Read more!

ఆరోగ్యానికొక అవకాశమిద్దాం!!

అవకాశం జీవితాలను ఎన్నో మలుపులు తిప్పే అద్భుతం అని చెప్పవచ్చు. అది రంగం ఏదైనా, వ్యక్తులు ఎవరైనా, పరిస్థితులు ఎలాంటివైనా అవకాశం అంటే అదృష్టమే. అవన్నీ మనిషి సామాజికంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మనిషి ఏదైనా సాధించాలంటే మొదట ఆరోగ్యవంతుడిగా ఉండాలి. దురదృష్టవశాత్తు నేటి కాలంలో సంపూర్ణ ఆరోగ్యవంతులు కరువయ్యారు. 

కొన్నేళ్ల కిందట పల్లెల్లో కష్టం చేసుకుని బతికే వాళ్లకు ఎలాంటి జబ్బులు రావడం లేదు, వాళ్ళ జీవితకాలం పట్టణాల్లో నివసించేవాళ్ళతో పోలిస్తే ఎక్కువ అని చెప్పుకునేవాళ్ళం. వాళ్ళ కష్టమే కాకుండా వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా వాళ్ళ శారీరక దృఢత్వానికి కారణం. అయితే నూతన ఒరవడికి ఆకర్షించబడని జీవులు అంటూ ఉండరు. ముఖ్యంగా మనుషులు కొత్తవాటి వైపు చాలా తొందరగా అడుగులు వేస్తారు. అది శుభపరిణామమే అయినా వాటిలో ఉన్న నష్టాలు వాటిలో ఉంటాయి అనే విషయాన్ని మొదట తెలుసుకోరు. ఫలితాలే మనుషుల ఆరోగ్యాలు రోజురోజుకు క్షీణించడం. 

మనిషి సగటు జీవితకాలం క్రమంగా తగ్గిపోవడం. ఇవన్నీ చూసి కేవలం ఆందోళనతోనే పైకి పోయేంత బలహీనులున్నారంటే మనిషి మానసిక శారీరక స్థాయి నిలకడగా లేకుండా ఎంత కంపనాలకు లోనవుతోందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆరోగ్యానికి ఒక అవకాశం ఇవ్వాలి ఇప్పుడు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా మన ఆరోగ్యానికి మనమే ఒక అవకాశం ఇచ్చుకుందాం. అదేంటి అంటారా……. చూద్దాం మరి.

ఆహారం!! 

ఆరోగ్యం ముఖ్యంగా ఆహారం మీదనే ఆధారపడి ఉంది. ఆహారం శక్తికి మూలవనరు. శక్తి ద్వారా శరీర సామర్థ్యము పెరుగుతుంది. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు. ముఖ్యంగా ఆడవాళ్లు ఆహారం విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎముకలు, నరాల బలహీనత వంటి సమస్యలు కొనితెచ్చుకోవద్దు. ఎందుకంటే ఓ దశలో ఆడవాళ్లు బిడ్డల్ని మోయాలి, తమ శరీరంలో ఆ బిడ్డల ఎదుగుదల బాగుండాలి అంటే ఆడవాళ్లు మెజ్నదు బాగుండాలి. అలాగే వయసుకు తగ్గట్టు అందుబాటులో ఉన్న వాటిలోనే సమర్థవంతమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే బాగుంటాము. ఇంకా ముఖ్యంగా బయట ఆహారాన్ని వదిలెయ్యాలి.

శుభ్రత!!

ఆరోగ్యం విషయంలో శుభ్రత ముఖ్యమైనది. వండుకునే కూరగాయలను శుభ్రంగా కడిగి వండుకోవడం నుండి, వంటగది, ఇల్లు, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వరకు అన్నిరకాలుగా శుభ్రత ఉండాలి. ఒకేసారి పెద్ద మొత్తం వండి వాటిని అలాగే పెట్టి వాటిని మళ్ళీ తినడం బదులు అవసరమైనప్పుడు కొద్దిగా వండుకోవడం ఉత్తమం. సమయం వేస్ట్ అవుతుందనే ఆలోచనతో ఒకేసారి వండుకోవద్దు. తప్పనిసరిగా ఆహారపదార్థాలు కానీ, సరుకులు కానీ నిల్వ చేసుకోవాల్సి వస్తే ఆ ప్రదేశాలను, కంటైనర్లను శుభ్రంగా ఉంచుకోవాలి.

జాగ్రత్తలు!!

జాగ్రత్తల వల్ల సమస్యలు రాకుండా ఉండవచ్చు, వాటిని దూరంగా ఉంచవచ్చు.  బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు పాటించడం. ఎక్కడ ఉమ్మి వేయకుండా ఉండటం, గుంపుగా ఉన్న చోట తినకుండా ఉండటం, ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జన చేయకుండా ఉండటం. తుమ్ములు వచ్చినప్పుడు కర్చీఫ్ అడ్డు పెట్టుకోవడం. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు రద్దీ ప్రాంతాలకు వెల్లకపోవడం మంచిది. మాంసాహారం ఏదో చెడు చేస్తుంది అని చెప్పడం కంటే దాన్ని కూడా జాగ్రత్తగా వాడిస్తాం మంచిది. వీలైతే తాజాగా ఉన్న మాంసం తీసుకోవడం మంచిది. కాసింత ధర ఎక్కువైనా హాస్పిటల్ కు వెళ్లే గోల తప్పుతుంది కదా. 

దగ్గరగా దగ్గరగా…..

దేనికి దగ్గరగా ఉండాలి అని ప్రశ్న వద్దు. మనిషి శరీరం ఆ ప్రకృతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పంచభూతాల కలయిక అయిన ఆ ప్రకృతి, మనిషి శరీరం రెండూ కూడా ఓకేలాంటివి. అందుకే వీలైనంత వరకు ప్రకృతికి దగ్గరగా ఉండేలా అయితే మంచిది. ఇంకా మనిషి శరీరాన్ని పటిష్టం చేసి రోగనిరోధక శక్తిని పెంచే మన ప్రాచీన మార్గాలు అయిన ఆయుర్వేదం, యోగ, ప్రాణాయామం వంటివి ఎంతో గొప్పగా దోహదం చేస్తాయి. 

పైన చెప్పుకున్నట్టు అన్నివిధాల ఆలోచించి మన ఆరోగ్యానికి మనమే అవకాశం ఇచ్చుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం పదిలం.


                                  ◆వెంకటేష్ పువ్వాడ.