ఎపి నూతన డిజిపిగా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ
posted on Jun 21, 2024 @ 3:28PM
సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు నేడు ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు విచ్చేసిన ద్వారకా తిరుమలరావుకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ద్వారకా తిరుమలరావు తన చాంబర్ లో సంతకం చేసిన డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు శంకబ్రత బాగ్చీ, వినీత్ బ్రిజ్ లాల్, రాజకుమారి తదితరు సీనియర్ ఐపీఎస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
ద్వారకా తిరుమలరావు 2021 నుంచి ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కర్నూలు జిల్లా ఏఎస్పీగా ఆయన ప్రస్థానం మొదలైంది. జిల్లా స్థాయిలోనూ, రైల్వే, సీఐడీ, సీబీఐ, ఎస్ఐబీ, ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు మొదటి స్థానంలో ఉండడంతో ఆయనను ఏపీ డీజీపీ పదవి వరించింది.