చంద్రబాబును చూసి నేర్చుకో మిస్టర్ జగన్!
posted on Jun 21, 2024 @ 12:10PM
సంస్కారం వున్న సంస్కర్త అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించుకున్నారు. అది మరెవరి విషయంలోనో కాదు.. తన రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి విషయంలో. అసెంబ్లీ అంటే కౌరవ సభలా కాదు.. గౌరవ సభలా వుండాలని ఆశించే ఆయన, దాన్ని తన ఆచరణలో కూడా చూపించారు. ఇదే నాకూ, జగన్‌కి మధ్య వున్న తేడా అని చెప్పకనే స్పష్టంగా చెప్పారు.
శుక్రవారం (21-06-24) నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమైనప్పుడు మొదటగా కొత్తగా శాసనసభకు ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మొదట ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, మహిళా సభ్యులు, సాధరణ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం అనేది సాధారణంగా జరుగుతూ వుంటుంది. అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కూడా పాటిస్తున్నారు. ఈ లెక్కప్రకారం ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్మోహన్‌రెడ్డి సాధారణ శాసనసభ్యుడి హోదాలో ప్రమాణ స్వీకారం చేయాల్సి వుంటుంది. శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం అనేది ఇంగ్లీషు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో జరుగుతుంది. ఇంటిపేరు ‘A’తో ప్రారంభమయ్యే శాసనసభ్యుడు మొదట ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ లెక్కప్రకారం జగన్మోహన్‌రెడ్డి ఇంటిపేరు ‘YS’ కాబట్టి ఆయన అందరికంటే చివరగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వుంటుంది. అంటే, ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు ఆయన శాసనభలోనే వుండి, తన పేరు వచ్చే వరకు వేచి చూడాల్సి వుంటుంది.
అయితే, జగన్ తనకు ముందే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జగన్ విజ్ఞప్తిని గౌరవిస్తూ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు జగన్‌కి ఆ అవకాశాన్ని ఇచ్చారు. అందువల్ల జగన్ సభకు వచ్చీ రాగానే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించారు. అలా వచ్చారు.. ఇలా ప్రమాణ స్వీకారం చేశారు.. మళ్ళీ అలా వెళ్ళిపోయారు. కట్టె కొట్టె తెచ్చె అన్నట్టుగా సింపుల్‌గా జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. శుక్రవారం నాడు అసెంబ్లీ ప్రవేశద్వారం ఎమ్మెల్యేల కార్లను అనుమతించడం లేదు. జగన్ సాధారణ ఎమ్మెల్యేనే కాబట్టి ఆయన కారును కూడా అసెంబ్లీ ప్రవేశ ద్వారం వరకు అనుమతించే అవకాశం లేదు. కొంత దూరం నడుచుకుంటూ ప్రవేశ ద్వారం దగ్గరకి రావలసి వుంటుంది.
కానీ, జగన్మోహన్‌రెడ్డి కారును ప్రవేశద్వారం వరకు అనుమతించాలని చంద్రబాబు ఆదేశించారు. ఇలా జగన్మోహన్‌రెడ్డి గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా చూశారు.
ఇదే జగన్ అయితే ఇలా చేసేవారా? నిస్సందేహంగా చేసేవారు కాదు.. తన అహంకారాన్ని నిర్లజ్జగా ప్రదర్శించి వుండేవారు. రూల్స్ పాటించాల్సిందే అని నియంతలాగా మాట్లాడి వుండేవారు. ఇదేదో ఊహించడం కాదు.. గతంలో చాలా సందర్భాల్లో అసెంబ్లీలోనే ఇలాంటి ప్రవర్తనను జగన్‌లో అందరూ చూశారు. అంతేకాదు, సినీ ప్రముఖులు ఆయన దగ్గరకి వచ్చినప్పుడు అందరూ ఎక్కడో దూరంగా కార్లు ఆపుకుని, చాలాదూరం నడిచి ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్ళాల్సి రావడం అంత త్వరగా మరచిపోయే విషయం కాదు.
అధికారంలో వున్నా, అధికారంలో లేకపోయినా మనిషికి విలువని, గౌరవాన్ని పెంచేది సంస్కారమేనని జగన్ ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది. తనకు, చంద్రబాబు నాయుడికి తేడా ఏమిటో అర్థం చేసుకుంటే, తన ప్రవర్తనను దిద్దుకుంటే రాజకీయంగా ఉపయోగపడినా పడకపోయినా, ఒక మనిషిగా ఉపయోగపడుతుంది.