పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా... జగన్ రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్?
posted on Jul 11, 2024 @ 10:04AM
గత కొన్ని రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో జగన్ పులివెందుల శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారనీ, కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందు కోసం జగన్ కడప లోక్ సభ సభ్వత్యానికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి, ఆయనను తాను రాజీనామా చేసిన పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి రంగంలోకి దింపుతారన్నవార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు వైసీపీ నుంచి కానీ జగన్ నుంచి కానీ ఎటువంటి స్పందనా లేదు. పార్టీ వర్గాలు జగన్ కడప నుంచి లోక్ సభకు ఎన్నిక కావాలన్న ఉద్దేశంతోనే ఉన్నారనీ, అలా అయితేనే తనకు తన అక్రమాస్తుల కేసులను డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటందని భావిస్తున్నారనీ అంటున్నారు.
అయితే కొంచం లాజిక్ తో ఆలోచిస్తే జగన్ పులివెందుల అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి కడప నుంచి లోక్ సభకు పోటీ చేస్తే అక్కడ గెలుస్తారా? అలాగే అవినాష్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే ఆయనకు విజయం సాధించే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉప ఎన్నికలలో సహజంగానే అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. దానికి తోడు తాజా ఎన్నికలలో పులివెందులలో జగన్ మెజారిటీ బాగా తగ్గింది. అలాగే కడప లోక్ సభ నియోజకవర్గంలో జగన్ కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి, సొంత చెల్లెలు షర్మిల రంగంలోకి దిగడం ఖాయం. అటువంటప్పుడు జగన్ ఆమెను నేరుగా ఢీకొని గెలవగలరా? తాజా ఎన్నికలలో కడప జిల్లాలో తెలుగుదేశం అద్భుత ప్రదర్శన కనబరిచింది. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు అధికారంలో ఉంది. ఈ తరుణంలో పులివెందుల అసెంబ్లీ, కడప లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే.. ఆ పార్టీకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఒక వేళ ఉప ఎన్నికలలో పులివెందుల నుంచి అవినాష్ పోటీ చేసి ఓడిపోయినా, కడపలో జగన్ స్వయంగా పరాజయం పాలైనా ఇక జగన్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లే అవుతుంది.
నిజంగానే జగన్ పులివెందుల స్థానానికి, అవినాష్ రెడ్డి కడప లోక్ సభ స్థానానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు తెరతీస్తే.. కడపలో జగన్ విజయం సంగతి ఎలా ఉన్నా పులివెందులలో అవినాష్ రెడ్డి విజయం సాధించడం మాత్రం అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజా ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జగన్ కు మెజారిటీ తగ్గింది. ఇక్కడ తెలుగుదేశం తరఫున బీటెక్ రవి రంగంలోకి దిగుతారు. సీఎం హోదాలో పోటీలో ఉన్న జగన్ నే దీటుగా ఎదుర్కొన్న బీటెక్ రవికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అవినాష్ పై విజయం నల్లేరు మీద బండి నడకే అవుతుందని అంటున్నారు.
ఇక కడప విషయంలోనూ తెలుగుదేశం అంత తేలిగ్గా తీసుకోదనీ, అవసరమైతే జగన్ ఓటమి లక్ష్యంగా ఉప ఎన్నికలో ఆయనకు ప్రత్యర్థిగా నిలిచే షర్మిలకు లోపాయికారీ మద్దతు ఇచ్చే అవకాశాలే మెండుగా ఉంటాయనీ చెబుతున్నారు. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కడప ఎమ్మెల్సీ ఎన్నికలో ఏం జరిగిందో పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే జగన్ చేజేతులా తన రాజకీయ జీవితానికి ముగింపు పలికినట్లేనని విశ్లేషిస్తున్నారు.