సుజనా.. వంగవీటి.. ఛాన్స్ దక్కేదెవరికో?
posted on Jun 21, 2024 @ 12:25PM
ఏపీలో చంద్రబాబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. జగన్ పాలనలో ఐదేళ్ల పాటు అన్ని రంగాలలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలెక్కించే దిశగా చంద్రబాబు కేబినెట్ అప్పుడే అడుగులు వేయడం మొదలు పెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఆయన తన తొలి పర్యటన పోలవరంతో ప్రారంభించారు. రెండో పర్యటన అమరావతిలో చేరారు. ఈ రెండు పర్యటనల్లోనూ చంద్రబాబు జగన్ విధ్వంస పాలనలో నవ్యాంధ్రప్రదేశ్ కు రెండు కళ్లలాంటి పోలవరం, అమరావతిల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రెండిటిపై కూడా త్వరలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని చెప్పారు. ఏపీకి జీవనాడి వంటి పోలవరం, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఇక వేగం పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రజలలో కలిగించారు.
అలాగే మంత్రి నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందుగానే తన నియోజకవర్గం మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఇసుమంతైనా అలసత్వం చూపబోనని చాటారు. అదే విధంగా హోంమంత్రి వంగలపూడి అనిత, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇలా ఒకరని కాదు చంద్రబాబు కేబినెట్ లో స్థానం దక్కించుకున్న మంత్రులంతా.. రాష్ట్ర ప్రగతి, సుపరిపాలన ధ్యేయంగానే తమ ప్రభుత్వ తీరు ఉంటుందన్నది తమ చేతల ద్వారా చాటారు. సరే అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం (జూన్ 21) ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో ఖాళీగా ఉన్న స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. పాలనను ప్రగతి బాటలో పరుగులెత్తించే పనిలో ఉన్న చంద్రబాబు తన కేబినెట్ లో ఖాళీగా ఉన్న బెర్త్ ను సాధ్యమైనంత త్వరగానే భర్తీ చేస్తారనడంలో సందేహం లేదు. దీంతో ఆ బెర్త్ ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొని ఉంది. ప్రస్తుత కేబినెట్ లో పలువురు సీనియర్లకు స్థానం దక్కని సంగతి తెలిసిందే. యనమల వంటి సీనియర్ మోస్ట్ లు కూడా కేబినెట్ లో స్థానం దక్కని వారిలో ఉన్నారు. అలాగే చంద్రబాబు గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారిలో కొందరికి కూడా ఈ సారి మంత్రి పదవి లభించలేదు. దీంతో ప్రస్తుత కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం కోసం ఆశావహుల సంఖ్య భారీగానే ఉంటుందనడంలో, ఉందనడంలో సందేహం లేదు. ఈ బెర్త్ కోసం రేసులో ఉన్న వారిలో ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా ఉన్నారని అంటున్నారు.
అలాగే పార్టీ టికెట్ ఆశించకుండా కూటమి అభ్యర్థుల విజయం కోసం పాటుపడిన వంగవీటి రాధాకృష్ణ కూడా రేసులో ఉన్నారని అంటున్నారు. ఆయనను కేబినెట్ లో తీసుకుని.. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే యనమల, పరిటాల సునీత, భూమా అఖిలప్రియ, కిమిడి కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావులు కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.