వెలిగే సూర్యుడు నాన్న!

సూర్యుడు ఈ సృష్టికి వెలుగు పంచేవాడు. ఉదయాన్నే లేలేత ఎండతోనూ, మధ్యాహ్నం భగభగ మండే ఎండతోనూ, సాయంత్రానికి చల్లబడి మెల్లిగా తన ప్రతాపం తగ్గిస్తూ ఉంటాడు. కానీ సూర్యుడు రాత్రి పూట కూడా తన పని తాను చేస్తూ ఉంటాడు. అయితే అది మనకు కనిపించదు. దాన్ని చీకటని, రాత్రి అని, ఇంకా వేరే వేరే పేర్లు పెట్టుకుంటాము. ఈ భూమండలం పెద్దది కాబట్టి సూర్యుడు మరొకవైపుకు వెళ్ళినప్పుడు ఆ వెలుగు మనకు కనిపించదు. బహుశా దీన్ని అవతలి కోణం అని కూడా అనచ్చేమో. ఇప్పుడు సూర్యుడి గురించి ఎందుకు?? అని అందరికీ సందేహం వస్తుందేమో కానీ మన ఇంట్లో నాన్న కూడా సూర్యుడి లాంటివాడే. నాన్న ప్రేమ ఉదయాన్నే సూర్యుడి వెలుగులా ఉంటుంది. నాన్న కోపం మధ్యాహ్నపు ఎండలా ఉంటుంది. నాన్న కష్టం అస్తమిస్తున్న సూర్యుడిలా నిశ్శబ్దంగా ఉంటుంది. నాన్న ఓర్పు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే సూర్యుడి గమనంలా ఉంటుంది.  నాన్నంటే!! నాన్నంటే ఓ ధైర్యం, ఓ భరోసా, ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తూ అందరి బాధ్యత మోస్తూ నిత్యం వెలిగే సూర్యుడి లాంటి వాడు నాన్న. అమ్మను అమ్మ ప్రేమను ఎప్పుడూ బయట పెడుతూ ఉంటాము. అమ్మను దేవతతో పోల్చి గొప్పగా పొగుడుతూ ఉంటాము. కానీ నాన్న విషయంలో మాత్రం అంతగా బయటకు చెప్పము. నాన్న ఎంత గొప్ప వాడు అయినా పిల్లల ముందు ఓడిపోవడానికే ఇష్టపడతాడు. అమ్మ ప్రేమ అమ్మ త్యాగం ఎప్పటికప్పుడు బయటకు కనిపించేవి అయితే నాన్న ప్రేమ, నాన్న త్యాగం కనిపించని ప్రాణవాయువు లాంటివి. గాలి కంటికి కనిపించదు కానీ అది లేకుంటే సమస్ధానికి మరణమే గతి. అలాగే నాన్న ప్రేమ, నాన్న త్యాగం బయటకు కనిపించవు కానీ నాన్న లేకుంటే ఏ కుటుంబం నిశ్చింతగా ఉండదు. నాన్న ఎందుకో చిన్నబోయాడు!! అమ్మ నవమాసాలు మోస్తుంది, నొప్పులు భరించి బిడ్డలకు జన్మనిస్తుంది. పాలిస్తుంది,. తన కొంగు వెనుక దాచుకుని పెంచుతుంది. ఇల్లాలకు ఏదైనా అవసరం వస్తే మొదట అమ్మ దగ్గరకే వెళ్తారు, బడి వయసు వచ్చేదాకా అమ్మ చేతుల్లోనే ఉంటారు పిల్లలు. అందుకే అమ్మకు దగ్గరగా ఉంటారు. నాన్నంటే అదొక భయం. ఉదయం లేచి ఏదో తిని, క్యారియర్ లో కట్టుకుని ఉద్యోగానికి వెళ్ళిపోయి ఎప్పుడో సాయంత్రం చీకటిపడే ముందు నాన్న ఇంటికి చేరుకుంటాడు. పాపం తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డల్ని ప్రేమగా ఎత్తుకోవాలని, ముద్దాడాలని అనుకుంటాడు. కానీ ఇంట్లో పిల్లలు అలసిపోయి అన్నం తిని నిద్రపోతూ ఉంటారు. చిన్న పిల్లలు అంటే నిద్రలోనే ఎక్కువ గడుపుతారు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక వాళ్ళు బడికి అలవాటు పడ్డాక, నాన్నలో ఆశ మొలకేస్తుంది. నా బిడ్డ మంచి స్థాయికి చేరుకోవాలి అని. అందుకే బాగా చదువుకోవాలని, మంచి మార్కులు రావాలని కొప్పడతాడు, అప్పుడప్పుడూ దెబ్బ వేస్తాడు. కోపం వెనుక, దెబ్బల వెనుక ప్రేమను అర్థం చేసుకోవడం మనవల్ల కాదప్పుడు. అందుకే అందరి మనసుల్లో నాన్న ఒక విలన్ లాగా ముద్రించుకుపోయి వెనుకబడ్డాడు. అన్ని విషయాల మెజ్నదు ప్రాధాన్యత లేని వ్యక్తిలా కనిపిస్తాడు. నాన్నకు ఒక ఉత్తరం!! ఓ పాతికేళ్ల వ్యక్తితో తన తండ్రికి ఉత్తరం రాయమంటే ఏమి రాయాలి అనే నిర్లక్ష్య సమాధానం వస్తుందేమో, కానీ తండ్రి స్థానానికి మారిన తరువాత అదే వ్యక్తితో ఉత్తరం రాయమని చెబితే తప్పకుండా ఎంతో బావిద్వేగంతో కూడుకున్న ఉత్తరం రాస్తాడు. అవును మరి బాధ్యత మీద పడితే తప్ప నాన్న సంఘర్షణ, నాన్న ప్రేమ, నాన్న ఆరాటం, నాన్న ఆశ, నాన్న త్యాగం ఇవ్వేమీ తెలిసిరావు.  ఎప్పుడూ అమ్మ అమ్మ అమ్మ అని అమ్మకోసమే కాదు ఆకాశమంత వ్యక్తిత్వం కలిగి, నిశ్శబ్దంగా తన పిల్లలకోసం తలవంచే నాన్న కోసం కూడా కొద్దిగా సమయం కేటాయించండి. అమ్మ అనే పదాన్ని కలుపుకున్నంత సులభంగా నాన్న అనే పదాన్ని కలుపుకోలేం మరి.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి!

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి అంటారు పల్లె ప్రజలు. అరుద్రలో పడే వాన అమృతంతో సమానమని వ్యవసాయదారులు భావిస్తారు. మృగశిర కార్తెలో వర్షాల కదలిక మొదలైతే ఆరుద్ర కార్తెలో ఆ వర్షాలు ఇంకొంచెం పుంజుకుంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే భూమి పుష్కలంగా తడిసి రైతులు వారి నాట్లు, జొన్న, మొక్కజొన్న, ప్రతి వంటి పంటల సాగుకు ఇక నడుం కట్టినట్టే. వ్యవసాయంలో ఎంతో ముఖ్యమైన అంశం అయిన మార్పులు చోటుచేసుకునే కాలాన్ని వ్యవసాయ పంచాంగంలో ఆరుద్ర కార్తె అని పిలుస్తారు.  ఆరుద్ర పురుగు! వ్యవసాయదారులకు ఈ ఆరుద్ర కార్తెలో కనిపించే గొప్ప అతిథి ఆరుద్ర పురుగు. ఎరుపు రంగులో వెల్వెట్ క్లాత్ చుట్టుకుని ఉందా అన్నట్టుగా కనిపించే ఈ ఆరుద్ర పురుగు పంట పొలాల్లో, వ్యవసాయ భూముల్లో కనిపిస్తే ఇక రైతులు తమ పని గట్టిగా ముందుకు లాగాల్సిందే అని సోఇచన ఇచ్చినట్టు అంట. వ్యవసాయం, వాతావరణ పరిస్థితుల మీద గొప్ప అవగాహన ఉన్న వాళ్లకు ప్రకృతి మార్పులను అనుసరించి ఎప్పుడు ఏ పని చేయాలి అనేది బాగా అర్థమయ్యేది. దాన్ని అనుసరించి మంచి పంటలు సాగుచేసి పుష్కలమైన దిగుబడి సాధించేవాళ్ళు. వ్యవసాయదారుల నేస్తం అయిన ఈ ఆరుద్ర పురుగు కేవలం సంవత్సరంలో ఒక్కసారి, ఆరుద్ర కార్తె సమయంలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆరుద్ర పురుగును చూసి నాట్లు వేయడానికి కదిలిపోవచ్చు రైతన్నలు. చాలామంది ఎవరైనా కనిపించడం తగ్గిపోయినప్పుడు, చాలారోజులు దూరంగా వెళ్ళినప్పుడు చాలా నల్లపూస అయిపోయావు, ఆరుద్రపురుగులాగా అంటూ ఉంటారు. దాని అర్థం ఆరుద్ర పురుగు కూడా సంవత్సరంలో ఒకసారి మాత్రమే కనబడుతుంది అని, అలా చాలా బిజీ అయిపోయి బొత్తిగా కనబడటం లేదని అర్థం. ఆరుద్ర కార్తెలో కోలాహలం! ఆరుద్ర కార్తెలో రైతన్నలు కోలాహలం చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పంటలు వేసేవాళ్ళు చాలా హడావిడిగా కనిపిస్తారు. వరి పంట వేసేవాళ్ళు నారుమళ్లలో అంతరకృషి చేస్తారు. అంటే బాగా తడిసిన  భూమిని దుక్కి దున్నడం, వారి నట్లు వెయ్యడం, వంటివి చేస్తారు. వర్షం సమృద్దిగా పడితే వరి నాట్లు వేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ మొదటి దశలో జరిగేవి. ఇప్పుడే ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వంగడాల విషయంలో మంచి అవగాహన, సలహాలు, సూచనలు కలిగి ఉంటారు.  జొన్న పంట వేసేవాళ్ళు దుక్కులు దున్నడం, రసాయనిక ఎరువులు వేయుట, విత్తనం వేయడం వంటివి చేస్తారు. విత్తనాల ఎంపిక ఎంతో కీలకమైంది. మొక్కజొన్న పంటలు వేసేవాళ్ళు సస్యరక్షణ  చేపడతారు. అప్పటికే నాటిన మొక్కజొన్నకు రెండవ సారి ఎరువులు వేయడం వంటి పనులు చేస్తారు. అలాగే ఎరువుల ఎంపిక ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రత్తి పంట వేసేవాళ్ళు అంతరకృషి చేస్తారు, మొక్కలను పలుచన చేయడం చేస్తారు.   గోగు  పంట వేసేవాళ్ళు అంతరకృషి చేయడం, మొక్కలను పలుచన చేయడం చేస్తారు. ఇక పంటల నుండి తోటల పెంపకంలోకి వస్తే పండ్ల తోటల సాగు చేసేవారిలో అరటి, మామిడి, జామనాట్లు వేయడం చేస్తారు. అలాగే కొబ్బరి చెట్లకు ఎరువులు వేయడం, రేగు, దానిమ్మ వంటి చెట్ల నాట్లు వేయడం చేస్తారు. పప్పుధాన్యాల తరహా పంటలు పండించేవారు చాలా ఆలోచన చేస్తారు. వీటికి నీటి అవసరం ఎంతో ఉంటుంది.  వర్షాలు ఆలస్యం అయితే కంది పంట విత్తడానికి భూమిని తయారు చేయడం, విత్తడం చేస్తారు.   కూరగాయల పంటలు ఏడాది పొడవునా సజీవి అయినా వీటిని మొదటగా అరుద్రకార్తెలో నాటితే ఏడాది మొత్తం వాటి దిగుబడి బాగుంటుందని నమ్ముతారు.  బీర, సొర, పొట్ల, గుమ్మడి మొదలైన విత్తనాలు విత్తడం చేస్తారు. ఇకపోతే సువాసన మొక్కలు అయిన నిమ్మగడ్డి, కామాక్షిగడ్డి, సిట్రొనెల్లా వంటి నాట్లు కూడా ఇదే సమయంలో వేస్తారు. ఇవన్నీ పెద్దగా సాగులో లేకపోయినా పండిన వరకు ఎన్నో లాభాలు ఇస్తాయి. ఇలా ఆరుద్ర కార్తెలో పంటల సాగులో రైతన్నలు మునిగి తేలతారు.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

రెడ్ అలెర్ట్!

రెడ్ అలెర్ట్ అనేది ప్రమాద సూచన. ప్రమాదం ఏ విషయంలో అంటే ఏదైనా కావచ్చు. కానీ అందులో ఉన్న రెడ్ హెడ్లైన్ గా మరి డేంజర్ బెల్స్ మోగిస్తే. ఇదేదో క్రైమ్ సీన్ కు ఎక్స్ప్లేన్టేషన్ ఇచ్చినట్టు ఉందేంటి అనుకోకండి. ఈ రెడ్ అలర్ట్ అంతా మనలో ఉన్న రెడ్ గురించే. అదే అదే మనలో ఉన్న ఎరుపు అంటే మనిషి శరీరంలో ఉండే రక్తమే. అందరి శరీరాల్లో ఉండే రక్తం రంగు ఎరుపు అయినా కొందరి శరీరంలో రక్తం విషయంలో సమస్యలు బాగా వచ్చేస్తున్నాయ్. చాలామంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళల్లో……. భారతదేశంలో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది అనిమియా!! శరీరంలో రక్తం తగినంత లేకపోవడం, రక్తకణాల క్షీణత, హిమోగ్లోబిన్ లోపించడం వంటి సమస్యలు మహిళలను భూతాళ్లా వెంటాడుతున్నాయి. ఎన్నిరకాల మందులు వాడినా అవి వాడినన్ని రోజులు బాగుండి తరువాత మళ్ళీ సమస్య మొదటికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత అనే సమస్య మహిళల్లో వేరే సమస్యలను సృష్టిస్తుంది. మహిళల్లో నెలసరి సమస్యలను అటు ఇటు చేసి మహాసికంగా, శారీరకంగా మహిళలను ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. ఇదంతా ఒక కోణం అయితే మరొక కోణం ఉంటుంది. అదే అత్యవసర సమయాల్లో రక్తం దొరకకపోవడం. ఎమర్జెన్సీ!! ఇప్పటి కాలంలో రోడ్ లు, వాహనాల రూపురేఖలు చాలా మారిపోయాయి. ఎక్కడికక్కడ ఆక్సిడెంట్ లు చాలా సాధారణ విషయాలు అన్నట్టు జరిగిపోతూ ఉన్నాయి. అలాంటి సందర్భాలలో బాధితులు హాస్పిటల్ వెళ్లెవరకు బతకడం వారి అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే హాస్పిటల్ కి వెళ్లిన తరువాత అవసరము అయ్యే  రక్తం అనుకున్న సమయానికి దొరకక ఎన్నో ప్రాణాలు గందరగోళంలో పడిపోతున్నాయి.  బ్లడ్ డోనర్స్!! ఈ సమాజంలో బ్లడ్ డోనర్స్ పాత్ర నిజంగా ఎంతో అభినందనీయమైనది. రక్తదాతలు కేవలం రక్తాన్ని దానం చేసినవాళ్ళు మాత్రమే కాదు, ప్రాణాలను దానం చేసినవాళ్ళు, ప్రాణాన్ని నిలబెట్టినవాళ్ళు. కొంతమంది అత్యవసర సమయాల్లో ఎవరైనా ఎమర్జెన్సీ ఉందంటూ కాల్ చేస్తే ఉన్న పనులు వదిలిపెట్టుకుని మరీ హాస్పిటల్స్ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటి బాధ్యతాయుతమైనవాళ్ళు  హాస్పిటల్స్ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటి బాధ్యతాయుతమైనవాళ్ళు  చాలా కొద్దిమంది ఉన్నారు. కనిపించే దేవుళ్ళు అని పిలిచినా వీళ్ల రుణం తీర్చుకోలేము. బ్లడ్ డోనర్స్ డే!! రక్తదాతల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అనే ఆలోచన ఎవరికైనా వస్తుందో లేదో తెలియదు కానీ కొందరు ఈరోజు సామాజిక సేవల కింద రక్తాదాన శిబిరాలు నిర్వహించడం, రక్తాన్ని దానం చేయడం చేస్తుంటారు. మరికొందరు రక్తదానం చేసినవారి ఆరోగ్యం కోసం పండ్లు ఇస్తుంటారు. ఎవరెవరి ఆలోచన వాళ్ళది.  అయితే 1901 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్ లాండ్ స్టీనర్ అనే వ్యక్తి రక్తాన్ని వర్గాలుగా విభజించారు. ఈయన నోబెల్ బహుమతి గ్రహీత కూడా. రక్తాన్ని వర్గాలుగా విభజించడం వల్లనే ఈరోజు ఇంతమంది ప్రమాధాలలో ఉన్నప్పుడు అత్యవసరంగా వర్గాల వారిగా రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడుతున్నారు. అందుకనే ఈయన పుట్టినరోజు గుర్తుగా రక్తాదాన దినోత్సవాన్ని అదేనండి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ని నివాహిస్తున్నారు.  కొంచెం ఆలోచించండి!! రక్తం అనేది కృత్రిమంగా తయారుచేసే ద్రవం కాదు. అది శరీరంలో ఉత్పత్తి అయ్యేది. మహిళల్లో నెలవారీ రక్తం పోతున్నా తిరిగి తీసుకునే ఆహారపదార్థాలు వల్ల ఆ రక్తం భర్తీ అవుతూ ఉంటుంది. కాబట్టి రక్తాన్ని ఇవ్వడంలో సమస్య ఏమీ ఉండదు. కాకపోతే శరీరంలో రక్తం పుష్టిగా ఉన్నవాళ్లు రక్తాన్ని దానం చేస్తే ఎంతో మంచిది. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవాళ్లు రక్తాన్ని దానం చేయచ్చు. తినే ఆహారం వల్ల వృద్ధి చెందే రక్తాన్ని అప్పుడప్పుడు దానం చేయడం వల్ల మరొకరి ప్రాణాన్ని కాపాడటమే కాకుండా కొత్త రక్తం వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి శరీరంలో రక్తం మలినమైందేమో అనే పిచ్చి ఆలోచనలు కూడా ఉండవు.  ఆలోచించండి మరి. ◆వెంకటేష్ పువ్వాడ.

సముద్రాలకు రక్షణ ఎక్కడ?

బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది అనే మాట మనకు అందరికీ తెలిసినదే. చుక్క చుక్క నీటి బొట్టు కలిస్తేనే సముద్రమైనా ఏర్పడేది. లేకపోతే సముద్రానికి మాత్రం రూపమెక్కడ. అంటే సముద్రం ఉనికి చుక్క నీటిబొట్టులో కూడా ఉందని అర్థం. సముద్రాలు ఈ భూమి మీద ప్రధాన పాత్రలు పోషిస్తాయి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి వంటి పంచభూతాలలో నీటిని నింపుకున్నవి సముద్రాలు. ఇవి కేవలం నీటి వనరులుగా కాకుండా ఎన్నో రకాల ఖనిజసంపదలకు  నిలయం. దేశాలను, ఖండాలను వేరు చేస్తూ ఉన్న ఈ సముద్రాలు జలమార్గానికి అనువైనవి. వాణిజ్యానికి అందులో ముఖ్యమైన ఎగుమతులు, దిగుమతులకు ఎక్కువభాగం సముద్రాలే ఉపయోగపడుతున్నాయి. జరుగుతున్న నష్టాలు! సముద్రాలు ఎంత గొప్పవో అందరికీ తెలిసిందే. అయితే చాలామంది వీటిని పుస్తకాల్లో చదువుకోవడం, టీవీలలో చూడటం జరుగుతూ ఉంటుంది. కొందరు మాత్రమే సముద్ర తీర ప్రాంతాలలో నివసించేవారు, పర్యాటకం  మీద ఆసక్తి ఉన్నవారు సముద్రాలను దగ్గరగా చూస్తూ ఉంటారు. అలాంటివాళ్లకు సముద్రపు నీళ్లలో ఎక్కువగా కనిపించేవి ఏవి అని అడిగితే బాగా సమాధానం ఇస్తారు. ఇంతకూ సముద్రపు నీళ్లలో ఎక్కువగా కనబడుతున్నది ఏమిటంటే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ అనేది కవర్ల రూపంలో ఈ పర్యావరణాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద భూతం అని చెప్పుకోవచ్చు. సముద్రతీర ప్రాంతాలలో ఫ్యాక్టరీలు గనుక ఉంటే ఫ్యాక్టరీలు విడుదల చేసే వ్యర్థాలు, రసాయనాలు, చెత్త అంతా సముద్రంలోకే వదిలేస్తున్నారు. ఫలితంగా సముద్రాలకు చెప్పలేనంత నష్టం వాటిల్లుతోంది. అది మాత్రమే కాకుండా ఈ రసాయనాల ప్రభావం వల్ల సముద్రంలో పెరిగే ఎన్నో రకాల సముద్ర జాతి జీవులు చనిపోవడం మాత్రమే కాకుండా అంతరించిపోతున్నాయి కూడా. స్వార్థపు అడుగులు! మనుషులకు స్వార్థం ఎక్కువ. అందుకే ఎక్కడ ఏమి దొరికినా దాన్ని చేజిక్కించుకుంటూ పోతాడు. అదే పద్దతిలో సముద్రాలను కూడా ఇష్టమొచ్చినట్టు నాశనం చేస్తుంటాడు. సముద్రగర్భంలో లభ్యమయ్యే ఖనిజ సంపదలు అయిన పెట్రోలియం వంటి చమురు నిక్షేపాల కోసం నిక్షేపంగా ఉండే సముద్రాల గర్భాలను అల్లకల్లోలం చేస్తున్నారు. అలాగే సముద్రంలో ఎంతో విలువైన ముత్యాలు, బంగారు గనులు వంటివి కూడా చాలా మిస్టరీగా ఉంటాయి. వాటికోసం ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. సముద్ర గర్భాలలో జరిగే కదలికల వల్ల సముద్రపు విస్ఫోటనాలు, సునామీలు సంభవిస్తూ ఉంటాయి. సముద్రంలో కలుస్తున్న వ్యర్థాల వల్ల చేపలు కూడా విషపూరితంగా మారిపోతూ ఉంటాయి. ఎన్నో అరుదైన సముద్ర జాతులు అంతరించిపోతూ ఉంటాయి.  మన కర్తవ్యం! నిజానికి సముద్రాలకు నష్టం జరుగుతున్న మార్గం తెలిస్తే అవన్నీ అంతర్జాతీయ సమస్యలుగా అనిపిస్తాయి. కానీ మనుషులు పీలుస్తున్న ఆక్సిజన్ లో 70% సముద్రాల నుండి లభిస్తున్నదే అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి సముద్రాలు మాత్రం ఆమ్లాన్ని నింపుకుని కలుషితం అయిపోతున్నాయి. సముద్రాల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మత్స్యకారులు మాత్రమే కాకుండా సాముధ్రాంతర్గత కార్యకలాపాల మీద ఆధారపడున్నవాళ్ళు  చాలామంది ఉన్నారు. ఎక్కువభాగం అగ్నిపర్వతాల పేలుళ్లు సముద్రాలలో సంభవిస్తున్నాయి. అదే సముద్రాల మనుగడ కష్టమైనప్పుడు మానవ సంచార ప్రాంతాలలో అవి సంభవిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి.  ఇవి మాత్రమే కాకుండా సముద్రాల వలన తెలియని ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి. వాటి వల్లనే చాలామంది ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. సముద్ర ప్రయాణంలో ఆటుపోట్లు అనేవి ఎలాంటివో సముద్రాలను నాశనం చేస్తే మనుషుల మనుగడ అలాగే అటుపోట్లలో చిక్కుకున్నట్టు అవుతుంది. కాబట్టి సముద్రాలను కాపాడుకోవడం అందరి బాధ్యత. బీచుకు వెళ్తే మీ వంతుగా నష్టం కలిగించకండి మరి.  ◆వెంకటేష్ పువ్వాడ

మృగశిరకార్తెతో జర జాగ్రత్త!

రోహిణీలో రొకళ్ళు పగిలితే మృగశిరలో ముంగిళ్ళు తడుస్తాయి అనే మాట అందరూ వినే వుంటారు.  వైశాఖం, జైష్టంలలో వేసవి విసురుల నుండి ఆషాడంలో కురిసే వర్షాలు కొత్త ఉపిరిని ఇస్తాయి. మృగశిర కార్తె తో మొదలయ్యే వర్షాల సందడితో వ్యవసాయదారులు కూడా బిజీ అయిపోతారు. అయితే వ్యవసాయాన్ని మినహాయించి చూస్తే మృగశిర కార్తె కు ఒక ప్రత్యేకత ఉంది. అదే చేపలు. మృగశిర కార్తె వచ్చిందంటే చేపల కొనుగోళ్ళు ఊపందుకుంటాయి. ప్రతి ఇంట్లో చేపలతో చేసే వంటకాలు ఘుమఘుమలాడుతూ ఉంటాయి. అన్ని మాసాలలో, అన్ని కార్తెలలో లేని ఈ చేపల ఆచారం మృగశిర కార్తెలో ఎందుకొచ్చినట్టూ? చేప రహస్యం! ఇదేమీ చేపలో ఉండే రహస్యం కాదు. చేపలు తినడం వెనుక రహస్యం గురించే ఇక్కడ విషయం. అందరూ చెప్పుకునేదాని ప్రకారం వేసవిలో ఉష్ణోగ్రతల మధ్య నుండి ఒక్కసారిగా మృగశిరలోకి ఎంటర్ అవ్వగానే వర్షాలు, గాలులు చల్లని వాతావరణం వల్ల శరీరానికి ఒకానొక అసౌకర్యం ఏర్పడుతుంది. వాతావరణానికి ప్రభావితమై శరీరం జబ్బులకు లోనవుతుంది. అలాంటి పరిస్థితులను అధిగమించాలనే చేపలు తింటారు. సాధారణంగా ఇలాంటి వాతావరణానికి ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు చేపమందు పంపిణీ చేయడం అందరూ చూస్తూనే ఉంటారు. ఇలా మృగశిర కార్తెలో చేపలు తినడం వెనుక కూడా అలాంటి ఆరోగ్యకర కారణమే ఉంది.  ఇక చేపలలో  కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజ పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి మాత్రమే కాకుండా  లైసిన్, మిథియోనిన్, ఐసాల్యూసిన్ వంటి ఆమ్లోనో ఆమ్లాలు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. థయామిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, పెరిడాక్సిన్‌, బయోటిన్‌, పెంటోదినిక్‌ ఆమ్లం, బీ 12 వంటి విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్ఏ , ఈపీఏ వంటివి కంటి చూపు మెరుగ్గా ఉండేలా చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చేపల్లో ట్రై గ్లిసరైడ్స్‌ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది శరీర రక్త పీడనంపై ముఖ్యంగా గుండెపై మంచి ప్రభావం చూపుతుంది. గుండె జబ్బు, అస్తమా వ్యాధిగ్రస్తులు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే చాలా మంచిది. నమ్మకమే వ్యాపారం! కొన్ని నమ్మకాలు వ్యాపారాలను నడిపిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలు తినాలి అనే నమ్మకమే దీనికి పెద్ద ఉదాహరణ. అలాగని ఇదేమీ మూఢనమ్మకం కాదు ఈ సీజన్ ను అనుసరించి చేపలు తినడం మంచిదే. అయితే ఖచ్చితంగా ప్రారంభం రోజే తినాలనేది కొంచెం అతినమ్మకమే. కానీ ఈ సీజన్ లో వీలును బట్టి చేపలు తినడం అనేది ఉత్తమమైన మార్గం. మరి శాఖాహారుల సంగతేంటో! చేపల్ని పట్టేవాళ్ళు, ముట్టేవాళ్ళు, తినేవాళ్ళు సరే. మరి శాఖాహారులు ఉంటారు వాళ్లకు అనారోగ్య సమస్యలు రావా?? వాళ్లకు రోగనిరోధకశక్తిని పెంచుకునే మార్గం ఏంటి అనే ఆలోచన కనుక వస్తే దానికి కూడా పరిష్కారం చూపించారు మన పెద్దలు. శాకాహారులు బెల్లం, ఇంగువ రెండూ కలిపి దంచి చిన్న గోళీల్లా తయారుచేసి వాటిని తింటారు. బెల్లం స్వతహాగా వేడి చేసి గుణం కలిగి ఉంటుంది. ఇక ఇంగువకు ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యము ఎక్కువ. జీర్ణసంబంధ సమస్యలను చక్కగా పరిష్కరిస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల పరిష్కారం దొరికినట్టె, శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. పురాణ కథ! ప్రతి విషయానికి ఒక పురాణ కథ ఉండటం గమనిస్తూ ఉంటాం.  ముఖ్యంగా ఆచారం ప్రకారం వచ్చే కొన్ని సందర్భాలకు ఇవి బలాన్ని చేకూర్చుతూ ఉంటాయి. మృగశిరకార్తె కు కూడా అలాంటి ఒక కథ ఉంది.  పురాణ కథ ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అనే వృతాసురుడు తనకున్న వరం ప్రభావం వల్ల పశువులను, పంటలను నాశనం వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం, వర్షాలకు అడ్డుపడటం చేసేవాడు. అతనికున్న వరాల వల్ల  అతనిలో అహంకారం ఇంకా ఎక్కువగా ఉండేది. బాగా ఆలోచించిన ఇంద్రుడు సముద్ర అలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి ఆ వృతాసురుడిని చంపేస్తాడు. ఇదీ కథ. అప్పుడు ప్రకృతి మార్పు ప్రభావం ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు వైపు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తెను అందరూ ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇదీ పురాణ పరంగానూ, ఆరోగ్య పరంగానూ మృగశిరకార్తె వెనుక ఉన్న అసలైన విషయం!! ◆వెంకటేష్ పువ్వాడ.

తగ్గేదేలేదంటున్న తాతగారు!

50 ఏళ్ళు దాటిందంటే ఇక వాళ్ళ పని ఖతం, హాయిగా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, విశ్రాంత జీవితంలోకి మెల్లిగా జారుకుంటారు ప్రతి ఒక్కరూ. అయితే ఒక తాతయ్య మాత్రం తగ్గేదెలేదంటున్నారు. ఇంతకూ ఏ విషయంలో అనే సందేహం వస్తే మనం టోక్యో కబుర్లలోకి వెళ్లిపోవాలి.  జపాన్ కు చెందిన కెనెచీ హోరీ అనే తాతయ్య వయసు అక్షరాలా 83 సంవత్సరాలు. ఇదేమీ పెద్ద నెంబర్ కాదులే భారతదేశంలో వందేళ్లు దాటిన తాతలు బామ్మలు పుష్కలంగా ఉంటారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరైతే ఈ హోరీ తాతయ్య ప్రత్యేకత ఏమిటంటా అనే డౌట్ వస్తే తెలుసుకునేయ్యాలి ఇక. హోరీ తాతయ్య వయసు ప్రస్తుతం 83 సంవత్సరాలు. ఈయన జపాన్ కు చెందినవాడు. సముద్రప్రయాణాలు అంటే ఈయనకు అదొక పిచ్చె అనుకోవచ్చు. ఎప్పుడో 23 సంవత్సరాల వయసులో అంటే 1962లో ఈయన సముద్రాలలో అతిపెద్దది అయిన  జపాన్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకు విస్తరించిన పసిఫిక్ మహాసముద్రం ప్రయాణం మొత్తం ఒక్కడే పూర్తి చేశాడు. 23 సంవత్సరాల ఉత్సాహమున్న వయసులో అలాంయి సాహసాలు చేయడం పెద్ద వింతేమీ కాదు అనిపించవచ్చు కానీ ఇప్పుడు  మళ్లీ దాన్ని రిక్రియేట్ చేయడం మాత్రం అద్బుతమే కదా!! ఇప్పుడేంటి విషయం? 83 సంవత్సరాల వయసులో ఈ హోరీ తాతయ్యకు బోర్ కొట్టిందో ఊరికే ఉండటం నచ్చలేదో మొత్తానికి తన గత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ శాన్ ఫ్రాన్సిస్కో నుండి కేవలం ఆరు మీటర్ల పొడవు ఉన్న చిన్న పడవలో ప్రయాణం మొదలుపెట్టి జపాన్ తీరంలో ఉన్న కీ జలసంధికి చేరుకున్నాడు. ఇదంతా 69 రోజులపాటు, 8500 కిలోమీటర్ల ప్రయాణం కావడం గమనార్హం. పెరిగే బిపిలు, పడిపోయే ఉష్ణోగ్రతలు, ఎండ, గాలి, వాన వంటి వాటిని భరిస్తూ 83 సంవత్సరాల వయసులో ఇంత సాహసం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం కదా. ప్రపంచంలో ఈ సముద్ర ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు తెచ్చేసుకున్నాడు హోరీ తాతయ్య. 80 వయసు దాటగానే కంటి చూపు మందగించడం, వినికిడి లోపం రావడం, నీరసం, శరీరంలో ఇబ్బందులు వంటి సమస్యలు అటాక్ అయ్యే పరిస్థితులలో ఒక్కడే ఇంత చేయడం నిజంగా తగ్గేదేలే అని అందరికీ చెప్పినట్టు లేదు. హోరీ తాతయ్య మాత్రం "నా 23 సంవత్సరాల వయసులో నాకు పాస్పోర్ట్ లాంటివి లేకపోయినా కుతూహలం కొద్దీ దొంగగా ప్రయాణం చేసాను. అయినా కూడా అప్పుడు నేను చేసింది సాహసం కాబట్టి అందరూ నన్ను క్షమించేసి నా సాహాసాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవు.ప్రయాణంలో కూడా కుటుంబసభ్యులతో కాంటాక్ట్ లో ఉన్నాను ఫోన్ ద్వారా అని చెప్పారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే హోరీ తాతయ్య 1974 సంవత్సరంలో సముద్రమార్గ ప్రయాణంలో ఏకంగా ప్రపంచాన్నే చుట్టేసాడు. అందుకే హోరీ తాతయ్య సూపరో సూపర్!! ◆వెంకటేష్ పువ్వాడ.

ఆహారమే మహాభాగ్యం!

మనుషుల శక్తివనరు ఆహారం. ఆహారం ద్వారానే అందరికీ శక్తి లభిస్తుంది. శక్తి ఉంటేనే మనిషి మనిషి తన పనులు తను చేసుకోగలడు. కేవలం ఒక్కరోజు ఆహారం లేకపోతేనే మనిషిలో నీరసం చోటు చేసుకుంటూ ఉంటుంది. అత్యవసర ప్రయాణాలలో ఆహారం దొరక్కపోయినప్పుడు, దేవుడి భక్తిలో భాగంగా ఉపవాసాలు చేస్తున్నప్పుడు ఒక పూట తిండి తినకపోతేనో లేక ఒక రోజు తిండికి దూరంగా ఉంటేనో సాధారణ సమయాల కంటే చురుగ్గా ఉండలేరు. తిరిగి శరీరానికి తగిన మోతాదులో ఆహారం లభిస్తేనే కాసింత పుంజుకుంటారు. జంతువులకు, మనుషులకు, పక్షులకు సకల జీవరాశులకు ఆఖరికి మొక్కల పెరుగుదలకు కూడా ఎరువుల రూపంలో శక్తి అవసరమే. ఇలా ప్రపంచమంతా ఆహారం మీదనే బ్రతుకుతోంది. ఇంకా చెప్పాలంటే ఆహార సంపాదన కోసమే మనుషులు పనులు చేస్తారు కూడా. మరి అలాంటి ఆహారం విషయంలో ఎంతవరకు బాధ్యతగా ఉంటున్నారు అందరూ?? ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఆహారపు అలవాట్లు! చాలామంది అనారోగ్యం పాలవుతున్నది ఆహారం అలవాట్ల వల్లనే. ఈ ప్రపంచంలో అధిక రకాల ఆహారపదార్థాలను విభిన్న రకాలుగా వండుకుని తినే దేశం భారతదేశం అనే మాట వింటేనే తెలిసిపోతుంది. మన దేశంలో ఆహారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో. ఆదిమ కాలం నుండి అభివృద్ధి చెందిన దేశం వరకు మార్పులను గమనిస్తే ఆహారం విషయంలో చెప్పలేనని మార్పులు, లెక్కలేనన్ని రుచులు వచ్చి పడ్డాయి. చాలామంది ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోవడం వల్ల ఆరోగ్యాలు పాడుచేసుకుంటారు. ముఖ్యంగా రుచి కోసం చేసే ప్రయోగలలో ఆహారంలో ఉండే పోషకాలు నశించి కేవలం కడుపు నిండుతుంది తప్ప అందులో ఉండే పోషకాలు ఏమి లభించవు. ఇక ముఖ్యమైనది నిల్వ చేసుకోవడం. పచ్చళ్ళు ఉరగాయలు వంటివి ఆనాధిగా వస్తున్నవే వాటిలో ఆరోగ్యాన్ని నాశనం చేసే గుణాలు ఏమీ ఉండవు. వచ్చే చిక్కంతా పాత వంటకాలకు కొత్త మెరుగులు దిద్దుతూ వాటిని కలగాపులగం చేయడం వల్ల. అతి ఎప్పటికైనా నష్టమే అనే విషయాన్ని మరచి ఆ పచ్చళ్ళను కూడా ఇష్టం కొద్దీ తినేయడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఉంటాయి అంతే.  ఇవి తప్పిస్తే వండుకున్న పదార్థాలను నిల్వచేయడం, కూరలు పచ్చళ్ళు, అన్నం వంటి వాటిని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినడం, కృత్రిమ రసాయనాలు కలిపిన పళ్ళ రసాలు తాగడం, కృత్రిమ రంగులు జోడించిన పదార్థాలు తినడం సీజన్ దాటిపోయిన తరువాత లభ్యమయ్యేవి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల పోకడలు ఫాలో అవుతూ అడ్డదిడ్డమైనవి అతి చల్లని పదార్థాలు తినడం చాలా సమస్యలు సృష్టిస్తాయి. వాటిలో పెప్సీ, థమ్సప్, కోలా వంటి యాసిడ్లు నిండిన శీతల పానీయాలు మనుషుల్ని దారుణంగా దెబ్బతీస్తాయి. నిర్లక్ష్యం! గంధపుచెట్లు విరివిగా పెరిగే ప్రాంతాలలో కొందరు ఆ గంధం చెక్కలను పొయ్యిలో పెట్టడానికి వాడతారట. అలాగే ఆహారం పుష్కలంగా లభ్యమయ్యే వాళ్లలో కొందరికి ఆహారం విలువ సరిగ్గా తెలియదు అని చెప్పుకోవచ్చు. ఆహారాన్ని వృధా చేయడం, అతిగా వండటం, దాన్ని కుళ్ళిపోయేలా చేయడం, చివరికి చెత్తబుట్టలోకి వేయడం ఒకరకం అయితే, పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లలో ఎన్నో రకాల పదార్థాలు హంగు కోసం వండి చివరికి వేస్ట్ చేస్తూ ఉంటారు. మనిషిలో ఉన్న ఆశ అనేది ఆహారం వ్యర్థం కావడానికి కారణం అవుతోంది. కాబట్టి ఆహారాన్ని చాలా పరిమితంగా జాగ్రత్తగా వాడుకోవాలి. పరిష్కారం! ఆహారం పొదుపు చేయడం అనేది ఎంత గొప్ప విషయమో అలాగే ఆహారాన్ని సృష్టించడం అనేది కూడా అంతే గొప్ప విషయం. ఈ విషయంలో రైతుల కష్టం ఎంతో గొప్పది. వాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలి. వాళ్లకు ఇచ్చే గౌరవం ఏదైనా ఉందంటే వాళ్ళు పండించే ఆహారాన్ని వృధా చేయకపోవడమే. కొన్ని దేశాల్లో మాంసాన్ని ఎండించి నిల్వ చేసుకుని తింటారు. కానీ భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు. పాడి, వ్యవసాయం, పంటలు అన్నీ బాగుంటాయి. మనుషులు చేయాల్సిందల్లా వీటిని సంరక్షించుకోవడమే. ఒక్క బియ్యపు గింజ పండాలి అంటే ఎంతో కష్టం చెయ్యాలి అనే విషయం గ్రహించాలి. ఆహారాన్ని వృధా చేయకూడదు తినే పదార్థాలను గౌరవించాలి ప్రకృతికి దగ్గర ఉండేలా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి భూమిని సంరక్షించుకోవాలి పిల్లలలో ఆహారం గురించి అవగాహన పెంచాలి. ఆహారమే మహాభాగ్యం మరి! ◆వెంకటేష్ పువ్వాడ

పర్యావరణాన్ని ప్రేమిద్దాం!

ఈ ప్రపంచం ప్రకృతి మీద ఆధారపడింది. భారతదేశం అయినా అమెరికా అయినా చైనా అయినా ఇలా ప్రపంచంలో దేశాలు అయినా ప్రజలు లేని ప్రాంతాలు అయినా మొత్తం అణువణువు ఈ ప్రకృతి ఆవరించి ఉన్నదే. ఈ ప్రకృతిలో నివసించే మనుషులు, జంతువులు, వస్తువులు, వివిధ రకాల జీవులు, చెట్లు ఇలా అన్నిటినీ కలిపి పర్యావరణం అని అంటారు. అయితే ఈ పర్యావరణం కలుషితం అవుతూ ఉంటుంది. వీటికి కారణాలు చెప్పాలంటే బోలెడు ఉన్నాయి. కానీ ప్రధాన కారణం మాత్రం మనిషే. మనిషి చేసే పనులు వలనే పర్యావరణం కాలుష్యానికి గురి అవుతోంది.  ప్రకృతి ప్రేమికులు పర్యావరణాన్ని కాపాడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అందరూ దాన్ని పాటించరు.  పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రణాళికలు, మరెన్నో స్లొగన్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి, ఉంటాయి. కానీ మనుషుల్లో ఆలోచన తద్వారా మార్పు రానప్పుడు ఎవరు ఎంత గీపెట్టి అరిచినా పర్యావరణం బాగవ్వదు, ప్రకృతి ప్రశాంతంగా ఉండదు. ఓజోన్ పొర దెబ్బతినడం, ప్రకృతి విపత్తులు, అకాల వర్షాలు, భగభగ మండే ఎండలు, ఋతువులు అటు ఇటు అయిపోయి వాతావరణం గందరగోళం అవ్వడం, నీటి కొరత, పంటలు సరిగా పండకపోవడం ఇలా చెబితే ఈ పర్యావరణ కాలుష్యం ద్వారా జరుగుతున్న నష్టాలు కోకొల్లలు. విచిత్రంగా పర్యావరణ కలుష్యమని చెప్పేది, వాటి వల్ల నష్టాలు వస్తున్నాయని ఏడ్చేది, తిరిగి ఆ పర్యావరణానికి నష్టం కలిగించేది మొత్తం మనుషులే.  మొక్కల్ని పెంచాలి!! ప్రకృతి పచ్చగా ఉండాలన్నా, వర్షాలు పడాలన్నా మొక్కల పెంపకం ముఖ్యమైనది. పెంచగానే కాదు వాటిని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉండాలి అప్పుడే నిజమైన పచ్చదనం నిలబడుతుంది. మంచిగా వర్షాలు పడతాయి, ఋతువులు వాటి పని సరిగ్గా చేస్తాయి.  పొల్యూషన్ అరికట్టాలి!! చేతిలో డబ్బులుండాలి అంతే ఎక్కడికైనా మోటార్ వెహికల్స్ వేసుకుని పోవడమే ఈకాలంలో అందరికీ తెలిసినపని. కనీసం నడుచుకుని వెళ్లి చేసే పనులకు కూడా బైకులు వాడే మహామహులున్నారు. భాగ్యనగరం, ముంబయ్ వంటి రాజధాని ప్రాంతాల్లో, ఇంకా అభివృద్ధి చెందిన పట్టణాల్లో వాహనాల ట్రాఫిక్ జామ్ లు చూస్తే పిచ్చెత్తి పోతుంది. జీవన శైలి దృష్ట్యా వాహనాల వాడకం తప్పనిసరి కావచ్చు. కానీ కొందరు అతిగా వాడటం, ముఖ్యంగా యూత్ తమా దూకుడు ప్రదర్శిస్తూ చేసే పనులు కూడా చాలా నష్టమే కలిగిస్తాయి. ఇక ఫ్యాక్టరీల తలనొప్పి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటిని అరికట్టడం పూర్తిగా ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆవైపుగా ప్రభుత్వాలు అడుగులు వెయ్యాలి. అడవులను రక్షించుకోవాలి, నీటిని పొదుపు చెయ్యాలి!! చెప్పిందే ఎన్నిసార్లు చెబుతారో, అన్నిటికీ ఇదే మాట చెబుతారేంటి వంటి ఆలోచనలు రావచ్చు. కానీ వినేవాళ్ళు వింటున్నారా ఏమైనా. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు ఎవరు వినిపించుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో అడవులను నరికేస్తారు, నీటిని కాలుష్యం చేస్తారు. అందుబాటులో ఉన్నాయని ఇష్టమొచ్చినట్టు వాడేస్తారు. జంతువులు నచ్చినంత తింటాయి, నచ్చిన్నత తాగుతాయి కానీ మనుషులే అన్నీ వృధా చేస్తారు. ప్లాస్టిక్ వాడకం అరికట్టాలి!! ఈ కలియుగంలో అతిపెద్ద నష్టం ఏదైనా ఉందంటే అది ప్లాస్టిక్ అనే రాక్షసినే. భూమిలో కలవక, కాలిస్తే గాలిని కాలుష్యం చేసే ఈ భూతం అతిపెద్ద సమస్య అయి కూర్చుంది. అన్ని దేశాలు ప్లాస్టిక్ ను నిషేధించి, కంట్రోల్ చేసి దాని నష్టాన్ని తగ్గించుకుంటూ ఉంటే భారత్ మాత్రం దానిమీద నియంత్రణను తీసుకురాలేకపోతోంది. మనుషులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లు వాడేస్తారు. ఇవి మాత్రమే కాకుండా పశువుల పెంపకం, పాడి, వ్యవసాయం ప్రకృతిని కాపాడే మార్గాలు. అభివృద్ధి దేశానికి ముఖ్యమే, కానీ పర్యావరణాన్ని నాశనం చేస్తూ జరిగే అభివృద్ది విపత్తులకు కారణం అవుతుంది. కాబట్టి పర్యావరణాన్ని ప్రేమించాలి సహజంగా ఉంచుకోవాలి.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

సాయం విలువ!

  చలికాలం. పైగా ఆ రోజు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ఉదయం ఎనిమిదిగంటలైనా కూడా వెలుగు జాడ కనిపించడం లేదు. జనం ఇళ్లలోంచి అడుగుపెట్టే సాహసమే చేయడం లేదు. ఎవరి ఇంట్లో వాళ్లు అలా వెచ్చగా ఉండగా ఒక నడివయసు మనిషి మాత్రం వీధి పక్కనే కూర్చుని వణుకుతూ ఉన్నాడు. ఇంతలో...ఎక్కడి నుంచో ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి ఒక యువతి బయటకు దిగింది. ఆ నడివయసు మనిషి వంక చూడగానే ఆమె మనసు కరిగిపోయినట్లుంది. నిదానంగా అతని దగ్గరకు వెళ్లింది. ‘‘మీరు చలికి బాగా వణికిపోతున్నట్లు ఉన్నారు!’’ అని అడిగింది ఆ యువత. ఆ మాటలకి పెద్దాయన ఉలిక్కిపడ్డాడు. తనని పలకరించిన యువతిని ఓమారు తేరిపార చూశాడు. ‘సమస్యే లేదు. ఈవిడ బాగా డబ్బున్నావిడే. నా పేదరికాన్ని ఎగతాళి చేయడానికే ఇలా అడుగుతోంది,’ అనుకున్నాడు. అందుకే ‘‘ఆహా బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటాను,’’ అంటూ ఈసడించుకున్నాడు. ఆ మాటలకు ఆమె పెద్దగా బాధపడినట్లు లేదు. పైగా ‘‘మీరు ఆకలిగా ఉన్నారా!’’ అని అడిగింది. ఆ ప్రశ్నకి పెద్దాయన మరింత మండిపడ్డాడు. ‘‘అబ్బే ఇప్పుడే కడుపునిండా భోజనం చేసి వచ్చాను. నేను వదలేసిన తిండితో ఇంకో నలుగురు కడుపు నిండుతుంది,’’ అని నిష్టూరమాడాడు. పెద్దాయన ఎగతాళిని ఆ యువతి అంతగా పట్టించుకోలేదు సరికదా... ఆయన దగ్గరకి వెళ్లి భుజం మీద చేయి వేసి ‘‘పదండి. ఆ హోటళ్లో తింటూ మాట్లాడుకుందాం!’’ అంటూ ఎదురుగుండా ఉన్న హోటల్లోకి ఆయనను నడిపించుకుని వెళ్లింది. ఆ యువతి చర్యతో పెద్దాయనకి నోటమాట రాలేదు. హోటల్ మేనేజరు కూడా ఏదో అనబోయాడు. కానీ యువతి ఖరీదైన దుస్తులు చూసి లేని మర్యాదని తెచ్చిపెట్టుకున్నాడు. ‘‘ఏం కావాలి మేడం!’’ అంటూ వారి టేబుల్‌ దగ్గరకి వచ్చి వినయాన్ని ఒలకబోశాడు. ‘‘ఈయనకి ఏం కావాలో అన్నీ తీసుకురండి,’’ అని హుకుం జారీచేసింది యువతి. యువతి చలవతో పెద్దాయన కడుపునిండా తిన్నాడు. ఆకలి తీరాక, కాస్త వేడివేడి టీ నోట్లో పోసుకున్నాడు. ‘‘ఇదంతా మీరు నాకెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు!’’ అన్నాడు పెద్దాయన కాస్త కుదుటపడిన తర్వాత. ‘‘మీరు ఇంకా నన్ను గుర్తుపట్టినట్లు లేదు జేమ్స్!’’ అంది యువతి చిరునవ్వుతో. ఆ యువతి తనని పేరు పెట్టి పిలవడంతో పెద్దాయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా ఆ యువతి తన కథని ఆయనకు గుర్తుచేసేందుకు సిద్ధపడింది. ‘‘సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం నేను కాలేజి చదువు ముగించుకుని, ఉద్యోగం కోసం ఈ ఊరికి వచ్చాను. ఎంత తిరిగినా నాకు ఉద్యోగం దొరకనేలేదు. చేతిలో ఉన్న డబ్బు కాస్తా అయిపోయింది. అద్దె కట్టలేదని ఒకరోజు ఇంట్లోంచి కూడా నడివీధిలోకి గెంటేశారు. నిలువ నీడ లేదు, విపరీతమైన ఆకలి. ఆ ఆకలిలో ఏం చేయాలో తెలియక ఇదే హోటల్‌ ముందుకి వచ్చి నిలబడ్డాను...’’ ‘‘అవును ఆ రోజు నాకు గుర్తుంది. అప్పుడు నేను ఇదే హోటల్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నీకు ఏదన్నా ఆహారం పెడదామంటే దానికి హోటల్‌ నిబంధనలు ఒప్పుకోవని చెప్పాను...’’ అంటూ గుర్తుచేసుకున్నాడు పెద్దాయన. ‘‘అయినా మీరు నన్ను ఈసడించుకోలేదు. నాకు ఆహారం ఇచ్చి, ఆ బిల్లు మీ జేబులోంచి చెల్లించారు. అనుకోకుండా నాకు ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సొంతగా ఓ కంపెనీ పెట్టుకునే స్థాయికి ఎదిగాను. ఈ ఇరవై ఏళ్లలో ఇటువైపుగా వచ్చిన ప్రతిసారీ మీరు కనిపిస్తారేమో కృతజ్ఞతలు చెప్పుకుందామని అనుకున్నాను. మీ గురించి ఎంతగా వాకబు చేసినా లాభం లేకపోయింది. చివరికి ఇవాళ మీరు కనిపించారు. ఇక నుంచి మీకు ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది,’’ అంటూ తన విజిటింగ్ కార్డుని అతని చేతిలో పెట్టింది ఆ యువతి. ‘‘అబ్బే ఆ రోజు నేను నీకు చేసిన సాయం చాలా చిన్నదే! అలాంటి సాయం నేను చాలామందికి చాలాసార్లు చేశాను. అంత చిన్న సాయానికి నువ్వు ఎందుకింతగా తిరిగి చెల్లించుకోవాలని అనుకుంటున్నావు?’’ అని అడిగాడు పెద్దాయన. ‘‘కొన్ని సాయాలు మనకి చాలా చిన్నవిగానే తోచవచ్చు. కానీ ఆ చిన్న పనుల ఇతరుల మనసులో కొత్త ఆశలని నింపుతాయి. ఆ రోజు జరిగిన సంఘటనలతో నాకు మానవత్వం మీద నమ్మకం పోయింది, జీవితం మీద విరక్తి కలిగింది. కానీ మీరు చేసిన పనితో మనుషులలో మంచితనం ఇంకా మిగిలి ఉంది అన్న నమ్మకం కలిగింది. ఎలాగైనా జీవించాలన్న ఆశ ఏర్పడింది. మీరు కల్పించిన ఆశకీ, నమ్మకానికీ తిరిగి ఎంత చెల్లించినా తక్కువే కదా!,’’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చింది ఆ యువతి. నిజమే కదా!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)  

నీడలే కాటేస్తాయ్!

ఆడపిల్లకు మగవాడు రక్షణ. ఈ సమాజంలో ఇలాగే ఉంది. ఒక కూతురికి తండ్రి రక్షణ, తరువాత తమ్ముళ్లు, లేక అన్నలు. తరువాత భార్యకు భర్త రక్షణ, తల్లిదండ్రులు లేక, భర్త లేక నిస్సహాయంగా ఉన్నవారికి భర్త తమ్ముడో, భర్త తండ్రి(మామయ్య), ఇంకా ఇతర బంధాలు కలిగినవాళ్ళు బాసటగా నిలుస్తూ మేమున్నాం అనే ధైర్యం చెబుతూ ఉంటారు. అలాంటి ధైర్యంతో జీవితాన్ని ముందుకు సాగించే వాళ్ళు ఎందరో ఉన్నారు.  అయితే ఇలా మేమున్నామని ధైర్యం ఇవ్వాల్సిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే. ఒక ఆడపిల్లకు ఈ కాలంలో లోపించిన రక్షణ ఏదంటే నిస్సందేహంగా మాన రక్షణ లేదని చెప్పుకోవచ్చు. ప్రతి అడ్డమైన వెధవకూ అమ్మాయిల్ని చూస్తే అదొక కోరిక పుట్టేస్తుంది. వాడు బలవంతుడు అయితే బలవంతంగానే అమ్మాయిల్ని పాడుచేస్తాడు. ఇలాంటివి బయట ఎక్కడో జరిగితే అందరూ అనే మాట ఒకటి ఉంది. ◆"ఉద్యోగమని ఏదో పొడిచేద్దామని తెగ తిప్పుకుంటూ పోయిందిగా ఏమయ్యింది ఎవడో మాయమాటలు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లి చేయాల్సింది చేసాడు" ◆"వీళ్ళేదో వీరనారులు అనుకుని ఫీలవుతూ సాయంత్రం అయినా ఇంటికి పోవడంలేదు. ఇక ఏమవుతుంది ఎక్కడో తాగిన వెధవలు చూసి వెంటబడి వాడి పని వాడు చేసుకుపోయాడు" ◆"అయినా ఒంటరిగా పోవడం ఎందుకు?? అంత పర్సనల్ పనులు ఏముంటాయి. ఏదో గూడు పుటానీ ఉంటుందిలే" ◆"బట్టలు సరిగ్గా వేసుకుంటే కదా!! ఫాషన్ పేరుతో వగలు పడతారు. మగవాళ్లను రెచ్చగొడతారు"  ఇలా ఒక్కొక్కరు ఒకో మాట మాట్లాడతారు ఎక్కడైనా ఏదైనా రేప్ జరిగిందని తెలిస్తే. సరే వీటన్నిటికీ కారణాలు ఉంటాయి. కానీ వేరే సంగతి ఏంటి?? తాగిన మత్తులో కూతుర్ని తండ్రి బలవంతం చేయడం. భర్త చనిపోయి ఇంట్లో ఉంటున్న కోడల్ని మామ బలవంతం చేయడం. అన్న భార్య మీద మనసు పడి మరిది వదినను బలవంతం చేయడం. సమాజంలో వావి వరుస అనేవి ఎప్పుడో అంతరించి పోయాయి అనే డైలాగ్ కు నిదర్శనంగా ఎక్కడ చూసినా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి.  వీటన్నిటికి ఎవరు ఏమని సంజాయిషీ ఇస్తారు??  జాగ్రత్తలు కావాలిప్పుడు!! ఇలా జరుగుతున్నప్పుడు ఎవరు ఎవరినీ ఏమనీ నిందించలేం. చాలామంది జరుగుతున్న వాటికి కారణాలు చెప్పి, విమర్శలు చేసి, శిఖలూ వేస్తారు కానీ పరిష్కారాలు ఏంటి అనేది మాత్రం తక్కువే. ఇక్కడ పరిష్కారం అంటే అమ్మాయిలకు నష్టం జరిగిపోయాక వేసే శిక్షలు, ఇచ్చే నష్టపరిహారాలు అనుకుంటున్నారు అందరూ. కానీ అది చాలా తప్పు, అది కాదు కావాల్సింది అసలు ఇలంటివి జరగకుండా చూడాలి. అమ్మాయిలు తమను తాము రక్షించుకోగలిగే సామర్థ్యము కలిగి ఉండాలి. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి. ఈ కాలానికి తగ్గట్టు ఒకరి మీద ఆధారపడటం మానేయాలి, అలాగే మగవాళ్లను చనువుగా మాట్లాడించడం మానుకోవాలి. లేకపోతే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే మహామహులు ఉంటారు.  తోడుగా!! అమ్మాయిలకు జరుగుతున్న ఈ ఘోరాలను ఆపాలి అంటే ఒకరి నుండి మరొకరికి సపోర్ట్ చాలా అవసరం. అమ్మాయిలు ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు ఒంటరిగా కాకుండా కలసికట్టుగా చెయ్యాలి. స్నేహితులు, చుట్టాలు, చనువుగా ఉన్నవారు ఇలా మగవాళ్లను ఎవరిని కూడా అతిగా  నమ్మేయకూడదు. ఎవరితో కూడా వెళ్లకూడదు.  పైనవి ఎన్ని చెప్పుకున్నా ఈ సమాజంలో పక్కనుండి ఇలా పాముకాటు వేసేవాళ్ళు ఎక్కువైపోతూనే ఉన్నారు. అందుకే అమ్మాయిలూ…… జాగ్రత్త!!                                 ◆వెంకటేష్ పువ్వాడ.

సన్నద్దానికి పలు మార్గాలు!

ఎల్. కె.జీ బుడ్డోళ్ల నుండి గ్రూప్స్, సివిల్స్ టార్గెట్ గా ఉన్న యంగ్ డైనమిక్స్ వరకు అందరికీ ఈ కాలంలో పరీక్షల గోల తప్పదు, పుస్తకాలు పట్టుకుని చదవడం అంతకన్నా తప్పదు. ఒకప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు బెత్తం పట్టుకుని, ముందు కూర్చుని పిల్లలకు చదివించేవాళ్ళు. ఇప్పుడు నువ్వు చదువుకొని ఎక్సమ్స్ బాగా రాయిరా బాబు నీకు కావలసింది కొనిస్తాం అని లంచాల ఆశ చూపిస్తారు. ఇదంతా పిల్లొళ్ల గోల. మరి పెద్దోళ్ళ గోల సంగతేంటి?? బుక్ తీస్తే పక్కనే ఉన్న మొబైల్ టింగుమని వాట్సాప్ లేదా fb మెసేజ్ అలర్ట్ ఇస్తుంది. మొబైల్ ను దూరంగా పెట్టేసామా కుంకుమపువ్వొ, కార్తీక దీపమో లేక ఇంకా వేరే ఛానెల్స్ పేర్లయినా పెటుకొండి వాటి తాలుకూ డైలాగులు హింసగా సాగిపోయే సెంటమెంట్లు, పిన్ చేంజ్ పెన్సిల్ లాగా పైకి కిందకి ఎక్కి దిగుతూనే ఉంటాయి. వాటి గోల ఒకటి. పోనీ అవి కూడా లేనప్పుడు, మొబైల్  దూరంగా ఉన్నప్పుడు, చదువుకోడానికి ఇంటరెస్ట్ పుట్టినప్పుడు అప్పుడే ఇంట్లో అమ్మ, లేదా నాన్న టింగుమని పిలిచి బయట షాపుకెళ్లి ఏదో ఒకటి తెమ్మని చెబుతారు.  ఇలా యూత్ కు మా చెడ్డకాలం నడుస్తూ ఉంటుంది. దాన్ని మార్చుకోవడానికి ఒక్కొరు ఒకో దారి ఎంచుకుంటారు, వాటిని ఫాలో అవుతారు.  ఇంతకూ ఏంటవి?? ఫ్రెండ్స్ తో గ్రూప్ స్టడీ!! ఇందులో బాగుపడటానికి ఎంత అవకాశం ఉంటుందో, చెడిపోవడానికి అంతే అవకాశం ఉంటుంది. చదువుకోవాల్సిన టైమ్ లో చదువుకోకుండా  మూడు కోతులు కలిసి నాలుగో కోతిని కూడా చెడగొట్టినట్టు కాస్తో, కూస్తో చదవాలనే ఇంటరెస్ట్ ఉన్నోడు కూడా నాశనం అయిపోతాడు. కాబట్టి సీరియస్ గా ప్రిపేర్ కావాలని అనుకున్నవాళ్ళు కలసి గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ చదివితే చాలా కొద్ది సమయంలోనే బోలెడు డౌట్స్ క్లియర్ అయిపోతాయి. పైగా ఒక్కొక్కరు ఒకో బుక్ తెచ్చుకుని నలుగురు డిస్కస్ చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. కావాల్సిందల్లా సీరియస్నెస్ మాత్రమే.  ఏకాంతం!! చాలామంది బుక్స్ ఎత్తుకుని ఏ పార్క్ కో, లేక ఏ చెట్ల కిందకో వెళ్ళిపోతారు. అబ్బాయిలకు ఈ మార్గం బాగానే ఉంటుంది. కానీ అమ్మాయిలకు ఇబ్బంది. సెక్యూరిటీ ఉండదు. పైగా ఏదైనా వేరే బుక్ లేదా నోట్స్ లాంటివి అవసరం అయితే తిరగడానికి టైమ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సైకిల్, బైక్ ల మీద వెళ్లే వాళ్లకు ఇది కొంచెం బెస్ట్. లైబ్రరీ!! అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఇదే. ఎలాంటి భయం ఉండదు, బుక్స్ చేతుల్లో మోసుకుపోవాల్సిన అవసరం ఉండదు. న్యూస్పేపర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి హాయిగా రెగులర్ కరెంట్ అఫైర్స్ తో పాటు జనరల్ నాలెడ్జ్ రౌండ్ కొట్టేయచ్చు. అలాగే పోటీ పరీక్షలకు కావల్సిన ఎన్నో బుక్స్ లైబ్రరీలలో ఉంటాయి కాబట్టి చక్కగా చదివేసుకోవచ్చు. అనవసర చర్చలు, మాటలు లేకుండా కీప్ సైలెన్స్ బోర్డ్ ఉంటుంది కాబట్టి ఏ గోలా లేకుండా హాయిహయిగా ఇంటరెస్ట్ గా చదివేయచ్చు. ఇలా ఒకటికి మూడు మార్గాలతో నచ్చిన దారిలో పుస్తకాలతో కుస్తీ పడితే పరీక్షల అంతు చూడచ్చు. ఎడ్యుకేషన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎలిజిబుల్ ఎక్సమ్ కావచ్చు. అన్నిటినీ చీల్చి చెండాటమే కావలసింది.  అయితే ఓ మాట. చదివే ముందు మరీ ఫుల్లుగా తినద్దు, తినకుండా చదువులో మునగద్దు, తాగడానికి ఒక మంచినీళ్లు బాటల్ దగ్గరే పెట్టుకోండి. ఇక బస్ చదుకోండి!!                                ◆వెంకటేష్ పువ్వాడ.

ఒక్కసారి ఇటు చూడండి!

★కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఎందుకుచుకు పంచాయతీ పరిధిలోని జీలగలగండి కాలనీ ఉంది. కాలనీలో  700 మంది ప్రజలు ఉంటారు. వాళ్ళందరూ మూడు కిలోమీటర్ల దూరంలో పొలాల్లో ఉండే బావులతో మంచినీళ్లు బిందెలతో తెచ్చుకుంటారు. ★ఎలూరు జిల్లాలోని 215 పల్లెలకు తాగునీరందించే సత్యసాయి రక్షిత నీ పథకం మూలన పడింది. వింజరం పంచాయతీలో బక్కబండారు గూడెంలో 200 మంది గిరిజనులకు ఆ నీళ్లే దిక్కుగా ఉండేవి. వీళ్ళు 5 కిలోమీటర్ల దూరంలో ఆర్వో ప్లాంట్ కు వెళ్లి నీళ్ల క్యాన్ లు కొనుక్కోచ్చుకుంటారు. ఒకవైవు నీళ్లు, మరోవైపు వెహికల్స్ పెట్రోల్ ఖర్చు. ★ కర్నూలు జిల్లా  ఆస్పరి మండలంలో డి. కోటకొండరి అనే ఊరుంది. అక్కడ మూడు బోర్లున్నా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రభుత్వాలు ట్యాంకర్లతో వాటర్ సప్లై చేయలేదు. అక్కడున్న 2500 దూరంగా ఉన్న పొలాలలో నీళ్లు తెచ్చుకుంటారు. ఒకేసారి ఎనిమిది బిందెలు. రిక్షా లాంటి మూడుచక్రాల బండిలో. ★ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో ప్రయివేడులో 100 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నీటి సదుపాయం మాయమయ్యింది. ఒక బోర్ లో రోజుకు కేవలం గంట సేపు మాత్రమే నీళ్లొస్తాయ్. ఆ గంటసేపులో వందకుటుంబాలు ఇంటికి సరిపడా నీళ్లను పట్టుకోగలరా?? పై విషయాలు అన్నీ ఏంటి న్యూస్ ఛానెల్ లో టెలికాస్ట్ చేసినట్టు వాయిస్ మాత్రమే తక్కువయ్యింది అనిపిస్తుంది ఇవి చదివే అందరికీ. ఇవి కేవలం అక్కడక్కడా నీటికి కొట్టుమిట్టాడుతున్న గ్రామాలు, గ్రామాలలో నివసించే ప్రజల సంగతి మాత్రమే. నీటికోసం ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొందరికి నీళ్ళంటే విలువ తెలియడం లేదు. సరికదా డబ్బు పెడుతున్నాం, నీటి సౌకర్యం ఉంది, కాబట్టే వాడుకుంటాం అనే అహంకార ధోరణికి పోతారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం వాళ్లకు ఎదో చెయ్యమని వాళ్ళను ఉద్ధరించమని కాదు. అలాంటి పరిస్థితి మనకూ వస్తే!! అనే ప్రశ్న వేసుకోవడం. రోజూ రెండుపూటలా స్నానాలు, హాయిగా సింక్ టాప్ ఆన్ చేసి అంట్లు కడుక్కోవడం, షవర్ ఆన్ చేసి నీళ్లతో ఆటలు ఆడటం,  నీళ్లను ఇష్టానుసారం  వేస్ట్ చెయ్యడం ఇలా చాలా రకాలుగా నీటి శాతాన్ని తగ్గించేస్తూ ఉన్నాం. పైన చెప్పుకున్నట్టు నీటి కొరత ఏర్పడితే?? కనీసం బిందెలు మోయడం కూడా మర్చిపోయిన పట్టణ ప్రజలలో నీటి ఎద్దడి వచ్చి పడితే, ఉదయం ఎప్పుడో ఆఫీసులకు వెళ్లి రాత్రిప్పుడో ఇంటికి చేరుకునే ఉద్యోగాల మధ్య, ఆడ, మగ అనే తేడా లేకుండా ఉరుకులు, పరుగుల జీవితాలలో కనీసం ఒక్క బిందె నీళ్లు స్వయంగా తెచ్చుకోగలమా?? అప్పుడొకసారి చెన్నై లో నీటికి ఎద్దడి ఏర్పడి చివరికి ట్రైన్లలో నీళ్లను చేరవేసి అక్కడి ప్రజల గొంతులు తడిపిన కథనాలు అందరూ మరచిపోగలరా??  ఉన్నప్పుడు నీటిని సరైన విధంగా జాగ్రత్త చేసుకోకపోతే విదేశాల శైలిలో టాయిలెట్ పేపర్లు, టెంపరరీ వంట పాత్రలు, బట్టలు, ఇతర వస్తువులు ఉపయోగించాల్సి వస్తుందేమో కదా!!  అసలు ఇవన్నీ తలచుకుంటే చేతిలో ఉన్న ఒక గ్లాస్ నీళ్లే అమృతంలాగా అనిపించేయవూ. వర్షం నీటిని భూమిలో ఇంకెలా చేయడమో, మొక్కల్ని పెంచడం, నీటిని జాగ్రత్తగా వాడుకోవమూ ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేస్తే భవిష్యత్తులు కాస్త బాగానే ఉంటాయి. లేదూ మాకు ఏమి అవసరం అని అంటారా?? సరే పోండి మీ ఖర్మ!! భవిష్యత్తరాలు ఏడుస్తూ ఉంటాయంతే!! ప్రకృతి కూడా మనుషుల స్పందనలకు ప్రతిస్పందలను ఇస్తుంది.             ◆ వెంకటేష్ పువ్వాడ.

పల్నాడు యుద్ధం నిజంగా జరిగిందా?? యుద్ధానికి కారణాలు ఏంటి?

భారతీయ చరిత్రలో రాజులు, రాజ్యాలు, యుద్ధాలు అన్నీ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. వాటి గురించి వినడం, తెలుసుకోవడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలనాడు ప్రాంతంలో జరిగిన పల్నాడు యుద్ధం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే బ్రహ్మనాయుడి పేరు కూడా ఎంతో గొప్పగా వెలిగింది. నిజంగానే పల్నాటి యుద్ధం జరిగిందా?? దానికి కారణాలు ఏంటి??  పల్నాటి యుద్ధం నిజంగా జరిగింది. ఈ యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు జరిగింది చరిత్రకారులు గుర్తించారు. చరిత్ర గ్రంధాలలో కూడా పూర్తి వివరాలతో వ్రాయబడింది. పలనాడు (ఈనాటి గుంటూరు జిల్లా ) వెలనాటిచోడుల సామంతులైన హైహయ వంశస్థులు (యాదవులు) అధీనంలో ఉండేది.పలనాటి పరిపాలకుడు 'అనుగురాజు' వెలనాటి గొంకరాజు కుమార్తె అయిన మైలాంబను వివాహం చేసుకుని తన పరపతిని పెంచుకున్నాడు. వారిద్దరికి  నలకామ/నలగామ అనే కొడుకు పుట్టాడు. అతడికి మరో ఇద్దరు భార్యలు. వాళ్ళ  పేర్లు వీరవిద్యా దేవి, భూరమదేవి. వీరవిద్యా దేవి కొడుకులు పెద మలిదేవ, చిన మలిదేవ, బాల మలిదేవ.  భూరమ దేవి కొడుకులు కామరాజు,నరసింగ రాజు, జత్తి రాజు, పెరుమాళ్ళు రాజు.  అంతఃపుర కలహాలతో అనుగురాజుకి పరిస్థితి దుర్భరంగా మారింది. ఆఖరికి అనుగు రాజు హత్య చేయబడ్డాడు. అతడి మరణం తరువాత క్రీ.శ.1170లో నలగామ' పల్నాడు పాలకుడయ్యాడు. కానీ అతడు తన మంత్రియైన రేచర్ల బ్రహ్మనాయుడి చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. రేచర్ల బ్రహ్మ నాయుడు వెలమ కులస్థుడు. ఆనాడు ఆంధ్ర దేశంలో వీర వైష్ణవ, వీరశైవ మతాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. బ్రహ్మ నాయుడు వీరవైష్ణవ మతావలంబి. ఆ మతాన్ననుసరించి, వేర్వేరు కులాలమధ్య బేధాలు తొలగించి, సహపంక్తి భోజనాలు, దళితులకు ఆలయప్రవేశం చేయించడం మొదలైన సామాజిక సంస్కరణలు చేపట్టాడు .నలగామకు ఇవన్నీ రుచించలేదు. అతడు తమ హైహయ వంశీకులందరి వలె శివభక్తుడు. ఈలోగా బ్రహ్మనాయుడు నలగామ సవతిసోదరులను మంచిచేసుకున్నాడు. నలగామ కి నచ్చజెప్పి పెదమలిదేవకు చిన్న సంస్థానం వంటిది ఇప్పించాడు. తరువాత బ్రహ్మనాయుడి సహాయంతో ఆ చిన్నరాజ్యం బాగా అభివృద్ధి చేసి మాచెర్ల రాజధానిగా చేసుకున్నాడు. ఈలోగా నలగామరాజు దగ్గర నాగమ్మ అనే రెడ్డి కులానికి చెందిన స్త్రీ నాయకురాలిగా చేరింది. ఆమె శివభక్తురాలు. మాచెర్ల అభివృద్ధి చెందడం చూసి, అది చేజిక్కించుకోవడానికి నలగామ, నాగమ్మలు పధకం ప్రకారం పెదమలి దేవుడిని కోడిపందాలకి ఆహ్వానించారు. పందెంలో తన రాజ్యం ఓడిపోయాడు పెదమలిదేవుడు. అందువల్ల 7 సంవత్సరాలు రాజ్యం విడిచిపెట్టి ఏడు సంవత్సరాలయ్యాక బ్రహ్మనాయుడు రాజైన పెద మలిదేవుడికి రాజ్యం తిరిగి ఇవ్వాలని కోరాడు. కానీ నలకామ అందుకు ఒప్పుకోలేదు. ఈ కారణం వల్ల సవతి సోదరుల మధ్య యుద్ధం మొదలయింది. క్రీ.శ.1185 లో కారెంపూడిలో నాగులేటి ఒడ్డున మహా సంగ్రామం జరిగింది. నలకామ పిలుపుకి స్పందించి కాకతీయులు, హోయసల, కోట, కాలచూరి, వెలనాటి చోడులు యుద్ధంలో పాల్గొన్నారు. మూడురోజుల్లో ముగిసిన యుద్ధంలో పెద మలిదేవుడు పక్షం ఓడిపోయింది. తనవారందరూ మరణించడంతో విరక్తి చెందిన బ్రహ్మనాయుడు పలనాడుని శాశ్వతంగా విడిచిపెట్టి తీర్ధయాత్రలకి వెళ్ళిపోయాడు. ఈ యుద్ధం వెలనాటి చోడులకు తమ సామంతులపై నియంత్రణ కోల్పోయారని లోకానికి వెల్లడైంది. ఈ బలహీనత గ్రహించిన కాకతీయులు 12 శతాబ్ధం చివరికల్లా కోస్తాంధ్ర ప్రాంతాన్ని కాకతీయ రాజ్యంలో భాగం చేసుకున్నారు. ఈ యుద్ధంలో గెలిచిన,ఓడిన పక్షాల నాయకులు (ఆంధ్ర నాయకులు) కాకతీయ రాజ్యంకి వలసపోయి, కాకతీయ సైన్యంలో నాయకులుగా ప్రసిద్ధి చెందారని, వారే కాకతీయ రాజ్య పతనానంతరం ముస్లింల దాడిని ఎదుర్కోవడానికి 'నాయక సమాఖ్య' గా ఏర్పడ్డారని చరిత్రకారుల కధనం. ఓడిపోయిన బ్రహ్మనాయుడి పేరు అంత గొప్పగా ఎందుకు మారింది అనే సందేహం అందరికీ వస్తుంది. ఆ కాలానికే కులమతాలను పక్కనపెట్టి అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టినవాడు బ్రహ్మనాయుడు. ఆయన్ను ఒక సంఘసంస్కర్తగా చెప్పుకోవచ్చు.  ◆వెంకటేష్ పువ్వాడ.

ఈ దొంగకు మీరూ ఫాన్ అయిపోతారు!!

మార్చి 19, 1987 ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంలో అరవింద్ ఇనామ్‌దార్‌కు అత్యవసరమైన ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ లో అరవింద్ కు త్రిభువన్ దాస్ భీంజీ జావేరీ వారి ఒపెరా హౌస్‌ శాఖలో ఏదో తేడా జరుగుతుందనే విషయం చెప్పారు.  ముంబై నగరంలోని ఒపెరా హౌస్ ప్రాంతంలో చాలా ఆభరణాల దుకాణాలు ఉంటాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధ ఆభరణాల వ్యాపారి త్రిభువన్ దాస్ భీంజీ జావేరీ(టి.బి.జెడ్)లో సిబిఐ దాడి జరిగింది. బృందం లోపలికి వచ్చి, షట్టర్ క్రిందికి లాగి, సిబ్బందిని ఇంకా ఖాతాదారులను "రిజిస్టర్లను పరిశీలించేవరకు వేచి ఉండండి కాల్ ద్వారా అరవింద్ తెలుసుకుంటారు"  అని చెప్పారు.  సాధారణంగా సిబిఐ దాడులు జరిగినప్పుడు ఎలాంటి ఫోన్ కాల్స్ జరగకుండా ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడూ పాటిస్తుంది సిబిఐ. అలాగే ఇక్కడ కూడా జరిగింది. కానీ అదంతా జరిగిన తర్వాతనే ఆయనకి తేడా కొట్టింది. సిబిఐ టీమ్ చాలా ఆభరణాలతో బయలుదేరినట్లు ఇనామ్‌దార్‌కు కాల్ చేసి చెప్పారు ఆభరణాల షాప్ లో పనిచేసేవాళ్ళు.  అది అతనికి వింతగా అనిపించింది. అరవింద్ అక్కడికి తన టీమ్ తో ఆ ఆభరణాల షాప్ ల దగ్గరకు చేరుకున్నాక తెలిసిన  విషయాలు అతనికి మరింత విచిత్రంగా అనిపించాయి. ఆ సిబిఐ టీమ్ మొత్తం అక్కడే ఉంది. కేవలం వారి నాయకుడు - మోహన్ సింగ్ తప్ప. అసలు ఈ మోహన్ సింగ్ ఎవరూ అనే అనుమానం అందరికీ వస్తుంది. అదే అనుమానం అరవింద్ కు కూడా వచ్చింది.  లోతుగా విచారిస్తే ఇది అసలు సిబిఐ బృందం కూడా కాదు, వారు ఏదో ఒక ఉద్యోగం వస్తుందనే ఆశతో ఉన్న బృందసభ్యులు మాత్రమే అని ఆయనకు తెలిసింది. ఇదేంటి ఏదో ఒక ఉద్యోగం కోసం సిబిఐ లా రైడ్ చేయడం ఏంటి అని అనుమానం ఈ దొంగతనం గురించి మొదటిసారి వినేవాళ్లకు కూడా వస్తుంది.  విషయం ఏమిటంటే  "ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్స్ పోస్ట్ల కోసం డైనమిక్ గ్రాడ్యుయేట్లు కావాలి" అని కోరుతూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రకటన వేయించాడు మోహన్ సింగ్. అసలే నిరుద్యోగుల దేశం కదా. ఆ ప్రకటన చూసి ఇంటెలిజెన్స్ విభాగం మీద ఆసక్తి ఉన్న ఎంతో మంది అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తాజ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌కి రావాలని ప్రకటనలో ఆయన చెప్పారు. అలా మోహన్ సింగ్  చివరకి ఇరవై ఆరుగురు వ్యక్తులని ఎన్నుకున్నాడు. వారిలో అప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నా దానికంటే మెరుగైన ఉద్యోగం కోసం వెతుకుతున్నవాళ్ళు కొందరు ఉన్నారు.   ఈ ఇరవై ఆరు మందిని మరుసటి రోజు ఉదయం 11 గంటలకు రిపోర్ట్ చేయమని ఆ తరువాత మోహన్ వారికి గుర్తింపు కార్డులను అందజేస్తానని చెప్పాడు. వచ్చిన గంట తరువాత, సింగ్ వాళ్ళందరిని బస్సులో ఎక్కించి  "మనమిప్పుడు ట్రయల్ రెయిడ్ కోసం టి.బి.జెడ్ కు వెళ్తున్నాము. కాబట్టి మీరు మీ బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫైనల్ గా జాబ్ కు సెలెక్ట్ అవుతారు" అని చెప్పాడు వాళ్లకు. బస్సు ప్రయాణంలో వాళ్ళందరిని ఆయన ఎంత తయారు చేసారంటే అక్కడికి చేరాక వారి ప్రవర్తన టి.బి.జెడ్ సిబ్బంది అందరికి నిజమైన సిబిఐ అధికారుల రైడ్ లాగే అనిపించింది. దాడి జరుగుతున్న మధ్యలో సింగ్ చుట్టూ తిరుగుతూ కొన్ని షోకేసులలో ఆభరణాలను 'శాంపిల్స్' గా తీసుకొని వాటిని పాలిథీన్ సంచులలో పెట్టి, ప్రభుత్వ ముద్రను చూపించే స్లిప్‌లతో సంచులని మూసారు. మోహన్ ఆ సంచులను తీసుకుంటూ దగ్గరలో ఉన్న మరో దుకాణంలో తనిఖీ చేస్తాను, నాకోసం వెయిట్ చేయండి అని తన సిబ్బందికి చెప్పాడు. తరువాత అతను బస్సులో ఎక్కి, తిరిగి హోటల్‌కు వెళ్లి, ఖాళీ చేసి, టాక్సీ ఎక్కి, మధ్యలో ఒక చోట ఆటోలోకి మారి వెళ్ళిపోయాడు. ఈ విషయం అంతా నిజమైన సీబీఐ ఆఫీసర్  అరవింద్ అక్కడ చేరుకున్నాక తెలుసుకోగలిగాడు. ఆ తరువాత మోహన్ సింగ్ కోసం ఎంత వెతికినా ఎంత ప్రయత్నించినా అతడు దొరకలేదు.  కొన్ని నెలల తరువాత తాజ్‌లో విచారించినప్పుడు మోహన్ సింగ్ త్రివేండ్రంకు చెందినవాడు అని తెలిస్తే, పోలీసులు దేశం మొత్తం అప్రమత్తం చేయించి, ఒక బృందాన్ని కేరళకు పంపారు. జార్జ్ అగస్టిన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తిని అక్కడ అరెస్టు చేశారు, కాని అతను ఒక చిన్న దొంగ అని తెలియడంతో అతనిని వదిలేసారు. పోలీసులు దేశ వ్యాప్తంగా ఎన్ని విధాలుగా ఎంత ప్రయత్నించినా మోహన్ సింగ్ ను పట్టుకోలేకపోయారు. చివరికి మోహన్ సింగ్ దొరకలేదు.  ఈ దోపిడీకి  మోహన్ సింగ్ ఎంతో తెలివిగా ఆలోచించాడు. చిన్నా చితకా హోటల్‌ను ఉపయోగించకుండా, చాలా ఖరీదైన తాజ్ నే వాడాడు. ఇంటెలిజెన్స్ వర్గాలు మరీ డబ్బా హోటల్స్ లో ఇంటర్వ్యూలు చేస్తాయా అనే అనుమానం రాకూడదు అండ్ మోహన్ సింగ్ మీద అటు హోటల్ వారికి, ఇటు అతని దగ్గరకు వచ్చిన వారికి అనుమానం రాకుండా.  అతడు కొత్తగా ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఒకరి గురించి మరొకరికి తెలియదు అంతే కాదు మోహన్ సింగ్ గురించి కూడా తెలియదు కాబట్టి వాళ్ళను తెలివిగా వాడేసుకున్నాడు. ఆభరణాల షాప్ లో సిబ్బందికి రియల్ సీబీఐ అనిపించేలా వాళ్ళను ప్రిపేర్ చేయడమే అతని తెలివికి నిదర్శనం. చివరి విషయం ఏంటంటే ఇంతచేసినపుడు ఇదంతా సినిమాటిక్ గా ఉందని అనుకుంటారు అందరూ. కానీ విచిత్రంగా సినిమాటిక్ రేంజ్ లోనే అతను తప్పించుకుని మాయమైపోయాడు. ఎక్కడైనా తేడా జరిగితే అనే జంకు లేకుండా ఇంత చేసాడు అంటే అతడు ఎంతో ధైర్యవంతుడు కదా. దొంగే కావచ్చు, తప్పే చేసుండచ్చు. కానీ దొరకకుండా తప్పించుకోవడం అతడి తెలివితేటలు విన్న తరువాత దొంగను కూడా హీరోలా మెచ్చుకునేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ఏవైనా సినిమాలు గుర్తొస్తాయేమో!!                               ◆వెంకటేష్ పువ్వాడ.

అతిథులొస్తున్నారా??

అతిథిదేవోభవ అని అన్నారు మనవాళ్ళు. ఎన్ని దేశాలు తిరిగినా ఎంతమందిని కలిసినా ఇంటికి వచ్చిన గెస్ట్ లను ఆదరించడం, తృప్తి పరచడం అనేది తప్పనిసరి. అయితే సాధారణ మిత్రులు అయితే ఇంటికి వచ్చినప్పుడు అతిథిమర్యాదల విషయంలో అంత ఖంగారు పడాల్సిన అవసరం ఉండదు. కానీ కొంచెం ప్రత్యేకమైన వారు, స్థాయిలో పెద్దవారు, ఇంకా వయసులో పెద్దవారు ఇవి మాత్రమే కాకుండా మొదటిసారి ఇంటికి వస్తున్నవారు వీరి విషయంలో కాసింత శ్రద్దపెట్టాల్సిందే.  అందరి ఆలోచన!! ఇంటికి ఎవరైనా అతిథులు వస్తారు అంటే మంచి భోజనం పెట్టడం వరకు మాత్రమే చాలా మంది ఆలోచన ఉంటుంది. మాంసాహరులు అయితే చికేనో, మటనో వండేసి దాంతో గెస్ట్ లు తృప్తి పడిపోతారని అనుకుంటారు. కానీ భోజనం అనేది ఇంటికి వచ్చే వారికి ఒక అంశం మాత్రమే. చాలమంది ఆ భోజనం విషయంలో శ్రద్ధ పెట్టి ఎన్నో విషయాలు మర్చిపోతుంటారు. కొంచం వాటి గురించి తెలుసుకోవాలి మరి. సమయం, సందర్భం!! సాధారణంగా ఇంటికి వచ్చేవాళ్ళు చెప్పే వస్తారు. వాళ్ళందరూ అతిథులు కాదు, చెప్పకుండా వచ్చేవాళ్లే అతిథులు అని కొందరు అంటారు. కానీ చెప్పి వచ్చినా, చెప్పకుండా వచ్చినా ఇంటికి వచ్చేవారు అతిథులే. జెండర్ జాగ్రత్తలు!!  ఇంటికి వచ్చే అతిథులు మగవాళ్ళు అయితే కేవలం రెండు విషయాలు మాత్రమే సరిగ్గా ఉంటే చాలని అనుకుంటారు. సరైన భోజనం, పడుకోవడానికి అనుకూలంగా ఉండటం.  కానీ ఆడవాళ్లు అయితే మాత్రం ఇల్లంతా శుభ్రత ఎలా ఉంది, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు లాంటివి చాలా అబ్సర్వ్ చేస్తుంటారు. కాబట్టి జెండర్ ను బట్టి ఇంట్లో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఏర్పాట్లు అగచాట్లు!! వద్దే వద్దు బాబోయ్, ఇంటికి ఎవరైనా వస్తారంటే పెద్ద హడావిడి మొదలైపోతుంది. ఇల్లంతా అటు ఉండేవి ఇటు ఇటు ఉండేవి అటు ఇంకా అస్తవ్యస్తంగా ఉన్నవి, బట్టలు, వస్తువులు పడుకునే బెడ్ లు, కూర్చోవాల్సిన కుర్చీలు, కూలర్ లు, బుక్ షెల్ఫ్స్ ఇలాంటివి ఒకటా రెండా బొచ్చెడు పనులు. వీటన్నిటికీ పరిష్కారం ఒకటే.  సాధారణ రోజుల్లో ఎక్కడి వస్తువులు అక్కడ ఉండేలా చూసుకోవడం. ఏదైనా వస్తువు తీసుకుని వాడుకున్నాక తిరిగి దాని స్థానంలో దాన్ని ఉంచాలి. ఒకవేళ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే  తీసుకున్న వాటిని తిరిగి జాగ్రత్తగా ఉంచడం నేర్పిస్తే ఎంతో క్రమశిక్షణ అలవడుతుంది. వారానికి ఒక్కసారి ఇంటికి బూజు క్లీన్ చేయడం. రెగులర్ పనులలో వస్తువులను నీట్ గా ఉంచడం. విప్పేసిన బట్టలు ఒక చోట పెట్టడం. ఇంకా ఉతికిన బట్టలు చెల్లాచెదురుగా కాకుండా కొంచెం ఓపిక చేసుకుని మడత పెట్టేయడం. ఇంట్లో చెత్త వంటి వాటిని బుట్టలో నింపి పోగు చేయకుండా ఎప్పటికప్పుడు బయట పడేయడం. బాత్రూములు భలే తికమకలు!! చాలామంది ఇల్లు ఎలా ఉంచుకున్నా బాత్రూముల విషయంలో మాత్రం నెగ్లేట్ గా ఉంటారు. వాడిన షాంపూ బెటల్స్, షాంపూ ప్యాకేట్స్ దగ్గర నుండి, సోపు ముక్కలు ఇంకా బాత్రూమ్ లో బకెట్ లు, మగ్ లు లాంటివి కొంచెం మారుస్తూ ఉండటం  మంచిది. అన్నిటికీ మించి నీటి వసతి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్ల షేవింగ్ పరికరాలు, ఆడవాళ్ళ పర్సనల్ ఐటమ్స్ బాత్రూమ్ లలో ఉండకూడదు. ఇంకా ముఖ్యంగా విడిచిన బట్టలు బాత్రూమ్ లలో అట్లాగే పెట్టేయకూడదు. బాత్రూమ్ లో కేవలం సోపులు, షాంపూలు, బకెట్, మగ్, స్నానం చేసేటప్పుడు బట్టలు వేసుకోవడానికి హోల్డర్స్ ఉండాలి అంతే. వండటం, వడ్డించడం!! వండటం ఒక కళ అయితే వడ్డించడం ఒక కళ. అదేదో ఇంటికి వచ్చిన వాళ్ళు మోహమాటపడతారని దగ్గరుండి వేసుకో వేసుకో అని కంచాల్లో కుమ్మరించడం చేయకూడదు. అలాగని మరీ నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి ఒక్కటీ ఒకటికి రెండు సార్లు రిక్వెస్ట్ గా చిరునవ్వుతో అడగాలి. అలాగే పెద్ద మొత్తం ఉన్న గిన్నెలు అన్ని ముందు ఉంచకూడదు. చాలామంది వండిన గిన్నెలను అట్టే ఎత్తుకొచ్చి భోజనం చేసేచోట పెట్టేస్తుంటారు. అలా కాకుండా వండిన వాటిని వేరే గిన్నెల్లోకి మార్చుకుని తీసుకొచ్చి పెట్టడం బాగుంటుంది. ఎన్ని రకాలు వండాము అనేది కాకుండా శ్రద్దగా ఎన్ని చేసాము అనేది మైండ్ లో పెట్టుకోవాలి. ఇంకా ముఖ్యంగా వీలైనవరకు బయట నుండి తెప్పించడం అస్సలు మంచిది కాదు. ఒకవేళ ఉన్న ప్రాంతాలలో చాలా ఫెమస్ పదార్థాలు ఉంటే వాటిని భాగం చేయచ్చు కానీ పూర్తిగా అవే ముందు పెట్టేసి హమ్మయ్య అనుకోకూడదు.  చిన్న జాగ్రత్తలు!! ఇంట్లో చుట్టాలు ఉన్నప్పుడు టీవీ లలో ప్రోగ్రాం ల మీద మరీ ఇంట్రెస్ట్ పెట్టకండి. రిమోట్ అతిథుల చేతుల్లో పెట్టండి. అదొక గౌరవమూనూ. ఇంకా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, కామన్ స్నేహితులు ఇలా ఎవరైనా వచ్చినా గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకోవద్దు. మాటల్లో పడి పనులు వాయిదా వేయొద్దు. ముఖ్యంగా కిచెన్ పనులు ఎప్పటికప్పుడు చేసి శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వాసనలు ఉండవు. వీలుంటే నాచురల్ ఎయిర్ ఫ్రెషర్ లు అయిన పువ్వులు, అగరొత్తులు, వాడటం మంచిది. ఇంట్లో గదుల తలుపులు, కిచెన్ తలుపులు అలా తెరచి ఉంచద్దు. కర్టెన్ లు వేయడం మంచిది. అతిథులు వచ్చారు కదా అని ఎడాపెడా మాట్లాడేయొద్దు. వాళ్లకు తగిన విశ్రాంతి, తగిన కంఫర్ట్ ఇవ్వడం మంచిది.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

పతకాలకు మీరూ పథకం వేయాలి!!

న్యూస్ ఛానెల్స్ లోనూ, న్యూస్ పేపర్స్ లోనూ ఇంకా సామాజిక మధ్యమాలలోనూ రాష్ట్రానికో, దేశానికో పతకం సాధించిన క్రీడాకారులను చూస్తే శభాష్!! దేశ పరువు నిలబెట్టారు అనే మాట చాలామంది నోటి నుండి వస్తుంది. అంతేనా!! ఇంట్లో ఉన్న తమ పిల్లల్ని చూసి మీరూ ఉన్నారు ఎప్పుడూ దుమ్ములో, బురదలో పందుల్లా దొర్లుతూ ఉంటారు అని విమర్శిస్తారు. నాన్నా నేనూ నా స్కూల్ డేస్ లో ఫలానా క్రీడలో ఫస్ట్ వచ్చాను అంటే, అవునురా నిన్ను అడుక్కుతినమని ఒక బొచ్చె ఇచ్చారులే వాళ్ళు లాంటి ఎగతాళి మాటలు కూడా పుష్కలంగా  వస్తాయి పెద్దల నోటి నుండి. కానీ అలాంటి పెద్దలు తెలుసుకోవలసిన నిజం ఏమిటంటే ఇప్పుడు పథకాలు సాధించినట్టు టీవీ లలో, పేపర్లలో మెరిసే పిల్లల్ని ఆయా పిల్లల తల్లిదండ్రులు ఎంతో ప్రత్సహించారు. వెంట ఉంది పిల్లల్ని కోచింగులకు తీసుకెళ్లి, దగ్గరుండి వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తూ వాళ్ళను ముందుకు నడిపించారు. కాబట్టే వాళ్లకు దేశ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అంతేనా పిల్లలకు ఆటల పట్ల ఉన్న ఆసక్తిని గమనించి వాళ్ళను వెనక్కు లాగి నిరాశపరచకుండా ప్రోత్సహించడం పిల్లల విషయంలో పెద్దలు తీసుకున్న గొప్ప నిర్ణయంగా ఒప్పుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహిస్తే వచ్చే లాభాలు తెలిస్తే ఆటలా వైపు పిల్లల్ని తరుముతారేమో!! గుర్తింపు, శారీరక వ్యాయామం!! చిన్నతనంలో పిల్లలు సరిగ్గా ఎదగాలి అంటే ఆటలకు మించిన గొప్ప మార్గం లేదు. టీవీ యాడ్స్ లో అందరూ చూపించే కాంప్లాన్లు, హార్లిక్స్ ల కంటే క్రీడలు మంచి శరీర సామర్త్యాన్ని,  శారీరక ఎదుగుదలను కూడా పెంపొందిస్తాయి. అంతేకాకుండా క్రీడల్లో ఓటమి, గెలుపులు సహజం కాబట్టి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వైఫల్యాలు ఎదురైనప్పుడు స్పోర్టివ్ గా తీసుకోగలుగుతారు పిల్లలు. కాబట్టి క్రీడల ద్వారా మానసిక పరిణితి కూడా పెరుగుతుంది. లక్ష్యాలు, లక్ష్యసాధనలు!! లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాటిని సాధించడం తెలిస్తే పిల్లల జీవితం ఎంతో క్రమశిక్షణ బాటలో ప్రయాణిస్తుంది. క్రీడల్లో ఇలాంటి లక్ష్యాలు, లక్ష్యసాధనలు పిల్లల చదువులో కూడా ఉపయోగపడతాయి. ఎప్పుడూ పుస్తకాల మధ్యన నలిగిపోయే పిల్లలకు క్రీడలు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. ఉద్యోగావకాశాలు!! రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీలలో క్రీడల్లో రాణించే వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. క్రీడాకారుల కోటాలో ఇచ్చే ఇంటి స్థలాలు, ఇల్లు, ఉద్యోగాలు, ఇంకా ప్రోత్సాహక బహుమతిగా లక్షల రూపాయలు కూడా ఇస్తాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు జాతీయస్థాయిలో మెరిసినప్పుడు రాష్ట్రప్రభుత్వాల తరపున ప్రకటించే డబ్బు లక్షల్లో ఉంటుంది.  మినహాయింపు!! రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో రాణించే వారికి చదువుతున్న కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి కూడా మంచి సహకారం ఉంటుంది. నిజానికి ఇలా క్రీడల్లో స్థాయిల వారిగా వెళ్లడం కూడా కళాశాలలు, విశ్వవిద్యాలయాల తరపున జరగడం వల్ల ఒకానొక లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందుతాయి.  ప్రత్యేక గుర్తింపు!! క్రీడల్లో రాణించడం అంటే మంచి శరీర సామర్థ్యము కలిగి ఉండటం కాబట్టి ఆర్మీ, నేవీ వంటి విభాగాల్లో ఎంతో అరుదైన హోదాలు కూడా దక్కుతుంటాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి పురస్కారాలు కూడా వరిస్తాయి. అందుకే మరి పిల్లలు ఆడుకుంటే పనికిమాలిన చర్యగా భావించి వారిని కట్టడి చేయకుండా హాయిగా ఆటల్లో రాణించేలా ప్రోత్సహించండి. రాజుల్లా, రాణుల్లా మంచి జీవితాన్ని పొందగలరు.                               ◆వెంకటేష్ పువ్వాడ  

ఊహించని ప్రధాని రాజీవ్!

భారతజాతీయ కాంగ్రేస్ గాంధీ-నెహ్రు కుటుంబాల వారసత్వ పార్టీగా అందరికీ తెలిసిందే. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుండి ఈ పార్టీనే దేశాన్ని నడిపిస్తూ వచ్చింది. మొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రు గారి దగ్గర సహాయకురాలిగా పనిచేసిన ఇందిరాగాంధీ నెహ్రు తరువాత ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుంది. అప్పుడు ఆమె వయసు 48 సంవత్సరాలు. ఆమెకు పుట్టిన ఇద్దరు కొడుకులలో రాజీవ్ గాంధీ పెద్దవాడు కాగా, సంజయ్ గాంధీ చిన్నవాడు. రాజకీయ కుటుంబంలో పుట్టినా చిన్నతనం నుండి రాజీవ్ గాంధీకి ఎలాంటి ఆసక్తి  లేదని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. కానీ అదే నిజం. ఆయన ఏ రోజూ రాజకీయాల్లోకి రావాలని, నాయకుడిగా ఎదగాలని కోరుకోలేదు. అయితే ఎలాంటి ఆసక్తి లేని రాజీవ్ భారతదేశానికి అతి చిన్న వయసు ప్రధానిగా ఎలా ఎంపికయ్యాడు?? ఆయన మరణం ఎలా సంభవించింది?? ఆయన ప్రధానిగా చేసిన కొద్ది కాలంలో దేశంలో చోటుచేసుకున్న మార్పులు ఏమిటి??  బాల్యం, విద్యాభ్యాసం!! రాజీవ్‌గాంధీ 1944 ఆగ‌స్టు 20 బోంబేలో జ‌న్మించారు. భార‌త‌దేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఆయ‌న తాత ప్ర‌ధాన‌మంత్రి అయ్యేనాటికి రాజీవ్ వ‌య‌సు కేవ‌లం 3 సంవ‌త్స‌రాలు. ఆయ‌న త‌ల్లిదండ్రులు ల‌క్నో నుంచి ఢిల్లీకి మ‌కాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్ల‌మెంటు స‌భ్యుడు అయ్యారు. రాజీవ్ చిన్నతనం ఆయన తాతగారు అయిన నెహ్రూతో గడిచింది. తరువాత డెహ్రాడూన్‌లోని వెల్హామ్ ప్రెప్ స్కూల్‌కు కొద్దికాలంపాటు వెళ్ళిన రాజీవ్‌గాంధీ త‌రువాత రెసిడెన్షియ‌ల్ డూన్ స్కూల్‌కు మారారు. స్కూల్ చ‌దువు పూర్త‌యిన త‌రువాత రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ క‌ళాశాల‌లో చేరారు. అయితే త్వ‌ర‌లోనే లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజ్‌కి మారారు. అక్క‌డ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు. సైన్సు, ఇంజినీరింగ్‌కు సంబంధించిన ఎన్నో పుస్తకాలు ఆయ‌న బీరువాల నిండా ఉండేవ‌ని ఆయన తోటి విద్యార్థులు  చెబుతారు. ఫిలాస‌ఫీ, రాజ‌కీయాలు లేదా చ‌రిత్ర గురంచి ఆయ‌నకు ఆసక్తి కాదు. అయితే సంగీతాన్ని ఇష్ట‌ప‌డేవారు. వెస్ట్ర‌న్‌, హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంతోపాటు ఆధునిక సంగీతాన్ని కూడా ఇష్ట‌ప‌డేవారు. రాజీవ్ ఆస‌క్తి క‌న‌బ‌బ‌రిచే ఇత‌ర అంశాల్లో ఫొటోగ్ర‌ఫీ, అమెచ్యూర్ రేడియో ముఖ్య‌మైన‌వి. ఈయన ఇంగ్లండ్ నుండి తిరిగి వచ్చిన తరువాత ప్లయింగ్  క్లబ్ లో సభ్యత్వం తీసుకుని ఎంట్రన్స్ ఎక్సమ్ పాసయ్యి కమర్షియల్ ఫైలట్ గా లైసెన్స్ తీసుకోవడానికి వెళ్లి ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఫైలట్ గా ఎంపికయ్యి, ఫైలట్ గా కొత్త జీవితం మొదలుపెట్టారు. పెళ్లి, పిల్లలు!! ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో చదువుతున్న సమయంలోనే ఇంగ్లీష్ చదివే ఇటాలియ‌న్ మ‌హిళ సోనియా మైనోతో ప‌రిచ‌య‌మ‌యింది. 1968లో ఢిల్లీలో వారు ఇద్ద‌రూ పెళ్ళి చేసుకున్నారు. రాహుల్, ప్రియాంక అనే ఇద్దరు పిల్లలతో ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంట్లోనే ఉండేవారు. రాజకీయ ప్రవేశం!! 1980లో సోద‌రుడు సంజ‌య్‌గాంధీ విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించ‌డంతో ప‌రిస్థితి మారింది. అప్ప‌ట్లో అంత‌ర్గ‌తంగా, బ‌హిర్గ‌తంగా అనేక స‌వాళ్ళు చుట్టుముట్టిన ప‌రిస్థితుల్లో త‌ల్లికి చేయూతను ఇవ్వ‌డానికి రాజ‌కీయాల్లో చేర‌వ‌ల‌సిందిగా రాజీవ్‌గాంధీపై వ‌త్తిడి పెరిగింది. మొద‌ట్లో వీటిని ప్ర‌తిఘ‌టించిన‌ప్ప‌టికీ త‌రువాత త‌ల వొగ్గ‌క త‌ప్ప‌లేదు. త‌మ్ముని మృతి కార‌ణంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రాజీవ్‌గాంధీ గెలుపొందారు. రాజీవ్ పాలనలో ముఖ్య విషయాలు!! 1982 న‌వంబ‌ర్‌లో భార‌త్ ఆసియా క్రీడ‌ల‌కు ఆతిథ్యం ఇచ్చిన‌పుడు అంత‌కు చాలా సంవ‌త్స‌రాల ముందు జ‌రిగిన ఒప్పందానికి క‌ట్టుబ‌డి స్టేడియంలు, ఇత‌ర మౌలిక స‌దుపాయాలు క‌ల్పించే కార్య‌క్ర‌మాన్ని రాజీవ్‌గాంధీ విజ‌య‌వంతంగా పూర్తిచేశారు. ఇది ఆయన సమర్త్యాన్ని బయటకు తెలిసేలా చేసింది.  ప్రధానిగా నిర్ణయాలు!! ఇందిరా గాంధీ మరణం తరువాత ఈయన పాలనలో ప్రధానిగా తీసుకున్న ముఖ్య నిర్ణయాలలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ముఖ్యమైనది. ఎన్నికైన పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యులు తరువాత ఎన్నికలు వచ్చేవరకు పార్టీలు మారడానికి వీల్లేకుండా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈయన కాలంలో మైనారిటీలకు అనుగుణంగా, సుప్రీం కోర్టు నిర్ణయాన్ని రద్దు చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అందుకే ఈయన పాలనలో మైనారిటీలకు పెద్ద పీట వేసినట్టు చెబుతారు. ఇంకా ఆర్థిక విధానం పరంగా రాజీవ్ నిర్ణయాలు కొంచం సంచనాలు అయ్యాయి. ప్రైవేట్ ఉత్పత్తిని లాభదాయకంగా మార్చడానికి ప్రోత్సాహకాలను అందించడం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తిని, ముఖ్యంగా మన్నికైన వస్తువులను పెంచడానికి కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చేలా నిర్ణయాలు జరిగాయి . ఇది ఆర్థిక వృద్ధిని పెంచుతుందని మరియు పెట్టుబడి నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థను బాహ్య ఆర్థిక ప్రభావాలకు తెరతీస్తుందని అందరూ భావించారు.  అయితే గ్రామీణ మరియు గిరిజన ప్రజలు వాటిని ధనవంతులకు మరియు నగరాల్లో నివసించేవారికి అనుకూలమైన సంస్కరణలుగా భావించి నిరసన వ్యక్తం చేశారు.  ఈయన  సైన్స్, టెక్నాలజీ మరియు అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతును పెంచారు మరియు టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, ముఖ్యంగా కంప్యూటర్లు, ఎయిర్‌లైన్స్, రక్షణ మరియు టెలికమ్యూనికేషన్‌లపై దిగుమతి కోటాలు, పన్నులు మరియు సుంకాలను తగ్గించారు. 1986లో, అతను భారతదేశం అంతటా ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునీకరించడానికి మరియు విస్తరించడానికి జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించాడు. 1986లో జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించాడు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధారిత విద్యా సంస్థ, ఇది గ్రామీణ జనాభాకు ఆరు నుండి పన్నెండు తరగతుల వరకు ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందిస్తుంది. మరణం!! జూలై 1987లో గాంధీ ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేశారు . ఈ ఒప్పందం తమిళం-మెజారిటీ ప్రాంతాలకు అధికార వికేంద్రీకరణను ఊహించింది, LTTEని రద్దు చేసింది మరియు తమిళాన్ని శ్రీలంక అధికారిక భాషగా నియమించింది.  ఇండో-శ్రీలంక ఒప్పందంపై సంతకం చేసిన ఒక రోజు తర్వాత, విజిత రోహన అనే గౌరవ గార్డు తన రైఫిల్‌తో రాజీవ్ భుజంపై కాల్చారు. అయితే ఆయన ఇది పసిగట్టి తప్పుకోవడం వల్ల భుజానికి మాత్రమే తగిలింది. నిజానికి అది తలకు పడాల్సింది.  రాజీవ్ గాంధీ చివరి బహిరంగ సభ 21 మే 1991న, శ్రీపెరంబుదూర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తున్నప్పుడు జరిగింది.  హత్యకు గురైన మద్రాసు నుండి దాదాపు 40 కిమీ దూరంలో ఇది ఉంది. రాత్రి 10:10 గంటల  తర్వాత తెన్మొళి రాజరత్నంగా గుర్తించబడిన ఒక మహిళ - లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సభ్యురాలుగా రాజీవ్ వద్దకు వచ్చి ఆయనకు నమస్కరించింది.  అయితే ఆమె కిందకు వంగినప్పుడు ఆమె తన శరీరానికి అమార్చుకున్న బాంబులను పేల్చింది. ఈ సంఘటనలో రాజీవ్, రాజారత్నం అనే మహిళతో సహా  14 మంది మరణించారు. ఇలా అనుకోకుండా ప్రధానిగా మారి మరణం బారిన పడింవారు రాజీవ్ గాంధీ. ◆వెంకటేష్ పువ్వాడ.

ప్రపంచంపై జ్ఞానాన్ని పూయించే బుద్దపూర్ణిమ!

దుఃఖం మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే దుఃఖం కలగడానికి కారణాలు ఏమిటి అంటే కోర్కెలు పుట్టడం. కోర్కెలు మనిషి జీవితాన్ని దుఃఖంలోకి నెట్టుతాయి. కోర్కెలను జయించడం మనిషికి ఎంతో కష్టం. కానీ అసాధ్యం మాత్రం కాదు. ప్రపంచాన్ని దుఃఖం నుండి బయటపడమని పిలుపునిచ్చిన వారిలో బుద్ధ భగవానుడు ఒకరు. ఈయన భోధనలు దాదాపు భగవద్గీతను సారానికి దగ్గరగా ఉంటాయి.  బుద్ధుడి జననం, బుద్ధుడికి జ్ఞానోదయం కలగడం, బుద్ధుడు నిర్యాణం చెందడం ఇలా ఎంతో ముఖ్య ఘట్టాలు అయిన మూడు వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ రోజే జరిగాయని చెబుతారు. అందుకే బుద్ధ పూర్ణిమ ఎంతో ప్రాశస్త్యం పొందింది. సిద్ధార్థుడి నుండి బుద్ధుడు!! పుట్టినప్పుడు ఈయనకు పెట్టిన పేరు సిద్ధార్థుడు. అయితే ఈయన తన పదహారు సంవత్సరాలు తరువాత యశోధరను పెళ్లి చేసుకున్నాడు  రాహులుడు అనే కొడుకు కూడా పుట్టాడు. సుఖాలు అనుభవించడమే జీవితానికి పరమార్థం అని నమ్మి ఎప్పుడూ సుఖసంతోషాలు గడిపేవాడు. అయితే తన ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో కపిలవస్తు నగరంలో విహారానికి వెళ్తున్నప్పుడు కనిపించిన నాలుగు సంఘటనలు అతడిని ఎంతగానో కలచివేశాయి. రోగాలను, మరణాన్ని, ముసలితనాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని, ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో మార్గాలు అనుసరించి చివరకు గయలో ఒక భోది వృక్షం కింద ఆత్మజ్ఞానం పొందాడు. అప్పటినుండి జీవితంలో ఎన్నో విషయాలను తన భోధనలుగా చెబుతూ ప్రపంచమంతా తిరుగుతూ ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేసినవాడు గౌతమ బుద్ధుడు. మానవుని అజ్ఞానానికి, కష్టాలకు కారణాలను, వాటి నుండి విముక్తి పొందడానికి మార్గాలను తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణం అని అంటారు. బుద్ధం, ధర్మం, సంఘం అనే మూడు సూత్రాలతో  మొదటి బౌద్ధ మత సంఘం ఏర్పడింది. తరువాత ఈ సంఘంలో చేరిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ బుద్ధుని బోధనలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడంలో ముందుకు కదిలింది. వర్షాకాలంలో వచ్చే వరదలవల్ల అన్ని మతాలకు చెందినసన్యాసులు ఆ కాలంలో తమ ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేశేవారు. ఈ సమయంలో బౌద్ధ మత సంఘం ఒక ఆశ్రమాన్నిఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేది. చుట్టుపక్కల ప్రాంతాలనుండి ప్రజలంతా ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు. దీనినే వస్సాన అని అంటారు. బుద్ధుడు ఐదవ వస్సనలో వైశాలికి దగ్గరలో ఉన్న మహావాసనలో బస చేశాడు. అప్పుడు బుద్ధుని తండ్రి శుద్ధోధనుడు మరణశయ్యపైఉండడంతో, బుద్ధుడు అతని దగ్గరికి వెళ్లి ధర్మాన్ని బోధించడంతో, శుద్ధోధనుడు మరణానికి ముందు బౌద్ధ సన్యాసిగా మారాడు. బుద్ధుని నిర్యాణం!! బుద్ధుడు తన ఎనభై సంవత్సరాల వయసులో తన దేహాన్ని విడిచిపెట్టాడు. ఆయన నిర్యాణం చెందడానికి ముందు తన శిష్యులను పిలిచి వారికి ఏమైనా సందేహాలు ఉంటే అడగమన్నాడు. చివరకు వారు ఎలాంటి సందేహాలు అడగకపోయేసరికి తన జీవితానికి ముగింపు ఇచ్చాడు.  ఈయన నేపాల్ ప్రాంతానికి చెందినవాడు కావడం వల్ల ఆ ప్రాంత వాసులు బుద్ధుడిని తమ దైవంగా భావిస్తారు.  బుద్ధుడు తన జీవితంలో ముఖ్యంగా యోగ, ధ్యానం, సన్యాసం మొదలైన విషయాలను ఎంతో ప్రాముఖ్యమైన వాటిగా భావించాడు. మనిషి అత్యాశతో బ్రతకడం వృథా అని భావించాడు. ఎప్పుడూ నిర్మలమైన ద్యానముద్రలో ఉండే బుద్ధభాగవానుడు ఎంతో గొప్ప శాంతియుత జీవనాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకున్నారు. దానిఫలితమే నేడు మానవ జీవితాల్లో  కనిపించే ఒకానొక మౌన ప్రవాహపు తరంగాల జ్ఞాన పరిమళం. ప్రపంచ శాంతి కోసం ఆరాటపడిన వాళ్లలో బుద్ధుడు కూడా ఒకరు. కేవలం ఆ బుద్ధుడి ధ్యాన స్వరూపాన్ని చూస్తూ పరిగెత్తే మనసును ఒకచోట నిలబెట్టచ్చు. ◆వెంకటేష్ పువ్వాడ.

నరసింహావతారం నరులకు ఇచ్చే సందేశం!

మహావిష్ణువు అవతారాలు ఎన్ని అంటే చాలా మంది పది అంటారు. కానీ మహావిష్ణువు పూర్తి అవతల 21. వీటిని ఏకవిశంతి అవాఘారాలు అంటారు. వీటిలో చాలా ప్రముఖమైనవి, కథలుగా ప్రాచుర్యంలో ఉన్నవి పది. ఆ పది అవతారాలు మహావిష్ణువు ఒక్కో యుగంలో ఒకో విధంగా ఆవిర్భవించి ఈ లోకాన్ని దుష్టుల నుండి కాపాడుతూ దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణ అనే విషయాన్ని వ్యాప్తం చేసాడు. అలా  విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగవ అవతారం అయిన నరసింహ అవతారం ఎంతో విశిష్టమైనది. పూర్తి మనిషిగా కాకుండా, పూర్తి మృగంలా కాకుండా రెండింటి కలయికతో ఆవిర్భవించిన భీకర స్వరూపం ఈ నరసింహ అవతారం. ఆవిర్భావం వెనుక కథ, వృత్తాంతం!! జయవిజయులు వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులు. అర్థమయ్యేలా చెప్పాలంటే లోపలికి ఎవరికీ పంపకుండా కాపలా ఉండటం. ఎవరైనా విష్ణుమూర్తిని కలవడానికి వస్తే మొదట విష్ణుమూర్తికి విషయం చెప్పి ఆయన సరేనంటే వాళ్ళను లోపలికి పంపడం. ఒకరోజు సనకసనందనాది మునులు విష్ణుమూర్తి దర్శనానికి వస్తే "ఇప్పుడు విష్ణుమూర్తిని కలవడానికి కుదరదు" అని చెప్పారు. ఆ మునులకు కోపం వచ్చి "మీరు విష్ణుమూర్తి  దగ్గర ఉంటున్నామని గర్వంతో ఇలా అంటున్నారు కదా, విష్ణులోకం నుండి మీరు దూరమైపోతారు" అని శాపం పెట్టారు.  ఆ జయవిజయులు విష్ణుమూర్తిని అడిగితే "ఏడు జన్మలు నాకు మంచి భక్తుల్లా పుడతారా?? లేక మూడు జన్మలు నాకు శత్రువులుగా పుట్టి నాచేతిలోనే మరణిస్తారా??" అని అడిగాడు విష్ణువు.  ఏడు జన్మలు మేము ఉండలేము, మూడు జన్మలు మీకు శత్రువులుగా పుట్టి మీ చేతిలోనే మరణిస్తాము" అని అన్నారు వాళ్ళు. అలా కృతయుగంలో పుట్టిన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులే ఈ జయవిజయులు. చాలామంది తిట్టుకుంటూ ఇలా గుర్తుచేసుకోవడాన్ని వైరి భక్తి అంటూ ఉండటం వైన్ ఉంటాం. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి వరం పొందాడు. గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని, దేవదానవమనుష్యుల చేతుల్లో కానీ, జంతువులతో కానీ, ఆయుధములచేత కానీ, ఇంట్లోకాని, బయటకాని మరణము కలగకుండా వరం సంపాదించాడు. అందువల్ల హిరణ్యకశిపుడిని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ప్రహ్లాదుడు, నృసింహ ఆవిర్భావం!! ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కొడుకు. యుద్ధం జరిగి హిరణ్యకశిపుడి భార్యను ఇంద్రుడు ఎత్తుకుని పోతే నారదుడు ఇంద్రుడిని మందలించి ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్లి రక్షణ కల్పిస్తాడు. ఆ సమయంలో నారదుడు చెప్పిన భాగవత విషయాలను విన్న ప్రహ్లాదుడు పుట్టుకతో విష్ణు భక్తుడిగా మారిపోయాడు.  శివుడు, విష్ణువు శత్రువులు కాకపోయినా వీరి భక్తులు మాత్రం ఎప్పుడూ శత్రుత్వంతో రగిలిపోయేవారు. వాళ్లలో హిరణ్యకశిపుడు కూడా ఒకడు. విష్ణువంటే సరిపడదు అందుకే కొడుకును చంపాలని చూసి విఫలమై చివరకు ఎక్కడున్నాడు నీ హరి??" అని ప్రశ్నించగా. స్థంబాన్ని చీల్చుకుని వచ్చిన మనుష్య, మృగ అవతారమూర్తి నరసింహుడు. బ్రహ్మ ఇచ్చిన వరంలో ఉన్న అంశాల ఆధారంగా వాటన్నిటినీ మినహా ఇస్తూ హిరణ్యకశిపుడిని ఇంటి గడప మీద చేతి గొర్లతో కడుపు చీల్చి వధించాడు.  ఇదీ నరసింహావతార కథ. అంతార్థం!! ఆ భగవంతుడు ఈ సృష్టిలో అణువణువు నిండి ఉంటాడు. భగవద్గీత చెప్పే విషయం ఇదే. దాన్నే ప్రహ్లాదుడు తన భక్తితో చెప్పాడు. వైర భక్తి. ప్రపంచంలో మనుషులు శత్రువులు అయినా వారిలో ఖచ్చితంగా ఎదజేటివాడు సరిచేసుకోగలిగిన అంశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఒక శత్రువు లోపాన్ని ఎత్తి చూపినట్టు, స్నేహితులు, దగ్గరివాళ్ళు చూపించరు. కాబట్టి శత్రువు ఎప్పటికైనా మంచివాడే. మృగ స్వభావం ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది. ఆ మృగస్వాభావం వచ్చినప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు అనే విషయం ఈ నరసింహ అవతారంలో స్పష్టం అవుతుంది. విచక్షణ కోల్పోయిన మనిషి చేసే పనులలో చాలా నష్టాలు ఉంటాయని అంటారు. కాబట్టి మృగ స్వభావం అనేది మనిషిని ఎప్పుడూ దిగజార్చకూడదు. ఇలా నరసింహ అవతారం మనిషికి ఎన్నో విషయాలు బోధిస్తుంది. నరసింహస్వామిని ఆరాధిస్తే అరిశడ్వర్గాలను అదుపులో ఉంచుకునే మానసిక శక్తి, ఇంకా అంతులేని ధైర్యం చేకూరుతాయి. అలాగే భయాలు తొలగిపోయి.  ఒకటి మాత్రం నిజం. లక్ష్మినారాయణుడు అన్నా, లక్ష్మీ నరసింహస్వామి అన్నా ఒకటే, అవతారాలు వేరు.  అన్నింటిలో నిండినది ఆ పరమాత్మే.                           ◆ వెంకటేష్ పువ్వాడ.