మహావీరుడిని స్మరించుకుందాం!!
posted on Apr 12, 2022 @ 9:30AM
సత్యం, ధర్మం, అహింస వంటి విషయాలను బోధించి హింసాయుతమైన జీవితాలను మార్చాలని కృషిచేసినవారు ఎందరో ఉన్నారు. నిజనికి ఈ మార్గాన్ని చెప్పే మతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో జైన మతం ఒకటి. ఆధినాధుడు లేదా వృషభనాథుడు స్థాపించిన ఈ జైన మతానికి ఇరవై నాలుగు మంది తీర్థంకరులు ఉన్నారు. వారిలో చివరివాడు, ఇరవై నాలుగవ తీర్థంకరుడు ఈ మహావీరుడు. ఈయన కాలంలోనే జైన మతం వ్యాప్తి చెందింది.
వర్థమానుడు….. మహావీరుడు!!
వర్థమానుడు మహావీరుడు ఇద్దరూ ఒకటే. బీహార్ లో వైశాలి అనే నగరానికి సమీపంలో కుండ అనే గ్రామంలో క్రీ.పూ 599 సంవత్సరంలో క్షత్రీయ కుటుంబంలో మహారాజు సిద్ధార్థుడుమహారాణి త్రిషలకు ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి వర్థమానుడు అని పేరు పెట్టారు. తల్లిదండ్రుల దగ్గర ఎంతో అల్లారుముద్దుగా పెరిగిన వర్తమానుడు తన ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఈయన భార్య పేరు యశోధర. ఈయనకు ఒక కూతురు పుట్టిన తరువాత తన ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అన్నిటినీ వదిలేసి సన్యాసం తీసుకున్నారు.
సుదీర్ఘ తపస్సు!!
ఈయన దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఆ పన్నెండేళ్ల కాలంలో ఆయనలో ఎన్నో రకాల ఆత్మానుభూతులు కలిగాయి. సాలవృక్షం కింద ఈయన తపస్సు చేసిన ఈయన సర్వవ్యాపకత్వమైన జ్ఞానాన్ని సంపాదించారు. దాదాపు ముప్పై సంవత్సరాల పాటు అందరికీ జ్ఞానాన్ని బోధించారు. అంగ, మిథిల, కోసల, మగధ దేశాలలో ఈయన తన తత్వాలను ప్రచారం చేసాడు.
త్రిరత్నాలు!! పంచవ్రతాలు!!
సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనే మూడింటిని త్రిరత్నాలు అని అంటారు. ఈ మూడు మనిషి జీవితం మోక్షం సాధించడానికి మార్గాలు అని వర్తమాన మహావీరుడు ప్రతిపాదించాడు. సరైన విధంగా దేన్నైనా చూడటం(చూడటం అంటే ఇక్కడ దృష్టికోణం అని అర్థం), సరైన జ్ఞానం, సరైన జీవితం ఇవన్నీ మనిషి మోక్షసాధనకు మూలం అని చెప్పారు.
ఇకపోతే పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనే దానిని కలిపి పంచవ్రతాలు రూపొందించాడు.
పంచవ్రతాలు మనిషి జీవితంలో పాటించడం ఎంతో ముఖ్యమని, వాటిని పాటిస్తూ త్రిరత్నాలలో జీవిస్తే మనిషి మోక్షానికి పాత్రుడు అవుతాడని వర్తమాన మహావీరుడు చెప్పాడు.
అలాగే ఈయన ఆ కాలానికే బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకించాడు. పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ, నిష్ఠగా తపస్సు చేస్తే ఎలాంటి వారు అయినా మోక్షాన్ని సాధించవచ్చని తెలియజేసారు.
ఆదర్శ మార్గం!!
అహింస అనే మార్గాన్ని ఆదర్శప్రాయంగా స్వీకరించి దాన్ని ఆచరించి బానిసత్వంలో ఇరుక్కుపోయిన భారతదేశానికి స్వతంత్ర్యాన్ని తీసుకురావడానికి కృషి చేసిన వారిలో మహాత్మ గాంధీ ఒకరు. ఈయన స్వయంగా వర్తమాన మహావీరుడి భోధనలకు ప్రభావితమై తన జీవితాంతం అహింసా మార్గాన్ని అనుసరించారు.
ఈయన ఒక్కరే కాదు. వర్థమహా వీరుడి మార్గంలో గాంధీ గారు, గాంధీ గారి మార్గంలో వెళ్లి ఆంధ్రరాష్ట్రాన్ని సాధించి పెట్టిన మరొకరు పొట్టిశ్రీరాములు గారు.
ఇలా వర్తమాన మహావీరుడి బోధనలను మార్గదర్శకంగా తీసుకుని ధన్యులు అయినవాళ్ళు ఎందరో. అలాంటి వర్తమాన మహావీరుడిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవాలి. ఆయన మార్గాలను వీలున్నంతవరకు పాటించాలి.
◆ వెంకటేష్ పువ్వాడ.