వల్లభనేని వంశీ.. దారులన్నీ మూసుకుపోయాయా?
posted on Jul 11, 2024 @ 2:07PM
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే...వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా అజ్ణాతంలోకి జారుకుంటున్నారు. అలా అజ్ణాతంలోకి జారుకున్న వైసీపీ నేతలలో ముందుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని చెప్పుకోవాలి. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో వీడి వైసీపీలో చేరడమే కాకుండా...తెలుగుదేశం అధినేత, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీని గన్నవరం ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో ఛీ కొట్టారు.
తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు ఎన్నికైన వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో గన్నవరం నుంచి విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై విపక్షానికి పరిమితం కావడంతో క్షణం ఆలోచించకుండా వైసీపీలోకి దూకేశారు. అలా దూకేసిన కొద్ది రోజులకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణి నారాభువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గన్నవరం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించడం తన బలంగా, తన గొప్పతనంగా భావించుకున్న వంశీకి 2024 ఎన్నికలలో పరాజయం తన గెలుపు ఉన్న శక్తి ఏదన్నది తెలిసేలా చేసింది.
జగన్ అండ చూసుకుని తెలుగుదేశం శ్రేణులు, నేతలపై ఇష్టారీతిగా చెలరేగిపోయిన వల్లభనేని వంశీకి ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనమయ్యాకా... చుక్కలు కనిపిస్తున్నాయి. గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయంపై దాడి సంఘటనలో ఆయనపై కేసు నమోదైంది. నాడు దాడిలో పాల్గొన్న ఆయన అనుచరులు 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వంశీ అరెస్టుకు కూడా రంగం సిద్ధమైంది. అయితే వంశీ మాత్రం ఎన్నికల ఫలితాల తరువాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఆయన వేర్ అబౌట్స్ కూడా తెలియకుండా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అక్కడ నుంచే ఆయన బీజేపీలో చేరేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ దిశగా ఒక్క అడుగూ పడినట్లు కనిపించదు. ఒళ్లైపై తెలియకుండా విర్రవీగిన వంశీని తమ పార్టీలోకి ఆహ్వానిం చడానికి కమలం పార్టీ సిద్ధంగా లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ అదే నిజమైతే ఆయన ఇక ఎల్లకాలం అజ్ణాతంలోనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది.
అయితే అజ్ణాతం లేకుంటే జైలు అన్నట్లుగా వంశీ పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ పరిస్థితి గమనించే తెలుగుదేశంకు దగ్గరకావడానికి వంశీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని చెబుతున్నారు. ఎలా చూసుకున్నా వంశీకి తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ అన్నది అసంభవమని పరిశీలకులు అఅంటున్నారు. తెలుగుదేశం ఎన్ఆర్ ఐల ద్వారా చంద్రబాబు, లోకేశ్ లతో మాట్లాడేందుకు వల్లభనేని వంశీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వంశీ అనుచరులే బాగాటంగా చెబుతున్నారు.