బీఆర్ఎస్ భూస్థాపితానికి శంకుస్థాపన!
posted on Jun 21, 2024 @ 2:46PM
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలోని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పార్టీని భూస్థాపితం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం (21-06-24) నాడు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ నాయకుడు, శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ తీర్థం ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ భూస్థాపితం కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. సాధారణంగా ఎవరైనా పార్టీ మారదలుచుకుంటే సదరు వ్యక్తి ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్ళి పార్టీలో చేరడం సర్వసాధారణం. కానీ, పోచారం ఇంటికి ముఖ్యమంత్రి వెళ్ళి మరీ పార్టీలోకి తీసుకున్నారంటే, శంకుస్థాపన కార్యక్రమం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ముందుముందు ఇంకా ఎంత భారీ స్థాయిలో జరగబోతోందో కూడా అవగాహనలోకి తెచ్చుకోవచ్చు.
ముఖ్యమంత్రి చేపట్టిన బీఆర్ఎస్ భూస్థాపితం కార్యక్రమానికి వచ్చే అసెంబ్లీ సమావేశాలకు డెడ్‌లైన్‌గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈలోపుగా కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు.. మరో ఇద్దరు ముగ్గురు మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశంల్లో బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేస్తారు. అప్పుడు బీఆర్ఎస్ భూస్థాపితం కార్యక్రమం సంపూర్ణమవుతుంది. ఇక ఆ తర్వాత కేసీఆర్ కుటుంబం ఇంట్లో కూర్చుని భజన చేయడం తప్ప చేయగలిగిందేమీ వుండదు.