నాకు టికెట్ ఇస్తే సికింద్రాబాద్ గెలిచేవాడిని: మీడియాకెక్కిన హనుమ
posted on Jul 10, 2024 @ 2:56PM
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకు కలిసి కట్టుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడిప్పుడే బజారున పడుతున్నారు. కాంగ్రెస్ లో కుమ్ములాటలు షరామామూలే. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఎక్కువే. రేవంత్ రెడ్డిని ఎవరూ ఓడించరు. అంతర్గత కుమ్ములాటల వల్లే రేవంత్ సర్కారు పడిపోతుందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బలం చేకూరే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంత్ రావ్ వ్యాఖ్యలు. పార్టీలో తనకు ఎనిమిదేళ్లుగా ఒక్క పదవీ లేదని, రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ వి.హనుమంతరావు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత లోక్ సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు. టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.టీ20 కప్ గెలిచిన టీమిండియాకు వీహెచ్ శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ఉద్యోగం ఇస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మన దేశంలో క్రికెట్‌కు మంచి క్రేజ్ ఉందన్నారు. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌లో తప్ప ఎక్కడా క్రికెట్ స్టేడియం లేదన్నారు. కానీ ఏపీలో 12 ఉన్నాయని వెల్లడించారు.తెలంగాణలోని ప్రతి జిల్లాలో స్టేడియం నిర్మాణానికి పన్నెండు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. గతంలో కేటీఆర్ క్రీడలను ప్రోత్సహించలేదని... కనీసం ఎకరం భూమిని కూడా కేటాయించలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో క్రీడలకు ఎక్కువ బడ్జెట్‌ను కేటాయించాలని కోరారు.