Read more!

వేసవి తాపం తీర్చుకుందామా??

వేసవి అంటే భయపడే కాలం వచ్చేసింది. ఒకప్పుడు వేసవి అంటే అదొక ఎంజాయ్మెంట్ ఉండేది. అన్ని కాలాలతోపాటు వేసవిని కూడా ఓ రేంజ్ లో ఇష్టపడేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే వేసవి కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా. పట్టణాల్లో ఎక్కడెక్కడో కృత్రిమజీవితాలలో పడిపోయిన వాళ్ళు కాస్త హాయిగా ఊపిరి పీల్చుకోవడానికి తాము పుట్టిన ఊర్లకు తమ భార్యా పిల్లలతో కలసి పరుగులు తీసేవారు. అయితే కాలం  మారుతూ పల్లెల రూపాన్ని కూడా మార్చేసింది. పల్లెటూళ్లకే సొంతమైన చెరువులు, బావులు, కాలువలు, తాటి, కొబ్బరి, ఈత, మామిడి మొదలైన చెట్ల సందడి క్రమంగా తగ్గింది. ఉన్న కాసిన్ని దిగుబడులు కూడా అధిక వస్తాయని పట్టణాలకే వెళ్లిపోతాయి. 

ఒకప్పుడు!!

వేసవి వస్తుంది, కొడుకు లేదా కూతురు తమ పిల్లలతో కలసి వస్తారు అనుకుంటే బుట్టల కొద్దీ మామిడి పళ్లు తెచ్చిపెట్టేవాళ్ళు పెద్దోళ్ళు. కానీ ఇప్పుడు అంతా వ్యాపారమైపోయింది. భూస్వాముల పిల్లలు మాత్రమే అలాంటి జీవితాన్ని కొద్దో గొప్పో చూడగలుగుతారేమో. అయితే కాలం మారిపోయిందని మనుషులు అలాగే ఉండిపోరు కదా!! అందుకే వేసవిలో తీసుకునే ఆహారం మీదనే మనిషి ఈ వేడిని తట్టుకోగలుగుతాడు. మరి ఈ వేసవిలో ఏమి తింటున్నారు?? ఎలా తింటున్నారు?? ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటారు?? వేసవి తాపం తీర్చుకోవడానికి సులువైన మార్గాలు.

వేడి తగ్గించుకోవాలి అంటే చలువ చేసే పదార్థాలు తీసుకోవాలి. శరీరంలో తేమ తొందరగా ఆవిరైపోయే ఈ కాలంలో ఎప్పుడూ తేమ శాతాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి.

నీళ్లు!!

చాలామందికి నీళ్లు తాగడం నేర్చుకోవాల్సింది ఏముంది అనుకుంటారు. అయితే ఓ పద్దతిలో నీళ్లు తాగితే శరీరంలో తేమ శాతం బాగుంటుంది, ఉదయాన్నే పరగడుపున లీటరు నీళ్లు తాగడం మంచిది. ఇది ఏ కాలంలో అయినా శరీరమనే ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడుతుంది. బాగా దాహం వేసినప్పుడే అని కాకుండా ఈ వేసవిలో కొంచం నీళ్లు తాగుతూ ఉంటే మంచిది. అయితే ఫ్రిజ్ నీళ్లు చల్లగా ఉంటాయని, అవి దాహం తీరుస్తాయని అనుకోవద్దు. అవి ఇంకా శరీరంలో వేడి పెరగడానికి కారణం అవుతాయి. కుండలో నీరు శ్రేష్టం.

పండ్లు!!

ఈ కాలంలో లభించే పండ్లలో కూడా సాధారణంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సీజనల్ పండ్లను తినడం చాలా ముఖ్యం. పుచ్చకాయ నుండి వేడిని తగ్గించే సబ్జా గింజల వరకు అన్నీ హాయిగా తినేయచ్చు, తాగేయచ్చు. ఫ్రూట్ సలాడ్ లూ చేసుకోవచ్చు, ఫ్రూట్ జ్యుస్ లు చేసుకోవచ్చు. అయితే నేరుగా పండు తింటే ఆ పండులో ఉండే అన్ని రకాల పోషకాలు అందుతాయి. 

ఉసిరి, నిమ్మ!!

ఈ రెండు దాహాన్ని తీర్చడంలో ఎంతో గొప్పగా సహాయపడతాయి. ఆమ్లా జ్యుస్ బయట మార్కెట్లలో దొరుకుతుంది, లేక ఆమ్లా పొడి అయినా తెచ్చుకోవచ్చు. ఈ పొడిని నీళ్లలో వేసి అయిదు నిమిషాలు అలాగే ఉండనిచ్చి, అందులో ఒక స్పూన్ తేనె కలుపుకుని తీసుకోవచ్చు. కేవలం దాహం తీర్చడమే కాదు, జీర్ణసమస్యలకు, రక్తం శుద్ధి చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

ఇంకా నిమ్మ అన్ని చోట్లా ఉపయోగించే సిట్రస్ పండు. అధిక దాహం ఉన్నప్పుడు అరచెక్క నిమ్మరసం ఒక గ్లాసు నీళ్లలో పిండి ఇష్టమైనట్టు పంచదార లేదా ఉప్పు కలుపుకుని తాగచ్చు.

పలుచని మజ్జిగ!!

ఒక కప్పుడు పెరుగులో ఒక లీటరు నీళ్లు వేసి బాగా చిలికి అందులో కాసింత కొత్తిమీర, అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి తాగితే అద్భుతంగా ఉంటుంది.

పెసరపప్పు!!

అందరూ పప్పు, చారు వండటానికి కందిపప్పు వాడతారు. అయితే వేసవిలో పెసరపప్పును రీప్లేస్ చేసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది. 

ఇలా అందరికీ అందుబాటులో ఉన్న వాటితోనే వేసవి తపాన్ని హాయిగా అధిగమించవచ్చు.

 ◆వెంకటేష్ పువ్వాడ.