ఒంటిమిట్ట కల్యాణ మహోత్సవం!!
posted on Apr 13, 2022 @ 9:30AM
కోదండరాముడంట అమ్మలాలా, కౌసల్య పుత్రుడంట అమ్మలాల అని పాడుతుంటే రామభక్తుల మనసు రమణీయంగా ఉంటుంది. చేతిలో కోదండం అనే ధనస్సు పట్టుకుని ఉంటాడు కాబట్టి ఈయన కోదండ రాముడయ్యాడని తెలుస్తుంది.
రామాయణంలో రామలక్ష్మణులు చిన్నగా ఉన్నప్పుడే విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం వాళ్లను తీసుకెళ్లడం. యాగరక్షణ తరువాత సీతమ్మ స్వయంవరానికి వెళ్లి అక్కడ శివదనస్సు విరిచి సీతమ్మను పెళ్లాడటం అందరికీ తెలిసిందే. అయితే అదంతా జరిగిపోయిన తరువాత కూడా రామలక్ష్మణులు ఒకసారి యాగరక్షణ కోసం వెళ్లినట్టు ఓ పురాణ కథనం ఉంది.
దుష్టశిక్షణకై నడక!!
మృకండుడు, శృంగుడు అని ఇద్దరు మహర్షులు ఉండేవాళ్ళు. వాళ్లిద్దరూ ఒక యాగం చేస్తుంటే రాక్షసులు ఆ యాగాన్ని అడ్డుకుంటూ ఆ మహర్షులను బాధపెట్టేవాళ్ళు. ఆ మహర్షులు ఇద్దరూ రాముడి దగ్గరకు వెళ్లి "రామా!! నువ్వు చిన్నతనంలోనే విశ్వామిత్రుడితో వెళ్లి యాగరక్షణ చేసావు కదా!! ఇప్పుడు మాక్కూడా అలాంటి రక్షణ కావాలి. మేము చేసే యాగం ఎలాంటి అడ్డంకులతో ఆగిపోకుండా నువ్వు వచ్చి కాపాడు" అని అడగగా, సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లిన ఆ రామచంద్రుడు యాగాన్ని రక్షించాడు. దానికి గుర్తుగా మృకండుడు, శృంగుడు ఇద్దరూ ఆ సీతారామ లక్ష్మణులను ఏకశిలలో చెక్కించారు. జాంబవంతుడు ఈ ఆలయంలో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసాడు.
హనుమంతుడు లేని ఆలయం!!
రాముడి బంటు హనుమంతుడు. రామనామం జరిగే ప్రతిచోటా హనుమంతుడు ఉంటాడు. రాముడున్న ప్రతిచోటా హనుమంతుడు ఉంటాడు. కానీ ఈ ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు. సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుడు లేని ఆలయం ఇదొక్కటేనని చెబుతారు. కారణం గురించి ఆలోచిస్తే రాముడికి, హనుమంతుడికి పరిచయం జరగకమునుపు ఇదంతా జరిగి ఉంటుందని పెద్దలు, చరిత్రకారులు చెబుతారు.
విశేషాలు!!
ఒంటిమిట్ట కోదండరామాలయానికి ఎంత చరిత్ర ఉందొ, అంతకు మించి విశేషాలు ఉన్నాయి. ఈ కోదండ రాముడిని స్తుతిస్తూ "అయ్యల తిప్పరాజు" శ్రీ రఘువీర శతకాన్ని రచించి ఈ కోదండరాముడికే అంకితమిచ్చాడు. ఈయన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అయ్యలారాజు రామభద్రుడి తాతగారు కావడం గొప్ప అంశం.
బమ్మెరపోతన తను రచించిన భాగవతాన్ని ఈ కోదండరాముడికే అంకితం ఇచ్చాడు. అలాగే వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి ఈ కోదండరాముడి దగ్గరే మందరం అనే పేరుతో వ్యాఖ్యానం రాసాడు. ఈయన కొబ్బరి చిప్పలో బిక్షం ఎత్తి వచ్చిన డబ్బుతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని, దేవతా మూర్తులకు ఆభరణాలు చేయించడానికి, రామసేవ కుటీరాన్ని నిర్మించడానికి ఉపయోగించాడని చెబుతారు. ఇంకా ఎంతోమంది కవులు ఈ ఏకశిలానగరంలో రామునికి తమ కవిత్వంతో అర్చన చేసుకున్నారని చెబుతారు.
బ్రహ్మోత్సవాల విశిష్టత!!
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ఎంతో గొప్పగా జరుగుతాయి. అన్నీకంటే ముఖ్యమైనది సీతారాముల కల్యాణం. పౌర్ణమి నాడు వెన్నెల వెలుగులో ఈ కల్యాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. పౌర్ణమి రోజు వెన్నెలలో ఎందుకు జరుపుతారు అనే ప్రశ్నకు సమాధానంగా ఒక పురాణం కథనం ఉంది.
సాగర మథనం తరువాత మహాలక్ష్మిని నారాయణుడు భార్యగా స్వీకరించాడు. వీరి కల్యాణం పగటి సమయంలో జరుగుతుండటంతో చంద్రుడు తన బాధను మహాలక్ష్మీకి చేబుతాడట. నేను మీ కల్యాణం చూడలేకపోతున్నాను అని. అపుడు మహాలక్ష్మికి తమ్ముడిని తృప్తి పరచడానికి ఒంటిమిట్ట ఆలయంలో పౌర్ణమి వెలుగులో రాత్రిపూట మా కల్యాణం జరుగుతుంది చూసి ఆనందించు అని చెబుతుందట. అప్పటి నుండి పౌర్ణమి సమయంలో ఎంతో అద్భుతంగా జరుగుతూనే ఉంది ఈ కల్యాణం.
రాష్ట్రాలు వేరైపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా ప్రకటించి ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణంకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తోంది.
ఏకాశిలానగరంలో పౌర్ణమి వెన్నెలలో సీతారాముల కల్యాణం, ఆ తరువాత రథోత్సవం చూసిరండి, ఆ రాముడి గురించి ఆలకించినా ఆలపించినా మైమరిచిపోతారు.
◆వెంకటేష్ పువ్వాడ.