మన చర్మం మీద ఒక జీవి బతుకుతోంది తెలుసా!

మనకి పైపైన కనిపించే చర్మం వేరు. కాస్త సూక్ష్మంగా చూస్తే అందులో ఒక ప్రపంచమే ఉంటుంది. స్వేదరంధ్రాలు, బ్యాక్టీరియా, వెంట్రుకల కుదుళ్లు... ఇలా చర్మం కాస్త వింతగా కనిపిస్తుంది. కానీ దాని మీద ఒక ఏకకణ జీవి (unicellular organism) కూడా బతికేస్తోందని ఈ మధ్యనే బయటపడింది. ఇక అప్పటి నుంచి దాని లక్షణాలు ఏమిటి, లాభనష్టాలు ఏమిటి అన్న చర్చ మొదలైంది.   మన చర్మం మీద ఆర్కియా అనే ఏకకణజీవి బతుకుదోందని ఈమధ్యనే గ్రహించారు. ఏడాది వయసున్న పిల్లవాడు మొదలుకొని 75 ఏళ్ల వృద్ధుల వరకూ అనేకమందిని పరిశీలించిన తర్వాత తేలిన విషయమిది. ఎక్కడో అంటార్కిటికా మంచుపలకల మీదా, వేడి నీటి బుగ్గలలోనూ మాత్రమే ఉందనుకునే ఈ చిత్రమైన జీవి ఏకంగా మన శరీరం మీదే నివసిస్తోందని బయటపడింది.   ఆర్కియా మన చర్మాన్ని ఆశించి బతికేస్తోందని తేలిపోయింది. కానీ దీని వల్ల లాభమా నష్టమా అన్న ఆలోచన మొదలైంది. పొడిచర్మం ఉన్నవారి మీద ఈ ఆర్కియా చాలా ఎక్కువ మోతాదులో కనిపించింది. బహుశా వారి చర్మాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఇది దోహదపడుతూ ఉండవచ్చు. అలాగే 12 ఏళ్లలోపు పిల్లలలోనూ, 60 ఏళ్లు దాటిన వృద్ధులలోనూ ఆర్కియా ఎక్కువగా కనిపించింది. బహుశా ఆయా వయసులలో సున్నితంగా ఉండే చర్మాన్ని ఈ ఆర్కియా కాపాడుతూ ఉండవచ్చు.   అంతేకాదు! చర్మం మీద కనిపించే ఆర్కియా, అమ్మోనియా మీద ఆధారపడి జీవిస్తోందని తేలింది. మన చెమటలో అమోనియా ఒక ముఖ్యభాగం. ఆ అమోనియా మన చర్మం మీద పేరుకుపోకుండా ఈ ఆర్కియా ఉపయోపడుతోందని భావిస్తున్నారు. చర్మం మీద PH లెవల్స్ని తగ్గించడంలో కూడా ఈ జీవి ఉపయోగపడుతోందన్నది మరో విశ్లేషణ. PH లెవల్స్ తక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్లు కూడా తక్కువగా ఏర్పడతాయి.   ఆర్కియా ఉపయోగాలు సరే! మరి అది మన శరీరం మీద అధిక మోతాదులో పేరుకుపోతే కలిగే అనర్థాలు ఏమిటో తెలియడం లేదు. పైగా వ్యోమాగాములు అంతరిక్షంలో తిరిగేటప్పుడు, వారితో పాటుగా ఈ జీవులు కూడా ఇతర గ్రహాల మీదకి చేరే అవకాశం ఉంది. MARS వంటి గ్రహాల మీదకి కనుక ఈ ఆర్కియా చేరితే, అక్కడి వాతావరణం మొత్తం కలుషితం అయిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.   లాభమో, నష్టమో! మొత్తానికి మన చర్మానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంగతి బయటపడింది. ఇహ వైద్యప్రపంచంలో ఆర్కియాకి ఒక కొత్త అధ్యాయం మొదలైంది. - నిర్జర.  

న్యాయం కోసం సంతకాలు చేద్దామా!! 

ఈ ప్రపంచంలో ఏ విషయం ను అయినా రెండు కోణాల్లో చూస్తారు. ఒకటి న్యాయం, రెండోది అన్యాయం. ముఖ్యంగా భారదేశానికి చట్టాలు ఏర్పడ్డాక ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ ప్రతి వ్యవస్థలోనూ న్యాయాన్ని కాపాడటానికి న్యాయవ్యస్థను ఏర్పాటు చేసి, న్యాయం కోసం కృషి చేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1949 సంవత్సరం నవంబర్ 26 వ తేదీన తొలి ముసాయిదా కమిటీ సభ్యులు సంతకాలు చేశారు. అదే 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని అందరికీ అందించడం. అలా ముసాయిదా కమిటీ సంతకాలు చేసిన ఆరోజును జాతీయ న్యాయదినోత్సవంగా జరుపుకోవాలని సుప్రీంకోర్టు ప్రకటించింది. అదే నేటి నేషనల్ లా డే.  న్యాయం ఎక్కడ!! న్యాయం ఎక్కడుంటుంది అంటే కోర్ట్ లో మాత్రమే అనుకోవడం పొరపాటు. ఈ న్యాయ దినోత్సవం అర్థం న్యాయవాదులు న్యాయం రక్షించడం కోసం కృషి చేయడమే కావచ్చు కానీ నిజానికి ప్రస్తుతం న్యాయాన్ని కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే తయారయ్యాయి. అందుకే ప్రతి ఒక్కరూ న్యాయాన్ని డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక చేదు నిజం ఏమిటంటే డబ్బు పెట్టి ఏది నమ్మిస్తే అదే న్యాయం అయిపోవడం. అంటే అన్యాయాన్ని కూడా డబ్బు పెట్టి న్యాయంగా మార్చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రస్తుత సమాజంలో కోకొల్లలు.  మరేం చేద్దాం!! న్యాయానికి నల్లకోటు ప్రామాణికం కాదు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. నిజానికి అందరికీ తెలుసు కూడా కానీ తెలియనట్టే ఉంటారు. ఈ సమాజంలో, మన చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నో విషయాలు, అవకతవకలు మొదలైన వాటిని ఎవరి శక్తి మేరకు వాళ్ళు పరిష్కరిస్తూ, తమ ప్రమేయం ఉన్న ఏ విషయంలో అయినా నీతిగా ఉండటం అందరూ చేయదగిన పని. న్యాయం కోసం!! చాలామంది కొన్ని విషయాలు నేరుగా చూసి అందులో తమ పాత్ర ఉన్నా ఏదో నష్టం జరుగుతుందనో లేక మనకెందుకులే అనే ఆలోచనతోనో ఆ విషయాన్ని చూసి చూడనట్టు ఉంటారు. అది ఎంత తప్పో చాలామందికి అర్థం కాదు. తమ మాట వాళ్లకు ఎంత గొప్ప పరిష్కారాన్ని చూపిస్తుందో అర్థం కాదు. ఎప్పుడో పాఠశాలల్లో చదువుకున్న ఐకమత్యం అనే విషయాన్ని జీవన సరళిలో ఎప్పుడో వదిలేసుకున్న మహానుభావులం మనం. ప్రతీది ఆర్థిక కోణంలో చూసే ఆర్థికశాస్త్ర విశ్లేషకులం. ఇంకా చేస్తున్న పనులను సమర్థించుకుంటూ వాటికి ఉదాహరణలు కూడా బయటకు చెప్పగల గొప్ప ప్రవచనాకారులం. ఇలాంటి మన మధ్య న్యాయం కావాలంటే అంత సులువుగా దొరుకుతుందా?? నమ్మకాల వంతెన!! నిజానికి న్యాయానికి, నమ్మకానికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. కానీ నమ్మకం ఉన్నచోట న్యాయానికి వెక్కిరింపు ఎదురవుతుంది కూడా. ఎన్నో సమస్యలను ఎదుర్కొని మరీ సహాయం చేసిన చోట ఇచ్చిన నమ్మకాన్ని, పొందిన సహాయాన్ని మరచి నమ్మకద్రోహం జరిగితే ఎవరూ న్యాయం కోసం ముందుకు రారు. ఉదాహరణకు ఈమధ్య కాలంలో కొందరు ఉద్యోగస్తులు లోన్ల విషయంలో ష్యురిటీ సంతకాలు పెట్టడానికి జంకుతున్నారు కారణం తీసుకున్నవారు  వాటిని కట్టడానికి వెనుకడుగు వేసి కట్టడం వదిలేస్తే సంతకాలు పెట్టిన సగటు వ్యక్తిని ఆ సంస్థ వారు కోర్ట్ ల చుట్టూ తిప్పి ఎన్నో ఇబ్బందులకు గురిచేయడం. నమ్మకంతో సంతకాలు పెట్టిన సగటు వ్యక్తికి జీవితమే ప్రశ్నార్థకమైతే మరెక్కడ న్యాయం.కాబట్టి ఇలాంటి  విషయాలలో పూర్వపరాలు పరిశీలించి కోర్ట్ వారు ఇచ్చే తీర్పు సగటు న్యాయమైన వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరూ ఎవరికి వారు బాధ్యతగా ఉండాల్సిన అవసరం అందరిపైనా ఉంది. ◆ వెంకటేష్ పువ్వాడ

ఈ కాలంలో నీతి ఎలా ఉంది?? 

మనుషుల జీవితాలలోనూ, వారి మధ్య ఇమిడిపోయినవి కొన్ని ఉంటాయి. వాటిని మనం అనుబంధాలు, విలువలు, సెంటిమెంట్లు ఇట్లా బోలెడు రకాలుగా చెప్పుకుంటాం. ప్రతి మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటి ఆధారంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అయితే ద్రవ పదార్థాలను ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఒదిగిపోయినట్టు మనిషి కూడా ఒదిగిపోతూ ఉండటానికి ప్రయత్నం చేస్తుంటాడు. కొంతమంది ఇలాగే ఉండాలి అంటారు, మరికొందరు అలా ఉండకూడదు అంటారు. కానీ మొత్తానికి ఈ సమాజంలో మనిషి ఇట్లా ఉండాలి అని కొన్ని ఆపాదించారు. మనిషి వాటినే అంటిపెట్టుకుని, పాటిస్తూ ఉంటే వ్యక్తిత్వం అంటారు. అలా ఉంటేనే నీతిగల వాడు అని గుర్తిస్తారు. నిజానికి ఈ నీతి అంటే ఏమిటి?? ప్రస్తుత సమాజంలో నీతి ఎవరికి ఎంత వరకు తెలుసు. చాలామంది మనిషి ఎట్లా ఉండాలి అని విషయం ప్రస్తావనకు వచ్చినపుడు చాణుక్యున్ని ఉదహరణగా చెబుతూ ఉంటారు. నిజమే కావచ్చు చాణుక్యుడు ఒక గొప్ప వ్యూహకర్త. అయితే ఆయన ఆలోచనలను, ఆయన సిద్ధాంతాలను పూర్తిగా తెలుసుకుంటేనే మనిషి దాన్ని గ్రహించగలుగుతాడు. లేకపోతే సగం సగం తెలిసిన జ్ఞానంతో తనకు నచ్చిదాన్ని, ఎక్కడో తన ప్రవర్తనను సమర్థించే నాలుగు వాక్యాలను పట్టుకుని వాటినే మననం చేసుకుంటూ వాటిలోనే నీతి మొత్తం ఉందని అందరికీ చెబుతూ బావిలోని కప్పలాగా ఉండిపోతాడు.  కృష్ణ నీతి... అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అందరూ చెప్పుకోవాల్సిన ఒక గొప్ప మనోవిజ్ఞాన స్వరూపుడు ఎవరన్నా ఉన్నారంటే అది శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు పాటించింది ఏమిటి?? మంచికి మంచి, చెడుకు చెడు, నీతికి నీతి, నమ్మినవాళ్లకు సహాయం చేయడం, ఏదైనా చిటికెలో తాను పరిష్కరించే నేర్పు ఉన్నా, తాను అందుబాటులో ఉన్న అదంతా తను చేసేయ్యక చుట్టూ ఉన్న అందరితో ఆ పనిని చేయించడం. ఆ ఫలితాన్ని వాళ్లే అనుభవించేలా చేయడం. డ్ఈని అర్థం ఏమిటి అంటే, ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి. ఏదో శక్తి, సామర్త్యాలు ఉన్నాయి కదా అని ఇతరుల పనులను చేతుల్లోకి తీసుకుని దాన్ని చిటికెలో చేసిపెడితే అవతలి వాళ్లకి ఆ పని నైపుణ్యత అలవాటు కాదు. ప్రతి తల్లిదండ్రి పిల్లల విషయంలో పాటించాల్సిన ముఖ్య సూత్రం ఇదే.  ఇక ప్రస్తుతం గురించి చెప్పుకుంటే తన తరువాతే ఇతరం. విషయం ఏదైనా కావచ్చు మొదట తన అవసరం తీరాలి, తన సమస్యలు సద్దుమనగాలి ఆ తరువాత ఇతరుల గురించి ఆలోచిస్తారు. ఇతరుల కోణంలో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. నిజానికి తన గురించి తను చూసుకోవడం మంచిదే. తనని తాను నియంత్రించుకునేవాడు, తనని తాను చక్కబెట్టుకునేవాడు ఇతరులకు భారంగా మారడని ఒక నమ్మకం. అయితే చాలా చోట్ల ఒకే ఒక విషయంలో రివర్స్ కనబడుతుంది. అదే ఇతరుల్ని చూసి ఓర్వలేకపోవడం. తన జీవితంలో సమస్యలు ఉన్నా లేకపోయినా ఇతరుల జీవితంలో సమస్యలు ఉంటే ఆనందపడిపోవడం. ఇది ఏ తాలూకూ ప్రవర్తన అంటే సాడిజం అని సులువుగా చెప్పేయచ్చు. ఇవ్వడమూ, తీసుకోవడమూ కాదు దోచుకోవడం నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఒకప్పుడు ఇతరులకు ఇవ్వడం అనే విషయం ఎంతో సంతోషంతో కూడుకుని ఉండేది, తీసుకోవడమూ అంతే సంతోషంతో ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండు పేర్ల ముసుగులో దోచుకోవడం అనే ప్రక్రియ ఎంతో దర్జాగా జరిగిపోతుంది. అది దోచుకోవడం అని అందరికీ తెలుసు కానీ ఎవరూ దాన్ని పల్లెత్తు మాట అనరు. అది సమంజసమే అంటారు. ఎందుకంటే దానివల్ల కలుగుతున్న ప్రయోజనం అలాంటిది. ఇంకా పిల్లలకు చెప్పే ఎన్నో నీతులు, విలువలు, నియమాలు, పద్ధతులు ఇవన్నీ కేవలం నీటి మాటలుగా ఉంటూ,  పెద్దలు విరుద్ధ మార్గాలు అనుసరిస్తూ పిల్లలకు ఒకానొక మార్గదర్శకులుగా మారుతున్నారు. ఈ నీతిని సరైన దిశలో మార్చాలంటే ప్రతి ఇంట్లో ఆ కృష్ణ నీతి, కృష్ణ వాక్కు వినబడాలి. భగవద్గీత అందరి ఇళ్లలో ఉండాలి.  ◆ వెంకటేష్ పువ్వాడ  

దేనికైనా సమయం రావాలి!

అనగనగా ఓ కుర్రవాడు. అతనికి ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించాలని తెగ కోరికగా ఉండేది. తన దాహాన్ని తీర్చేందుకు తగిన గురువు ఎక్కడ దొరుకుతారా అని, ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇక ఎలాగైనా సరే... ఓ గొప్ప గురువు దగ్గరకి వెళ్లి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాలని బయల్దేరాడు. కుర్రవాడు అలా బయల్దేరాడో లేదో... అతని ఊరి చివరే ఒక పెద్దాయన కనిపించాడు. వెంటనే ఆయన దగ్గరకి వెళ్లి ‘నేను ఓ గొప్ప గురువు దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను. మీ దృష్టిలో అలాంటి గురువు ఎవరన్నా ఉంటే చెప్పగలరా!’ అని అడిగాడు. ‘ఓ దానిదేం భాగ్యం! నాకు తెలిసిన కొందరి పేర్లు చెబుతాను. వారి శిష్యరికంలో నీకు తృప్తి లభిస్తుందేమో చూద్దాం,’ అంటూ కొన్ని పేర్లు చెప్పాడు. పెద్దాయన చెప్పిన మాటలను అనుసరించి కుర్రవాడు ఆయా గురువులను వెతుక్కుంటూ బయల్దేరాడు. కానీ అదేం విచిత్రమో! ఎవ్వరి దగ్గరా తనకి తృప్తి లభించలేదు. అతని జ్ఞాన తృష్ణ చల్లారలేదు. అలా ఒకరి తర్వాత ఒకరిని వెతుక్కుంటూ, గాలిపటంలా దేశమంతా తిరుగుతూ తన యాత్రలను సాగించాడు. ఎక్కడా అతనికి తగిన బోధ లభించలేదు. అలా ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు గడిచిపోయాయి. అతనిప్పుడు కుర్రవాడు కాదు, యువకుడు! చివరికి నిరాశగా కాళ్లీడ్చుకుంటూ తన ఊరివైపు బయల్దేరాడు. యువకుడు ఊళ్లోకి అడుగుపెడుతుండానే అతనికి ఒకప్పుడు తారసపడిన పెద్దాయన కనిపించాడు. కానీ ఎందుకనో ఆ పెద్దాయన మొహం చూడగానే ఆయన గొప్ప జ్ఞానిలా తోచాడు. ఆయన దగ్గరకి వెళ్లి మాట్లాడుతున్నకొద్దీ... తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న గురువు ఆయనే అనిపించింది. ‘నేను పదేళ్ల క్రితం గురువుని వెతుక్కుంటూ మీ దగ్గరకి వచ్చినప్పుడే... మీరు నన్ను శిష్యుడిగా ఎందుకు స్వీకరించలేదు! నా జీవితంలో పదేళ్లు వెతుకులాటలో వృధా కాకుండా ఉండేవి కదా!’ అంటూ నిష్టూరమాడాడు యువకుడు. యువకుని మాటలకు పెద్దాయన చిరునవ్వులు చిందిస్తూ.... ‘నువ్వు పదేళ్ల క్రితం చూసినప్పటికీ, ఇప్పటికీ నేను పెద్దగా మారలేదు. మారింది నువ్వే! ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ నువ్వు అన్ని రకాల వ్యక్తులనూ చూశావు. ఏ మనిషి ఎలాంటివారు అని బేరీజు వేయగలిగే విలువైన నైపుణ్యాన్ని సాధించగలిగావు. ఆ నైపుణ్యంతోనే ఇప్పుడు నన్ను గుర్తించగలిగావు. అందుకే ఈ పదేళ్లు వృధా కానేకాదు. ఏ విషయం మీదైనా ఆసక్తి ఉంటే సరిపోదు. దాన్ని నెరవేర్చుకోగలిగే నైపుణ్యం కూడా సాధించాలి. అప్పుడే నీ లక్ష్యాన్ని సాధించగలిగే అర్హత ఏర్పడుతుంది,’ అంటూ యువకుడిని తన శిష్యునిగా స్వీకరించాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

ఇంటర్నెట్ ఓ అందమైన వ్యసనం

ఇప్పుడు ఇంటర్నెట్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. బ్రాడ్బ్యాండ్, 4G లాంటి సాంకేతికతత పుణ్యమా అని గంటల తరబడి వందలకొద్దీ సైట్లను చూడవచ్చు. కానీ ఇంటర్నెట్ వాడకం తర్వాత మన రక్తపోటు, గుండెవేగంలో కూడా మార్పులు వస్తాయని సూచిస్తున్నారు.   ఇంగ్లండుకి చెందిన Swansea University పరిశోధకులు ఇంటర్నెట్ వాడిన వెంటనే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 18 నుంచి 33 ఏళ్ల లోపు వయసున్న ఓ 144 మందిని ఎన్నుకొన్నారు. కాసేపు ఇంటర్నెట్ చూసిన తర్వాత వీరందరిలోనూ గుండెవేగం, రక్తపోటు కనీసం 4 శాతం పెరిగినట్లు గమనించారు. తమలో ఉద్వేగపు స్థాయి కూడా మరీ ఎక్కువైనట్లు వీరంతా పేర్కొన్నారు.   రక్తపోటు, గుండెవేగంలో ఓ నాలుగు శాతం మార్పు వల్ల అప్పటికప్పుడు వచ్చే ప్రాణహాని ఏమీ లేకపోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఇది తప్పకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. పైగా వీటికి ఉద్వేగం కూడా తోడవ్వడం వల్ల హార్మోనులలో మార్పు వస్తుందనీ, అది ఏకంగా మన రోగనిరోధకశక్తి మీదే ప్రభావం చూపుతుందనీ హెచ్చరిస్తున్నారు.   ఒక అలవాటు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆరోగ్యంలో వచ్చే మార్పులని withdrawal symptoms అంటారు. మద్యపానం, సిగిరెట్, డ్రగ్స్లాంటి వ్యసనాలు ఉన్నప్పుడు ఈ withdrawal symptoms కనిపిస్తూ ఉంటాయి. ఆ వ్యసనం కొనసాగితే కానీ సదరు లక్షణాలు తగ్గవు. ఆ వ్యసనం వైపుగా మళ్లీ మళ్లీ పరుగులు తీసేందుకు అవి దోహదం చేస్తాయి. అలాగే ఇంటర్నెట్ ఆపిన తర్వాత పెరిగిన ఉద్వేగం, తిరిగి అందులో మునిగిపోయిన తర్వాత కానీ తీరలేదట.   ఇంతాచేసి తమ ప్రయోగంలో పాల్గొన్నవారంతా కూడా ఇంటర్నెట్ను అదుపుగా వాడేవారే అంటున్నారు పరిశోధకులు. ఇక ఇంటర్నెట్లో గేమ్స్, షాపింగ్, సోషల్ మీడియా వంటి సైట్లకి అలవాటు పడినవారిలో ఈ ‘వ్యసనం’ మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉందని ఊహిస్తున్నారు. నిజానికి ఇంటర్నెట్ వల్ల మన ఆరోగ్యంలోనూ ప్రవర్తనలోనూ మార్పులు వస్తాయన్న హెచ్చరికలు కొత్తేమీ కాదు. ఇలాంటి సమస్యలకు digital-behaviour problems అని ఓ పేరు కూడా పెట్టేశారు. ఆరోగ్యం సంగతి అలా ఉంచితే సుదీర్ఘకాలం ఇంటర్నెట్ వాడటం వల్ల డిప్రెషన్, ఒంటరితనం లాంటి సమస్యలు వస్తాయనీ... మెదడు పనితీరే మారిపోతుందని ఇప్పటికే పరిశోధనలు నిరూపించాయి. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని పెద్దలు ఊరికే అన్నారా! - నిర్జర.

మగమహారాజుల మెన్స్ డే!!

ఇంగ్లీష్ క్యాలెండర్లో బోలెడు డే లు. ఉపాధ్యాయులు, మహిళలు, వృద్ధులు, సైనికులు, పిల్లలు ఇలా ఉన్న అందరికీ డే లు పెట్టి వాళ్ళను సంవత్రానికి ఒకసారి ఘనంగా తలచుకోవడం పరిపాటి. అయితే ఆ లిస్ట్ లో పురుషులు ఉన్నారు. ఇంటర్నేషనల్ మెన్స్ డే పేరుతో నవంబర్ 19 న పురుషులకూ ఒక రోజును కేటాయించారు.  పితృస్వామ్య వ్యవస్థ అయిన మన భారతదేశంలో అన్ని విషయాలలోనూ మొదటి నుండి పురుషులదే పైచేయి. అలాంటి దేశంలో ఇప్పుడు పురుషుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అనుకున్నా ఒకప్పటికి, ఇప్పటికి మారిన పరిస్థితులను బట్టి మగవాళ్ళ గురించి చెప్పుకోవాల్సింది ఉంది. ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే ప్రతి ఆడదాని విజయం వెనుక కూడా మగవాడు ఉంటాడు. పదస్తుతం అన్ని రంగాలలో మహిళలు మగవాళ్లకు తక్కువేమీ తీసిపోము అన్నంత పోటీ ఇస్తున్నారన్నా, గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నారన్నా అందులో ఆ ఇంట్లో వాళ్ళను ప్రోత్సహించిన తండ్రులు, భర్తలు, కొడుకులు ఇట్లా మగవాళ్ళ పాత్ర ఉంటుందని చెప్పచ్చు. ఇంకా చెప్పాలి అంటే స్త్రీ తన సమానత్వం కోసం పోరాడుతూ ఉంటే చాలా మంది మగవాళ్లు ఇంట్లో వంట నుండి కుటుంబాన్ని చక్కదిద్దడం వరకు అన్ని పనులు పంచుకుంటూ వాళ్లే సగాన్ని ఆడవాళ్లకు వదిలేస్తున్న మహానుభావులు బోలెడు ఉన్నారని మాత్రం మర్చిపోలేం. మరేం చేద్దాం అనుకుంటున్నారా?? కొంచం సందడి సందడి అంటే ఎదో పండుగ కాదు. అలాంటి వాతావరణం అన్నమాట. ఇంట్లో ఉన్న మగవాళ్లకు అందునా మీకోసం ఎంతో తాపత్రయ పడుతూ మీకు సపోర్ట్ ఇస్తున్నవాళ్లకు నచ్చిన పంటకం చేసిపెట్టి, దగ్గరుండి వడ్డించి వాళ్ళ కళ్ళలో సంతోషాన్ని చూడాలి, ఎప్పుడూ కుటుంబంలో గొడవలు, ఆర్థిక సమస్యలు అంటూ వాధించుకుని, గోడవపడే విషయాలను వదిలిపెట్టి వీలైనవరకు ప్రశాంతగా ఉండటానికి వాళ్ళను ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు. సరదాగా బయటకు వెళ్లడం, భర్తకోసం అయితే వాళ్లకు నచ్చిన రంగు దుస్తులు వేసుకోవడం, వాళ్లకు నచ్చిన చోటుకి వెళ్లడం కలసి జీవిస్తున్నందుకు, కలసి అన్ని పంచుకుంటున్నందుకు ప్రేమా, ఆప్యాయతలు ఎప్పటికి నిలబెట్టుకుంటాం అనెంతగా వారికి వ్యక్తం చేయడం. మరికొంచం కృతజ్ఞత కృతజ్ఞత పదం నాలుగే అక్షరాలు అయినా దానిలో ఉన్న అర్థం మాత్రం ఎంతో గొప్పది. కృతజ్ఞత అనేది మన జీవితంలో మనకోసం ఏదైనా చేసేవారి పట్ల కచ్చితంగా ఏర్పరచుకోవలసిన గుణం. అలాంటిది కుటుంబం కోసం ఎంతో చేస్తున్న మగవాళ్ళ విషయంలో కృతజ్ఞత చూపించడానికి తగిన సమయం ఇలాంటి మెన్స్ డే అని చెప్పచ్చు. అంతేనా నిజానికి ఒక మాట చెప్పాలంటే ఆడవాళ్లు ఉద్యోగం చేయకపోయినా, సంపాదించకపోయినా, ఇంటిని చూసుకుంటూ, వంట చేసి పెడితే చాలు ఉద్యోగాల గొడవలు గురించి అడిగే వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ మగవాళ్లకు మాత్రం ఇవన్నీ కచ్చితమైన బాధ్యతలు. వాళ్ళు బయట ఎన్నో సంఘర్షణలు పడుతూ కుటుంబాలకు లోటు రానివ్వకుండా చూసుకోడానికి ఎంతో కష్టపడతారు. అలాంటి వాళ్లకు కృతజ్ఞత చెప్పుకోవాలి. అలాగే ఆడవాళ్లను ప్రోత్సహించేవారిని ఎంతో గొప్పగా ప్రస్తావించాలి.  చిన్నవో పెద్దవో శక్తిని బట్టి బహుమానాలు. జీవితాన్ని సంతోషంగా ఉన్నందుకు కొన్ని సంతోష సమయాలు, నిజానికి ఇవ్వడమనే అలవాటు ఉన్న మగవాళ్ళు వస్తువులు, బహుమతులు కాదు భార్య, కూతురు, కోడలు మొదలైన వాళ్ళ నుండి ప్రేమ, ఆప్యాయత, అభిమానాన్ని కోరుకుంటారు. కాబట్టి అలాంటివి అందించడం. వాళ్ళ పట్ల ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే క్షమాపణ చెప్పి అపార్థాలు చెరిపేసుకోవడం.  ఇంకొక్క మాటలో చెప్పాలంటే సపోర్ట్ ఇస్తూ, కుటుంబాల ఎదుగుదలకు నిరంతరం పాటుపడే మగవాళ్ళ ముందు ఆడవాళ్లు తాము తక్కువే అని ఒప్పుకున్నా నష్టమేమీ లేదు అంటే ఆడవాళ్లను తక్కువైపోమని చెప్పడం ఇక్కడి ఉద్దేశ్యం కాదు. మగవాళ్ళకు ఆ గౌరవం ఇవ్వచ్చు అని. కాబట్టి బాధ్యతాయుతమైన మగవాళ్ళూ అందుకోండి అందరి సలాములు.  ◆ వెంకటేష్ పువ్వాడ

పెళ్లికి పోదాం చలో చలో... 

పెళ్లి అనేది భారతీయుల సాంప్రదాయంలో పండుగ కంటే ఎక్కువ. వధూవరుల చూపులు మనసులు కలిసి, పెద్దల మాటలు ఒక్కటవ్వగానే మొదలయ్యే హడావిడి, బంగారం, చీరలు, బట్టలు షాపింగ్, పెళ్ళిపత్రికల ఎంపిక, కళ్యాణ మండపాల బుకింగ్, వంటల మెనూ ఇలా బోలెడు విషయాల నుండి ఎవరిని పిలవాలి, ఎంతమందికి గదులు బుక్ చేయాలి వంటివి వాటితో కలిపి పెద్ద తతంగమే ఉంది మనకు.అయితే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబాలకి మాత్రమే కాకుండా కాసింత దగ్గరి బంధువులకు కూడా తప్పదు ఈ హడావిడి. మిరుమిట్లు గొలిపే కల్యాణ మండపాల్లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుల శోభకు ఏమాత్రం తగ్గకుండా జిగేలు మని మెరావడానికి పోటీ పడే మగువలు, మగరాయుళ్లకు తక్కువేమీ లేదు. కానీ వాటికోసం షాపింగ్ అవి ఇవీ కాస్త విసుగు తెప్పిస్తాయి, విసుగుతో పాటు జేబులు  కూడా కొల్లగొడతాయి. అలాంటిదేమి లేకుండా హాయిగా పెళ్లికి వెళ్లి రావడానికి కొన్ని చిట్కాలు. షాపింగ్ గోల తప్పించుకోండి ఇలా… సాదారణంగా చాలామంది చేసేపని పండుగ ముందో లేదా పెళ్లిళ్లు, శుభకార్యాల ముందో షాపింగ్ చేయడం. దీనివల్ల ఏదో హడావిడి చుట్టుముడుతుంది. కాబట్టి సింపుల్ గా డబ్బులు దగ్గరున్నపుడు, ఎక్కడైనా దూరప్రాంతాలకు టూర్ లకు వెళ్ళినపుడు అక్కడ ప్రముఖ  షాప్ లలోనో, లేదా ప్రత్యేకంగా పరిగణించబడే దుస్తులో, లేదా జ్యువెలరీనో కొనుక్కోవచ్చు. దానివల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఫలానా చోట కొన్నాం అని చెప్పుకుంటే వచ్చే కిక్కు ఒకటైతే, అందరిలోనూ కాసింత ప్రత్యేకత మరియు మీరు చేసిన ప్రయాణం తాలూకూ మంచి గుర్తులుగా మీ షాపింగ్ ఎప్పటికీ మర్చిపోలేనంతగా తీపి జ్ఞాపకాలను మిగులుస్తుంది. అంతే కాదు పెళ్లిళ్ల ముందు తొందర తొందర అని తరిమే పెద్దవాళ్ళ మాటల్లో బట్టల ఎంపికలో బొక్కబోర్లా పడకుండా వేరే పనులు చూసుకునే అవకాశం లభిస్తుంది. జ్యువెలరీ జుయ్ జుయ్!! ఇప్పట్లో జ్యువెలరీ అంటే అందరూ బంగారమే పెట్టేస్తున్నారా ఏమన్నా?? గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఎక్కడ చూసినా లక్షణంగా దొరుకుతుంది. అది కూడా తక్కువ ధరలోనే. ఎక్కడికైనా వెళ్ళినపుడు రంగురంగుల రాళ్లతో పొదిగిన జ్యువెలరీ తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాగే అల్ టైమ్ ఫెవరేట్ గా అందరిలో నిలబెట్టేవి ముత్యాలు. ఇవి కూడా ధరలను బట్టి దొరుకుతాయి. అపుడపుడు ముత్యాల చెవిదిద్దులు, మెడ హారం, గాజులు వంటివి తీసుకుని భద్రపరచుకుంటే పెళ్లిళ్ల కోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టనవసరం లేదు. ప్యాకింగ్ పారాహుషార్!! పెళ్లికి వెళ్తున్నాం అంటే అందరి బట్టలు సర్దడం పెద్ద చిరాకు. అలా కాకుండా సింపుల్ గా జరిగిపోవాలి అంటే, పెళ్లికి వెళ్తున్నన్ని  రోజులు ఏ రోజు ఏ దుస్తులు వేసుకోవాలి, ఏ వస్తువులు కావాలి వంటివి ఎవరికి వారు నిర్ణయించుకుని, ఎవరి బ్యాగ్ వాళ్ళు సర్దుకోవడం ఉత్తమం. దీనివల్ల పెళ్లింట్లో నేను అది చెప్పాను, నువ్ అది పెట్టలేదు, ఇది పెట్టలేదు లాంటి గోల తప్పుతుంది.  కిట్ తో షార్ట్ కట్!! అందరూ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్రష్ లు, పేస్ట్ లు, సోప్ లు, షాంపూ లు, దువ్వెనలు ఇలా అందరివి ఒక కిట్ సెపరేట్ గా ఉంచుకుంటే వాటిని మర్చిపోవడం మధ్యలో కొనడం వంటి అదనపు పనులు తగ్గుతాయి. నిజానికి పెళ్లి అనే కాదు చాలా ప్రయాణాల్లో చాలామంది మర్చిపోయేవి ఇవే. ఇట్లా అన్నీ ఒక ప్రణాళికతో సాగిపోతే పెళ్లికి పోవడం పెద్ద హంగామాలా కాకుండా సింపుల్గా వెళ్లి వచ్చేయచ్చు. పెళ్లిని ఎంతో చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.  ◆ వెంకటేష్ పువ్వాడ      

ఎడమ చేతి వాటం ఎందుకు ఉంటుంది?

మహాత్మాగాంధి గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు. కానీ ఆయనది ఎడమ చేతి వాటం అన్న విషయం తెలుసా! సచిన్‌ టెండుల్కర్‌ని క్రికెట్‌ ప్రపంచం దేవుడిగా ఆరాధిస్తుంది. ఆయన కుడిచేతితో బ్యాటింగ్‌ చేసినా... స్వతహాగా ఎడమచేతి వాటం ఉన్న మనిషన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎడమచేతి వాటం ఉన్న ప్రసిద్ధుల గురించి చెప్పుకోవడం మొదలుపెడితే... ఆ జాబితా చాలా పెద్దదిగానే ఉంటుంది. కానీ అలా కొందరికి మాత్రమే ఎడమచేతి వాటం ఉండటం వెనక కారణం ఏమిటి? మన నాగరికత అంతా కుడిచేతి వాటానికి అనుకూలంగా కనిపిస్తుంది. కారు దగ్గర నుంచీ కత్తెర దాకా ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుంది. ఎడమచేతి వాటం ఉన్నవారిని పరిశుభ్రత లేనివారుగానూ, వింతమనుషులుగానూ భావించడమూ కనిపిస్తుంది. ఇప్పుడంటే ఫర్వాలేదు కానీ.... ఒకప్పుడు ఎడమచేతివారిని మంత్రగాళ్లుగా, సైతానుకి ప్రతిరూపాలుగా భావించేవారట. అలా ఎడమచేతి వాటం ఉన్నవారిని తగలబెట్టిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయని అంటారు. ఇంగ్లీషులో sinister అనే పదం ఉంది. దుష్టబుద్ధి కల మనిషి అని ఈ పదానికి అర్థం. అసలు ఈ పదమే sinistra అనే లాటిన్ పదం నుంచి వచ్చిందట. అంటే ఎడమచేయి అని అర్థం. దీనిబట్టి జనం ఎడమచేతి వాటం ఉన్నవారిని ఎలా అపార్థం చేసుకునేవారో గ్రహించవచ్చు. హిందూ సంప్రదాయంలో కూడా తంత్రాలతో కూడిన ఆచారాలను ‘వామాచారం’ అని పిలవడం గమనించవచ్చు. ఎడమచేతి వాటానికి కారణం జన్యువులు అన్న అనుమానం ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే! దీనికి కారణం అయిన జన్యువులని ఆ మధ్య కనిపెట్టామని కూడా శాస్త్రవేత్తలు ప్రకటించారు. PCSK6 అనే జన్యువులో మార్పు కారణంగానే కొందరు ఎడమచేతి వాటంతో పుడతారని తేల్చారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడే... అతనిది కుడిచేతివాటమా, ఎడమచేతివాటమా అన్నది పసిగట్టేయవచ్చని చెబుతున్నారు. ఎడమచేతి వాటం ఉన్నవారు ఈ ప్రపంచంలో పదిశాతమే ఉంటారు. ఒకవేళ జన్యుపరమైన కారణాలు ఉంటే ఈ నిష్పత్తి సరిసమానంగా ఉండవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. దీనికి మన నాగరికతే కారణం అంటున్నారు. మనిషి సంఘజీవి. సాటి మనుషులతో కలిసి పనిచేస్తేనే అతని పని జరుగుతుంది, సమాజమూ ముందుకు నడుస్తుంది. ఈ క్రమంలో అతను తయారుచేసుకునే పరికరాలు అన్నీ కూడా కుడి చేతివాటం వారికే అనుకూలంగా ఉండేలా చూసుకున్నాడు. అలా నిదానంగా ఎడమచేతివాటాన్ని నిరుత్సాహపరుస్తూ వచ్చింది సమాజం. దాంతో క్రమంగా ఎడమచేతి వాటం ఉండేవారి సంఖ్య తగ్గిపోయింది. ఈలోగా భాషకి లిపి కూడా మొదలైంది. ఆ లిపి కూడా కుడిచేతి వాటంవారికే అనుకూలంగా రావడంతో... కుడిచేతివారిదే పైచేయిగా మారిపోయింది. ఈ ప్రపంచం అంతా కుడిచేతివారికే అనుకూలంగా ఉంటుందన్న విషయంలో అనుమానమే లేదు. కానీ ఇది ఒకరకంగా ఎడమచేతివారికి అదృష్టం కూడా! మిగతావారికి భిన్నంగా ఉండటం వల్ల, కొన్ని పోటీలలో ఎడమచేతి వాటం గలవారికి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు బేస్‌బాల్‌ ఆటనే తీసుకోండి. బేస్‌బాల్ ఆటగాడికి కనుక ఎడమచేతి వాటం ఉంటే అతని ఆట తీరుని పసిగట్టడం, శత్రువులకి అసాధ్యంగా మారిపోతుంది. ఈ తరహా లాభాన్ని negative frequency-dependent selection అంటారు. పైగా ఎడమచేతి వాటం ఉన్నవారు ఇతరులకంటే తెలివిగా ఉంటారనీ, వీరిలో సృజన ఎక్కువగా ఉంటుందని కూడా అంటారు.  

పుస్తకం మన ప్రియ నేస్తం

పుస్తకాలు ఎక్కువగా చదివే వాళ్ళని నమ్మకూడదు అని అన్నాడు హెన్రీ డేవిడ్ అనే ఒక రచయిత. కారణం తన ఇంటికి వచ్చిన స్నేహితుడొకరు తన దగ్గరున్న పుస్తకాన్ని చెప్పకుండా పట్టుకుపోయి, అది బాగా నచ్చటంతో తిరిగి ఇవ్వలేదట. ఆశ్చర్యపోవక్కర్లెద్దు ఇలా కూడా ఉంటారండి పుస్తక ప్రియులు. ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది అంటారు. నిజంగానే ఎంత తిరిగినా, ఎంత తిన్నా, ఎంత సేపు పడుకున్నా రాని ఆనందం ఒక మంచి పుస్తకం చదివితే వస్తుంది. ఎప్పుడైనా కాస్త చికాకుగా ఉన్నా, లేదా నిస్పృహలో పడినా పుస్తక పఠనం మనని అందులోంచి బయటకి లాగగలదు. ఈ రోజు ప్రపంచ పుస్తక దినోత్సవం. ఎవరికి వారు ఒక మంచి పుస్తకాన్ని కొని మనకి ఇష్టమైన వాళ్ళకి కానుకగా ఇద్దాం. పుస్తకం మనిషికి అత్యంత ప్రియ నేస్తం కాబట్టి ఇందుకోసం కూడా ఒక ప్రత్యేకమైన రోజుని కేటాయించాలని నిర్ణయించుకున్న యునెస్కో 1995వ సంవత్సరంలో ఏప్రిల్ 23వ తారీఖుని ఖరారు చేసింది. అప్పటి నుంచి మనం ఈ ఇంటర్నేషనల్ బుక్ డేని జరుపుకుంటున్నాం. ఇదే రోజున సెయింట్ జార్జ్ జన్మదినాన్ని స్పెయిన్ లో జరుపుకుంటారు. ఇప్పటికీ స్పెయిన్ లో ప్రతి పుస్తక కొనుగోలు పై ఒక గులాబీని గిఫ్ట్ గా ఇస్తారు తెలుసా. ఈ బుక్ రీడింగ్ అలవాటు మనలో సృజనాత్మకతని పెంచుతుంది. మన ఆలోచనా విధానాన్ని కూడా మార్చుతుందనటంలో సందేహమే లేదు. అందుకే పుస్తకం చదివే అలవాటు లేకపోతే వెంటనే అలవాటు చేసుకుంటే చాలా ఉపయోగాలే ఉన్నాయండోయ్. ఒక పుస్తకం మన చిన్నప్పుడు చదివితే మనకు వచ్చే అనుభూతికి, అదే పుస్తకాన్ని కాస్త వయసులోకి వచ్చాకా చదివితే వచ్చే అనుభూతికి మద్య చాలా తేడా ఉంటుంది. కావాలంటే టెస్ట్ చేసి చూసుకోండి. రిటైరయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు చేసే పని ఈ బుక్ రీడింగ్ అనుకుంటే పొరపాటే. అసలు వాళ్ళకన్నా జీవితాన్ని మొదలుపెట్టటానికి ప్రపంచంలోకి అడుగుపెట్టేవారికే  ఇది చాలా అవసరం. ఎందుకంటే పుస్తకాలు చదవటం వల్ల కొత్త విషయాల సేకరణ జరుగుతుంది. ఒక పుస్తకం చదివాకా అందులో ఉన్న విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండటం వల్ల మన జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. మనం ఏదన్నా రాయాలన్నా బుక్ రీడింగ్ వల్ల మనం అలవర్చుకున్న పరిజ్ఞానం రాయటంలో  ప్రదర్శించచ్చు. ఈ పుస్తక పఠనం వల్ల అన్ని రకాల పుస్తకాలు చదవటం అలవాటయ్యి, ఏదైనా సమస్య ఎదురైనపుడు ఎలా దాన్ని హేండిల్ చెయ్యాలో కూడా మనకి చాలా సులువుగా తెలిసిపోతుంది. ముఖ్యంగా మన ఏకాగ్రత పెరుగుతుంది. కుదురుగా ఒక దగ్గర కూర్చునే అలవాటు లేని వాళ్ళు సైతం బుక్ రీడింగ్ హేబిట్ వల్ల దాన్ని అలవాటు చేసుకుంటారు. నలుగురిలో కలిసే అలవాటు లేనివాళ్ళు చాలా మటుకు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు పుస్తకం చదివే అలవాటు చేసుకుంటే ఇక ఎప్పటికి ఒంటరితనం ఫీల్ అవ్వరు. మొత్తానికి ఒక మంచి పుస్తకం అన్ని వయసుల వారిని అలరిస్తుంది. అందుకే మన లైఫ్ లో మనం ఎంత బిజీ అయిపోయినా మనకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకుని పుస్తకం చదవటంలో ఉండే ఆనందాన్ని అనుభవిద్దాం. ...కళ్యాణి

దయామయులకు వందనం !! 

ప్రపంచంలో ఎన్నో రకాల మనస్తత్వాలు ఉన్నవారు ఉంటారు. ఒకరికి మరొకరు విభిన్నమైన వారు. కొందరిలో క్రూరత్వం, మరికొందసరిలో సాధుస్వభావం ఉంటుంది. ఇవన్నీ కూడా వారు పెరిగిన పరిస్థితుల ఆధారంగానే ఉన్నా, తమ అనుభవాల కారణంగా అటు వారు ఇటు, ఇటు వారు అటు మారిపోయిన, మారిపోతున్న సందర్భాలు కూడా బోలెడు.  అయితే ప్రపంచానికి దయా హృదయాన్ని పంచినవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది ఎమిటో తెలుసుకుని ఆ మాటలను పిల్లలకు చెబితే నేటి పిల్లలు రేపటి దయామయులు అవుతారు.  సాధారణంగా అందరూ చేసే తప్పు ఒకరిని తక్కువగా చూడకూడదు, పేదవారిని ఎగతాళి చేయకూడదు, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి ఇలాంటి మాటలు పిల్లలకు చెప్పడం. ఇవి తప్పు మాటలా అని అందరికి అనిపిస్తాయి. కానీ వంద మాటలు చెప్పడం కన్నా ఒక చిన్న పని పిల్లల చేత చేయించడం ఎంతో ఉత్తమం. నీతి కథలను, వేమన పద్యాలను, సుభాషితాలను పిల్లలచేత వల్లే వేయించి వాళ్లకు నీతిని, దాయను, జాలిని నూరిపోస్తున్నాం అనుకుంటారు కానీ కేవలం మాటల వల్ల మాత్రమే వాటి తాలూకూ విలువలు పిల్లల్లో పెంపొందవు.  పేదవాళ్లకు, కష్టంలో ఉన్న వాళ్లకు సహాయం చేయించాలి. చిన్నదా పెద్దదా అనే సంశయం అక్కర్లేదు. నేటి విత్తనమే రేపటి వృక్షం. పిల్లలతోనే నేరుగా సహాయం చేయించడం వల్ల దాని లోతులు పిల్లలకు తెలుస్తాయి.  మొక్కల పెంపకం ఓ మొక్కను నాటించి దాన్ని సంరక్షించి, నీళ్లు పోసి, కలుపు తీసి దాన్ని పెద్దగయ్యేలా చేయడంలో ఉన్న శ్రమ పిల్లల్లో బాధ్యతను తెలుపుతుంది. పెద్దవారి పట్ల పిల్లలు బాధ్యతాయుతంగా ఉండేలా అది తోడ్పడుతుంది. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల సందర్శన వృద్ధాశ్రమాలలో దిక్కులేని వృద్ధులు బిక్కు బిక్కుమని గడుపుతుంటారు. వారి దగ్గరకు తీసుకెళ్తే వారి దయనీయ పరిస్థితులు, అనాధాశ్రమాలలో పిల్లల జీవితాలు చూడటం ద్వారా జీవితంలో తాము ఎంత మంచి స్థాయిలో ఉన్నామో అర్థమవుతుంది. వారికి సహాయం చేయాలనే మనస్తత్వం పెంపొందుతుంది.  జంతువుల పట్ల భూతదయ.. ఇంట్లో ఏదో ఫాషన్ కోసమూ, స్టేటస్ కోసమూ పెంపుడు జంతువులను పెంచడం కాదు. వీధి కుక్కలు, పిల్లులుకు ఆహారం పెట్టడం. ఇంటి గోడ మీద వాలే పక్షులకు గింజలు, నీళ్లు పెట్టడం. మూగజీవాలను కొట్టకుండా వాటికీ మనసు ఉంటుందని వాటి చర్యలకు అర్థం వివరిస్తూ జంతువులను అర్థం చేసుకునేలా చేయడం. సమాజంలో తిండి, నీరు, కట్టుకోవడానికి బట్టలు లేక ఉండటానికి సరైన నివాస ప్రాంతాలు లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు జీవితంతో ఎలా పోరాటం చేస్తున్నారో, వీధి బాలలు తమ బాల్యాన్ని చిత్తు కాగితాల మధ్య ఎలా కోల్పోతున్నారో అర్థమయ్యేలా చెబుతూ మీ చుట్టూనే ఉన్నవారిని ఉదాహరణగా చూపించడం వల్ల పిల్లల్లో ప్రత్యక్ష ప్రతిస్పందనలు కలుగుతాయి. ఈ దయ అనేది పిల్లలోనే కాకుండా పెద్దలలో కూడా పెంపొందాల్సిన అవసరం ఎంతో ఉంది. స్వార్థంలో కూరుకుపోయిన ఎందరో మార్పు చెంది ప్రపంచాన్ని కూడా మార్చాల్సిన సమయం ఆసన్నమయ్యింది.  నవంబర్ 13 ప్రపంచ దయా దినోత్సవం సందర్బంగా అందరిలో ఈ విషయం పట్ల అవగాహన పెంచేందుకు ఇదొక చిన్న ప్రయత్నం. మీరు మీ చుట్టుపక్కల వారిలో మార్పు కోసం ప్రయత్నించండి. మీ చుట్టుపక్కల ఉన్న కరుణా మూర్తులకు వందనం సమర్పించండి. ◆ వెంకటేష్ పువ్వాడ    

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు !!

సినిమా పాట హమ్ చేయడం లేదండోయ్!! మరైతే ఏంటీ?? అంటారా అది చెప్పడానికేగా ఇప్పుడు ఇక్కడ ఇలా మీ ముందు.మనం మన చుట్టూ ఉన్న చాలామంది తమ ప్రణాళికలలో రేపు ఏంటి?? రేపు ఏమి చేద్దాం, ఆ తరువాత ప్లాన్స్ ఏమిటి?? ఇలాంటి ఆలోచనలతో మునిగిపోయి ఉంటారు. లేదూ కొంతమంది అదే రోజు గురించి పని చేస్తున్నా, ఇతర ఆలోచనలతో ఉన్నా పూర్తిస్థాయి సాటిసిఫాక్షన్ తో ఉండరు. ఎందుకిట్లా అని ఆలోచన చేసారా ఎప్పుడైనా?? దానికి సమాధానం సులువుగా చెప్పాలంటే మనిషికి ప్రస్తుతం తనదగ్గర ఉన్నదానికంటే తనదగ్గరలేని దాని గురించి, ఎక్కడో ఉన్నదని గురించి ఆసక్తి ఎక్కువ, దానిమీద అంచనాలు ఎక్కువ. ఇంకా గట్టిగా చెప్పాలంటే రేపటి గురించి ఆశ ఎక్కువ. నిజానికి మనిషిని బతికించేది ఆశ అయినపుడు ఆశపడటంలో తప్పు లేదు. కానీ ప్రస్థుతాన్ని నిర్లక్ష్యం చేస్తూ రేపటి విషయాల గురించి ఆశపడటం అంటే ఇంకా విత్తని విత్తనాల క్రమం గురించి ఆలోచిస్తూ భూమిని సరిగా దున్నకపోవడమే. భూమి సరిగా దున్నలేదు అనుకోండి, విత్తనాలు సరిగా వేయలేరు, ఆ తరువాత వర్షం కురిసినా విత్తనాలు మొలకెత్తవు, పంట పండదు. ఇక్కడ జరిగింది ఏమిటి?? జరగని పనిని ఆలోచిస్తూ జరిగే పనిని నిర్లక్ష్యం చేయడం వల్ల తగిన పలితం రాకపోగా, సమయం మొత్తం వృథా చేసినట్టు. ఒక అవకాశాన్ని చేజార్చుకున్నట్టు. సరిగ్గా చాలామంది జీవితంలో ఇదే చేస్తున్నారు. ప్రస్థుతంలో రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజును నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని ఫలితం ఏమిటి?? ఎంతో ఆలోచన చేసిన రేపు కూడా ఆశించిన విధంగా లేకపోవడం. ఎన్నాళ్ళు గడిచినా ఇలా సరైన ప్రణాళిక సాగకుండా నిరాశలో మిగిలిపోవడం. ఇప్పుడు అర్థం అయ్యింది కదా మనిషి నిరాశకు కారణం ఏమిటి అనేది కూడా. అయితే ఇప్పుడేం చేయాలి?? ప్రస్థుతాన్ని అంటే ఈరోజును ఎంత బాగా ఉపయోగించుకోగలిగితే రేపు అంతకంటే బాగా మీ ముందు ముస్తాబవుతుంది. రోజులో ఉన్న 24 గంటల్లో సూర్యోదయం నుండి, నిద్రపోయేవరకు మీకున్న సమయం ఎంత?? సాధారణంగా అందరూ నిద్రపోవడానికి ఉపయోగించే 6 లేదా 8 గంటలు మినహాయిస్తే రోజులో ఉండే18 లేదా 16 గంటలను ఏమి చేస్తున్నారు?? ప్రతి రోజు ఏ పని ఎంతసేపు చేస్తున్నారు?? మీ 18 లేదా 16 గంటల పలితం ఏమిటి?? దానికి మీరు సరైన న్యాయం చేసారా?? ఇక్కడ ఒక విషయం గమనిస్తే ర్యాంకులు తెచ్చుకుంటున్న స్టూడెంట్స్ కు, ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ కు, అట్లాగే మంచి ఎంప్లాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉద్యోగస్తుడికి, సాధారణ ఉద్యోగస్తులకు. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ కాలమానం ఒకటే అందరికి 24 గంటలు ఉన్నాయి. దీనికి కులము, మతము, లింగ వివక్ష అంటూ ఏమీ తేడా లేదు. అలాంటప్పుడు అందరూ ఒకేలా ఎందుకు లేరు??  కొందరు ఏవో కారణాలు చెబుతారు. బహుశా వారు చెప్పినట్టే అందరికి అన్ని వనరులు, వసతులు, సౌకర్యాలు ముఖ్యంగా డబ్బును బట్టి చేకూరే ప్రయోజనాలు అందుబాటులో లేకపోవచ్చు. కానీ అన్ని ఉండి కూడా పనికిరానట్టు ఉన్నవాళ్ల సంగతి ఏమిటి??  ఇట్లా ఆలోచిస్తే అందరికి వస్తాం ఏమిటి అనేది అర్థం అవుతుంది. లోపం ఎక్కడుందో క్షుణ్ణంగా తెలిసిపోతుంది. ఫలితంగా  తమని తాము సరిదిద్దుకునే మార్గం కనిపిస్తుంది, లేకపోతే వెతుక్కునే ఆలోచన కలుగుతుంది. ఇవన్నీ జరిగితే ప్రస్తుతం అంటే ఈరోజు ఎంత గొప్పదో… దాని విలువ ఏమిటో… దాని ప్రాధాన్యత ఎలాంటిదో చాలా బాగా తెలుస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని చెప్పింది. ఈరోజును ఎంత బాగా మలచుకుంటారో అంత గొప్ప ఫలితం మీ సొంతం.  ◆వెంకటేష్ పువ్వాడ

అక్షరం మీద అవని!!

ప్రపంచ దేశాల మధ్య అన్ని రంగాలలో పోటా పోటీ కొనసాగుతూనే వుంటుంది. విద్య, వైద్యం, వ్యాపారం, పారిశ్రామికం ఇలా ఎన్నో….  ఒక్కొక్క రంగంలో నిపుణత సాధించడానికి ఎన్నో అవగాహనాలు, విశ్లేషణలు, పరిశీలనలు, ప్రయోగాలు చాలానే ఉంటాయి. అయితే రంగం ఏదైనా అందులో అన్ని తెలుసుకోవాలన్న దేశ కాలమాన పరిస్థితులను అంచనా వేయాలన్న ఆలోచనతో పాటు చదువు కూడా ఉండాలి. ఏదో దేశాలు ఉద్ధరించడానికి కాకపోయినా కనీసం ప్రతిమనిషి తన జీవితానికి ఆహారం, నీరు, అవసరాలు ఎలా ఉన్నాయో అలా చదువుకోవడం కూడా ముఖ్యమేనని, అది ప్రతి మనిషి హక్కు అని ప్రపంచ విద్యా దినోత్సవం నాడు గుర్తుచేసుకోవలసిన విషయం. నవంబర్ 11 ప్రపంచ విద్యా దినోత్సవంగా యావత్ ప్రపంచ దేశాలు విద్య ఆవశ్యకతను గుర్తిస్తూ తమతమ దేశాలలో అక్షరాస్యతను పెంచుకునేందుకు కలిగించే అవగాహనా దినోత్సవంగా చెప్పుకోవచ్చు. ఇక మన దేశం గురించి చెప్పుకుంటే విద్యను సామాజిక హక్కుగా, అది అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఒకానొక వనరు స్థానం నుండి దాన్ని మళ్ళీ కేవలం డబ్బుతో కొనుక్కునే వస్తువుగా ఎన్నటి నుండో పరిగణిస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం విద్య అందరి హక్కు అని, అందరికి అందుబాటులో ఉండాలని అది తమ లక్ష్యమని చెబుతున్నా ఆచరణలో మాత్రం విఫలం అవుతూ వస్తుంది. ప్రయివేటు విద్యాసంస్థలు అధికం కావడం, విద్య ఖరీదు రెక్కలు తొడగడమే దీనికి కారణం అని చెప్పవచ్చు. అయితే సాధారణ పౌరుల్లో సామాజిక విద్య పట్ల అవగాహన పెంపొందించడం సాటి పౌరులుగా అందరి బాధ్యత అనే విషయం మరచిపోకూడదు.  ఇప్పట్లో ప్రభుత్వ బడులలో కూడా నాణ్యమైన విద్య అందించడానికి ప్రాణాళికలు బాగానే జరుగుతున్నాయి. కొన్నిచోట్ల స్వార్థం వల్ల వాటిని అమలుపరచడంలో సమస్యలు తలెత్తుతున్నాయేమో కానీ మండల, జిల్లా స్థాయి పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. బడి పిల్లలకు పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం, స్కాలర్షిప్ లు, రిజర్వేషన్ లు, ఇవి మాత్రమే కాకుండా ప్రయివేట్ పాఠశాలలు మరియు కాలేజి పిల్లలకు కూడా రీయింబర్స్మెంట్ రూపంలో పూర్థిస్తాయి నాణ్యమైన విద్య అందే మార్గాలు ఎన్నో ఉన్నాయి.  అయితే దేనికైనా అవగాహన ముఖ్యం అన్నట్టు విద్య దాని ప్రయోజనాలను గురించి తెలుసుకోవాలి మరియు తెలియజెప్పాలి వేగవంతమైన ఈ ప్రపంచంలో విద్య ద్వారా మనిషి స్థాయి ఎలా ఇనుమడిస్తుందో, ఎలా అసాధ్యాలను సుసాధ్యం చేస్తుందో కొండశ్రీ జీవితాలను చూస్తూ తెలుసుకోవాలి పేదరికం విద్యకు ఎప్పుడు అడ్డంకి కాదని, దిగువ కులాలకు ఇచ్చిన ఎన్నో ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ చదువులో ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అని ఎందరో జీవితాలు ఉదాహరణగా ఉన్నాయి. వారి గురించి వివరించాలి.  ప్రతి పిల్లవాడికి లింగ బేధం లేకుండా కనీస విద్యార్హత వరకు చదువు చెప్పించడం ద్వారా వారి జీవితం ఎంతో ఆశావాహంగా సాగుతుందనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. విద్య ద్వారా ప్రపంచాన్ని, ప్రపంచ పరిస్థితులను, కాలాన్ని అంచనా వేస్తూ దానికి తగ్గట్టు తమ సామర్త్యాన్ని వినియోగించడం ద్వారా గొప్ప జీవితం సొంతమవుతుంది. ఇలా అన్ని విధాలుగా అన్ని కోణాలలో ఆలోచించి విద్య పట్ల అవగాహన పెంపొందిస్తే మన భారతదేశంలో అక్షరాస్యత రేటు పెరిగి అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచ అభివృద్ధి  మొత్తం విజ్ఞానం పైననే ఆధారపడి ఉంది ఇప్పుడు. ◆ వెంకటేష్ పువ్వాడ

 మళ్లీ పెళ్లికి భయపడుతున్నారా?? 

ప్రతి మనిషి జీవితంలో చదువు, ఉద్యోగం ఎంతటి ప్రధాన పాత్రలు పోషిస్తాయో పెళ్లి కూడా అంతే ప్రధాన  పాత్ర పోషిస్తుంది. చదువుకు, ఉద్యోగానికి ముందు, తరువాత అని మార్పు గూర్చి చెప్పుకున్నట్టే, పెళ్లికి ముందు తరువాత అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి పెళ్లి కొందరి జీవితాల్లో చేదు జ్ఞాపకం అవుతుంది. ప్రమాదాలు కావచ్చు,  సమస్యలు కావచ్చు, కోల్పోవడం కావచ్చు, బందం మధ్య సరైన అవగాహన లేక  వదులుకోవడం కావచ్చు. కారణాలు ఎన్ని అయినా జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా మారడం  కాసింత తెలియని వెలితే. ముఖ్యంగా బయటకు చెబితే సమాజం ఏదో ఎదో అంటుంది కానీ శరీరంలో హార్మోన్ల గోలను భరించి ఆ ఒత్తిడిని మోయడం కూడా కష్టమే. చాలామంది అటు సమాజం ఏమనుకుంటుందో  అనే భయంతో వెనకడుగు వేస్తూ తాత్కాలిక ఉపశమనం అన్నట్టు ఎవరితోనో ఒకరితో సంబంధం పెట్టుకుని వాటిని  అక్రమసంబందాలుగా ముద్ర వేసుకుని వాటిని కూడా గోప్యంగా ఒత్తిడిలో నెట్టుకొస్తూ అటు సమాజపరంగానూ, ఇటు  అంతరాత్మ పరిధిలోనూ నేరస్తులుగా తమని తాము పరిగణించుకుంటూ గడుపుతుంటారు. అయితే ఇలా మరొకరి  సాంగత్యం కోరుకునే వారు ఎవరైనా సరే తమకు తగిన వ్యక్తిని వెతుక్కుని పెళ్లి చేసుకోవడం ఎంతో ఉత్తమం. కానీ బయట నుండి ఎదురయ్యే మాటలే మిమ్మల్ని అలా పెళ్లి చేసుకోవడానికి వెనకడుగు వేసేలా చేస్తుంటే  మాత్రం ఒక్కసారి కింది ప్రశ్నలు వేసుకోండి. మీరు సమాజంలో భాగమా?? లేక సమాజపు భారం మీ మీద ఉందా?? చాలామంది కొన్ని పనులు చేస్తే సమాజం దృష్టిలో విలువ లేని వాళ్ళు, ఉన్నత వ్యక్తిత్వం లేని వాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఈ పెళ్లి మరియు వివాహ, శారీరక సంబంధ విషయాలలో ఒకానొక అసంబద్ధమైన ముద్రను వేస్తారు. అయితే ఎవరి జీవితం వారిది అయినపుడు, ఒకరి జీవితంలో నష్టం వాటిల్లినపుడు సమాజం ఏమి సహాయం చేయనపుడు, ఎవరూ ఇతరుల జీవితాలను మోయనపుడు ఇతరుల మాటలను అంతగా పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఏముంది?? విలువలు కానీ విషయాలు కానీ సమంజసం మరియు సమంజసం కానిదీ అనే విషయాలు కూడా వ్యక్తి ఉన్న పరిస్థితులను బట్టి మారుతూ ఉన్నపుడు ఇతరుల మాటలకు భయపడి జీవితాన్ని అట్లా నిర్జీవంగా మరియు ఒత్తిడి వలయంలో కుదించేసుకోవడం అవసరమేనా?? అసంబద్ధమైన సంబంధాల కంటే ఆరోగ్యకరమైన బంధం ఉత్తమమెగా?? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదు అనుకుంటుంది. గుట్టుగా జరిగే వ్యవహారాలు కూడా అలాంటివే. ఇంకా చెప్పాలి అంటే ఈ సమాజానికి ఎప్పుడూ వంద కాదు వెయ్యి కళ్ళు ఉంటాయి. వాటికి అవకాశం ఇచ్చి ఎవరి గౌరవాన్ని వారు తగ్గించుకోకూడదు కదా. దానిబధులు ధైర్యంగా బయటకు చెప్పుకోగల బంధం ఉంటే నిజంగా అది ఎంతో సంతోషించాల్సిన విషయం. తోడు ఎందుకోసం?? సాధారణంగా చాలామంది కుటుంబ సభ్యులతో చెప్పుకోలేని ఎన్నో విషయాలు కేవలం జీవిత భాగస్వామితో చెప్పుకునే సందర్బాలు కోకొల్లలు. ఆర్థిక, మానసిక, శారీరక ఇట్లా అన్నిరకాల విషయాలు భాగస్వామితో మాత్రమే చెప్పుకోగలరు. అట్లాంటప్పుడు అర్థం చేసుకునే వ్యక్గులను ఎంపిక చేసుకుని వారితో ఆనందంగా ఉండటం మంచిదే కదా!! అందుకే కదా తోడు  కావాలి మరి.  సమాజం గురించి భయమా?? ఈ సమాజానికి ఇతరుల జీవితాల్లో తొంగిచూసి విమర్శ చేయడం వచ్చినంతగా మననుషులను అర్థం చేసుకోవడం రాదు.  నిజానికి ప్రస్తుత కాలంలో మనుషుల జీవితాలు, వారి బాధలు ఇవే పెద్ద ఎంటర్టైన్ అయిపోతున్నాయి. అట్లాంటప్పుడు సమాజం  ను చూసి భయపడటం ఎందుకు?? మళ్ళీ పెళ్లి అనేది ఎంతమాత్రం తప్పు కాదు. కాబట్టి కొందరు చిన్న వయసులో జీవిత భాగస్వామిని కోల్పోయి పిల్లలు ఉన్నారనే కారణంతోనో లేక సమాజానికి భయపడో  మరింకేవో కారణాల వల్ల సహచర సాంగత్యాన్ని కోల్పోవలసిన అవసరం ఎంత మాత్రం లేదు.  కన్న తల్లిదండ్రులు, కడుపున  పుట్టిన పిల్లలు చుట్టాలు  అందరూ దూరం అయినా జీవితాంతం వెంట ఉండేది కేవలం జీవిత భాగస్వామి మాత్రమే.  కాబట్టి ఆ తోడు ఉంటే, ఆ బంధం పటిష్టంగా ఉంటే జీవితంలో ఎన్నో గెలవగలుగుతారు.  ◆ వెంకటేష్ పువ్వాడ  

రేడియేషన్‌ను రెడి చేస్తున్నారా??

మరో ప్రపంచం మరో ప్రపంచం అనే కవితా వాక్యాలు శ్రీశ్రీ గారు రాసిన కారణం వేరు కావచ్చు. దాని ఆంతర్యం వేరు కావచ్చు కానీ ప్రపంచం మొత్తం అభివృద్ధితో గత వందేళ్లకు ఇప్పటికి చెప్పలేనంత మార్పుకు లోనయ్యింది. నిజానికి అప్పటికి ఇప్పటికి తరచి చూస్తే నిజంగా ఇది మరో ప్రపంచంలాగే ఉంది. అయితే ఏంటంటా?? అని మీకు అనిపించవచ్చేమో. ఈ మార్పులో సాంకేతికత ఎంతటి ప్రాధాన్యత సంతరించుకున్నదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా గత దశాబ్దం ఉహించన్నత మార్పులకు లోనయ్యింది. ఈ మార్పులో ముఖ్యమైన పాత్ర స్మార్ట్ ఫోన్, లాప్టాప్ మొదలైన టెక్నాలజీ పరంపరదే మొదటి అడుగు అని ఒప్పేసుకోవచ్చు కూడా. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్, సిస్టం వంటివి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లోకి వచ్చేసాయి. అవి ఎలా అయితే అందెశ్రీ చేతుల్లోకి వచ్చేసాయో పర్యావరణం కూడా అంతే సులువుగా సర్వనాశనం అయిపోతోందన్నది ఒప్పుకోవలసిన వాస్తవం.  రజినీకాంత్ గారు రోబో 2.0 అంటూ రేడియేషన్ గురించి, దాని ఫలితంగా జరుగుతున్న నష్టాల గురించి ఇప్పటికే సినిమా పరంగా ప్రజలకు చెప్పేసారు. కానీ ఈరోజు అంటే నవంబర్ 8 ని ప్రపంచ రేడియోలజీ దినోత్సవంగా గుర్తించి రేడియాలజీ గురించి కాసింత అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం.  మొబైల్ ఫోన్ వాడినంత సులువుగా ఈ పర్యావరణాన్ని తిరిగి నిర్మించుకోలేము. పుట్టగొడుగుల్లా లేస్తున్న సెల్ ఫోన్ టవర్లు, ఇరవై నాలుగు గంటలు ఇష్టానుసారం వాడేస్తున్న మొబైల్ ఫోన్ వల్ల విడుదల అయ్యే రేడియేషన్ వల్ల ఎన్నో పక్షి జాతులు అంతరించి పోతున్నాయేది వాస్తవం. ఒక మనిషికి స్కానింగ్ తీయడం వల్ల ఆ x-ray కిరణాలు శరీరం మీద  ఎంతో ప్రభావం చూపిస్తాయి. అందుకే ఎక్కువ సార్లు స్కానింగ్ తీయించుకోకూడదు అని చెబుతుంటారు. ముఖ్యంగా గర్భిణీలకు స్కానింగ్ ఎక్కువ తీయకూడదు ఎందుకంటే కడుపులో శిశువు ఎంతో సున్నితం కాబట్టి ఆ కిరణాల ప్రభావం వల్ల  కూడా పుట్టుకలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. పక్షులు కూడా అలాంటి సున్నితమైన జీవాలే అనే విషయం పెద్దగా పట్టించుకొము. ఇన్ని కోట్ల మంది నిరంతరం సాంకేతికత పేరుతో ఉపయోగిస్తున్న మొబైల్ వల్ల విడుదల అయ్యే రేడియేషన్ ద్వారా పక్షులు ఎంత బాధ అనుభవిస్తాయో ఒక నిమిషం ఆలోచిస్తే అర్థమవుతుంది. అందుకే ఈ ప్రపంచ రేడియాలజీ దినోత్సవ సందర్భంగా కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకుంటే మనం కొన్ని ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాము. 1● ఇప్పుడు అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నది మొబైల్ ఏ. కాబట్టి అవసరాన్ని ఆలోచించుకుని మొబైల్ ఫోన్ వినియోగించడం ఉత్తమం. వీలైనంత వరకు నేరుగా కలుసుకుని మాట్లాడుకోవడం మంచిది. దీనివల్ల ఈ రేడియేషన్ గోల తప్పడమే కాదు మనుషుల మధ్య బంధాలు ఎంతో గట్టిగా తయారవుతాయి. 2● వీడియో గేమ్ లు, నెట్ కాల్స్, టైం పాస్ చాటింగ్ వంటివి తగ్గించుకుంటే మీ సమయం ఆదా అవ్వడమే కాదు ఖర్చు కూడా తక్కువే అవుతుంది. 3● రాత్రిపూట పడుకునే ముందు నెట్ ఆఫ్ చేయడం, లేదా వీలున్నవాళ్ళు మొబైల్ ఆఫ్ చేయడం మంచిది. దీనివల్ల మొబైల్ ఛార్జింగ్ అయిపోదు, నెట్ వేస్ట్ కాదు, ఇంట్లో ఎలక్ట్రిక్ ఆదా చేసినట్టు. అన్నిటికి మించి ఎలాంటి డిస్టర్బ్ లేకుంటే హాయిగా నిద్రపోవచ్చు. 4● జీవితాన్ని మీరు చేసే పనులను కాసింత సీరియస్ గా తీసుకుంటే అర్థమవుతుంది సోషల్ మీడియా ద్వారా ఓనగూరే ప్రయోజనాలు ఏమిటో. నిజానికి సోషల్  మీడియా లో పనికొచ్చే వాటికంటే వ్యర్థమైన విషయాలే ఎక్కువ. మరొకరి జీవితాల్లోకి తొంగిచూసి వాటిని బేరీజు వేయడం, చర్చ చేయడం వంటివే ఎక్కువ. వీటివల్ల మీకు కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా అనేది ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది అనవసర వృథా ఎక్కడ చేస్తున్నారు అని. అది తెలిస్తే తప్పకుండా మొబైల్ వాడకం, సిస్టం వాడకం వంటివి అదుపులో ఉంచుకుంటారు. కాబట్టి పైన చెప్పుకున్న విషయాల గురించి కాసింత ఆలోచన చేసి దేనికోసం ఎందుకోసం మనం ఈ టెక్నాలజీని ఉపయోగించాలి అనే విషయాన్ని తెలుసుకుంటే మనమే కాదు ఈ పర్యావరణం కూడా బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఈ పర్యావరణం బాగుంటేనే మనం ఇంకా బాగుంటాం. అందుకె రేడియేషన్ కు రెస్ట్ ఇద్దాం. ◆ వెంకటేష్ పువ్వాడ  

నవంబర్ వ్రతం గురించి తెలుసా?

అనుకుంటాం కానీ సమాజములో సమస్యల మీద స్పందించే వాళ్ళు బానే ఉన్నారు. అయితే దాన్ని వ్యక్తం చేసే విధానంలో మాత్రం భిన్న కోణాలు తారసపడుతుంటాయి. అలాంటిదే ఈ నవంబర్ నెలలో కూడా ఉందని చెప్పవచ్చు. ఇంతకు విషయం ఏమిటంటే నవంబర్ మొత్తం చాలా వరకు బార్బర్ షాపులకు రాబడి తక్కువ. అలా కాదు ఇంకోలా చెప్పాలంటే నో షేవ్ నవంబర్(no shave november) ప్రస్తుత కాలంలో ఒక ఉద్యమంలాగే తయారయ్యింది. ప్రతి సంవత్సరం దీన్ని ఫాలో అయ్యేవాళ్ళు పెరుగుతున్నారు. కొంతమంది దీన్ని సామాజిక స్పృహ అనుకుని ఫాలో అయితే మరికొంతమంది ఫ్యాషన్, ఆనందం, అన్నిటికి మించి కొత్తదనం, ఇంకా చెప్పాలంటే అదొక కిక్కు లాంటి ఫీల్ కోసం ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు.  ఇంతకు ఏమిటీ నో షేవ్ నవంబర్( no shave november) నో షేవ్ నవంబర్ అనేది నవెంబర్ నెల మొత్తం జుట్టు కత్తిరించకుండా పెరిగే జుట్టును అట్లాగే పెంచేయడం. ఇదే నో షేవ్ నవంబర్ అనే చిన్నపాటి ఉద్యమం లాంటి సామాజిక కార్యక్రమం.   దీని వెనుక కారణం ఏమిటి?? ప్రతి దానికీ కారణం ఉన్నట్టే ఈ నో షేవ్ నవంబర్  వెనుక పెద్ద కారణమే ఉంది. అదే మహమ్మారి కాన్సర్. కాన్సర్ తో బాధపడేవారు ఎదుర్కొనే సమస్యలలో జుట్టురాలిపోవడం ఎంతో మానసిక క్షోభకు గురి చేసే అంశం. కాన్సర్ సోకిన వారి నుండి దాని ట్రిట్మెంట్ మొత్తం పూర్తయ్యేలోపు జుట్టు రాలిపోతుంది. అలాంటి వారు నలుగురి మధ్య తిరగడానికి ఆత్మన్యూనతా భావానికి లోనవుతుంటారు. అలాంటి వారి కోసం ఒక నెల మొత్తం జుట్టు కత్తిరించకుండా పొడవుగా పెంచి తరువాత దాన్ని కత్తిరించి కాన్సర్ పేషెంట్ ల కోసం వినియోగించడం, అలా కాన్సర్ మీద అవగాహన కూడా కలిగించడం దీని ఉద్దేశ్యం. ఎక్కడ మొదలయ్యిందిది?? ఈ నో షేవ్ నవంబర్ పుట్టుక ఆస్ట్రేలియా, మరియు న్యూజిలాండ్ దేశాలలో 2004 వ సంవత్సరంలో మొదలయ్యిందని నమోదయ్యి ఉంది. ఏది ఏమైనా కాన్సర్ మీద అవగాహన కోసం, కాన్సర్ తో బాధపడే వారికి తమవంతు సహకారం అందించేందుకు  పట్టణ ప్రజలు, ముఖ్యంగా యువత ఈ నో షేవ్ నవంబర్ ను ఫాలో అవుతుంటారు.  ఇదేనా నో షేవ్ నవంబర్ అనిపించవచ్చు. ఇది కేవలం ఇలాగే ఉండలేదు అండోయ్!! ముందు చెప్పుకున్నట్టే ఇదొక ఉద్యమంలా వ్యాప్తమవుతూ సంస్థలు పుట్టుకొచ్చి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తూ, అటు సామాజిక పరంగా ఇటు మానవీయ విలువల నిర్వహణలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. నవంబర్ ఏ ఎందుకు?? అనే అనుమానం అందరికి రావచ్చు. బహుశా కాన్సర్ గురించి అవగాహన లేని వాళ్లకు నేషనల్ కేన్సర్ అవేర్నెస్ డే ఎప్పుడో తెలిసి ఉండదు. నవంబర్ 7 ను ప్రతి ఏటా నేషనల్ కేన్సర్ అవెర్నెస్ డే గా జరువుకుంటారు. ఈ అవగాహనా రోజును పురస్కరించుకుని నవంబర్ నెల మొత్తం నో షేవ్ నవంబర్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడం దీని ఉద్దేశం కూడా కావచ్చు.  బంగారం లాంటి జుట్టు: నిజమే కదా జుట్టు బంగారమే. ఎవరికి అంటే అది లేనివాళ్లకు. సాదారణంగా మంచి ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారిలో జుట్టు ఎంతో ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటుంది. అలాంటివాళ్ళు  జుట్టు కెత్తిరించినా మళ్ళీ చాలా తొందరగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి లేనివాళ్లకు ఇవ్వాలంటే గొప్ప మనసు ఉండాలి. అది జుట్టైనా, మరింకేదైనా ఏమంటారు??  కాదంటారా?? అవునంటారా?? అవేమి వద్దు నో షేవ్ నవంబర్ కు ఓటెయ్యండి. అంటే మీరు  ఫాలో అయిపోండి. జుట్టు పోతే మళ్ళీ వస్తుంది బాధపడకండి.  ◆  వెంకటేష్ పువ్వాడ

ముసలి ఆవుని తరిమేస్తే!

ఆడవారు అంతెత్తుకు ఎదిగి తమని తాము విజేతలుగా నిలబెట్టుకునే ఆత్మస్థైర్యాన్ని స్వంతం చేసుకున్నారు.  ఈ పరిణామ క్రమంలో ఎన్నో  ఆటంకాలని ఒకటొకటిగా దాటుకుంటూ వచ్చారు. కుటుంబం, సమాజంతోపాటు ప్రకృతి విసిరే సవాళ్ళకి కూడా దీటుగా బదులిచ్చి తమ శక్తి సామర్థ్యాలని ప్రపంచం గుర్తించేలా చేశారు. ఇందుకు శభాష్ అని తీరాలి. అయితే ‘‘ప్రయాణం ఇంకా ఎంతో వుంది’’. అందుకే చిన్నచిన్న అంశాల పట్ల కూడా కొంచెం శ్రద్ధ పెడితే మరిన్ని విజయాలు సులువుగా అందుకోవచ్చు అంటున్నారు నిపుణులు. సహజంగా ఆడవారు దృష్టిపెట్టని అంశాలు ఏవో, అలాగే వాటిపై దృష్టి సారిస్తే వారు పొందే లాభాలు ఏంటో పరిశోధనా పూర్వకంగా నిరూపించారు. మరి ఎన్నో సాధించాలని తపనపడే మీరు ఆ విషయాలో ఏంటో తెలుసుకుని కొంచెం శ్రద్ధ పెట్టాలి. 1. పోషకాహార లోపం ఎక్కువ పోషకాహార లోపం ఆడవారిలో  చాలా ఎక్కువగా కనిపిస్తోందట. అదేంటి... బానే తింటున్నాంగా అంటారా - ఒక డైటీషియన్‌ని కలిసి మీ ఆరోగ్య పరిస్థితి, దానికి మీరు తీసుకోవలసిన ఆహారం, నియమాలు వంటివి తెలుసుకున్నారా ఎప్పుడైనా? అని అడిగితే ‘లేదు’ అన్నది చాలామంది చెప్పిన సమాధానం ఒక అధ్యయనంలో. అలవాటుగా తీసుకునే ఆహారమే తప్ప ప్రత్యేక ఆరోగ్య అవసరాలకు తగ్గట్టు మార్పులు, చేర్పులు ఏవీ చేయకుండా, ఎప్పుడూ ఒకే తరహా ఆహారం తీసుకోవడం ఆడవారు చేసే పెద్ద పొరపాటు. అది వారి ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇన్ని ఉద్యోగాలు, ఇంత సంపాదన పెరిగినా ఆడవారు ఈ విషయంపై శ్రద్ధ పెట్టకపోవడం విచారకరం అంటున్నారు నిపుణులు. గర్భందాల్చి మరో ప్రాణికి ఊపిరి పోసే సమయంలో శరీరానికి తప్పక అందాల్సిన పోషకాలు కొన్ని అయితే, బిడ్డకి జన్మనిచ్చాక చనుబాలు ఇచ్చే సమయంలో తప్పక అందాల్సిన పోషకాలు కొన్ని. అంతెందుకు... నెలనెలా నెలసరికి ముందు, తర్వాత శరీరంలోని హార్మోన్లలో వచ్చే హెచ్చుతగ్గులను బట్టి తీసుకునే ఆహారంలో కూడా అనగనగా ఒక గురువుగారు తన శిష్యునితో కలిసి హిమాలయాలలో సంచరిస్తున్నారు. ఒకరోజు వాళ్లు అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా చీకటి పడిపోయింది. ఎటు చూసినా చిమ్మచీకటి. ఈ చీకటివేళలో తలదాచుకునేందుకు చోటు దొరికితే బాగుండు దేవుడా అని వాళ్లు ప్రార్థిస్తుండగా, కాస్త దూరంలో ఒక చిన్న దీపపు వెలుగు మిణుకుమిణుకుమంటూ కనిపించింది. ఆ వెలుగుని అనుసరిస్తూ వెళ్లిన గురుశిష్యులకి ఒక చిన్న గుడిసె కనిపించింది. ఏ సమయంలోనైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ గుడిసెలోకి అడుగుపెట్టిన వాళ్లిద్దరికీ అందులో ఏ మూల చూసినా పేదరికం సాక్షాత్కరించింది. ఈ పేదరికం మధ్య బతుకుతున్న ఓ కుటుంబమూ కనిపించింది. ఒక భార్యాభర్తా, వారి ఇద్దరు పిల్లలూ చిరిగిన బట్టలతో చలికి వణుకుతూ కనిపించారు. ‘మేం దారి తప్పిపోయి ఇటువైపుకి వచ్చాం. మీరు కనుక ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తే, ఉదయాన్నే వెళ్లిపోతాము.’ అని అభ్యర్థించాడు శిష్యుడు. ‘ఓ దానిదేం భాగ్యం’ అన్నాడు గృహస్థు. ఆ రాత్రి మాటల మధ్యలో ‘మీకు జీవనోపాధి ఎలా?’ అని అడిగారు గురువుగారు. దానికి ఇంటి పెరట్లో కట్టేసి ఉన్న ఓ ముసలి ఆవుని చూపిస్తూ ‘అదిగో ఆ ముసలి ఆవే మాకు జీవనాధారం. అది రోజూ కాసిని పాలు ఇస్తుంది. ఆ పాలు తాగి, దాంతో చేసుకున్న జున్ను తిని బతికేస్తాం. ఇంకా కాసిని పాలు, జున్ను మిగిలితే పట్నానికి పోయి ఏదన్నా కొనుక్కుంటాం’ అని బదులిచ్చాడు గృహస్థు. మర్నాడు ఉదయం గురుశిష్యులిద్దరూ తిరుగు ప్రయాణం కట్టారు. కాస్త దూరం వెళ్లగానే గురువుగారు ‘శిష్యా! నువ్వు నాకోసం ఒక పని చేయాలి. వెళ్లి ఆ ఆవుని దూరంగా అడవుల్లోకి తరిమేసి రా’ అన్నారు. గురువుగారి మాటలకు శిష్యుడు ఆశ్చర్యపోయాడు ‘అయ్యా ఆ కుటుంబానికి ఉన్న ఒకే ఒక్క జీవనాధారం ఆ ముసలి ఆవే కదా! దాన్ని తరిమేస్తే వాళ్లంతా ఆకలితో చచ్చిపోతారు,’ అని నసిగాడు. ‘అదంతా నాకు తెలుసు! నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పిన పని చేయి,’ అని హుంకరించారు గురువుగారు. ఇక గురువుగారి మాట కాదనలేని శిష్యుడు దొంగచాటుగా వెళ్లి ఆ ఆవుని ఎవరికీ కనపడనంత దూరంగా అడవుల్లోకి తరిమేసి వచ్చాడు. గురువుగారి ఆజ్ఞని నెరవేర్చాడే కానీ శిష్యుడిని తను చేసిన పనికి చాలా గిలిగా ఉండేది. కొన్నాళ్లకి పశ్చాత్తాపంతో అసలు అన్నం సయించడం కూడా మానేసింది. ‘ఇక లాభం లేదు’ అనుకున్నాడు శిష్యుడు. ‘వెళ్లి నేను చేసిన పనికి వాళ్లని క్షమాపణ కోరతాను. అవసరం అయితే వాళ్లకి ఏదో ఒక విధంగా సాయపడతాను’ అనుకుంటూ ఆ పూరి గుడిసె వైపుకి బయల్దేరాడు శిష్యుడు. అల్లంత దూరంలో ఆ గుడిసె ఉండే ప్రదేశాన్ని చూడగానే శిష్యుని కళ్లు బైర్లు కమ్మాయి. ఆ గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో చక్కటి ఇల్లు ఉంది. ముసలి ఆవు ఉండాల్సిన చోట చక్కటి గుర్రాలు ఉన్నాయి. ‘పాపం ఈ చోటుకి ఎవరికో అమ్మేసి ఆ కుటుంబం వలస వెళ్లిపోయి ఉంటుంది’ అనుకుంటూ ఆ ఇంటి ఆవరణలోకి అడుగుపెట్టాడు శిష్యుడు. ఎదురుగా చూస్తే ఇంకెవరు ఆనాటి గృహస్థు. మనిషైతే అతనే, కానీ అతని వేషధారణే మారిపోయింది. ఖరీదైన బట్టలు, చలిని ఆపేందుకు శాలువా, మెడలో బంగారు గొలుసు. ఇంటి లోపల తిరుగుతున్న మిగతా కుటుంబసభ్యులదీ ఇదే పరిస్థితి. ‘అయ్యా రెండేళ్ల క్రితం నేను మా గురువుగారితో ఇక్కడికి వచ్చాను. గుర్తుపట్టారా!’ అని వినయంగా అడిగాడు శిష్యుడు. ‘అయ్యయ్యో గుర్తుపట్టకేం. దయచేయండి’ అంటూ సాదరంగా ఆహ్వానించాడు గృహస్థు. ఇంట్లో ఎన్ని అతిథి మర్యాదలు జరుగుతున్నా శిష్యుని మనసులో మాత్రం రకరకాల ఆలోచనలు, సందేహాలు! వాటిని గ్రహించిన గృహస్థు ‘రెండేళ్ల క్రితం మీరు వచ్చినప్పుడు మేం కటిక పేదరికంలో ఉండేవాళ్లం. అప్పట్లో మాకున్న ఒకే ఒక జీవనాధారం ఆ ముసలి ఆవు మాత్రమే. ఒక రోజు అదీ తప్పిపోయింది. మొదట్లో మాకు ఏం చేయాలో పాలు పోలేదు. ఆవు ఉన్నంతవరకూ ఏ పనీ చేయకుండా దానిమీదే ఆధారపడేవాళ్లం. మరో విషయం గురించి ఆలోచించే అవకాశమే లేకపోయింది. కానీ అది పోయాక మా జీవనోపాధి కోసం రకరకాల ఉపాయాలని ఆలోచించడం మొదలుపెట్టాము. బట్టలు నేయడం, చెక్కపని చేయడం, అడవిలో ఉండే అరుదైన ఔషధాలను సేకరించడం… ఇలా నానారకాల పనులన్నీ చేసేవారం. అలా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని పెట్టుబడిగా దాచుకునేవాళ్లం. త్వరలోనే మా నైపుణ్యాలకి తగిన గుర్తింపు లభించింది. అదృష్టం మమ్మల్ని వరించింది. దానికి ఫలితంగానే ఈ సంపద’ అంటూ ముగించాడు గృహస్థు. గృహస్థు మాటలు విన్న తరువాత శిష్యుడికి తన గురువుగారు చేసిన పనిలో ఆంతర్యం బోధపడింది ‘ఆ ముసలి ఆవులాగానే కొన్ని ఆధారాలు మనల్ని బలహీనురుగా మార్చేస్తాయి. వాటిని విడిపించుకున్నప్పుడే మనలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయగలం,’ అనుకుంటూ తన గురువుగారిని చేరుకునేందుకు తిరుగుముఖం పట్టాడు. --నిర్జర

మనలోనే ప్రపంచం

ధర్మరాజు ఓసారి ప్రపంచయాత్రకు బయల్దేరాడట. తిరిగివచ్చిన తర్వాత ప్రపంచలోని మనుషుల స్వభావం ఎలా ఉంది అని ఎవరో అడిగారట. ‘ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత మంచి కనిపిస్తోంది,’ అన్నాడట ధర్మరాజు. అదే సమయంలో దుర్యోధనుడు కూడా ప్రపంచయాత్ర నుంచి తిరిగివచ్చాడట. ప్రపంచంలోని మనుషులు స్వభావం ఎలా ఉంది? అని దుర్యోధనుని అడిగితే... ‘ ఈ ప్రపంచంలో అంతా క్రూరులూ, దుర్మార్గులే కనపిస్తున్నారు,’ అన్నాడట దుర్యోధనుడు. మన దృక్పథం ఎలా ఉంటే ప్రపంచం కూడా అలాగే కనిపిస్తుంది అని ఈ కథతో తేలిపోతోంది కదా! ఇలాంటి కథే ఒకటి జపాన్ జనపదంలో ప్రచారంలో ఉంది. కాకపోతే అది కాస్త సరదాగా ఉంటుంది. ఇంతకీ ఆ కథేమిటంటే... అనగనగా జపాన్లో ఓ మారుమూల గ్రామం. ఆ ఊరిలో ఓ భవనం. ఆ భవనంలోని పెద్ద హాలులో ఎటుచూసినా అద్దాలే కనిపిస్తాయట. అలా పది కాదు వంద కాదు, హాలు అంతా వేయి అద్దాలతో నింపేశాడట ఆ భవన యజమాని. ఆ అద్దాలగదిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేవారు. ఆ వేయి అద్దాలలో కనిపించే తమ వేయి ప్రతిబింబాలను చూసుకుని మురుసుకునేవారు. క్రమంగా జపాన్ అంతా, అద్దాల హాలు గురించిన వార్త పాకిపోయింది. ఆ వార్త విన్న ఓ కుక్కపిల్ల ఎలాగైనా ఆ గదిని చూడాలని అనుకుంది. ఉరుకులుపరుగులు తీస్తూ ఎలాగొలా ఆ గ్రామానికి చేరుకుంది. సందు చూసుకుని నిదానంగా ఆ అద్దాలగదిలోకి చొరబడింది. గదిలోకి చూడగానే తనలాగే వందలాది కుక్కలు కనిపించాయి. తను తోక ఊపితే అవికూడా సంతోషంగా తోక ఊపాయి. తను నవ్వితే అవి కూడా నవ్వాయి. తను చేయి చాపితే అవి కూడా తనవైపు చేయి చాపాయి. మొత్తానికి కుక్కపిల్లకు ఆ గది భలే నచ్చేసింది. ‘ఇక్కడ ఎంత సంతోషంగా ఉందో! మళ్లీమళ్లీ ఇక్కడకు వస్తూ ఉండాలి,’ అనుకున్నది. కుక్కపిల్ల వెళ్లి తన నేస్తాలన్నింటితోనూ అద్దాలగది గురించి చాలా గొప్పగా చెప్పింది. జీవితంలో ఒక్కసారైనా అందులోకి ప్రవేశించాల్సిందే అంది. ఆ మాటలు విన్న మరో కుక్కపిల్ల అద్దాలగదిని చూసేందుకు బయల్దేరింది. కానీ అందులో ఏముంటుందో అన్న భయంతో, అక్కడ తనకు కనిపించే కుక్కపిల్లలు తనతో ఎలా ప్రవర్తిస్తాయో అన్న అనుమానంతో అడుగులో అడుగు వేసుకుంటూ అద్దాలగదిలోకి చేరుకుంది. అక్కడ దానికి కనిపించిన ప్రతిరూపాలు కూడా భయంభయంగా అనుమానంగా చూస్తూ కనిపించాయి. భయంతో తను మూలిగితే అవి కూడా మూలిగాయి. అనుమానంతో అరిస్తే, అవి కూడా అరిచాయి. ‘అయ్యాబాబోయ్! ఈ ప్రదేశం చాలా ప్రమాదకరంగా ఉంది. మళ్లీ ఇంకెప్పుడూ ఇక్కడకు రాకూడదు,’ అనుకుంటూ తోకముడుచుకుని పారిపోయింది. ఈ కుక్కపిల్లల కథలో కనిపించే నీతి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

జీవిత గమనానికి - క్రమశిక్షణ ఒక చుక్కాని

జీవితంలో ఆరోగ్యకరం అయిన ప్రయాణానికి దోహదం చేసేది క్రమశిక్షణ. కేవలం సమయపాలననే క్రమశిక్షణ అని అనుకోకూడదు. సమాజం పట్ల అవగాహన కలిగి వుండి ఆశావాహ దృక్పధమైన పనులను వరుస ప్రకారం నెమ్మదిగా చేసుకుపోవడం క్రమశిక్షణ కి అద్దం పడుతుంది. సమయ సాధనతోనే సాధ్యం. క్రమశిక్షణ అంటే సరైన దారిలో నడిపించడం లేదా నేర్పించడం అనే అర్థం వస్తుంది. కొన్నిసార్లు అది పిల్లల అమర్యాద ప్రవర్తనని సరిచేయడం కూడా అవుతుంది. కానీ ముఖ్యంగా క్రమశిక్షణ అంటే మంచి, చెడు తెలుసుకునేలా శిక్షణ ఇవ్వడం. ఆ శిక్షణ పిల్లలు తప్పు చేయకముందే మంచి నిర్ణయాలు తీసుకునేలా వాళ్లకు సహాయం చేస్తుంది. ఇటీవల కాలంలో చాలా ఇళ్లలో క్రమశిక్షణ అనేదే లేకుండా పోయింది. ఎందుకంటే పిల్లల్ని సరిదిద్దితే వాళ్ల ఆత్మ గౌరవం తగ్గిపోతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. కానీ తెలివైన తల్లిదండ్రులు పిల్లలు పాటించగలిగిన రూల్స్‌ పెట్టి పిల్లలు వాటికి లోబడేలా శిక్షణ ఇస్తారు. చదువులో ఏకాగ్రత, పెద్దల పట్ల గౌరవం,మంచి అలవాట్లు క్రమశిక్షణతో సిద్ధిస్తాయి.  అనుకున్నదానికి కట్టుబడి ఉండండి. మీ పిల్లలు మీరు పెట్టిన రూల్స్‌కి కట్టుబడి లేకపోతే వాళ్లను పర్యవసానాలు ఎదుర్కోనివ్వండి. అలానే మీ బాబు లేదా పాప మీరు చెప్పినట్లు వింటే వాళ్లను వెంటనే మెచ్చుకోండి. సమంజసంగా ఉండండి. క్రమశిక్షణ ఇచ్చేటప్పుడు పిల్లల వయసు ఎంత, వాళ్ల సామర్థ్యం ఎంత, వాళ్లు చేసిన తప్పు ఎంత పెద్దది అనే విషయాలను చూసుకోవాలి. ఫలానా తప్పు చేసినందుకే ఈ శిక్ష వేయబడింది అనే విషయం పిల్లలకు అర్థం కావాలి. ఉదాహరణకు సెల్‌ఫోన్‌ విషయంలో పెట్టిన రూల్స్‌ని పాటించలేదు కాబట్టే కొన్ని రోజుల వరకు వాళ్లకు సెల్‌ఫోన్‌ ఇవ్వడం లేదని లేదా తక్కువ వాడుకోనిస్తున్నామని వాళ్లకు తెలియాలి. అదే సమయంలో కేవలం మీకు విసుగు తెప్పించారనే కారణంతో చిన్న విషయాల్లో కోపం తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి. ప్రేమతో ఉండండి. తల్లిదండ్రులు ఏది చెప్పినా ప్రేమతోనే చెప్తారు అనే విషయాన్ని పిల్లలు అర్థం చేసుకుంటే వాళ్లకు క్రమశిక్షణను అంగీకరించడం సులువు అవుతుంది. ◆ వెంకటేష్ పువ్వాడ