తా ఎంపికైనప్పుడే పుట్టారు. ఈమె ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఈమె వయసు 21 సంవత్సరాలు, భారతదేశానికి ఈమె 21 సంవత్సరాల తరువాత యూనివర్స్ కిరీటాన్ని అందించారు. ఈ అంకెలు ఇలా కలవడం యాదృశ్చికమే అయినా కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కూడా. అందాల పోటీలలో పాల్గొంటూ ఒక్కో మెట్టూ ఎక్కి వచ్చిన హర్నాజ్ కౌర్ సంధూ 2017 లో మిస్ చండీగఢ్ గానూ, 2018 లో మిస్ మాక్స్ ఎమర్జింగ్ స్టార్ గానూ, 2019లో ఫెమినా మిస్ ఇండియా  పంజాబ్ గానూ నిలిచారు. ఇక 2021 సంవత్సరంలోనే లీవా మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని కూడా అందుకున్నారు. ఈమె కొన్ని పంజాబీ చిత్రాలలో కూడా నటించారు.  అలాంటి సంధూ 2021 సంవత్సరంలో తొలిసారిగా ప్రపంచ అందాల పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఇజ్రాయెల్ లో అందాల పోటీలో పాల్గొని విశ్వసుందరిగా విజయకేతనం ఎగరేశారు. ఈ పోటీలో సుమారు 79 మంది పాల్గొనగా అందరినీ దాటుకుని విజయాన్ని ఒడిసిపట్టారు. ఓ ప్రశ్న ఓ జవాబు!! అందాల పోటీలు అంటే శరీరాన్ని చూసి ఇచ్చే బహుమతులు, తలమీద పెట్టె కిరీటాలు అనుకుంటే పొరపాటే. వ్యక్తిత్వాన్ని, ఆలోచనను ఇంకా చెప్పాలంటే మనోవిజ్ఞానశాస్త్ర ఆధారంగా మనుషుల ఆలోచనా తీరు ఎలాంటిది?? ఏ సమస్యకు ఎలాంటి నిర్ణయం తీసుకోగలుగుతారు?? ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది కూడా పరీక్షించడం జరుగుతుంది.  అలా సంధూ కు ఒక ప్రశ్న ఎదురయ్యింది. దానికి సరైన సమాధానం ఇచ్చి సంధూ విజేతగా నిలబడింది. యువతకు ఒక స్ఫూర్తి మంత్రం!! ప్రస్తుతం యువత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఒత్తిడిని జయించడానికి నువ్వైతే ఎలాంటి సలహా ఇస్తావు అనే ప్రశ్నను ఆమె  ముందు ఉంచారు న్యాయనిర్ణేతలు. తమ మీద తమకు పూర్తిస్థాయి నమ్మకం లేకపోవడమే యువత ఒత్తిడి ఎదుర్కోవడంలో ఎక్కువగా కారణం అవుతుంది.  ఎవరి ప్రత్యేకత వారు గుర్తించడంలోనే నిజమైన అందం దాగి ఉంటుంది. బయటకు రండి, మీకోసం మీరు గొంతెత్తండి, మీ జీవితానికి మీరే నాయకులు, నాకు నామీద పూర్తి నమ్మకం ఉంది అందుకే ఈరోజు నేను ఇక్కడిదాక రాగలిగాను. అని స్ఫూర్తివంతమైన సమాధానం ఇచ్చింది సంధూ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారే, ఎవరూ మరొకరికి పోటీ కాదు, పోలిక అసలే కాదు. ఎప్పుడైతే ఎవరి జీవితాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం మొదలుపెడతారో అప్పుడే వాళ్ళు నిజమైన విజయాలను చవిచూడగలరు  వంటి ఎన్నో అంతర్గత విషయాలు సంధూ ఇచ్చిన సమాదనంలో దాగున్నాయి. ఇలాంటి పరిపక్వత కలిగిన సమాధానాన్ని ఇచ్చింది కాబట్టే విశ్వసుందరిగా నిలిచింది అనుకోవడంలో సందేహం లేదు. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే ప్రపంచంలో యువతకు ఎన్నో రంగాలు ఉన్నాయి. ఎవరి ఆసక్తిని బట్టి వాళ్ళు కృషి చేస్తూ ఉంటే తప్పకుండా విజేతలు అవుతారు.  విశ్వాన్ని కూడా జయించగలుగుతారు. ◆ వెంకటేష్ పువ్వాడ

 అర్ధశతాబ్దపు విజయం!!

అర్ధశతాబ్దపు విజయాన్ని గుర్తుచేసుకుంటూ దేశమంతా ఆనంద సందోహల్లో మునిగిన దినం డిసెంబర్ 16. విజయ్ దివస్ గా పిలుచుకునే ఈ దినాన సరిగ్గా యాభై సంవత్సరాల కిందట భారత్ యుద్ధరంగంలో పోరాటంలో  పాకిస్థాన్ పై విజయం సాధించింది. రెండు దేశాలు, ఓ యుద్ధం, ఓ విజయం, ఓ కొత్త కొత్త దేశం అవతరణ, ఆ దేశానికి స్వేచ్ఛ వెరసి విజయ్ దివస్ ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది. యుద్ధం అంటేనే హింస. అలాంటి హింస ఈ యుద్ధంలో చెప్పుకోవాల్సొలినంత చెప్పలేనంత ఉంది.  పాకిస్థాన్ నుండి విముక్తిని ఇవ్వడానికి బంగ్లాదేశ్ కు భారదేశం సహాయం అందిస్తూ జరిగిన ఈ యుద్ధంలో సుమారు పది మిలియన్ల జనాభా శరణార్ధులుగా వలస పోయింది. దాదాపు మూడు మిలియన్ల మంది ప్రజలు పాకిస్థాన్ సాయుధ దళాల చేతిలో చంపబడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధం తరవాత జరిగిన తొలి యుద్ధం ఇదే కావడం అందులోనూ ఎంతో హింసాత్మకత కొనసాగడం. ఎట్టకేలకు భారత్ విజయం సాధించి బంగ్లాదేశ్ కు పాకిస్థాన్ చెర నుండి విముక్తి లభించడం వంటి చెప్పుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్ నుండి విడిపోయాక స్వాతంత్ర్య దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాన్నే తమ జాతీయగీతంగా స్వీకరించి మన దేశానికి, మన దేశ కవికి తగిన గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు.  ఇక ఈ యుద్ధంలో పాకిస్థాన్ వైపు నుండి ఎనిమిది వేల మంది సైనికులు చనిపోయారు, ఇరవై ఐదు వేల మంది సైనికులు గాయపడ్డారు.  భారతదేశం మూడువేల మంది సైనికులను కోల్పోయింది. పన్నెండు వేల మంది సైనికులు గాయపడ్డారు. పాకిస్థాన్ వారి తొంభై మూడు వేల మంది సైనికులను భారత్ యుద్ధఖైదీలుగా, యుద్ధంలో వాళ్ళందరిని బంధించింది. ఫలితంగానే భారత్ కు నాటి యుద్ధంలో విజయం సులువైందని చెబుతారు. అయితే పై లెక్కలు చూస్తే ఒక యుద్ధం, ఒక దేశస్వతంత్రం పలితంగా  ఇరు దేశాల నుండి పదకొండు వేల మంది ప్రాణాలు యుద్ధభూమిలో కలిసిపోయాయి.   పదమూడు రోజుల పాటు సాగిన యుద్ధంలో పదకొండు వేల ప్రాణాలు అంటే ఈ దేశాలకు పౌరులు తమ ప్రాణాలను ఎలా పణంగా  పెడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ మరణించిన సైనికుల కుటుంబాలకు దేశంలో దక్కుతున్నది ఏమిటి అంటే అయోమయం నెలకొంటుంది. అది వేరే విషయం కావచ్చు. కానీ ఈ యుద్దానికి కారణం పాకిస్థాన్ అత్యుత్సాహమే అనిపిస్తుంది. బెంగాలీల భాషను కాదని ఉర్ధూను జాతీయ భాషగా మార్చి అంతటినీ ఉర్ధూ కిందకు తీసుకురావాలని ఆలోచనతో చిన్నగా మొదలైన కాంక్ష క్రమంగా వ్యతిరేకత చూపించే అందరి మీదా దాడులు చేయించడం, చంపించడం ఊచకోత చేపట్టడం మొదలుపెట్టింది. ఫలితంగా కాలేజీలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల పై దాడి చేయించడం, విద్యార్థినిలను, మహిళలను అత్యాచారం చేయించడం. మానభంగాలు వంటి అకృత్యాలు చేయించడం మొదలుపెట్టింది. పలితంగా వీరి పైశాచికత్వంలో ముప్పై లక్షల మందిని ఛాంపినట్టు, నాలుగు లక్షల మంది మహిళపై అత్యాచారాలు చేసినట్టు బంగ్లాదేశ్ అధికారిక వర్గాలు విశ్లేషణ చెబుతుంది. ఇంతటి గోరానికి  పాల్పడిన దేశం మెడలు వంచడానికి భారత్ కృషి చేసి విజయం సాధించడంతో చరిత్రలో గొప్ప సుదినంగా  నమోదైంది విజయ్ దివస్. ఇది మన దేశ విజయం అయితే.  స్వేచ్ఛ, స్వాతంత్రం లభించి ఒక కొత్త దేశంగా స్వాతంత్ర్య వాయువులు పీల్చుకుంటూ కొత్త జీవితాలను ప్రారంభించిన బంగ్లా సోదర, సోదరీమణులకు సంతోషాన్ని ఇచ్చిన రోజు.  కాబట్టి ఓ యుద్ధం కొన్ని మరణాలు పురివిప్పిన స్వతంత్రం, స్వేచ్ఛ వెరసి విజయ్ దివస్.  నాటి సైనికులకు అందరికీ సలాం చేయాల్సిందే!! ◆ వెంకటేష్ పువ్వాడ

నోబుల్ ప్రైజ్ అంటే ఏంటో తెలుసా ?? 

ప్రపంచ దేశాలు అన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే బహుమతులలో నోబుల్ బహుమతి ఒకటి. ఈ నోబుల్ బహుమతి ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబుల్ గౌరవార్థం ప్రతి సంవత్సరం ప్రధానం చేస్తారు. ముఖ్యంగా శాంతి బహుమతి పురస్కారం తప్ప మిగిలిన అయిదు రంగాలు అంటే భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలలో కృషి చేసిన వారికి డిసెంబర్ 10 వ తేదీన ఆల్ఫ్రెడ్ నోబుల్ వర్ధంతి రోజు ప్రదసనం చేస్తారు.  ఈయన కుల, మత, లింగ, జాతి వివక్షలు లేకుండా వారు సూచించిన రంగాలలో కృషి చేసిన వారికి ప్రోత్సాహకంగానూ మరియు ప్రతిభను గుర్తించే కోణంలోనూ ఈ బహుమానాన్ని ప్రధానం చేయవలసిందిగా తన వీలునామలో  ప్రస్తావిస్తూ తన 90 లక్షల డాలర్లను బహుమతి ప్రధానం కోసం ఉపయోగించవలసిందిగా కూడా పేర్కొన్నాడు.  1901 సంవత్సరంలో ప్రారంభమైన ఈ బహుమతుల ప్రధాన పరంపర సాగుతూనే ఉంది.  వంద సంవత్సరాల పైన కాలంలో ఇప్పటి వరకు మన భారతదేశం నుండి ఎనిమిది మంది ఈ నోబుల్ పురస్కారాన్ని అందుకుంటే వీళ్ళలో కేవలం ఐదు మంది మాత్రమే పూర్తిగా భారతీయులు. మిగిలిన ముగ్గురు భారతదేశంలో నివసించినవారూ మరియు విదేశాలలో స్థిరపడిన భారత సంతతి వారు.  సాహిత్యానికి వన్నె తెచ్చి గీతాంజలి ద్వారా కవిత్వపు సొగసును ఖండాంతరాలు వ్యాపించేలా చేసిన రవీంద్రనాథ్ టాగూర్ నోబుల్ బహుమతిని 1913 సంవత్సరంలో అందుకున్న తొలి భారతీయుడు కాగా సుబ్రహ్మణ్య చంద్రశేఖరన్ విదేశాల్లో స్థిరపడిన భారత సంతతిగా 2009 సంవత్సరంలో నోబుల్ పురస్కారం అందుకున్నారు. ఈయన జీవరసాయన శాస్త్రవేత్త.  ఈ విధంగా నోబుల్ బహుమతులు పరంపర సాగుతుండగా భారతదేశం నుండి దీన్ని అందుకునే వారి సంఖ్య చాలా తగ్గిపోతోంది. కారణం గురించి ఆలోచిస్తే ఎందరికో అర్ధమయ్యే ఒక చేదు నిజం. ప్రతి రంగంలో ఎంతో విశేష కృషి జరుగుతున్నా అవన్నీ ఆర్థిక కోణంలో మరియు రాజకీయ లబ్ది కొరకు ఇంకా చెప్పాలి అంటే ప్రతి రంగాన్ని వ్యాపారదృక్పథంలో చూస్తూ అసలైన పరిశోధనలు, దీర్ఘకాలిక పరిశీలనలు జరగకపోవడమే కారణం అని చెప్పవచ్చు.  నోబుల్ బహుమతి ఆశిస్తూ దాదాపు యాభై సంవత్సరాల పాటు ఎదురు చూసిన వారున్నారు అంటే ఈ పురస్కారం ప్రాముఖ్యత ఎలాంటిదో తెలుస్తుంది. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వడపోతలో ఎంపికయ్యే ఈ బహుమతి విలువ కూడా అంతే ప్రాచుర్యం పొందిందని చెప్పచ్చు. సుమారు ఏడు కోట్లా, ఇరవై రెండు లక్షల (7,22,00,000) రూపాయల విలువ చేసే నగదు బహుమతి ఈ నోబుల్ ప్రైజ్ కింద ఇవ్వబడుతుంది. ఇంతటి ప్రఖ్యాతి పొందిన నోబుల్ బహుమతి భవిష్యత్తు భారతదేశ ఖాతాలో ఎప్పుడు చేరుతుందో చూడాలి మరి.  ◆ వెంకటేష్ పువ్వాడ  

కళ కోసం ఓ సినిమా !!

భర్తృహరి అద్భుత పద్యం కళాతపస్వి అద్భుత దృశ్యకావ్యం!! 【శ్లోకం:- జయంతి తే సుకృతినో | రససిద్ధాః కవీశ్వరాః || నాస్తి తేషాం యశః కాయే | జరామరణజం భయమ్ || సిద్ధౌషధ సేవవల్ల ముసలితనాన్ని – మరణాన్ని సైతం అతిక్రమించవచ్చు ! అయితే – అది ఇట్టి ఔషధం యోగులకు మాత్రమే అందుబాటులో ఉండి, వారే సేవించగలుగుతారు. విద్వాంసులైన వారికి ‘ కీర్తి ‘ రూపంలో మరణానంతరం కూడ జీవం ఉండి, సిద్ధౌషధంలా వారిని జీవింపచేస్తుంది. ఇటువంటి ధన్య జీవులు ఎవరు ? కవులు – పండితులు వీరు సద్ధౌషధం సేవించిన యోగులవంటివారు.】 పై పద్యం భర్తృహరి రచించిన నీతి శతకంలోనిది. ఆ పద్యాన్ని, దాని భావాన్ని వివరంగా పరిశీలిస్తే, దాన్ని అర్థం చేసుకుంటే కళ ఎంత గొప్పదో అర్థమవుతుంది. కవులు, పండితులు సిద్దౌషధం సేవించినటువంటి వారని ఆయన అంటాడు. ఇంతకు సిద్ధ ఔషధం ఏమిటి అంటే ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంలాంటిది శక్తివంతమైన వైద్యం సిద్దవైద్యం కూడా. సిద్ధులు శైవ భక్తులు, వీరు పద్దెనిమిది మంది ఋషులు. ఆయుర్వేదాన్ని ఎలాగైతే ధన్వంతరీ మహర్షి అభివృద్ధి చేశారో అలాగే సిద్ధులు కూడా సిద్దవైద్యాన్ని అభివృద్ధి చేశారు. ఈ సిద్ధులలో అగస్త్య మహర్షి ముఖ్యమైనవాడు. ఇక విషయంలోకి వెళ్తే ఆ సిద్ధ ఔషధం అమృతంతో సమనమైనది. దాన్ని తీసుకున్నవాడు మరణాన్ని జయిస్తాడు. అయితే అది సాధారణ మనుషులకు అందుబాటులో ఉండదు. యోగులు, ఋషులకు అందుబాటులో ఉండి వాళ్ళు మాత్రమే దాన్ని సేవించగలుగుతారు. కానీ….. విద్వాంసులు అంటే కవులు, పండితులు, కళలలో నైపుణ్యం సంపాదించినవారు. వీళ్ళందరూ సాధారణ మనుషుల్లోనే ఉన్నా, వీళ్ళు మరణించినా వారిలో ఉండే కళ, దాని నైపుణ్యం కారణంగా వాళ్ళు అందరి మనసులలో జీవించే ఉంటారు. అంటే భౌతికంగా మరణించినా, మానసికంగా అందరి మనసులలో బతికే ఉండటం. ఇలాంటి వాళ్ళు సిద్ధ ఔషధం స్వీకరించిన యోగులు, ఋషుల వంటి వారు. మనుషుల్లో ఉన్న గొప్పవాళ్ళు వీళ్ళు.  దీని వల్ల కళ గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. సంగీతం, సాహిత్యం, నృత్యం, బొమ్మలు గీయడం, పాటలు పాడటం, విశిష్ట ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరు కూడా పైన భర్తృహరి చెప్పినట్టు అమృతంతో సమానమైన ఔషదాన్ని సేవించినవాళ్ళ లాంటి వారే. ఇక ఈ పద్యం ముఖ్యంగా భర్తృహరి నీతి పద్యంగానే కాకుండా కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం సాగరసంగమంలో ఈ పద్యాన్ని ప్రస్తావిస్తారు. అంటే ఆ సినిమాలో కూడా కళ గురించి తపించిన వారు కళను ప్రేమించి, ప్రతిభ ఉన్నవారికి భౌతికంగా మనరణం సంభవించినా మానసికంగా మరణం అనేది ఉండదనే విషయాన్ని అందులో చెప్పారు. కాబట్టి కళను గౌరవించి, ప్రేమించాలి. ముఖ్యంగా నేటితరం సంప్రదాయ కళలను ప్రోత్సహించాలి. ◆ వెంకటేష్ పువ్వాడ  

ఏమి చెబుతున్నాయి హక్కులు??

 Human rights. ప్రస్తుత ప్రపంచంలో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన భారతదేశంలో చిన్న నుండి పెద్ద వరకు, గల్లీ నుండి ఢిల్లీ వరకు, ఇంట్లో మనుషుల నుండి సమాజంలో కూటములైన సంఘాలు, సంస్థలు వాటిలో పనిచేసే వారి వరకు. ఇలా సకల ప్రజానీకం ఎక్కువగా మాట్లాడే పదం, ఉపయోగించే పదం "హక్కు" మనిషికి తన జీవితంలో కొన్ని స్వేచ్చలు ఉన్నాయి వాటిని పొందడానికి, ఆ స్వేచ్ఛకు తగ్గట్టు బతకడానికి ఐక్యరాజ్యసమితి తీర్మానం చేపట్టి ఆమోదించినవే మానవ హక్కులు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐక్యరాజ్యసమితి పేర్కొన్న హక్కులను పొందే సౌలభ్యం ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది, ఉండాలి కూడా. అయితే ఐక్యరాజ్యసమితి పేర్కొన్న హక్కులు ఏమిటి?? మనం డిమాండ్ చేస్తున్నది ఏమిటి?? వీటిని గూర్చి ఆలోచిస్తే  జాతి, మత, లింగ, కుల, వర్ణ, రాజకీయ లేదా ఇతర కారణాలతో ఏ విధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. కానీ మన సమాజంలో ప్రతి మనిషితో మాట్లాడే ముందు కచ్చితంగా కులం, మతం చూసుకుంటూ ఉంటారు. వీటి ప్రస్తావన లేకుండా వాటి గురించి అసలు ఆలోచించకుండా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువని చెప్పవచ్చు. పరోక్షంగా ఎందరో చర్యల ద్వారా ఈ రకమైన వివక్షకు గురవుతూనే ఉంటారు. ఇక ఈ సమాజంలో ప్రస్తుతం  ఉన్న అతి పెద్ద సమస్య రాజకీయ కారణాలు. చెప్పుకోవడానికి విచిత్రంగా ఉన్నా సాధారణ పౌరులు ఈ రాజకీయ వర్గాలు మధ్య నలిగిపోతూ ఉంటారు.  చిత్రహింసలు మరియు క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కును మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది కానీ దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలు సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రహింసలు మరియు క్రూరత్వానికి బలి అవుతున్న వాళ్లలో ఆడవాళ్లు అధికశాతం మంది, తరువాత పిల్లలు, వృద్ధులు ఉన్నారు. కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా వీఎటి బారిన పడుతున్నారు. చేదైన నిజం ఏమిటంటే చిత్రహింసలు, క్రూరత్వం కుటుంబ సభ్యులనుండే ఇవన్నీ ఎదురవ్వడం. వ్యక్తిగత దాడులు, ఆర్థికపరమైన కారణాలు, కక్షలు, కుట్రలు వంటి వాటిలో బాగా తెలిసినవారి నుండి, లేదా కుటుంబ సభ్యుల నుండి పై సమస్యలు ఎదుర్కొంటారు. వెట్టిచాకిరీ, బానిసత్వం నుండి రక్షణ పొందే హక్కును మానవ హక్కుగా ఐక్యరాజ్యసమితి పేర్కొంది. బానిసత్వం మన భారతదేశంలో వేళ్లూనుకుపోయింది. ఎంతగా అంటే పక్క దేశాలు చెప్పినదానికి తలలు  ఊపుతూ వాగ్దానాలు చేసి దేశంలో ఉన్న ప్రజల జీవితాలతో ఆడుకునే స్థాయిలో. నిజానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఎన్నో ఒప్పందాలు, వాటి రహస్యాలు సామాన్య ప్రజలకె కాదు ధనికులకు కూడా తెలియదు సరిగ్గా.  ఒక కుటుంబంలో ఆడపిల్లను ఎలాగైతే బాధ్యత, పరువు అనే పేరు కింద స్వేచ్ఛను తుంచి బానిసగా ఉంచుతారో అలాంటివి సమాజంలో, జీతీయం, అంతర్జాతీయ స్థాయిలలో కూడా జరుగుతుంటాయి. ఆర్థిక, విద్య, వైద్య రంగాలలో ఇలాంటివి ఎన్నో ఉంటాయి.  నిర్బంధించబడకుండా ఉండే హక్కు మానవ హక్కుగా పేర్కొన్నారు. నిర్బంధం అంటే కట్టడి చేయడం. సరైన కారణం లేకుండా ఒక మనిషి స్వేచ్ఛను హరించడం, ఆ మనిషిని అన్ని రకాలుగా అన్నిటికీ దూరం చేయడం. ఆంక్షలు విధించడం, ఇష్టాలకు గౌరవం ఇవ్వకుండా ఉండటం. ప్రస్తుత సమాజంలో ఈ రకమైన నిర్బంధం ఆడవాళ్ళ విషయంలోనూ, పిల్లల విషయంలోనూ చాలా జరుగుతున్నాయి.  పక్షపాతం లేకుండా ఉండటం. అనేది మానవ హక్కు కానీ ఇంటా బయట ఈ పక్షపాత ధోరణి పుష్కలంగా కనిపిస్తుంది. ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్లలో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఉంటే అక్కడ పక్షపాత ధోరణి కచ్చితంగా ఉంటుంది. లింగవివక్షలో మెండుగా ఉండే ఈ పక్షపాతం వల్ల ఎంతో నష్టపోతారు. ఇషి మాత్రమే కాకుండా పేద,  ధనిక వర్గాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య ఇలా అన్ని వర్గాలలో పక్షపాతం ఉంటుంది. పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా జీవించే హక్కు, సామాజిక భద్రతాహక్కు, భావ స్వాతంత్య్రహక్కు, విద్యాహక్కు, పిల్లలు ఆడుకొనే హక్కు, ప్రజాస్వామ్య హక్కు, కాపీరైటు హక్కు, జాతీయత హక్కు, ఏ మతాన్ని అయినా స్వీకరించే హక్కు వంటి మానవ హక్కులు ఎన్నో ఉన్నాయి. అయితే హక్కుల పేరుతో వీటిని ఎందసరో దుర్వినియోగం చేస్తున్నారు కూడ. ముఖ్యంగా యువత స్వేచ్ఛ అనే హక్కును, జీవించే హక్కును కాస్త అడ్డదారిలో వెల్తూ అది నా హక్కు అని, స్వేచ్ఛగా ఉండటంలో తప్పులేదని అతిగా వాదిస్తుంది.   హక్కుల ప్రాముఖ్యత తెలుసుకుని వాటిని సరైన దిశలో అనుసరిస్తే అప్పుడే వాటికి సార్థకత చేకూరుతుంది.   ◆ వెంకటేష్ పువ్వాడ  

ఆలోచన బాగుంటే మెదడు కూడా ఎదుగుతుంది

మనిషి నుదురు విశాలంగా ఉంటే అది అతని పెద్ద మెదడుని సూచిస్తుందనీ, పెద్ద మెదడు తెలివితేటలని సూచిస్తుందనీ పెద్దలు చెబుతూ ఉండేవారు. ఇందులో నిజానిజాల గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలు తర్జనభర్జనలు పడుతూనే ఉన్నారు. ఆ సంగతేమో కానీ ఇప్పుడు మెదడు ఆకారాన్ని పరిశీలిస్తే, సదరు మనిషి మనస్తత్వం బయటపడుతుందని చెబుతున్నారు. అంతేకాదు! ఆ మనస్తత్వం ఆధారంగా భవిష్యత్తులో అతను ఎదుర్కోబోయే మానసిక సమస్యలని కూడా అంచనా వేయవచ్చని ఆశిస్తున్నారు.   ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు, మెదడులో ఉండే కార్టెక్స్‌ అనే ముఖ్యభాగం తీరుని బట్టి వ్యక్తుల ధోరణిని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఈ కార్టెక్స్‌ ఎంత మందంగా ఉంది, ఎంత పెద్దదిగా ఉంది, ఎంతవరకు ముడుచుకుని ఉంది అనే మూడు అంశాల ఆధారంగా ఐదు రకాల లక్షణాలను పసిగట్టారు. నిరాశావాదం (neuroticism), కలుపుగోలుతనం (extraversion), విశాల దృక్పథం (openness), పరోపకారం (altruism), ఆత్మస్థైర్యం (conscientiousness) అనేవే ఆ ఐదు లక్షణాలు.   ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు దాదాపు 500 మంది వ్యక్తుల మెదడు తీరుని గమనించారు. కార్టెక్స్‌ బాగా మందంగా ఉన్న వ్యక్తులలో నిరాశావాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి దృక్పథం ఉన్న వ్యక్తులు సహజంగానే మానసికమైన రోగాలను కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా విశాలమైన దృక్పథం ఉన్న మనుషులలో కార్టెక్స్ తక్కువ మందంతోనూ, ఎక్కువ వైశాల్యంతోనూ కనిపించింది.   మెదడు ఓ చిత్రమైన అవయవం. తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచీ యవ్వనం వచ్చేంతవరకూ కూడా ఆ మెదడులో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో మన ఆలోచనా తీరు, మన అలవాట్లు కూడా మెదడు నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. మెదడులోని కార్టెక్స్ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని చేరుకోవాలంటే దానికి ఒకే ఉపాయం ఉంది. అది తన మందాన్ని తగ్గించుకుని వైశాల్యాన్ని పెంచుకోవాలి. అలా పెరిగిన వైశాల్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ముడతలు పడాలి.   ఒక్క మాటలో చెప్పాలంటే రబ్బరు షీటుని మడిచిపెట్టినట్లుగా కార్టెక్స్‌ కూడా మడతలు మడతలుగా మారడం వల్ల తనకి ఉన్న ప్రదేశంలోనే ఎక్కువ విస్తరించగలుగుతుందన్నమాట. మెదడులో ఇలాంటి మార్పులు వచ్చేందుకు మన ఆలోచనలు కూడా దోహదపడతాయని ఇప్పుడు తెలిసిపోయింది. మనుషులు పెద్దవారయ్యే కొద్దీ వారిలో తిరుగుబాటు ధోరణి, బాధ్యతారాహిత్యం, నిరాశావాదం తగ్గడానికి కారణం కూడా మెదడులో వచ్చే మార్పులే కారణం అంటున్నారు. అదీ విషయం! అంటే మన మెదడు శుభ్రంగా ఎదగాలంటే ఆలోచనల్లో పరిపక్వత ఉండాలన్నమాట!   - నిర్జర.

ఆకాశమే హద్దురా!! 

మనిషి ఆత్మవిశ్వాసాన్ని గురించి మాట్లాడేటప్పుడు, జీవితంలో సాధించాల్సిన లక్ష్యాల గురించి చర్చిస్తున్నపుడు చాలామంది చెప్పే మాట ఆకాశమే హద్దుగా సాగిపో అని. అంటే అంత ఆత్మవిశ్వాసంతో ఉండాలని. ఆకాశం ఒక అనంత దృశ్యం. నింగికి ఎగరడం ఒక అపురూప విజయ బావుటా ఎగరేసినంత సంతోషం. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదిన పౌర విమానయాన దినోత్సవం జరుపుకోబడుతుంది. గ్రామాలు, రాష్ట్రాలు, దేశాలకు సరిహద్దులు చేరిపి మనిషి ప్రయాణం సాగిస్తున్నాడు. అయితే దేశాలను దాటి ఖండాంతరాలు దాటి ప్రతిభను పెంచుకుంటూనో, జీవితాన్ని మెరుగుపరుచుకుంటూనో సాగుతున్నాడు. రెక్కలు కట్టుకుని ఏమీ ఎగిరిపోవడం లేదు కానీ, రెక్కల కృత్రిమ విహంగాలలో గాల్లో తేలినట్టుందే అని పాడుకుంటూ ప్రయాణాలు సాగిస్తున్నాడు. ఇదంతా పౌర విమానయాన శాఖ కల్పిస్తున్న సౌకర్యమే. రైట్ బ్రదర్స్!! రైట్ రైట్ బ్రదర్స్!! విమానాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు వైట్ బ్రదర్స్. వీళ్ళ పుణ్యమా అని గాల్లో ఎగురుతూ తిరుగుతోంది కోట్ల ప్రజానీకం. దాని ద్వారా ఎంతో మందికి ఉపాధి. ఫైలట్ లు, ఎయిర్ హోస్ట్ లు మాత్రమే మనకు తెలుసు. దాని వెనుక బోలెడు యంత్రాంగం, యంత్రాల తయారీకి బోలెడు ఇంజనీరింగ్ సైన్యం ఉంటుంది. ఇదంతా ఒక వైపు విషయం అయితే  మనుషుల ఆర్థిక స్థాయిల కొద్దీ వారి కోరికలు ఉంటాయి. స్థాయి పెరిగేకొద్దీ అవి కూడా పెరుగుతాయి. చిన్నతనంలో ఆకాశంలో విమానం ఎగురుతూ పోతుంటే దాన్ని చూసి చేతులు ఊపుతూ గంతులు వేసిన బాల్యానికి అదే విధంగా తాము విమానంలో ప్రయాణించి రెక్కల చాచుకున్న పక్షిలా  మనసును ఎగరేస్తూ దేశం దాటాలని, విదేశాలలో విద్య, ఉద్యోగం, విశిష్ట సందర్భాలు, విహారయాత్రలు వగైరాల వంకతో ఆకాశాన్ని ముద్దాడుతూ ప్రయాణించాలని అనుకుంటారు.   కల మీద సంతకం!! అలా కలలు కన్న వాళ్లకు, కన్నవాళ్ళ తోడ్పాటు చుట్టాలు, స్నేహితులు ఇలా అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉండనే  ఉంటుంది. అయితే చాలామంది మధ్యతరగతి వారికి ఇలాంటి కలలు కలలుగానే మిగిలిపోతుంటాయి. నిజానికి విమనప్రయణం మరీ అంత ఆర్థిక భారం ఏమీ కాదు. సాధారణ జీవితంలో ఖర్చులలో  కొన్ని సేవింగ్స్ వల్ల హాయిగా ఏరోప్లేన్ ఎక్కేయచ్చు.  ఆశించదగ్గ చదువు,తెలివి తేటలు ఉంటే విదేశాలలో ఎంచక్కా ఉద్యోగాలు కూడా చేయచ్చు. కాబట్టి మొదట మనిషి విద్య పరంగా మంచి స్థాయిని చేరుకుంటే ఆకాశంలో ఎగరావచ్చు, మేఘాలలో తేలావచ్చు. సగటు మనిషి కూడా కలను తీర్చుకోనూవచ్చు.  యువత కల!!  చాలామంది యూత్ కల ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం సంపాదించడం. పెద్దోళ్ళు ఏమో రిస్క్ జాబ్ వద్దంటారు. కానీ రిస్క్ లేని ఉద్యోగం అంటూ ఏదీ ఉండదు. నిజానికి నైపుణ్యం సంపాదిస్తే అన్ని ఉద్యోగాలు సహజంగానే ఉంటాయి. అలాగే ఈ ఎయిర్ ఫోర్స్ జాబ్స్ కు ఇండియన్ ఆర్మీ లెవల్ లో సెలెక్షన్స్ ఉంటాయి. నైపుణ్యం నుండి శరీర దారుడ్యం వరకు, అన్ని రకాలుగా సంసిద్ధతగా ఉన్నవాళ్లకే పట్టం కడతారు.  కాబట్టి ఆకాశంలో ఆ కృత్రిమ రెక్కల విహంగాన్ని నడపడంలోనూ, ఆ రెక్కల విహంగంలో ఎగరడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది, ప్రస్తుత మన భారతం నుండి విదేశాలలో ఉద్యోగాలు, చదువుల దృష్ట్యా వెళ్లివస్తున్నది,  స్థిరపడుతున్నది ఎక్కువగా యువతనే. కాబట్టి యువత ఆకాశమే హద్దుగా సాగిపోవాలి. అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోవాలి. కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్ళా కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ అన్నట్టు, విమానయానం, నౌకాయానం, అంతరిక్షయానం కాదేదీ యువత మేధస్సుకు అనర్హం. అందుకే కలాం చెప్పినట్టు, కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!! ◆ వెంకటేష్ పువ్వాడ  

సిగిరెట్‌ మానడం తేలికే!

‘మనిషి తల్చుకుంటే సాధించలేనిది ఏదీ లేదు’... వగైరా వగైరా వాక్యాలు మనం చాలానే వింటూ ఉంటాము. వినడానికి కాస్త అతిగా ఉన్నా, వాటిలో తప్పేమీ లేదని మనకి తెలుసు. అందుకే సిగిరెట్‌ మానడం కూడా ఏమంత కష్టం కాదని తేల్చేస్తున్నారు పెద్దలు. కావాలని అంటించుకున్న వ్యసనం, పొమ్మంటే పోకుండా ఉంటుందా! పోయేదాకా పొగపెడితే సిగిరెట్టైనా పారిపోకుండా ఉంటుందా! కాకపోతే చిన్నపాటి జాగ్రత్తలు పాటించేస్తే సరి... ప్రణాళిక ఏర్పరుచుకోండి: సిగిరెట్టుకి దూరం కావాలి అని నిర్ణయించుకోగానే, ఒక ప్రణాళికను ఏర్పరుచుకోండి. కనీసం ఒక నెల రోజులన్నా మీరు సిగిరెట్టుకి దూరంగా ఉండేందుకు ఏమేం చేయాలో నిర్ణయించుకోండి. మీ నిర్ణయాన్ని కుటుంబసభ్యులతో సహా మీ సన్నిహితులందరికీ తెలియచేయండి. మీరు ఏమాత్రం మీ లక్ష్యం నుంచి దూరమైనా, వాళ్లు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు. పొగకు దూరమైనప్పుడు మీ శరీరంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి? వాటిని మీరు ఎలా ఎదుర్కోవాలి? ఇలా ఎన్నాళ్లు ఓపిక పట్టాలి?... వంటి విషయాలన్నింటి మీదా ఒక అవగాహనను ఏర్పరుచుకోండి. వ్యాపకం మీరు ఉద్వేగంగా ఉన్నప్పుడో లేక ఖాళీగా ఉన్నప్పుడో సిగిరెట్‌ తాగాలని నోరు పీకేయడం సహజం. అందుకనే ఏదో ఒక వ్యాపకాన్ని అలవర్చుకోండి. సిగిరెట్ తాగాలని మీ నోటికి అనిపించినప్పుడల్లా చూయింగ్‌ గమ్‌ నమలడమో, మంచి నీరు తాగడమో చేయండి. చేతులతో వీడియో గేమ్ ఆడటమో, రాయడమో చేయండి. అదీ ఇదీ కాకుంటే కాసేపు ధ్యానం చేయండి లేదా ఓ నాలుగడుగులు అలా వీధి చివరిదాకా వెళ్లిరండి. మొత్తానికి సిగిరెట్‌ తాగడం తప్ప మరేదన్నా పనికొచ్చే పనిచేయండి. వాతావరణం పొగని గుర్తుచేసే అన్ని వస్తువులనీ కట్టకట్టి అవతల పారేయండి. మీ సిగిరెట్‌ ప్యాకెట్లు, లైటర్లు, యాష్‌ట్రేలు.... వీటన్నింటినీ చెత్తబుట్టలో పారేయండి. ఇక పొగని గుర్తుచేసే ప్రాంతాలకి (ఉదా॥ సినిమా హాళ్లు, బార్లు...) దూరంగా ఉండండి. మీ స్నేహితులలో తెగ పొగ తాగేవారికి కొన్నాళ్లు దూరంగా ఉండండి. వారి సాన్నిహిత్యంలో మీకు పొగ గుర్తుకురావడం మాట అటుంచి, మీతో మళ్లీ పొగ తాగించేందుకు వాళ్లు విశ్వ ప్రయత్నం చేస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు! సలహాసంప్రదింపులు సిగిరెట్టు వ్యసనానికి ముఖ్య కారణం అందులో ఉండే నికోటిన్‌ అనే పదార్థమే! కాబట్టి నికోటిన్‌ వ్యసనం నుంచి తప్పించుకునేందుకు వైద్యుల సలహా తప్పకుండా ఉపయోగపడుతంది. నికోటిన్‌ రిప్లేస్‌మెంట్‌ పేరుతో కొన్నాళ్ల పాటు తక్కువ మోతాదులో నికోటిన్‌ ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. నికోటిన్‌ వ్యసనం నుంచి దూరం చేసేందుకు మందులూ ఉన్నాయి. మన పరిస్థితిని బట్టి మనకి ఎలాంటి చికిత్స అవసరమో వైద్యులు గుర్తిస్తారు. అదీ ఇదీ కాదంటే మనకి కౌన్సిలింగ్ ఇచ్చి, సిగిరెట్‌ వ్యసనం నుంచి దూరమయ్యేందుకు సాయపడే సైకాలజిస్టులూ అందుబాటులో ఉన్నారు. కాబట్టి అవసరం అనుకుంటే ఏమాత్రం మొహమాటం లేకుండా వైద్యుల సాయాన్ని తీసుకోవాలి. సిద్ధంగా ఉండండి సిగిరెట్‌ మానేసిన మొదటి రోజు నుంచి తలనొప్పి మొదలుకొని నానారకాల ఇబ్బందులూ మీ శరీరాన్ని పీడించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు... వారాల తరబడి నానారకాల సమస్యలూ మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆకలి వేయదు, నిద్ర పట్టదు, దేని మీదా ధ్యాస నిలువదు. నిస్సత్తువ, అజీర్ణం, దగ్గు... మనల్ని కుంగతీస్తాయి. వీటన్నింటినీ తట్టుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీకు ఇష్టమైన కుటుంబ సభ్యుల కోసం, మీ దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం కొన్నాళ్లపాటు వీటిని భరించక తప్పదని గుర్తుంచుకోండి. ఒకో వారం గడిచేకొద్దీ మీ ప్రయత్నాన్ని మీరే అభినందించుకోండి. మీకు మీరే బహుమతిగా ఇష్టమైన వస్తువులను కొనుక్కోండి.   - నిర్జర.