విశ్వమంత గీతానికి మూలపురుషుడు!!
posted on May 9, 2022 @ 9:30AM
భారతీయ సాహిత్యంలో మొట్టమొదటగా నోబెల్ బహుమతి అందుకున్నవారు రవీంద్రనాథ్ టాగోర్. ఈయన రచించిన గీతాంజలి కావ్య గ్రంథానికి నోబెల్ బహుమతి లభించింది. ప్రపంచ సాహిత్యాన్ని కూడా శాసించగలిగే గొప్ప కవి, నాటక రచయిత, చిత్రాకారుడు రవీంద్రనాథ్ టాగోర్. ఈయన రెండవ అన్నయ్య ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో నియమితుడైన మొట్టమొదటి భారతీయుడిగా పేరు పొందాడు. దీని కారణంగా టాగోర్ గొప్ప కుటుంబానికి చెందినవాడని అర్థమవుతుంది. అయితే టాగోర్ బాల్యం నుండి కాస్త ప్రత్యేకంగానే ఉండేవాడు. ఆయన్ను గొప్ప కవిగా చేసిన సంఘటనలు, ఆయన జీవిత ప్రయాణం తెలిస్తే అందరిలోనూ తెలియని ఉత్సాహం మేల్కొంటుంది.
బాల్యం, విద్యాభ్యాసం!!
టాగోర్ 1861 సంవత్సరంలో జన్మించాడు. ఈయన చిన్నతనంలో బడికి వెళ్లాలంటే ఆసక్తి చూపించేవాడు కాదు. అలాగని మొద్దబ్బాయి అస్సలు కాదు. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, పెరటిలోకి వెళ్లి ప్రకృతిని చూసి ఆనందపడటం ఇష్టంగా ఉండేది. ఆ తరువాత వ్యాయామం చేయడం. గణితం, చరిత్ర, భూగోళం మొదలైన పాఠ్య పుస్తక విషయాలు నేర్చుకునేవాడు. ఆ తరువాత సాయంత్రం తోటలో తిరుగుతూ ఆంగ్లం నేర్చుకునేవాడు. ఈయనకు చిన్నతనం నుండే కథలు నతే చాలా ఇష్టం ఉండేది. ప్రతి ఆదివారం సంగీతం నేర్చుకునేవాడు. కాళిదాసు, షేక్ష్పియర్ మొదలైన వారి నాటకాలు, గ్రంధాలు ఇష్టంగా చదివేవాడు. ఆయన మాతృభాష అయిన బెంగాలీ మీద ప్రత్యేకంగా ప్రేమను పెంచుకున్నాడు.
ఆంగ్ల సాహిత్యం వైపు ప్రయాణం!!
టాగోర్ గారు ఇంగ్లాండ్ లో ఒక పబ్లిక్ స్కూల్ లో చేరి ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు వినేవారు. ఇంకా ఎంతోమంది ఉపన్యాసాలు వినేవాడు. ఎంతోమందితో ఆంగ్లంలోనే సంభాషణలు జరిపేవాడు. ఆంగ్లంలో నాటకం, సంగీత కచేరీలు మొదలైన వాటికి వెళ్లి వాటిని ఎంతో శ్రద్ధగా వింటూ ఆంగ్లం మీద ఆంగ్ల సాహిత్యం మీద పట్టు తెచ్చుకున్నాడు. ఈయన బెంగాలిలో రచించిన ఎన్నో కవితలను ఏర్చి కూర్చి గీతాంజలిగా పేరు పెట్టాడు. దీన్ని ఆంగ్లంలోకి అనువదించిన తరువాత టాగోర్ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చింది.
శాంతినికేతన్!!
గీతాంజలి మనుషుల మనసుల్లో ప్రేమతత్వాన్ని స్పర్శించి, దాన్ని వెలికి తీసే ఒక అద్భుతం. అయితే టాగోర్ పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో స్థాపించినదే శాంతినికేతన్ విశ్వవిద్యాలయం. ఇది అయిదు మంది పిల్లలతో మొదలై ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకుంది. అక్కడ విద్యను అభ్యసించిన వారికి ఒకానొక ప్రత్యేక వ్యక్తిత్వం ఏర్పడటం ఎంతో గొప్ప విషయంగా భావించేవారు. గొప్ప క్రమశిక్షణ కలిగిన జీవితం వారికి సొంతమయ్యేది.
మరొక కోణం!!
టాగోర్ అంటే చాలామందికి కేవలం గీతాంజలి రచయితగా పరిచయం అవుతారు కానీ ఈయన నవలలు, నాటకాలు కూడా రాశారు. ఇంకా ముఖ్యంగా రవీంద్ర సంగీతం అనే ప్రత్యేక వర్గాన్ని సృష్టించిన గొప్ప సంగీత పిపాసి ఈయన. ఈయన రచించిన నవలల్లో గోరా ఈయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలాగే నాటకాలలో చిత్రాంగద నాటకం మంచి పేరు తెచ్చిపెట్టింది.
సామాజిక చైతన్యం వైపు!!
టాగోర్ కు సామాజిక స్పృహ ఎప్పుడూ ఎక్కువగానే ఉండేది. ఆయన జీతీయభావాలు పుష్కలంగా కలిగి ఉండేవాడు. తిలక్ ను బ్రిటీష్ ప్రభుత్వం బంధించినప్పుడు తీవ్రంగా విమర్శించాడు. బెంగాల్ విభజన సమయంలో ప్రముఖ పాత్ర పోషించాడు. చివరికి ఈయన రచించిన జనగణమన జాతీయగీతంగా మారి ఈ దేశం నిలిచి ఉన్నంత వరకు టాగోర్ ఉనికిని జీతంలో ప్రతిబింబిస్తూ ఉంది, ఉంటుంది.
విశ్వకవి బిరుదును సొంతం చేసుకున్న ఈయన విశ్వాన్ని తన కలంతో శాసించాడు.
◆వెంకటేష్ పువ్వాడ.