జగన్ మావయ్యా.. సూపర్ కామెడీ మావా!
posted on Jun 21, 2024 @ 1:07PM
నా పరిపాలనలో స్టూడెంట్స్ ఇంగ్లీషులో ఇరగ్గొట్టేస్తున్నారు అని ప్రచారం చేసుకోవడం కోసం జగన్ ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన కాలంలో తన దగ్గరకి స్కూలు పిల్లల్ని పిలిపించుకోవడం.. వాళ్ళ చేత ఇంగ్లీషు మాట్లాడించడం లాంటి వికటించిన ప్రయోగాలు చేశారు. వాళ్ళలో ‘మై నేమీజ్ మ్యాగనా’ గురించి అందరికీ తెలిసిందే.
ఒకసారి ఓ సభలో ఒక కుర్రాణ్ణి పిలిపించి, జగన్ సమక్షంలో అతని చేత ఇంగ్లీషు మాట్లాడించారు. ఇంగ్లీషు మాట్లాడ్డం అంటే ఆక్స్.ఫర్డ్ డిక్షనరీ లెవల్లో ఆలోచించి, మరేదో అనుకోకండి.. స్టూడెంట్స్ ఇంగ్లీషు మాట్లాడ్డం అంటే, జగన్ పథకాల భజన చేయడం. సదరు కుర్రాడు కూడా నాన్ స్టాప్‌గా ఆంగ్లములో జగన్ భజన కార్యక్రమం నిర్వహించాడు. ఆ కుర్రాడలా భజన చేస్తుంటే, పక్కనే మన జగన్ చేతిలో చెయ్యి పెట్టుకుని, ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయారు. గడగడా ఇంగ్లీషు మాట్లాడాల్సిన ఆ కుర్రాడు గడగడలాడుతూ ఇంగ్లీషు మాట్లాడాడు. జగన్ హయాంలో రోడ్ల మీద వెహికల్ నడిపినట్టు బ్రేకుల మీద బ్రేకులు వేస్తూ ఇంగ్లీషు మీద కక్ష తీర్చుకున్నాడు. ఇదంతా ఇలా వుంటే, ఇంగ్లీషు మాట్లాడుతున్న ఆ కుర్రాడి ఫేస్‌లో సడెన్‌గా ఏదో మార్పు వచ్చింది. మనిషి స్టిఫ్ అయిపోయాడు. పొరపాటున ఇప్పుడు జగన్‌నిగానీ తిట్టబోతున్నాడా అనే సందేహం వచ్చేలా కనిపించాడు. అప్పుడు ఆ కుర్రాడి నోటి నుంచి బుల్లెట్‌లా ఒక మాట దూసుకొచ్చింది. ఆ కుర్రాడు ‘జగన్ మావయ్యా’ అని ఒక్కసారి గావుకేక పెట్టాడు. ఆ గావుకేక విని సాధారణంగా ఎవరైనా భయపడతారు. కానీ, మన జగన్ మావయ్య మాత్రం సిగ్గుపడిపోతూ ఆ పిలుపును ఆస్వాదించారు.
ఆనాటి నుంచి మొదలైంది ట్రోలింగ్.. జగన్ కీర్తి కిరీటంలో ‘జగన్ మావయ్యా’ అనే మాట కూడా చేరింది. చివరికి ‘మావయ్య’ అనే పదం కామెడీగా మారిపోయిన పరిస్థితి జగన్ గారి పుణ్యమా అని ఏర్పడింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పడం జరిగిందంటే, శుక్రవారం నాడు అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి జగన్ వచ్చినప్పుడు అక్కడున్న కుర్రకారు ‘జగన్ మావయ్యా.. జగన్ మావయ్యా’ అని కామెడీగా పిలుస్తూ రచ్చరచ్చ చేశారు. ఆ పిలుపులు జగన్ చెవిలో పడినా విననట్టుగా నటిస్తూ, నమస్కారాలు పెడుతూ అసెంబ్లీ లోపలకి వెళ్ళిపోయారు.