ప్రశాంత్ కిషోర్ సొంత కుంపటి... ముహూర్తం అక్టోబర్ 2
posted on Jul 11, 2024 @ 2:38PM
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంత కుంపటి అదే పార్టీ ఆవిర్బావానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి రోజున సొంత పార్టీని ప్రకటించనున్నారు. కాకతాళీయం ఎంత మాత్రం కాదు కానీ సరిగ్గా రెండేళ్ల కిందట ప్రశాంత్ కిశోర్ తన ఎన్నికల వ్యూహకర్త ఉద్యోగానికి పదవీ విరమణ ప్రకటించి బీహార్ వ్యాప్తంగా జన సూరత్ యాత్రకు శ్రీకారం చుట్టింది కూడా అక్టోబర్ 2నే. అంటే గాంధీ జయంతి రోజునే. ఈ రెండేళ్లలో ప్రశాంత్ కిషోర్ బీహార్ రాష్ట్రమంతటా పర్యటించారు. ఆయన దాదాపు రాష్ట్రంలో దాదాపు 5000 కిలోమీటర్లు యాత్ర చేశారు. ఈ యాత్రలో భాగంగా ఆయన బీహార్ లోని 14 జిల్లాలలో పాదయాత్ర చేశారు. మిగిిన 10 జిల్లాలలో కారు యాత్ర చేశారు.
ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త విధుల నుంచి వైదొలగి సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు యోచన చేయడానికి ముందు దేశంలోని వివిధ పార్టీలకు ఎన్నికల వ్యూహాలను అందజేశారు. 2014 బీజేపీ విజయం వెనుక ఉన్నది ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే. అలాగే 2019 ఎన్నికలలో ఆయన జగన్ నేతృత్వంలోని వైసీపీకి వ్యూహాలు అందించారు. ఆ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఆ తరువాత 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ విజయానికి కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే కారణమనడంలో సందేహం లేదు. ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ ఇతర పార్టీలకు ఎన్నికల వ్యూహాలు అందించి వాటిని అధికారంలోకి తీసుకురావడం కంటే తాను సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి ఎందుకు రాకూడదనుకున్నారో ఏమో సొంత రాష్ట్రం బీహార్ లో జన సూరజ్ యాత్ర పేరిట సుదీర్ఘ యాత్ర చేశారు. ఆ యాత్ర ప్రారంభించిన సందర్భంలోనే తాను సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి బీహార్ ఎన్నికల బరిలో దిగుతాననీ, అందుకోసమే జనసూరజ్ యాత్ర చేపట్టానని ప్రకటించారు. తన యాత్ర సందర్భంగా ఆయన తాను ఏర్పాటు చేయబోయే పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకున్నారు. అలాగే కింద స్థియి నుంచీ పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలూ చేపట్టారు.
బీహార్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో తన పార్టీ రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలలోనూ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తన జనసూరజ్ యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమాావేశంలో ఆయన మాట్లాడుతూ కులం, మంతం, ప్రాతిపదికన ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. మీ పిల్లల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని కోరారు.