జగన్ మళ్లీ సభకు వచ్చేనా?
posted on Jun 21, 2024 @ 2:54PM
ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం (జూన్ 21) అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. గత అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ కు అప్పుడు ఆయన పార్టీ తరఫున 151 మంది ఎమ్మెల్యులు ఉన్నారు. ఐదేళ్లు గిర్రున తిరిగి ఇప్పుడు ఆయన కనీసం ప్రతిపక్ష నేత హోదాను కూడా కోల్పోయి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ తరఫున ఆయనతో సహా కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. అంటే ఐదేళ్ల జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతగా విసిగిపోయారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. జగన్ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదన్నదే ప్రజా తీర్పు. ఆ ప్రజా తీర్పును ఎవరైనా సరే గౌరవించి తీరాల్సిందే. అందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కూడా మినహాయింపు లేదు.
ఇక విషయానికి వస్తే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ కు చంద్రబాబు ఆయన కోరిన మీదటే అయినా కొన్ని వెసులు బాట్లు ఇవ్వడం పట్ల ప్రజలలో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు కూడా బాబు మరీ అంత మంచితనం ప్రదర్శించకుండా ఉండాల్సిందని అంటున్నారు. ఇంతకీ జగన్ కోరిన మీదట చంద్రబాబు ఆయనకు కల్పించిన వెసులు బాట్లు ఏమిటయ్యా అంటే.. మంత్రులు వచ్చినట్లుగానే జగన్ కూడా తన వాహనంలోనే అసెంబ్లీ ఆవరణలోకి వచ్చే అవకాశం కల్పించడం, అలాగే ప్రమాణ స్వీకారానికి అక్షర క్రమంలో తన వంతు వచ్చే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేకుండా మంత్రుల ప్రమాణ స్వీకారం కాగానే జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వడం. ఈ వెసులు బాట్లను చంద్రబాబు జగన్ కు కల్పించడంపై తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలలోనే కాదు జనం నుంచి కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. జగన్ అసెంబ్లీలోకి ప్రవేశించగానే తెలుగుదేశం ఎమ్మెల్యే ఒకరు వచ్చావా? అంటూ ప్రశ్నించడం, అసెంబ్లీ బయట జగన్ మావయ్యా అంటూ జనం గేలి చేయడం చూసిన తరువాత జగన్ తన అస్తవ్యస్త పాలనతో అందరిలోనూ ఎంతగా వ్యతిరేకత మూటగట్టుకున్నారో అర్ధమౌతుంది.
ఇక ఆయన హయాంలో అసెంబ్లీ నడిచిన తీరు, ప్రత్యర్థి పార్టీ నేతలను అవమానించిన విధం అందరికీ తెలిసిందే. అంతకు అంతా తిరిగి ఇచ్చేయాలన్న భావిస్తున్న తెలుగుదేశం ఎమ్మెల్యేలకు గతం గత: మనం మాత్రం మంచిగానే ఉందామనేలా చంద్రబాబు జగన్ కు వెసులుబాట్లు కల్పించడమేంటన్న ఆవేదన తెలుగుదేశం ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. అయితే కొందరు మాత్రం చంద్రబాబు తన పట్ల ప్రదర్శించిన ఉదారత జగన్ కు చెంపపెట్టులా తగులుతుందని అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్ కు అక్కడ నుంచి బయటకు వెళ్లిన జగన్ మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టే సాహసం చేస్తారని అనుకోవడం లేదని పలువురు ఎమ్మెల్యేలు అంటున్నారు. ముఖ్యమంత్రిగా తన ప్రవర్తన ఎంత హేయంగా ఉందో తన హుందాతనంతో చంద్రబాబు జగన్ కు కళ్లకు కట్టేలా చూపించారంటున్నారు. తొలి రోజే ఓ ఐదు నిముషాలు అసెంబ్లీలో కూర్చోలేకపోయిన జగన్.. ముందు ముందు అసెుంబ్లీలోకి వచ్చి సభా కార్యక్రమాలలో పాల్గొంటారని భావించలేమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.