తెలంగాణ డీజీపీగా జితేందర్!
posted on Jul 10, 2024 @ 5:32PM
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు హోం డీజీపీగా వున్న రవి గుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొత్త డీజీపీ జితేందర్ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి ఎంపికయ్యారు. మొదట నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ రో్జుల్లో నక్సల్స్ ప్రభావం అధికంగా వున్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్ళి ఢిల్లీ సీబీఐలో, అనంతరం 2004 నుంచి 2006 వరకు గ్రే హౌండ్స్.లో పనిచేశారు. అనంతరం డీఐజీగా ప్రమోషన్ పొంది విశాఖపట్నం రేంజ్ బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత వరంగల్ రేంజ్ డీఐజీగా నియమితులయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్.మెంట్‌లో బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా పనిచేశారు. అనంతరం తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ళ శాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా వున్నారు. జితేందర్ 2025 సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు.