జగన్ మీటింగ్.. అదే పాత సుత్తి..!
posted on Jun 21, 2024 @ 3:17PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే పాతకాలం అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే, అధికారం పోయిన దగ్గర్నుంచీ ఆయన భారీగా సుత్తి కొడుతున్నారు. వేసిన రికార్డే వేస్తున్నారు. చెప్పిందే చెప్పి బుర్ర తింటున్నారు. అధికారం పోగానే ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఏం మాట్లాడారో విన్నారుగా. వాళ్ళకి ఇన్ని కోట్లు పంచాను ఆ ప్రేమ ఏమైందో.. వీళ్ళకి ఇన్ని కోట్లు పంచాను.. వీళ్ళ ప్రేమ ఏమైందో.. అంటూ సుదీర్ఘ సుత్తికొట్టారు. పులివెందులలో ఈయన ఆస్తులు అమ్ముకొచ్చి ఆ డబ్బు పంచారు కాబట్టి ఈయన ఏమి చేసినా జనం ఈయన్ని ప్రేమించాలి. మరోసారి గెలిపించాలి.. అదీ ఈయన బాధ! ఆమధ్య ఓడిపోయిన ఎమ్మెల్యేలతో, నాలుగైదు రోజుల క్రితం ఎమ్మెల్సీలతో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇదే సుత్తి. డబ్బులు పంచాను.. వాళ్ళ ప్రేమ ఏమైంది.. డబ్బులు పంచాను... వీళ్ళ ప్రేమ ఏమైంది...!
లేటెస్ట్.గా గురువారం (20-06-24) నాడు పార్టీ నాయకులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా అయన డబ్బు పంచాను.. బటన్ నొక్కాను.. హోమ్ డెలివరీ చేశాను.. ఆ ప్రేమంతా ఏమైంది అని చెప్పిందే చెప్పి బుర్ర వాచిపోయేలా చేశారు. ఈ మీటింగ్‌కి వచ్చిన నాయకులంతా, తామెందుకు ఓడిపోయారో అర్థంకాక బుర్ర హీటెక్కిపోయి వుంటే, ఇక్కడ కూడా ఈయన ఆ ప్రేమంతా ఎటు పోయిందో అని తగులుకుంటే ఎంతసేపని భరించగలరు? అందుకే మీటింగ్‌కి వచ్చిన నాయకులు చాలామంది, ఈయన సుత్తి త్వరగా ముగిస్తే పారిపోదాం దేవుడా అని ఎదురుచూశారని సమాచారం.
జగన్ సారు మీటింగ్ పెడుతున్నారూ అంటే, మనం ఈ ఐదేళ్ళ కాలంలో ఈ తప్పులు చేశాం.. వాటిని సరిదిద్దుకుందాం అని చెప్తారని చాలామంది అనుకున్నారు. కానీ, ఇప్పటికీ తామేం తప్పు చేయలేదనే భ్రమల్లోనే బతుకుతున్న తమ నాయకుడిని చూసి నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్థితిలో సీనియర్ నాయకులు వున్నారు. మనం చాలా తప్పులు చేశాం.. వాటిని ఇలా సరిదిద్దుకోవాలి అని జగన్ ముందు నిలబడి మట్లాడే సినిమా ఏ నాయకుడికీ లేదు మరి. అందుకే, మీటింగ్ జరుగుతున్నంత సేపూ తమలో తామే కుమిలిపోతూ, ఆ తర్వాత బయటపడ్డారని సమాచారం. జగన్ మీటింగ్ అని అందర్నీ పిలిపించారు. కానీ స్పీచ్ ఇచ్చి పంపించేశారు. మీటింగ్ అంటే ఏమిటీ...? ఒక డిస్కషన్‌లాగా జరగాలి... కానీ జగన్ విషయంలో జరుగుతున్నది మీటింగ్ కాదు... కేవలం జగన్ స్పీచ్ మాత్రమే. ఈ ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పులు చేస్తుంది.. మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అని చేతగాని మాటలు చెప్పడమే. వాళ్ళు తప్పులు చేస్తే మనం అధికారంలోకి వస్తామనే తప్ప.. మనం ఈ మంచి పనులు చేద్దాం.. అధికారంలోకి వద్దామనే మాట జగన్ నోటి వెంట రావడం లేదని వైసీపీ నాయకులు తలలు బాదుకుంటున్నారు.