65 కోట్ల రూపాయల స్కూలు ఫీజు వాపస్!
posted on Jul 11, 2024 @ 5:17PM
స్టూడెంట్స్ నుంచి అక్రమంగా వసూలు చేసిన 65 కోట్ల రూపాయల ఫీజును తిరిగి ఇచ్చేయాలని పలు ప్రైవేట్ పాఠశాలలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నేళ్ళుగా కొన్ని స్కూళ్ళు నిబంధలను ఉల్లంఘించి ఫీజులు పెంచాయి. ఈ విషయమై అధికార యంత్రాంగానికి ఫీజులు అందడంతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించింది. దర్యాప్తు అధికారులు పలు స్కూళ్ళ ఖాతాలను పరిశీలించారు. 2018-19, 2024-25 విద్యా సంవత్సరాల మధ్యకాలంలో 10 పాఠశాలలు 81 వేలకు పైగా విద్యార్థుల నుంచి దాదాపు 65 కోట్ల రూపాయలను అదనంగా వసూలు చేసినట్టు తేలింది. దీనిని ప్రభుత్వం తప్పుపట్టింది. ఎక్కువగా చెల్లించిన ఫీజును తిరిగి ఇవ్వాలని సదరు స్కూళ్ళకు నోటీసులు జారీ చేసింది. సాధారణంగా స్కూళ్ళ 10 శాతం కంటే ఎక్కువ ఫీజులు పెంచాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. 15 శాతానికంటే ఎక్కువ ఫీజు పెంచాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ, ఈ స్కూళ్ళు మాత్రం ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేశాయి.